సాహిత్యము—సౌహిత్యము ~ 73 | గోవింద-గోపికా సంభాషణా చాతురీ చారిమ

ఐం శ్రీశారదాపరదేవతాయై నమో నమః|
10—11—2018; శనివారము|

శ్రీశారదాంబికా దయాచంద్రికా|

“సాహిత్యము—సౌహిత్యము ~ 73″| “గోవింద-గోపికా సంభాషణా చాతురీ చారిమ”|

శ్రీ లీలాశుక కవియోగివర్యులు విరచించిన “శ్రీకృష్ణకర్ణామృతమ్ ” అనే పవిత్రగ్రంథంలో అన్ని శ్లోకాలూ మణిమయ అమృతభాండాలే అయినా సుప్రసిద్ధమైన ఒక ప్రార్థనశ్లోకం ఈ రోజు ఇక్కడ ముచ్చటించుకుందాం! ఇది, “శ్రీకృష్ణకర్ణామృతమ్ ” లోని, తృతీయాశ్వాసంలో, 105వ శ్లోకం!

“అంగుళ్యా కః కవాటం ప్రహరతి? కుటిలే! మాధవః, కిం వసంతః?

నో చక్రీ, కిం కులాలః? నహి ధరణిధరః, కిం ద్విజిహ్వః ఫణీంద్రః?|

నాహం ఘోరాహిమర్దీ, కిమసి ఖగపతిః? నో హరిః, కిం కపీంద్రః?

ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాతు వః చక్రపాణిః”||

ఈ శ్లోకంలోని ఇతివృత్తం ఇది. శ్రీకృష్ణస్వామి ఒకసారి బృందావనంలోని ఒక గోపకన్య ఇంటికి వెళ్లి ఆమె ఇంటితలుపు వేలితో తడతారు. అప్పుడు గోపికకి శ్రీకృష్ణులవారికి మధ్యజరిగిన సంభాషణని ఇక్కడ దార్శనికులైన కవివరులు ఈ విధంగా ఆ మధురభావబంధురమైన మహాసౌందర్యశోభిత సన్నివేశంతోసహా సుందరపదబద్ధంచేసి మనవంటి భావుక రసిక భక్తకోటి హృదయాలయాలలో సుప్రతిష్ఠితం చేస్తున్నారు. రసజ్ఞులు చిత్తగించండి!

గోపిక:—అంగుల్యా కః కవాటం ప్రహరతి? = వ్రేలితో తలుపు తట్టేవారు ఎవరు?
కృష్ణుడు:—కుటిలే! మాధవః = ఓ వక్రబుద్ధీ! నేను మాధవుడిని!

గోపిక:—కిం వసంతః? = అంటే వసంతుడివా?  (మాధవుడు=కృష్ణుడు, వసంతుడు అనే రెండర్థాలూవున్నాయి)
కృష్ణుడు:—నో చక్రీ = కాదు! (సుదర్శన)చక్రం ధరించే శ్రీహరి ఐన, చక్రిని!

గోపిక:—కిం కులాలః? = అంటే కుమ్మరివా? (చక్రి=కృష్ణుడు, కుమ్మరి)
కృష్ణుడు:—నహి ధరణిధరః = కాదు! భూమిని (వరాహావతారంలో) మోసినవాడిని!

గోపిక:—కిం ద్విజిహ్వః ఫణీంద్రః? = అంటే రెండు నాలుకల శేషుడివా? (ధరణిధరః=వరాహస్వామి, ఆదిశేషుడు)
కృష్ణుడు:—నాహం ఘోరాహిమర్దీ = నేను శేషుడిని కాదు. భయంకరమైన (కాళియ)సర్పంయొక్క దర్పం హరించినవాడిని!

గోపిక:—కిమసి ఖగపతిః? = అంటే పక్షిరాజైన గరుత్మంతుడివా? (అహిమర్ది=కృష్ణుడు, గరుడుడు)
కృష్ణుడు:—నో హరిః = కాదు, హరిని(శ్రీకృష్ణుడిని).

గోపిక:—కిం కపీంద్రః? = అంటే వానర రాజువా? (హరి=కృష్ణుడు, కోతి) (ఇక్కడితో కృష్ణుడు మౌనం వహించి గోపికకి సంభాషణా చతురతలో విజయాన్ని అందించి ఆమెని ప్రసన్నురాలినిగా చేసుకున్నాడు).

ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః చక్రపాణిః వః పాతు! = ఈ విధంగా గోపకన్యతో సంభాషణాచాతుర్యనిర్వహణలో ఆమె వాదోపవాదనైపుణ్యంచేత జయింపబడిన సుదర్శనచక్రహస్తుడైన శ్రీకృష్ణుడు మిమ్మందరినీ సదా రక్షించుగాక!

సాహిత్యపరంగా సంస్కృతభాషలోని శబ్దాలకివున్న నానార్థశోభా వైభవాన్ని ఈ శ్లోకం మహామహిమాన్వితమైన ప్రజ్ఞాపాటవంతో లోకానికి ప్రకాశితంచేస్తోంది. భాషలోని అనేకానేకపదాలకి భిన్న,విభిన్న అర్థాలు సారస్వతంలోను. లోకవ్యవహారంలోను రూఢమైవుండడం అందరికీ అనుభవంలోవున్న విషయమే! సంస్కృతభాషలో పదాలకేకాక, మూలధాతువులకికూడా నానార్థాలు ఉంటాయి. ఉదాహరణకి, “దివాది(చతుర్థ)“వర్గానికి చెందిన “దివు” ధాతువుకి అనేక అర్థాలున్నాయి. అవి యివి:—

“దివు—> క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు”|

“దివు” అనే ధాతువుకి “ఆడుట(to play), గెలవాలని కోరుట(to desire to win), వ్యవహరించుట(to transact), ప్రకాశించుట (to shine), ప్రశంసించు(to extoll), ప్రసన్నమగుట(to be glad), గర్వించుట(to be proud), నిద్రించుట(to sleep), కోరుట(to desire),  వెడలుట(to go)” అని వివిధ అర్థాలు ఉన్నాయి.

ఇదే విధంగా అచ్చతెలుగులోనూవుంటాయి. ఒక ఉదాహరణ:—అనువు = ఉపాయం, నేర్పు, సామర్థ్యం, వశం, అవకాశం, అనుకూలం, యుక్తం, విధం.

పై శ్లోకతాత్పర్యాన్ని పోలిన భావంతో మన తెలుగు జానపదసాహిత్యం లోను, బాగా పాత సినిమాలలోను కృష్ణ-గోపికా సంవాదరూపమైన యుగళగీతాలు మా చిన్నతనంలో రేడియోలోను, రికార్డులద్వారాను వినేవాళ్ళం!

పై శ్లోకం, ప్రతిపాదానికి 21 అక్షరాలు కలిగిన ప్రకృతిచ్ఛందస్సు వర్గానికి చెందిన “స్రగ్ధర” అనే పేరు కలిగిన వృత్తం. మనకి సుపరిచితమైన “చంపకమాల” వృత్తం ఈ వర్గానికి చెందినదే! సంస్కృతంలో స్రగ్ధరకి 7+7+7విభాగంతో యతి(విరామం) ఉంటుంది. తెలుగులోకూడా పాదాది అక్షరానికి పాదంలోని 8వ, 15(14)వ అక్షరాలతో యతిమైత్రిని కూర్చాలి. ప్రతిపాదంలోను “మ, ర, భ, న, య, య, య” అనే గణాలు ఉంటాయి.

తిక్కనగారు తమ భారత విభాగంలో స్రగ్ధరని ౘాలాబాగా వినియోగం చేసేరు. విరాటపర్వంలో దుర్యోధనవైభవవర్ణనలో అనితరసాధ్యంగా  స్రగ్ధరని ఉపయోగించేరు. శ్రీనాథాదులు స్రగ్ధరని సమర్థవంతంగాను, సమయోచితంగాను ఉపయోగించేరు.

స్వస్తి|

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    ‘ శ్రీకృష్ణ కర్ణామృతమ్’ లోని శ్లోకం ఎంతో మధుర భావనలలో
    ముంచెత్తింది.
    భాషకుండే వెసులుబాటును ఉపయోగించుకుంటూ ,
    భావనాబలం కలిగిన కవులు చాతుర్యంతో సరస సంభాషణ
    ఎంత సౌలభ్యంతో నడపగలరో లీలాశుకుల వారు ప్రయోగాత్మకంగా
    అందించారు.
    చాలా ప్రసిద్ధమైన ఈ శ్లోకం ఆధారంగా అనేక భాషల్లో ఎన్నో గేయాలూ,
    జానపద గీతాలూ వెలువడ్డాయి.
    అలాగే ఈ సంభాషణ నడిపిస్తూ ఆ రోజుల్లో “జ్యోతి” లో అందమైన
    కార్టూన్లు కూడా వచ్చాయి.
    చాలా మంచి శ్లోకాన్ని హృదయోల్లాసంగా వివరించినందుకు
    ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *