శారదా సంతతి — 15 : శారదా ప్రియ దంపతి ~ శ్రీమతి బాలాంత్రపు సుబ్బమ్మ / శ్రీ బాలాంత్రపువెంకట కృష్ణరావు.

శ్రీశారదా దయా సుధ :—
22—10—2017; ఆదిత్యవారము.

శారదా సంతతి~15.

శారదా ప్రియ దంపతి ~ శ్రీమతి బాలాంత్రపు సుబ్బమ్మ / శ్రీ బాలాంత్రపువెంకట కృష్ణరావు.

మహాపుణ్యమయమైన కార్తికమాసం 20—10—2017; శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఈ రోజు కార్తికశుక్లతృతీయ (తదియ). మా జన్మస్థలం తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం. మా తల్లిగారి పుట్టిల్లు ఆ ఊరిలోనేవుండేది. రామచంద్రపురం, పిల్లావారివీధిలో, మా అమ్మమ్మగారు బాలాంత్రపు సుబ్బమ్మగారు, మాతాతగారు బాలాంత్రపు వెంకటకృష్ణారావుగారు ఉండేవారు. కార్తికమాసం వచ్చిందంటే మా కుటుంబాలన్నింటిలో చెప్పలేనంత ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసేది. ఊరి శివాలయం కార్తికమాసంలో  కంటిముందు వెలిసిన కైలాసంగా దివ్యకాంతులతో ధగధగలాడేది.

మా అమ్మమ్మ-తాతయ్యలు ఆర్షధర్మనిరతికి, సనాతన వైదిక అనుష్ఠాన నిష్ఠకి పరంపరాగతమైన ప్రతినిధులు అని చెప్పాలి. వారియిల్లు నిత్య సదాచార నైర్మల్య వైభవంతో వెలిగి పోతుండేది. గార్హస్థ్యధర్మనిర్వహణని చాంద్రమానంప్రకారం, ఏ నెలలో ఏ విధంగాచెయ్యాలో, ఏ పర్వదినాలలో ఏయేనోములు, వ్రతాలు ఎలా చెయ్యాలో తెలుసుకోవడానికి వారిల్లు ఒక విశ్వవిద్యాలయం.

కార్తికమాసం అనగానే నాకు తప్పక (1) మా అమ్మమ్మ; (2) మా పాప (సూర్యశ్రీ); (3) మా అమ్మమ్మగారి యింట్లో పనిచేసే యనమదల పెంటయ్య—ఈ ముగ్గురూ ముఖ్యంగా, తప్పక జ్ఞాపకంవస్తారు. కార్తికమాసం అంటే వీళ్ళు ముగ్గురూ ప్రత్యేక ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో నెల్లాళ్ళూ తెల్లవారకుండాలేచి, రాత్రి పొద్దుపోయేవరకు శివభగవానుడికి ప్రీతికరమైన స్నానజపాదులు, క్షేత్ర-తీర్థ దర్శనాదులు, ఉపవాసాలు, పూజలు ఇలాగ లెక్కకిమిక్కుటంగా సాధనలలో ములిగితేలుతూనే, వారి దైనిక కర్తవ్యాలని సమర్థవంతంగా నిర్వహించేవారు.

మా అమ్మమ్మ చాగంటివారి ఆడబిడ్డ. నల్లూరుగ్రామవాసులైన చాగంటి అనంతరామయ్య-శేషమ్మ దంపతికి నలుగురు కూతుర్లు, ఇద్దరుకొడులు.అందరిలో పెద్ద వెంకట సుబ్బమ్మ, మా అమ్మమ్మ. శ్రీ చాగంటి శేషయ్యగారు, “ఆంధ్ర కవి తరంగిణి” కర్త, మా అమ్మమ్మకి స్వంత పినతండ్రి. మా తాతయ్య, కృష్ణారావుగారు, బాలాంత్రపు రామయ్య-సూరమ్మ గారల కుమారుడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బాలాంత్రపు సత్యనారాయణ (స్వామీ సత్య ప్రకాశ్ ), వారి తమ్ముడు. కవిరాజహంస, కవికులాలంకార, శ్రీ బాలాంత్రపు వెంకటరావుగారు, స్వయంగా, మా తాతగారి పినతండ్రి.

మా తాతగారు, శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణారావు, సుమారు 50 ఏళ్ళు, రామచంద్రపురంలో న్యాయవాదవృత్తిలో, ప్రథమశ్రేణి న్యాయవాదిగా ఉన్నారు. వారి వృత్తిలో వారు ఉత్తమ ప్రమాణాలని అనుసరించి, ఆదర్శవంతమైన న్యాయవాదిగా కీర్తిప్రతిష్ఠలుగడించేరు. ఇటు గార్హస్థ్యధర్మనిర్వహణలోను, అటు వృత్తిధర్మనిర్వహణలోను, వ్యక్తిగతశీలంలోను ఆర్షధర్మ ఉపదేశమే ఆయనకి పరమ ఆదర్శం. సనాతన ధర్మ ఆచరణ విషయంలో వారు కేవలం లౌకికుల మన్ననలనేకాదు, శృంగేరి-కంచి పీఠాధిపతుల అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందేరు. ఈ విషయంలో మా అమ్మమ్మ-తాతగారల దాంపత్యం నేను మరెక్కడా చూడలేదు. అమ్మమ్మ స్త్రీల నోముల-వ్రతాల ఆచరణజ్ఞాన సర్వస్వం. అమ్మమ్మ-తాతయ్యలు, రామాయణ-భారత-భాగవత సంపూర్ణధర్మ నిర్వహణ స్వరూపాలు. వారికి ఐదుగురు కూతుళ్ళు-ఒక కుమారుడు. ఉమ్మడికుటుంబవ్యవస్థ, బంధు-మిత్ర ఆదరణ మొదలైన శిష్టాచారసంప్రదాయం ఇంట్లోవుండడంవల్ల ఎప్పుడూ ఇల్లంతా బంధు-మిత్రులతో కలకల లాడుతూండేది. చాకిరీ చేయడానికి అమ్మమ్మ వెనకతీసేదికాదు. ఖర్చుకి తాతయ్య వెరిచేవారుకాదు. వెనకాల ఏ లోటుపాట్లూరాకుండా చూసుకునే పెంటయ్య అనుపమసేవలు ఉండేవి. అటు ఆర్షధర్మం, ఇటు లోకధర్మం, పండుగలు, పర్వదినాలు, ఆబ్దికాది పితృదేవతాకార్యనిర్వహణాదులు, వచ్చేవారు, వెళ్ళేవారు, పండిత గోష్ఠులు, యతులు, అవధూతలు, యోగులు, పౌరాణికులు, కవులు, —అదంతా ఒక మహావైభవమయమైన దివ్యలోకం. అది కేవలం ఒక ఇల్లు అని నేను ఎప్పుడూ అనుకోలేను. ఎందుకంటే అక్కడే మా తరంవారి అందరి ఆటపాటలకి, ౘదువుసంధ్యలకి, నీతినియమాలకి, బ్రతుకుబడిలో పాఠాలు నేర్చుకోడానికి, పరస్పరం కష్టసుఖాలు పంచుకోడానికి, ఆత్మీయతా-అనురాగాలకి అన్నింటికి పునాదులు రూపుకట్టుకున్నాయి.

తెలతెలవారుతూండగా అమ్మమ్మ దైనికవిధినిర్వహించుకుంటూ పాడే సంప్రదాయగీతాలు చెవికి ఇంపుగా మనసులోకి తీయగా వినబడేవి.

“గుమ్మడేడే గోపిదేవి! గుమ్మడేడే కన్నతల్లీ!
గుమ్మడిని పొడచూపగదవే! అమ్మ గోపమ్మా! అమ్మా! గుమ్మడేడే!”

“బంగారు చెంబుతో పన్నీరు పట్టుకు
పడతి రుక్మిణివచ్చె మేలుకో ||బం||
రంగైన బంగారు కెంగోరు బూసుకు
రమణి సత్యవచ్చె మేలుకో
కృష్ణ తెల్లవార వచ్చేను- – – – –
దంతకాష్ఠముబూని తామరసాక్షి గా
సుదతి వచ్చినదయ్యా మేలుకో ||కృ||
అంతకుమున్నె రుమాలుపట్టుకుజాంబ
వంతునిసుత వచ్చె మేలుకో ||కృష్ణ||
అందమూగ నిలువుటద్దముగొనిమిత్ర
వింద వచ్చిందయ్య మేలుకో ||కృష్ణ||
పొందుగ కస్తూరిభరిణపట్టుకు కా
ళింది వచ్చిందయ్యమేలుకో ||కృష్ణ||
బాలాభోగంబులు పంౘదారతేనె
భద్రతెచ్చిందయ్య మేలుకో ||కృష్ణ||
వాలాయముగ తాంబూలముపట్టుకు
శ్రీలక్ష్మణ వచ్చింది మేలుకో ||కృష్ణ||
ముదముతో వీణవాయించుచువేగ
రాధా వచ్చిందయ్య మేలుకో ||కృ||
పదహారువేల గోపికాస్త్రీలెల్ల సొగటాలు
పాళి తెచ్చి ఉన్నారు మేలుకో ||కృష్ట||

కేశవనామాల మేలుకొలుపు పాట పరమరమ్యంగావుంటుంది.

అమ్మరో! ఇమ్ముగ అరుణోదయం
బయ్యె! అమ్మ! బంగరుబొమ్మ! లెమ్మా!

అనే పాట అద్భుతంగావుంటుంది. ఆ తరవాత అమ్మమ్మ స్నానంచేసి మడిగా వంటచేసుకుంటూ దైవధ్యాన పూర్ణమైన పాటలు పాడుకుంటూ వంటచేసి, దేవుడిగదిలో నిత్యపూజచేసి, దేవుడికి మహానైవేద్యంపెట్టి తాతగారికి భోజనం పెట్టేది. తాతగారు అమ్మమ్మకంటె కాస్త వెనక-అంటే అమ్మమ్మ తెల్లవారుజామున 4—30 కి లేస్తే, తాతగారు 5—00 కి -లేచేవారు. స్నానాదికాలు ముగించి, 5—30కి నిత్యానుష్ఠానం ప్రారంభించేవారు. 7—30 లోగా అన్ను పూర్తి చేసి తమ కార్యాలయానికివెళ్ళి, 10—00 కి భోజనంచేసి కోర్టుకి వెళ్ళిపోయేవారు. వృత్తిలో పార్టీలకి పూర్తిగా న్యాయం జరిగేలాగ చూసేవారు. అన్యాయం, అధర్మంవున్న కేసులు స్వీకరించేవారు కాదు. వీలైనంతవరకు పార్టీలకి మితవ్యయం అయ్యేలాగ చూసేవారు. కొన్ని సందర్భాలలో పార్టీలిద్దర్నీ పిలిపించి న్యాయవాదులు-కోర్టులు ప్రమేయం లేకుండా, ప్రతిఫలం తీసుకోకుండా, వ్యవహారాలు పరిష్కరించేవారు.

కవిత్రయభారతం, పోతనభాగవతం,భాస్కరరామాయణం, తాతగారు బాగా ౘదువుకున్నారు.షేక్స్పియర్ నాటకాలు తాతగారికి చాలా ప్రియమైనవి. అద్వైతవేదాంతం క్షుణ్ణంగా అధ్యయనం చేసేరు. శ్రీవిద్యలో తాతగారు పూర్ణదీక్ష స్వీకరించేరు. “శ్రీమాత” తో వారి దివ్య అనుభవాలని తమ “ఏకాంత నివేదన” పద్యకావ్యంలో వారు పొందుపరిచేరు. రామచంద్రపురంలోని “వేదపరిషత్తు“కి తాతగారు స్థాపకాధ్యక్షులు. కర్ణాటక శాస్త్రీయ సంగీతం తాతగారికి చాలాయిష్టం.

అమ్మమ్మ-తాతగారు సనాతనవైదిక గార్హస్థ్యధర్మ అనుష్ఠానానికి ఉదాహరణ ప్రాయమైన అనుపమ, అలౌకిక జీవితాలని, అనేక కష్ట నష్టాలకి ఓర్చి, నిర్వహించిన తీరు మాకే కాదు, లోకానికి అంతటికి ఆదర్శప్రదమైనదని ఎందరో పెద్దలు ప్రస్తుతించడం నేను ప్రత్యక్షంగా గమనించేను.

స్వస్తి ||

You may also like...

6 Responses

  1. Suryanarayana Gorthi says:

    మాకు మీ స్నేహం దొరికే భాగ్యం కలిగినందుకు మాపూర్వపుణ్య ఫలం

  2. సి.యస్ says:

    ఒక్కసారిగా కాలం యాభై సంవత్సరాలు వెనక్కి పరిగెట్టినట్టయింది. తెల్లవారుఝామునే లేచిన అమ్మమ్మ నువ్వు చెప్పిన పాట పాడుతూ, కార్తీక మాసపు చలికి చెవులకి గుడ్డ చుట్టుకుని పెద్ద కవ్వంతో తాళ్ళు లాగుతూ మజ్జిగ చేసే రోజులు కళ్ల ముందు కదిలేయి. పైగా ఆ చలిలో కాలవ స్నానానికి వెళ్లి వచ్చేది. సినిమా రీలు వెనక్కి తిరిగినట్టు మనసుని గతం లోకి లాక్కు పోయింది నీ అద్భుత రచన.
    తాతయ్య గారిల్లు, ఆ వాతావరణం అప్పటి సంప్రదాయాలను పట్టి చూపించింది.
    విశ్వాసానికి, విధేయతకీ మారుపేరైన పెంటయ్యని జ్ఞాపకం చేసినందుకు చాలా సంతోషం.
    అందరి కళ్ళల్లో వెలుగులు నింపుతూ, కార్తిక మాసపు ఆకాశ దీపమై నవ్వుల వెలుగులను పంచుతున్న పాపని తలపుల్లోకి తెచ్చావు. మొత్తానికి,రామచంద్రాపురం లోకి మకాం మార్చేసాను.

  3. కృష్ణ says:

    తాతయ్య గారు స్నానానంతరం చదివే ఆదిత్య హృదయం… అది వినే నేర్చుకున్నాము….

  4. PURUSHOTHAM SRIKAKULAPU says:

    శారదాప్రియ దంపతి నేటి విద్యార్థి లోకానికి పాఠ్యాంశంగా చేర్చాల్సిన అంశం🙏🙏

  5. Devi says:

    We all Thank u very much for giving us an opportunity to pay homage to Pedda tatagaru and Ammamma,the Parvati and Parameshwara of our Family in this holy Karthika Masam.Their dedication to Sanatana Dharma,Aryan culture and values, their way of living on Dharmic path is presented by u in such a beautiful manner we are filled with joy and pride that we are the descendants of the Divine couple. May we all pray to their lotus feet and seek blessings from them to help us walk in their path for our own welfare and prosperity. Let us keep them alive forever by playing our role in handing over the precious culture and tradition to the generations to come.

  6. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    What a rich upbringing Krishna! నాకు పార్వతీపరమేశ్వరుల్లాటి వాళ్ళిద్దరూకూడా ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుగా ఉన్నారు. దొడ్డమ్మ గారి తడిచీరకట్టు, మడి, ఆచారము exemplary గా ఉండేవి. ఆవిడ ఆప్యాయత అనుపమాన మైనది. పెదనాన్నగారి గోచీపోసిన పంచకట్టు, పిలకా, గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి ఖద్దరు లాల్చీ, ఆ బాలాంత్రపువారి నిండైన నవ్వూ మర్చిపోలేను. వారు పద్యకావ్యం రాశారని తెలీదు. ఈమాటు మనం కలిసినప్పుడు, అవకాశం దొరికితే ఆ పుస్తకం తిరగెయ్యాలని ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *