శారదా సంతతి ~ 63 : నాదయోగి – ఆచార్య డా.॥ గోకులోత్సవగోస్వామి మహరాజ్
ఐం శ్రీశారదాపరదేవతాయై నమో నమః|
11—11—2018; ఆదిత్యవాసరము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“శారదా సంతతి ~ 63″| “నాదయోగి – ఆచార్య డా.॥ గోకులోత్సవగోస్వామి మహరాజ్ “|
అది ప్రయాగ(అలహాబాదు) మహాపుణ్యతీర్థరాజ నగరం. బహుశః 1966 లేక 1967 ప్రాతంలో కావచ్చు! షోడశవర్షప్రాయుడైన నవయువకుడు జగద్గురు శ్రీశ్రీశ్రీవల్లభాచార్యస్వామివారి శుద్ధాద్వైతమతపరంపరలోని శ్రీనాథ వైష్ణవసంప్రదాయానికి చెందిన తిలకధారణ, వేష-భూషలతో సంపూర్ణసాత్త్వికసౌందర్యంతో వెలిగిపోతూ “ప్రయాగ సంగీత సమితి” వారి భవనప్రాంగణంలోవున్నాడు. 16 సంవత్సరాలున్న ఆయన పేరు శ్రీ గోకులోత్సవ గోస్వామి. ఒక అలౌకిక తేజఃపుంజం రాశీభూతమై ఆ రూపంలో ప్రకాశిస్తోంది అని పించేటట్లు ఆయనవున్నారు. అక్కడ ప్రయాగ సంగీత సమితివారు నిర్వహించే ఉత్తరభారత సంగీత సంప్రదాయానికి సంబంధించిన “హిందూస్థానీ సంగీతం“లో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి అనువైన వార్షిక పరీక్షలలో రెండవ సంవత్సరం పరీక్షకి ఆయన హాజరయ్యేరు. దానిలో ఉత్తీర్ణులైతే మూడవ సంవత్సరంలోకి ఆయనకి ప్రవేశం లభిస్తుంది.
పరీక్షాధికారులు పరీక్షలో ప్రధానభాగంగా, గోకులోత్సవజీని, “దేశ్ “, “సారంగ్ “, “బేహాగ్ ” రాగాలని పాడవలసినదిగా ఆదేశించేరు. గోకులోత్సవజీ “దేశ్ – సారంగ్ “, “సారంగ్ – బేహాగ్ ” అనే మిశ్రమ రాగాలలో అప్పటికప్పుడు శారదాప్రసాదిత ప్రతిభతోను, ఉపజ్ఞతోను నవీనకృతులకి అవసరమైన సాహిత్యం-రాగం-తాళం ౘక్కగాకూర్చి ఆ చిన్నవయస్సులోనే మహాపరిణతితో గానంచేసి వినిపించేరు. పరీక్షాధికారులు ఆ అలౌకికప్రజ్ఞకి అచ్చెరువు పొంది, ౘాలా ఆనందించి, మెచ్చుకున్నారు. గోకుల్జీకి మరొక గంటసేపు వారికి ఇష్టమైన రాగాలని పాడవలసినదిగాకోరి ఎంతో ఉత్సుకతతో ఏమి పాడబోతున్నారోనని ఎదురుచూసేరు.
ఆ సందర్భంలో గోకుల్జీ “హేంకల్యాణ్ “, “కేదార్ – బహార్ “, “రామప్రియ“, “జుర్తాబీ” రాగాలలోని కృతులని అనితరసాధ్యమైన నేర్పుతో, అపూర్వసృజనాత్మకతతో సత్సంప్రదాయశుద్ధంగా గానం చేసేరు. ఆ గానామృతశ్రవణంచేసిన పరీక్షాధికారులు వర్ణించి చెప్పడానికి వీలులేనంత ముచ్చటపడి, మంత్రముగ్ధులైపోయేరు. మహానందంతో వారు గోకుల్జీని సంగీతవిద్యాభ్యాసంలో మూడవ సంవంత్సరంలోకి ఉత్తీర్ణులని చేయడానికి బదులు ఆయనకి “సంగీతాచార్య” పట్టాని ప్రదానంచేసేసేరు.
ప్రత్యక్షంగా జగద్గురు శ్రీవల్లభాచార్య వంశపరంపరకిచెందిన గోస్వామి గోకులోత్సవజీ మహారాజ్ తాతగారు గోస్వామి కృష్ణమహారాజ్ జీ. గోకుల్జీ తండ్రిగారు ఆచార్య గోస్వామి గిరిధరలాల్జీ. శ్రీ ముకుందలాల్ గోస్వామి వారి పినతండ్రి. వారందరూ శ్రీకృష్ణపరమాత్మయొక్క దేవాలయాలలో పరంపరగా అర్చన-పూజాదులు నిర్వహిస్తూవస్తున్నారు. అది కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న పరమపుణ్యమయ సత్సంప్రదాయం. వారి దేవాలయాలనన్నింటినీ శ్రీనాథ్జీ మందిరాలు అని అంటారు. వాటిని “హవేలీ“లు లేక “నాథ్ ద్వారా“లు అని కూడా అంటారు. అక్కడ జరిగే భగవదర్చనకి సంబంధించిన వివిధ ఉపచారాలనీ ప్రపంచంలోనే అత్యంతప్రాచీనతమమైన సజీవ శాస్త్రీయ సంగీతసంప్రదాయం(the most ancient living music-tradition) అయిన “ధ్రు(వ)పదసంగీత పద్ధతి“లో గానం చేయబడే కృతులతో శ్రీనాథ(శ్రీకృష్ణ)ఆరాధనాసేవలు నిర్వహించే విధివిధానాలని స్వయంగా జగద్గురు వల్లభాచార్యులవారే ప్రవేశపెట్టి, వారు ఉన్నంతకాలమూ వారే ఆ సంగీతమయభగవత్సేవాకైంకర్యాలని నిర్వహించేవారు. ఈ శుద్ధాద్వైత సంప్రదాయాన్ని “పుష్టిమార్గం” అనికూడా పిలుస్తారు. ఈ పుష్టిమార్గంలో శ్రీనాథసేవద్వారా తరించడానికి సాధనచేసే భక్తజనులకి కేవలం భోజనపానాదులద్వారా దైహికపుష్టిని, ఇంద్రియభోగానుభవంద్వారా మనఃపుష్టిని, గ్రంథపఠన-పాఠనాదులద్వారా బుద్ధిపుష్టినికలిగించడం కాకుండా, శ్రీనాథప్రసాదసేవనంద్వారా శారీరకపుష్టిని, శ్రీనాథ నామ-రూప-గుణ-లీలావైభవ స్మరణ-దర్మన-శ్రవణ సంకీర్తనాదులద్వారా మనఃపుష్టిని, శ్రీమద్భాగవత అధ్యయన-అధ్యాపన-ప్రవచనాదులద్వారా బుద్ధిపుష్టిని, శ్రీనాథసంపూర్ణఅనుగ్రహ సంప్రాప్తిద్వారా ఆత్మపుష్టిని పొందడమే పరమాశయంగావుంటుంది. భక్తులజీవితాలలో నిర్వహించబడే ఏ ఇతర క్రియాకలాపాలైనా ఈ పరమాశయానికి పూర్తిగా లోబడే ఉంటాయి, అలాగే ఉండాలికూడాను
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గోకుల్జీ జన్మించేరు. ఇండోరులోని శ్రీనాథమందిర మహాప్రాంగణంలోనే వారి పారంపరికకుటుంబాలన్నీ నివాసముంటాయి. అక్కడి “నాథ్ ద్వారా” లేక “హవేలీ” అంటే మన భాషలో శ్రీకృష్ణదేవాలయంలో స్వామివారి సేవలన్నీ వారి తాత-ముత్తాతల చేతులమీదుగానేజరుగుతూ వచ్చేయి. శుద్ధాద్వైతమతస్థాపకులు, ప్రవర్తకులు అయిన జగద్గురు వల్లభాచార్యమహాస్వామివారు (కృష్ణానదీ తీరప్రాంతానికిచెందిన ఊరువారైన శ్రీ లక్ష్మణభట్టు-శ్రీమతి యల్లమ్మ దంపతులు వారాణసీమహాక్షేత్రవాసులు. వారి కుమారులే శ్రీ వల్లభాచార్య స్వామివర్యులు అని చరిత్ర చెపుతోంది) ఏర్పరచిన హవేలీగాన సంప్రదాయ సేవావిధానాలు ఎంతోకొంతమేరకి ఇప్పటికీ ఇండోరులోని నాథద్వారా మందిరంలో జరుగుతూ ఉంటాయి.
గోకుల్జీ తమ ఐదవ సంవత్సరప్రాయంలోనే “పఖవాజ్ ” లేక “పఖావజ్ ” (పక్షవాద్యం లేక ప్రక్కవాద్యం అనబడే ఉత్తరభారత ధ్రు(వ)పదసంగీతంలో వినియోగించబడే తాళవాద్యమైన ఉత్తరభారత మృదంగం) లోను, హవేలీసంగీతగానప్రక్రియలోను తమ తండ్రిగారైన ఆచార్య గోస్వామి గిరిధరలాల్జీమహరాజ్ గారి శిక్షణలో ౘాలా ౘక్కగా నేర్చుకున్నారు. ఉపనయనానంతరం వేద-వేదాంగ-ఉపాంగ-సంస్కృత సాహిత్య-వ్యాకరణాదులని వివిధ గురుపరంపరలలోను కూలంకషంగా అధ్యయనంచేసేరు. పండిత నారాయణజీ శాస్త్రివద్ద వేదవిద్య, సంస్కృతభాషావ్యాకరణశాస్త్రం, ప్రొఫెసర్ కె.వి. చక్రవర్తిశాస్త్రివద్ద న్యాయదర్శనం, పండిత ఆనందలాల్ శాస్త్రివద్ద సాంఖ్య-మీమాంసా దర్శనాలు, పండిత రామకృష్ణ మణిచంద్ర ఉపాధ్యాయవద్ద సంస్కృత సాహిత్య-అలంకార వ్యాకరణాలు మొదలైన అనేకవిద్యలని ఆయన శాస్త్రవిహితంగా అధ్యయనంచేసేరు. ఆధునిక విద్యలో బి.ఏ. పట్టా తీసుకున్నారు. ఇవికాక హిందీ, పార్సీ, ఉర్దూ, వ్రజభాష, సంస్కృతం, ఆంగ్లం మొదలైన భాషలలో పాండిత్యం సంపాదించేరు. జోధ్ పూర్ కి చెందిన డాక్టర్ ఆమ్తీలాల్ బాపానా వద్ద పార్సీ భాషాధ్యయనంతోబాటు యునానీ, హోమియోపతీ వైద్యవిధానాలలో ౘక్కని శిక్షణని పొందేరు.
ఇంక సంగీతానికిసంబంధించినంతవరకు వారి విద్యాభ్యాసం వేరే పద్ధతిలో జరిగింది. ఇండోరులోని వారి హవేలీలో ప్రతి సంవత్సరమూ తరతరాలుగా జరుగుతూవస్తూన్న మహాసంగీతకళాకారులకి సంబంధించిన వివిధ రకాలైన రికార్డింగులరూపంలో భద్రపరచబడిన గాత్రసంగీతభాండాగారం లోకోత్తరమైనది. గోకుల్జీ పుట్టకముందు కనీసం మూడు-నాలుగు దశాబ్దాల పూర్వంనుంచీ ఆయనకి ముందుతరాలవారు అనేకమహాగాయకసార్వభౌముల గానం హవేలీ సంగీతభాండాగారంలో- అంటే మ్యూజిక్ లైబ్రరీలో – భద్రపరచి ఉంచేరు. ఆ లైబ్రరీలోవున్న అనేక గాత్రకళాకారుల గానాన్ని చిన్నతనంనుంచీ వారు వినేవారు. ఉదాహరణకి బాలకృష్ణబువా ఇఛల్కరాంజికర్ , భాస్కరబువా బాఖలే, ఆషిక్ ఆలీఖాc, ఝండేఖాc, వహీద్ ఖాc, అమీర్ ఖాc మొదలైన హేమాహేమీలందరి గానాన్ని బాల్యంనుంచీ గోకుల్జీ అపారశ్రద్ధాసక్తులతో విని-విని తమదైన గాయనశైలిని వారు తీర్చి దిద్దుకున్నారు. అమీర్ ఖాcసాహబ్ వద్ద ఆయన శిష్యరికంచేయకపోయినా, ఉస్తాద్జీని కనీసం ప్రత్యక్షంగా ఆయన వినకపోయినా ఆయన విలంబితకాలగానప్రక్రియామాధుర్యాన్ని తనదైన శైలిగా మలచుకున్న మహా ప్రతిభాశాలి గోకులోత్సవజీ మహారాజ్ ఆయన గాయకులేకాక వాగ్గేయకారులుకూడాను. సుమారు ఐదువేల కృతులని ధ్రువపదాలు, ధమార్లు, ఖయాలులు, ఖయాలునుమా ఠుమ్రీలు, రుబైదార్ తరానాలు మొదలైన రూపాలలో వారు రచించేరు. “మధుప్రియ” వారి ముద్ర. అంతేకాక భారతీయవైదిక, ధర్మశాస్త్ర, ఉపనిషద్వాఙ్మయ, సంగీతశాస్త్ర, వల్లభసంప్రదాయభక్తిశాస్త్రాది అనేక విషయాలమీద ప్రామాణిక గ్రంథాలని ఆయన రచించేరు. దేశ-విదేశాలలో అనేకప్రాంతాలలో వారు తమసంగీతసభలని, భాగవతప్రవచనాలని నిర్వహిస్తూవుంటారు. వారు ఎక్కడకి వెళ్ళినా శ్రీనాథదేవాలయాలలోనే ఉండి, అక్కడ భగవత్సేవని చేసి, దైవప్రసాదం స్వీకరిస్తారు. అలాగ ఆలయం లేకపోతే పుష్టిమార్గగాములైన భక్తుల గృహాలలో ఉంటారు.
సంగీత-సాహిత్యాది సర్వకళలకి శ్రీకృష్ణపరమాత్మమాత్రమే పరమగమ్యంగా వారు భావిస్తారు. త్యాగరాజాది మహానుభావులలాగే నాదోపాసన ద్వారా భగవద్భక్తినిపొంది పరమాత్మానుగ్రహంసంపాదించడమే జీవితధ్యేయం, జీవనసాఫల్యం అని వారు బోధిస్తారు. వారికి ఇప్పుడు సుమారు అరవైఐదు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు!
వారి మహామధురగానం యూట్యూబులో పుష్కలంగా లభిస్తోంది. సంగీతాభిమానులు విని తరించవచ్చు. భాగవతోత్తములైన ఆచార్య గోస్వామి గోకులోత్సవజీ మహారాజ్ కి నతమస్తకులమై అంజలి ఘటిద్దాం!
స్వస్తి||

ఆచార్య గోకులోత్సవజీ మహరాజ్ గురించి చదువుతోంటే,
ఏదో ఓ నూట యాభై రెండువందల ఏళ్ల క్రితం జీవించిన
మహా పురుషుల చరిత్ర చదువుతోన్నట్టుంది కానీ , ఈ ఆధునిక
కాలంలో సనాతన సంప్రదాయాన్ని ఇంతిలా కాపాడుతున్న
వారున్నారని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది.
స్వయంగా వల్లభాచార్యుల వారి వంశానికి చెందిన వారు
ఆ పరంపరను యధాతథంగా కొనసాగించడం గొప్ప విషయం.
అన్ని భాషలలో ప్రావీణ్యం సంపాదించడానికీ
అన్ని శాస్త్రాలు అధ్యయనం చేయడానికే జీవితం సరిపోదనుకుంటే,
శాస్త్రీయ సంగీతంలో అత్యున్నత స్థాయికి చేరడం,
అన్నివేల కృతులు రచన చేయడం అసామాన్యమైన సంగతి.
అటువంటి వారి దర్శనం చేసుకోలేకపోయినా….నీ ఈ పరిచయం
ద్వారా తెలుసుకుంటూన్నందుకు ధన్యులం.