శారదా సంతతి — 9 : శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు

శ్రీశారదా కారుణ్య కౌముదీ  :—
10—09—2017; ఆదివారం.

శారదా సంతతి—9.

సంపూర్ణ గానకళాయోగి— శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లుగారు.

మొట్టమొదటిసారి ఓలేటివారి ప్రత్యక్షగానాన్ని నేను 1974 చెన్నై సంగీత ఉత్సవంలో మ్యూజిక్ అకాడమీలో విన్నాను. ఆ రోజు ఆడిటోరియం సంగీతరసికులతో నిండిపోయింది. అందువలన నేను వేదికమీద మఠం వేసుకుని కూర్చోడానికి సిద్ధపడి ఆ టికెట్టు కొనుక్కున్నాను. వారి ప్రక్కనే కూర్చుని వినే గొప్ప అవకాశం మరి! దేవగాంధారి, కల్యాణి విన్నగుర్తు. 3 గంటల కచేరి 3 నిమిషాలలో ఐపోయినట్లనిపించింది. గానం ఆద్యంతమూ ఒక నిర్విరామగాన ప్రక్రియగా అనిపించింది.ఒక కృతికి మరొక కృతికి ఏమాత్రమూ అంతరాయం లేదు. ఆ గానం మహా మధురంగా సాగిపోయింది. ఆ తరువాత ఆళ్వారుపేటలో వీనస్
కాలనీ సభలో ఆయన పాడిన ఆరభి ఈ నాటికీ నాచెవులలో ఆ గాన మాధుర్యం అప్పుడప్పుడు వినిపిస్తునే వుంటుంది. ఆ తరువాత ఆయన కచేరీలు నేను ఎప్పుడూ వదలలేదు. వారిది ఆదర్శవంతమైన పురుషకంఠం-Ideal male-voice. అద్భుతమైన మంద్రసంపద.మధ్య,తారా స్థాయిలలో ఏమాత్రమూ వన్నె తగ్గని ధాగధగ్యం.-Uniform luminosity of voice-quality in all the three octaves.

శ్రీ కె. పొన్మయ్యపిళ్ళై గారి, సౌరాష్ట్రరాగంలో “రంగనాథుడే, అంతరంగనాథుడే” అనే ఆదితాళనిబద్ధకృతి మొట్టమొదట ఓలేటివారికంఠంలోనే విన్నాను. అలాగే బేగడరాగంలో దీక్షితులవారి “వల్లభనాయకస్య“, సుబ్బరాయశాస్త్రిగారి “శంకరి నీవని“, త్యాగరాజుగారి “సుందరి నన్నిందరిలో” “నాదోపాసన” ఇవన్నీ రసికుల మనస్సుని దోచుకునేవే!  “అకారప్రయోగం“లో పూర్ణప్రజ్ఞావంతులు వారు.

ఉత్తర-దక్షిణ భారతసంగీతగానంలో పరిణతవైదుష్యం వారి సొత్తు! కాని సంగీతసంప్రదాయాలని కలగలుపు చెయ్యకుండా ఉత్తరభారతసంగీతాన్నికేవలస్వరస్థానగానఫణితిలోను, దక్షిణభారతసంగీతాన్ని అనుస్వరాలతో సహా స్వరప్రయోగగాన నైపుణ్యంతోను పాడడంలో ఆయనకి ఆయనేసాటి. వారు తమ గానాన్నిఒక విలక్షణధ్యానస్థితిలోవుండి పాడేవారు.ఆ సమయంలో వారి హృదయంలోకి సంగీతశారద వేంచేసి తనకి కావలసిన రాగాలు-పాటలు తనప్రేరణతోనే వారిచేతపాడించుకుని, వారిని పరిపూర్తిగా అనుగ్రహించి, శ్రోతలనికూడా ధన్యులనిచేస్తుంది.

వరాళిరాగంలో “ఏటి జన్మమిది హా“, తోడిరాగంలో “నీవంటి దైవమును“, “ఏమిజేసితేనేమి“, “ఎందుదాగినాడో“, శంకరాభరణంలో “ఎందుకు పెద్దల” ఇటువంటి లెక్కకి మిక్కుటమైన ఎన్నో కృతులు,
తోడి, సావేరి, శంకరాభరణం, కాంభోజి, రీతిగౌళ మొదలైన అనేక రక్తిరాగాలలో వారి “రాగం-తానం-పల్లవి” గానధ్యానయోగసిద్ధిని నిరూపించే రాగభావ-సాత్యభావ సమైక్యతా ప్రతిభ, తాళ-లయాత్మక ఏకీకరణ పక్వత ఇవన్నీ శ్రోతలకి అనుభవైక వేద్యం.

రీతిగౌళరాగం పాడాలంటే వారే పాడాలి. తప్పితే ఎం.డి.రామనాథన్ గారు. రీతిగౌళలో సుబ్బరాయశాస్త్రిగారి “జననీ! నినువినా” కృతి చాపుతాళంలో చౌకకాలంలో పరమ మనోజ్ఞంగావుంటుంది. ఈ రాగం పూర్వాంగ ప్రధానమైనది. అందువల్ల మంద్ర, మధ్య సప్తక ప్రయోగాలు ఓలేటివారి కంఠంలో మహాసకుమారంగాను, తేనెలూరే పూలబాటలలోను సంచరిస్తూ శ్రోతల చెవులని సంగీత సుధలతో నింపుతాయి. “నినిసా“, “నిసగరి” వంటి మధుర స్వరప్రయోగాలతోనిండిన రీతిగౌళ రాగాధిదేవతయొక్క అనుగ్రహసర్వస్వం పొందిన స్వరయోగి శ్రీ ఓలేటి వేంకటేశ్వర్లు నాదయోగ సంసిద్ధి ద్వారా శ్రీసంగీతశారదలో ఐక్యం అయిన పవిత్రజన్ముడు.

ఆయనకి నతమస్తకులమై నమస్కరిద్దాం!

స్వస్తి ||

You may also like...

3 Responses

  1. సి.యస్ says:

    సంగీత కళానిధి శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గారి పరిచయం సంక్షిప్తంగా ఉన్నా, సమగ్రతతో ఉంది. ఆయనని తలుచుకుంటే, ఆరోజుల్లో ఆకాశవాణిలో సంగీత శిక్షణ, భక్తిరంజనిలో హనుమాన్ చాలీసా జ్ఞాపకానికొస్తాయి. నువ్వు చాలాసార్లు చెప్పినట్టు ఆయనది perfect male voice.

  2. Chaganty RamaRao says:

    Avunu. MahaNubhaavudu. Unfortunately naaku sangeetam gurinchi eemee teleedu. Kaanee rajamandry loo Bugga Papaya sastri gaaru voileti vaaridi nuukala, balamurali, annavarapu Vaarina violin pettaru. Annee vines vaanni Buugunnayi anipincheevi

  3. Dakshinamurthy M says:

    Voleti గారి గురించి చాలా బాగా వివరించారు. ఆయన గురించి ఎంత చెప్పినా, ఎంత వ్రాసినా తక్కువే. ముందు ముందు ఆయన గురించి మరిన్ని వివరాలు మాకు అందించాలని నా విన్నపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *