శారదా సంతతి — 34 : మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి:—
04—03—2018; ఆదిత్యవాసరము.

“శారదా సంతతి~34” ~ “మహా గాన తపస్విని~మోగూబాయి కుర్డీకర్ “| (15—07—1904 to 10—02—2001)

మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరు. ఆయుర్వేదవైద్యంలో దేశదేశాల సువిఖ్యాతుడైన ఆయుర్వేద వైద్యరాజ్ శ్రీ వైద్య అబాసాహెబ్ సంబారెగారి సువిశాల వైద్యశాల. అనేక వ్యాధిగ్రస్తులతోను, వారిసహాయకులతోను, వైద్యశాలకి సంబంధించిన సిబ్బందితోను, ఇన్ – పేషెంట్లతోను, ఔట్ – పేషెంట్లతోను అంత పెద్ద ఆసుపత్రి కిటకిటలాడుతూ చాలా ఇరుకుగావున్నట్టు అనిపిస్తోంది.
డాక్టర్ . సంబారెగారు వారి సంప్రదింపు గదిలో ఒక పెద్ద మేజా బల్లకి ఒకవైపు ౘక్కని పాతకాలపు టేకు కుర్చీలో కూర్చునివున్నారు. వారి వెనక వున్న ౘాలాపెద్ద అద్దాల బీరువానిండా ఎన్నో ప్రాచీన గ్రంథాలు ఒక క్రమంలోఅమర్చబడివున్నాయి. ఆయన కుడిచేతివైపువున్న పెదపెద్ద గదులలో అనేక వ్యాధిగ్రస్తులు పాత కర్రమంచాలమీద పడుకునివున్నారు. రకరకాల సిబ్బంది, రోగులకి అందించవలసిన సేవలని విసుగు, విరామంలేకుండా శ్రద్ధతో అందిస్తూన్నారు.

డా. సంబారె ఎడమ వైపువున్న గదులలోవున్న సిబ్బంది అనేకవిధాలైన మందులని తయారుచేసి రోగులు వాడుకోవడానికి వీలుగా చిన్న కాగితం పొట్లాలు కడుతున్నారు.
డా. సంబారెగారికి ఎదురుగా రోగులు రావడానికి పెద్ద ద్వారం వుంది. ఆ ద్వారానికి ఒకవైపు గోడమీద మరాఠీభాషలో, తిథి-వార-నక్షత్రాలతో కూడిన ఒకపెద్ద కేలెండరు డాక్టరుగారికి ఎదురుగావుంది. ఆ కేలెండరు, 1920వ సంవత్సరం, జనవరినెలని సూచిస్తోంది.

డాక్టరుగారి ఎదురుగా మేజాబల్లకి అటువైపు నాలుగు పాతబడిన కుర్చీలున్నాయి. ఆ కుర్చీలలో ఒక కుర్చీలో విశ్వవిఖ్యాత గానసామ్రాట్ ఉస్తాద్ అల్లాదియా ఖాc సాహెబ్ ఆసీనులైవున్నారు. పరస్పర అభివాదాలైన తరవాత వారిద్దరిమధ్య సంభాషణ ఇలా జరిగింది.

డాక్టరుజీ:— ఇప్పుడు ఎలావుంది ఉస్తాద్జీ? ఇంతకిముందిచ్చిన మందులు ఐపోవచ్చేయా?

ఖాన్జీ:— మందులు సుమారు ఇంకొకవారంరోజులువస్తాయి డాక్టరుగారూ! పాత సమస్యలు నన్ను బాధించడం తగ్గించి, క్రమ-క్రమంగా, వెనకబడుతున్నాయి. కాని కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్ననే, ఊరినుంచి వచ్చేను. ప్రయాణం బడలికవల్ల నిన్న విశ్రాంతి తీసుకుంటూ ఇంటివద్దనేవుండిపోయేను డాక్టర్జీ!

డాక్టర్జీ:— మరేమీ ఫరవాలేదు ఉస్తాద్జీ! మీకు వచ్చే సమస్యలేవీ మా అదృష్టం వల్ల ప్రాణాంతకమైనవి, ప్రమాదకరమైనవికావు. మీ క్రమబద్ధజీవితం, పథ్య-పానాదులయందు నా సలహాలు పాటించడంలో ఏ మాత్రమూ అలసత్వంచూపకపోవడము, సక్రమ ఔషధసేవనము, అన్నింటినీమించి మీ నిరంతర సంగీత శారదోపాసన మీకు ౘక్కని చికిత్స జరగడానికి, మా వైద్య ప్రక్రియ సఫలవంతంగా కొనసాగడానికి దోహదంచేస్తున్నాయి.

ఈ విధంగా మాటలు జరిగేక, శ్రద్ధగా డాక్టరుగారు అన్నీవిని, కొన్ని కొత్త మందులు కట్టించిఇచ్చి, రెండు-మూడునెలలైనా సంబారెలో ఉండవలసివస్తుందని సలహా ఇచ్చేరు. మరుసటి రోజు మళ్ళీ చికిత్సాలయానికి రమ్మని కోరేరు. ఖాన్జీ అంగీకరించి, శలవుతీసుకుని ఇంటిముఖం పట్టేరు. కొంతదూరంవెళ్ళినతరవాత, కుడిచేతివైపువున్న మేడలోనుంచి భీంపలాస్ రాగంలో ఒక పాట, తీయని స్త్రీకంఠంనుంచి ముగ్ధమనోహరంగా వినిపిస్తోంది. వింటూనే ఖాన్జీ మెల్లిగా తమ ఇంటికి వెళ్ళిపోయేరు. ఆ మరునాడుకూడా ఆ మేడ సమీపానికి రాగానే మరొకపాట అంత అందమైన కంఠంలో మహాశ్రావ్యంగా వినిపించింది. అలా వింటూనే, ఖాన్జీ ఆ రోజుకూడా ఆ మేడవైపు చూస్తూ, స్వగృహం చేరుకున్నారు.

మూడవరోజుకూడా మెల్లిగా అడుగులువేసుకుంటూ, వైద్యశాలనుంచి, గృహోన్ముఖులయ్యేరు. ఆ గృహప్రాంతంలో అడుగు పెట్టగానే, అదే అద్భుతకంఠం వినిపించింది. మరొక పాట సాధన జరుగుతోంది. ఆ అపూర్వగాత్రంలో చెవులకి మళ్ళీ-మళ్ళీ వినాలనిపించే, ధగ-ధగలాడే రవ్వలు పలుకుతున్నాయి; చిరుమువ్వల సవ్వడులు ఒలుకుతున్నాయి; మధుర మృదుల గతుల మధూలికలు చిలుకుతున్నాయి; కమనీయ స్వర కపోతాల కదలికలు కులుకుతున్నాయి; పాటలోని పదాల రమణీయ భావాలు తలుకులీనుతున్నాయి. ఇంక ఖాన్జీ గత రెండురోజులలోలాగ నిగ్రహంతో అడుగులు ముందుకువేయలేకపోయేరు. అడుగులు అప్రయత్నంగానే ఆ ఇంటి మేడమెట్లు ఎక్కడం ప్రారంభించేయి. ఆయనలోని సంగీత రాసిక్యంముందు ఆయనస్థాయి, వయస్సుయొక్క ఆధిక్యం, కీర్తి-ప్రతిష్ఠలు, మొదలైన అనేక అంతరాలతెరలన్నీ వినమ్రతతో ప్రక్కకి తొలగిపోయేయి. ఆయన మేడమీద గదిలోకి అడుగుపెట్టేసరికి వారి ఎదురుగా సుమారు 15 ఏళ్ళు పైబడ్డ ఒక సున్దర,నవయువతి పాడుతూకనిపించింది. సన్నగా పొడుగ్గా జాజితీగలాగవుంది. తీర్చిదిద్దిన అందమైన ముఖ కవళికలతో, బంగారురంగు దేహచ్ఛాయతో, ప్రసన్నముఖంతోవున్న ఆమె ఒక్క ఉదుటునలేచి, పాట ఆపి, ఆయనకి నమస్కరించింది. ఆజానుబాహువైన ఆయనని చూడగానే ఆమె ఆశ్చర్యంతో అవాక్కైపోయి సంభ్రమంతో, వారి ముఖంలోకి అలాగ చూస్తూనే వుండిపోయింది. అప్పుడు వారిద్దరిమధ్య ఈ సంభాషణ నడిచింది:—

ఖాన్జీ:— ౘాలా బాగా పాడుతున్నావు. రోజూ ఈ దారినే వెడుతూ నీ పాటని వింటున్నాను. ఏరోజుకి ఆరోజు లోపలికి రావాలనుకుంటూనే, నీ సాధనకి అంతరాయం కలుగుతుందని ఉపేక్షించేను. ఈ రోజు నీ పాట నన్ను అలాగ ఉపేక్షించనివ్వలేదు. నీ పేరేమిటి తల్లీ? అలాగ పాట ఆపెయ్యకు. నీ పాట వినడానికేకదా, నేను వచ్చేను?

ఆమె(మోగూబాయి):—నా పేరు మోగూబాయి అండీ! తమరు నిలబడే వున్నారు. ఆ కుర్చీలో కూర్చోండి.(అని పాట పూర్తిగా వినిపించింది).

ఖాన్జీ:—(కుర్చీలో కూర్చుని) నీవు పాడుతున్న ఈ పాటలు ఎక్కడివి? ఈ సంగీతం, ఎక్కడ నేర్చుకుంటున్నావు?

మోగూబాయి:— నేను పాడే పాటలు, “మృచ్ఛకటికం” నాటకంలోవండి. వీటిని చింతోబా గురవ్ మాస్టరుగారు నాటకంకోసం నేర్పుతున్నారండి. ఏమైనా లోటు-పాటులువున్నాయాండీ?నేను ఆ నాటకంలో వసంతసేనగా నటిస్తున్నానండి. ఇవన్నీ ఆ నాటకంలో వసంతసేన పాడే పాటలండి.

ఖాన్జీ:—నీ పాటలలో లోటులు లేవు తల్లీ! అయితే ఇలాగ నాటక సంగీతానికి మాత్రమే పరిమితమైపోయి జీవితాన్నంతా, నాటకరంగానికే అంకితంచేసుకోవలసిన కంఠం కాదమ్మా నీది!నీ కంఠం శాస్త్రీయసంగీతం నేర్చుకుని, పాడడానికి అనువైన కంఠం. అల్లాః ఇటువంటి అరుదైన కంఠాన్ని అందరికీ ఇవ్వడు. అల్లాః అనుగ్రహించిన ఈ కంఠాన్ని శాస్త్రీయ సంగీతానికే అంకితం చేసుకోవాలి. అదే అల్లాః అభిమతం. అందుకనే నేను ఇక్కడికి వచ్చేను. నేను నీకు శాస్త్రీయసంగీతం నేర్పుతాను. నేర్చుకుంటావా? నీకు సంగీతం ౘాలా బాగా వస్తుంది. నీకు చెప్పాలని నాకు కుతూహలంగావుంది. మరి శ్రద్ధగా నేర్చుకుని, బాగా రోజూ అభ్యాసంచేస్తావా? నాటకరంగానికికాక, నీ జీవితాన్నిసంగీతరంగానికి సమర్పించుకుని, నీ జీవితం ధన్యంచేసుకుని, అల్లాః ఆశీస్సులు పొందుతావా? సంగీతరంగంతో పోలిస్తే, నాటకరంగంద్వారా నీవు పొందే యశస్సు పరిమితమైనదీ, స్వల్పకాలికమైనదీను! ఆలోచించి చెప్పు.

మోగూబాయి:—నేను, మా తల్లిగారు ఈ విషయంగురించి ఎప్పుడో ఆలోచించుకున్నామండి. సరైన గురువుగారు లభ్యంకాకపోవడంవలన, ఇలాగ నాటకరంగంలో పనిచేస్తున్నానండి. నేను సంగీతం తప్పకుండా నేర్చుకుంటానండి. మా అమ్మకి, నాకు శాస్త్రీయ సంగీతం అంటే పంచప్రాణాలండి.

ఖాన్జీ:—సుభానల్లాః! “శుభస్య శీఘ్రం” అంటారు కదా? ఇప్పుడే మొదలు పెడదాం! నీవు సిద్ధమేనా?

మోగూబాయి:—అయ్యో, ఎంతమాటండీ? తప్పకుండా, ఇప్పుడే నేర్చుకోవడం ప్రారంభిస్తానండి.

ఆవిధంగా ఖాన్ సాహబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాcగారి వద్ద మోగూబాయి కుర్డీకర్ సంగీతంనేర్చుకోవడం, అంత అలవోకగా ప్రారంభమయ్యింది. ఆయనకి శిష్యురాలవ్వడం అంత సులువుగా జరిగిపోయింది. మరి సంగీతవిదుషి కేసర్బాయి కేర్కర్ విషయంలో భూమ్యాకాశాలని ఏకం చేస్తేనేకాని జరగనిపని, మోగూబాయి కుర్డీకర్ విషయంలో ఆయనంతట ఆయనే వచ్చి, ఎవ్వరిప్రమేయమూ ఏమాత్రమూ అవసరంలేకుండా, అలాగసంగీతం నేర్పడానికి ఆయన ఎలాగ పూనుకున్నారు, అని అడిగితే, భవభూతిమహాకవి తన “ఉత్తర రామచరితమ్ ” లో వ్రాసిన ఈ సుప్రసిద్ధ శ్లోకమే, ఆ జటిల ప్రశ్నకి సమాధానం చెపుతుంది:-

“వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి|

లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతుమర్హతి”||

“మహానుభావుల మనస్సులని అర్థంచేసుకోవడం అసాధ్యమనే అనాలి. వారి మనస్సులు ఒక సమయంలో వజ్రంకన్న కఠినంగాను, మరొక సందర్భంలో సుమంకన్నసున్నితంగాను ఉంటాయి”.

గురుమహరాజ్ శ్రీరామకృష్ణ పరమహంస ప్రభుదేవులవారి జీవితాన్నిపరిశీలించిచూస్తే, మనం పైన చెప్పుకున్న రెండువిధాలైన గురు-శిష్య సంబధాలకి సజీవ ఉదాహరణలు(live examples) లభిస్తాయి. శ్రీవారికి గురుత్వం వహించజాలిన భైరవీబ్రాహ్మణి, తోతాపురి మొదలైన మహానుభావులందరూ శ్రీవారిని అన్వేషిస్తూ, వారివద్దకివచ్చి, వారి-వారి కర్తవ్యాలని వారు నిర్వర్తించుకున్నారు. వివేకానందులవారు, బ్రహ్మానందుల వారు మొదలైన శ్రీవారి అపూర్వ శిష్యవర్గమంతా శ్రీరామకృష్ణగురుదేవులని అన్వేషిస్తూవచ్చి, వారిని చేరుకున్నారు. రామావతారంలో శ్రీరాములవారు వసిష్ఠమహర్షులవారివద్దకి, కృష్ణావతారంలో శ్రీకృష్ణులవారు సాందీపనిమునిగారి వద్దకి వెళ్ళవలసివచ్చింది.

పై రీతిలోనే, సంగీతరంగంలోని కేసర్బాయి కేర్కర్ అనూహ్యమైన ఆటంకాలని అతికష్టంమీద దాటి తను ఎంచుకున్న గురువుగారియొక్క శుశ్రూషనిసంపాదించగలిగింది. కాని మోగూబాయి విషయంలో జగద్విఖ్యాత ఆచార్యవరిష్ఠుడైన ఖాcసాహెబ్ అల్లాదియా ఖాc గారు స్వయంగావచ్చి తనంతతానుగా మోగూబాయిని శిష్యురాలిగా ఎంపికచేసుకున్నారు. “కుమార సంభవమ్ ” కావ్యంలో కాళిదాసమహాకవి అన్నవిధంగా

“న రత్నమన్విష్యతి మృగ్యతే హి తత్ “|—కుమారసంభవమ్ – 5:45.

“రత్నం తనకి యోగ్యుడైన యజమానిని తాను వెతుక్కోదు. అటువంటి అమూల్యరత్నాన్ని వెతుక్కుంటూ ఆ యోగ్యమైన యజమాని తానే ఆ రత్నసమీపానికి వస్తాడు”

మోగూబాయి జీవితంలో జరిగిందదే! అయితే తనకి తానుగావచ్చి సంగీతవిద్యాప్రదానం అనుగ్రహిస్తున్న ఆ పుంభావ సంగీతశారద ఎవరో మోగూబాయికి తెలియనే తెలియదు. అంతటి అయాచిత అనుగ్రహాన్నిఅందుకున్న ఆనందాతిరేకస్థితి, ఆయనయొక్క పేరైనా తెలుసుకోవాలనే కుతూహలాన్ని మబ్బులాకమ్మేసింది. డా. అబాసాహెబ్ సంబారెవద్ద మోగూబాయికూడా వైద్యంచేయించుకుంటోంది. ఒక ప్రత్యేక సందర్భంలో డాక్టరుగారింట్లో గొప్ప సంగీతగోష్ఠి-అంటే మెహఫిల్ – జరిగింది. ఆ సంగీత సభలో ఎందరెందరో సువిఖ్యాత కళాకారులందరూ పాల్గొన్నారు. ఆ సభలో “ఉస్తాద్ అల్లాదియాఖాc సాహెబ్ ” అని సభానిర్వాహకుడు ప్రకటించేరు. ఆ సభలో శ్రోతగావున్న మోగూబాయి, అప్పటికే ఆయన పేరు లోకవిదితం కనక, తాను వినడమేకాని వారిని చూడలేదుకనక, ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తోంది. తీరాచూస్తే, తన గురువుగారే ఆ మహాగాయకుడని గుర్తించి, అవధులెరుగని ఆనందపారవశ్యంలో ఉక్కిరి-బిక్కిరై, గర్వంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది.

మోగూబాయి కుర్డీకర్ , 1904వ సంవత్సరం, జూలై 15వ తేదీ, కుర్డీగ్రామం (మహారాష్ట్ర)లో జన్మించేరు. తల్లి జయశ్రీబాయికి శాస్త్రీయసంగీతమంటే వల్లమాలిన ప్రీతి. కూతురికి బాల్యంలోనే సంగీతంనేర్పించడంకోసం శతవిధాలప్రయత్నంచేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే “చంద్రేశ్వర్ భూతనాథ్ సంగీత మండలి” అనే నాటకసంస్థలో తన కుమార్తెని చేర్పించింది. ౘక్కని, తీర్చిదిద్దినట్లున్న ముఖకవళికలతో, మోగూబాయి బాలనటిగా ప్రహ్లాదుడు, ధ్రువుడు మొదలైన పాత్రలలో గొప్ప గాత్రంతోమనోహరమైన పాటలు పాడుతూ బాగా పేరుతెచ్చుకుంది. ఐతే శాస్త్రీయ సంగీతంలో రాణించడానికి యోగ్యమైన సంగీతశిక్షణ నాటకరంగంలోని కళాకారులవద్ద మోగూబాయికి ఏ మాత్రమూ లభించలేదు. తల్లి బిడ్డలిద్దరూ దక్షతకలిగిన సంగీతశిక్షణకోసం తహతహలాడుతున్న సమయంలో సంగీతకల్పవృక్షంవంటి అల్లాదియాసాహబ్ రూపంలోని ఆశ్రయంలభించింది. అప్పటికి మోగూబాయివయస్సు పదిహేను సంవత్సరాలు. 1920లో ఉస్తాద్జీ వద్ద శిష్యరికం ప్రారంభించిన మోగూబాయి, 1946లో గురువుగారి దేహాంతం పర్యంతమూ వారివద్ద సంగీతవిద్యాభ్యాసం పూర్తి శ్రద్ధాసక్తులతో కొనసాగించింది.

ఐతే, మోగూబాయి సంగీతవిద్యాభ్యాస జీవితభాగమంతా పూలపాన్పుపైన నడకలాగ జరిగిపోయిందని చెప్పడానికి ఆస్కారమేమీలేదు. ఆవిడ సంగీత తపోదీక్షకి చెప్పలేనన్ని అంతరాయాలు ఏర్పడ్డాయి. ఒకసారి, ఆమె, అల్లాదియాజీకి “గండాబంధ షాగిర్ద్ “, అంటే, “దీక్షిత శిష్యురాలు” కాదని ఒక దుమారం రేగింది. అటువంటి దీక్షలేని విద్యని “illegitimate progeny” లాగ, “illegitimate acquisition of the art”గా, అంటే అక్రమ సంతానంలాగ, అక్రమ కళా/విద్యా అభ్యాసంగా ఆనాటి ఉత్తరభారత సంగీతలోకంలో పరిగణించి, అటువంటి కళాకారులని సంగీతసమాజంలోఅగౌరవంగా చూసేవారు. అప్పుడు ఉస్తాద్జీ, మోగూబాయి, తనవద్ద “సంగీతవిద్యాదీక్ష” ద్వారా సుశిక్షితురాలైన విదుషి/గాయకి అని సభాముఖంగా ప్రకటించి ఆమెకి ఒక అమోఘగౌరవాన్ని కలిగించవలసివచ్చింది.

అందరి ఆలోచనలకి అందని అతిమానుష అంకితభావంతో, మోగూబాయి, మహాసంగీత తపస్సుని అద్భుతంగా నిర్వహించి, తనగురువు నేర్పిన అల్లాదియా గానసంగీతఫణితిని స్వచ్ఛసమగ్రనైపుణ్యంతో తన స్వరమనోజ్ఞమాధుర్యశోభిత గళంలో యథాతథంగా భద్రపరిచి తన తరవాత తరాలవారికి, ఆ అమలిన సంప్రదాయాన్ని అందించడం సంగీత రసజ్ఞుల పుణ్యమని భావించాలి. అట్రౌలీ – జయపూర్ ఘరానాకి ఆమె చేసిన ఈ సేవ అప్రతిరూపం అని విమర్శకుల అభిప్రాయం. కిరానా ఘరానా సంప్రదాయానికి, రాంభావు కుండుగోల్కరుగారి గురుత్వ మార్గదర్శకత్వంలో, విదుషి గంగూబాయి హంగల్ , ఎటువంటి సేవచేసేరో, మోగూబాయి, ఖాన్జీ నేతృత్వంలో, జయపూర్ గాయకీకి సుమారు అటువంటి సేవనే చేసేరు.

ఆమె అద్భుతమైన గాత్రశక్తిలోను, గానధర్మంలోను జయపూరుగాయకీకి చెందిన విలక్షణ స్వర-లయాత్మక సమగ్ర సాహచర్య ధౌరంధర్యం అనితరసాధ్యంగా సుశిక్షితంగా సురక్షితంచేయబడింది.

స్వచ్ఛ స్వర స్వరూపాన్ని ప్రకాశింపచేసే క్లిష్టమైన “ఖయాల్ ” గానాన్నిరసమయంగా పాడి, రసికవరుల రసహృదయ సామ్రాజ్ఞిగా ఆమె రాణించేరు. వారి జీవితంలో కనీసం ఒక్క ఠుమ్రీనికూడా వారు పాడలేదు.

మోగూబాయి, సంగీత విదుషీమణి శ్రీమతి కిశోరీ అమోన్కర్ గారి తల్లి. కిశోరీజీయొక్క సంగీతకల్పతరుమూలాలన్నీ, తన తల్లి ఐన మోగూబాయి పునీత సంగీత హృదయ క్షేత్రంలో గాఢంగా నాటుకునివున్నాయి. విదుషి పద్మా తల్వాల్కర్జీకూడా ఆమె శిష్యురాలే!

తపస్విని మోగూబాయిజీ మహామధురమైన, అలైయా బిలావల్ , శుక్లబిలావల్ , హిందోళ్ , బసంతీ కేదార్ , దర్బారీ, నాయకీ కానడా, సూహా, బాగేశ్రీ, ముల్తానీ, పూర్వీ, జయజయవంతి మొదలైన రాగాలని వారి ఘరానా సంప్రదాయంలో అద్భుతంగా గానంచేసేరు. “యూ-ట్యూబు”లో ౘాలావరకు లభ్యం ఔతాయి.రసజ్ఞశ్రోతలు విని ఆనందించవచ్చు.

అనేక బిరుదులు, సత్కారాలు మోగూబాయిజీని వరించి, వాటి ఘనతని పెంచుకున్నాయి. 1968లో సంగీత నాటక అకాడమివారి సమ్మానం, వారికి లభించింది. 1974లో భారతదేశ కేంద్రప్రభుత్వం, వారికి “పద్మభూషణ్ ” బిరుదాన్ని సమర్పించేరు. 1990లో మధ్యప్రదేశ ప్రభుత్వంవారు, ఆమెకి “తాన్సేన్ ” సమ్మానంచేసేరు.

సువిఖ్యాత ఉత్తరభారత విమర్శకాగ్రేసరులు, శ్రీ మోహన నాదకర్ణిజీ, శ్రీమతి మోగూబాయి సంగీతప్రతిభని వర్ణిస్తూ, ఇలాగ అన్నారు:—

” – – -she (Smt. Mogubai Kurdikar) never hesitated to regale ‘fit audiences, though few’, as Milton has put it, and won the hearts of true rasikas all over the country for every thing that is subtle and beautiful, intellectual and aesthetic, sublime and pure in classical music.” (మిల్టన్ మహాకవి చెప్పినట్లు, ‘తక్కువమంది అయినా, తగిన శ్రోతలని’ పరవశింపచెయ్యడంలో ఆమె ఏ మాత్రమూ సంకోచించలేదు. ఆ విధంగా దేశవ్యాప్తంగావున్న అసలైన రసజ్ఞశ్రోతలు, ఆమె అందించిన శాస్త్రీయ సంగీతంలోని సూక్ష్మమూ-సుందరమూ, మేధాశక్తి స్పందితమూ-హృదయరక్తి రంజితమూ, నిసర్గోత్కృష్టమూ-నిర్మలోన్నతమూ ఐన శ్రేష్ఠలక్షణాలనన్నీ ఆత్మీయంగా అందిపుచ్చుకున్నారు).

సంగీత తపస్విని అయిన శ్రీమతి మోగూబాయి కుర్డీకర్జీ మ్రోల వినమ్రాంజలిని సమర్పించుకుందాం.

స్వస్తి||

You may also like...

3 Responses

  1. సి. యస్ says:

    మోగూబాయి కుర్డీకర్ అనే మహా సంగీతకారిణి — కిశోరీ
    అమోన్ కర్ తల్లి అని తెలియగానే చాలా సంతోషం కలిగింది.
    ఎందుకంటే చిన్నతనంలో కిశోరీ అమోన్ కర్ ” గీత్ గాయా
    పద్థరోంనే” సినిమాలో పాడిన టైటిల్ సాంగ్ వినడం వల్ల
    ఆమె పేరుతో బాగా పరిచయం. (తరువాతి కాలంలో ఆమె
    పద్మభూషణ్ , పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న
    శాస్త్రీయ సంగీతకారిణి అని తెలిసింది)
    ఇక సాంగ్లీకి వైద్యం కోసం డా. సంబారే దగ్గరకి ఉస్తాద్ అల్లాదియా
    ఖాంజీ వెళ్ళడం, వెళ్ళివస్తూ ప్రతిరోజూ ఆయన మోగూబాయి
    గానం వినడం యాదృచ్ఛికంగా జరిగినది అనుకుంటే, స్వయంగా
    ఖాంజీ శిష్యురాల్ని వెతుక్కుంటూ వెళ్ళడం ఆయన వ్యక్తిత్వంలోని
    వైచిత్రి! నువ్వు చెప్పినట్టుగా మహానుభావుల మనసులని అర్థం
    చేసుకోవడం అసాధ్యమనే అనుకోవాలి. వారి దయావర్షం ఎప్పుడు
    ఎవరిమీద ఎలా కురుస్తుందో తెలియరాదు.
    గురు శిష్య సంబంధం గురించి చెబుతూ గురుమహరాజ్
    ప్రసక్తి తీసుకువచ్చి, వారితో పోల్చిచెప్పడం చాలా బాగుంది.
    ఎందరో మహానుభావుల జీవితచిత్రాలని కళ్ళముందర కమనీయంగా
    నిలుపుతున్నందుకు ధన్యవాదాలు.

  2. Devi says:

    I was overjoyed to learn that Kishori Amonkar , one of my most favourite Hindustani classical musician is the daughter of Sangeeta Yogini Sri Mogubai kurnikar. Maro pranam Banke Bihari by kishori is an excellent Thumri which I always love. Her mother Mogubai ‘s melodious voice and Ustad Alladiya khan himself Offering to be a guru is a divine blessing for her. The two quotes by Kalidasa and Bhava Bhuti in this context are very interesting. You also highlighted about Sri Ramakrishna which aptly suits the article. I look forward to enjoy the Ragas detailed by u in the you tube.

  3. Ramarao says:

    Very good information about a gifted woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *