సాహిత్యము-సౌహిత్యము – 39 : దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్

శ్రీశారదా  వాత్సల్య  దీపకళిక  :—

03—02—2018; శనివారము.

“సాహిత్యము—సౌహిత్యము~39″||

ప్రముఖ కవి, పండితులు,సమస్యాపూరణకోవిదులు, మన శీర్షికలో మనకి సుపరిచితులు ఐన శ్రీ కోడూరి సాంబశివరావుగారి మరొక కరుణారసపూర్ణ సమస్యాపూరణని పరికిద్దాం!

సమస్య:—

“దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపులనిండె చీకటుల్ “|

“దీపం వెలుగుతున్న గదిలోనే నాలుగు వైపులనుండి చీకటులు ఆవరించుకుంటున్నాయి” అని ఈ సమస్యయొక్క భావం.

1977లో దివిసీమలో సంభవించిన దారుణమైన ఉప్పెన కారణంగా జరిగిన మానవ,పశు,వృక్ష విధ్వంస విలయాన్ని వర్ణిస్తూ వారు చేసిన ఉత్ప్రేక్షప్రయోగం, సాహిత్య శాస్త్ర పరమైన అలంకార ఔచిత్య వైభవాన్ని ౘాటి చెపుతోంది. ఇప్పుడు పూరణని గమనిద్దాం!

“అవ్విధి, సాగరంబు ప్రళయంబుగ డెబ్బదియేడు నందు, ము

య్యవ్వల,బాలబాలికల,అయ్యల,అమ్మల, మ్రింగె నిర్దయన్ |

చివ్వున మారె నాడు దివిసీమ భయంకర రుద్రభూమిగా 

దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపుల నిండె చీకటుల్ “||

“ఆ విధంగా, 1977వ సంవత్సరంలో, సముద్ర జల ప్రళయంవంటి ఉప్పెన ఉవ్వెత్తుగా వచ్చి, దివిసీమలోని  వివిధకుటుంబాలలోని ముసలి అవ్వలు, మగ-ఆడ బిడ్డలు, తండ్రులు, తల్లులు మొదలైన వారందరినీ దిగమింగి, తన పొట్టన పెట్టుకుంది. అటువంటి ఆ ఘోరసమయంలో దివిసీమ పూర్తిస్మశానవాటికగా మారిపోయింది. అప్పుడు గదిలో దీపం వెలుగుతూన్నప్పటికీ, నాలుగు వైపులనుంచీ మానవరోదనల చీకటులే కమ్ముకున్నాయితప్ప, సంతోష చిహ్నమైన వెలుగుకిరణం ఒక్కటికూడా లేకపోయింది”||

సర్వేషాం శాన్తిః భవతు ||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    కవులకు కల్పనాచాతుర్యమే కాకుండా, సమకాలీన సామాజిక
    అంశాలమీద స్పందించే గుణం కనిపిస్తుంది. ఈ పద్యపూరణలో
    శ్రీ సాంబశివరావు గారు దివిసీమ ఉప్పెన సృష్టించిన భీభత్సం
    ఆర్ద్రంగా వర్ణించారు. ఆ సమయంలో చాలామంది కవులు,
    కళాకారులు ఇలాగే స్పందించేరు.
    సిరివెన్నెల సీతారామశాస్త్రి దివిసీమ మీద పాట రాస్తూ
    ” చూడుమిది ఒక గడియ క్రితమున సంక్రాంతి భవనపు పునాది
    నేడు ఇది తన సుతులకై భూమాత కట్టిన సమాధి” అను రాసేడు.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    “మా నో మహాంత ముత మా నో అర్భకం
    మా న ఉక్షంత ముత మా న ఉక్షితం
    మా నో వధీః పితరం మోత మాతరం
    ప్రియా మా న స్తనువో రుద్ర రీరిషః! “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *