మేధా

శ్రీశారదా వాత్సల్య సుధ :—
11—10—2017; బుధవారము.

ఇతరములు.

ఈ రోజు “మేధా” శబ్దం గురించిన విచారణ చేద్దాం.

మేథృ/మేదృ/మేధృ-సంగమే” అనే ధాతువునుంచి “మేధా” శబ్దం పుట్టింది. “to know, to understand” అని ఒక ప్రధాన అర్థం.(ఇది “భ్వాది” గణ ధాతువు). “మేధా-ఆశుగ్రహణే“- “to grasp fast” అని అర్థం.(“కణ్డ్వాది గణం” ధాతువుగా దీనిని కొందరు వర్గీకరించేరు. “మేధతే అనుభూతం సర్వం అస్యాం ఇతి” అని వ్యుత్పత్తిచెప్పి, “ధీః ధారణావతీ మేధా” అని నిర్వచించేరు.

ఇప్పుడు తెలుగులో వీటికి వివరణ తెలుసుకుందాం. “మేధృ సంగమే” అంటే మూల ధాతువుకి, “కలిసిపోవడం” లేక, “తెలుసుకోవడం” అని మన సందర్భానికి అనుగుణంగా అర్థం
చెప్పుకోవాలి. ఇంక వ్యుత్పత్తి ఇలా చెప్పవచ్చు:— “అనుభూతాలైన విషయాలన్నీ దీని యందు సంగతాలై లేక అనుభవాలు అన్నీ దీనిలో చేరిపోయి ఉంటాయి”. ఇప్పుడు నిర్వచనం చూద్దాం:—

ధీః ధారణావతీ మేధా“||

ధారణచేసే అంతఃకరణవిభాగాన్ని మేధ” అంటారు.

వేదాంత పరిభాషలో దీనినే “చిత్తం”అంటారు. చిత్తంచేసేపని “అవధారణ”. అంటే మన అందరి భాషలో జ్ఞాపకం ఉండడం లేక “జ్ఞప్తి”లో ఉండడం. అంటే “retentivity” అన్నమాట.

ఈ సంక్షిప్త పరిచయంతో అసలు విషయానికి వద్దాం. మూల సంస్కృతభాషకి చెందిన ఈ “ఆకారాంత స్త్రీలింగ శబ్దం” తెలుగులో”మేధస్సు” ఎలా ఐపోయింది? అని ప్రశ్న. దీనికి రెండుకారణాలు నాకు కనిపిస్తున్నాయి. వాటిరెండింటినీ ఇక్కడ పరిశీలిద్దాం:—

1.ఈ మేధాశబ్దం బహువ్రీహి సమాసంలో అంటే “సు/దుః” లేక వ్యతిరేకార్థ “అ” ఉపసర్గలతో-prefixes తో- చేరితే వాటిరూపాలు ఇలాగ మారుతాయి. “సుమేధస్సు”, “దుర్మేధస్సు”, “అమేధస్సు” అని రూపొందుతాయి. వీటికి సకారాన్త పుంలింగశబ్దమైన “వేధస్ “(బ్రహ్మ) శబ్దంలాగ “విభక్తిరూపాలు”, “declensions”, ఉంటాయి. అంటే, “వేధాః—వేధసౌ—వేధసః” అన్నట్లు “సుమేధాః–సుమేధసౌ–సుమేధసః” అని ఉంటాయి. ఇదేవిధంగా మిగిలిన రూపాలు decline చెయ్యాలి. దీనికి భాగవతం-9వ స్కంధము-4వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో
ప్రయోగం ఒకౘక్కని ఉదాహరణ:—

ఇమే అంగిరసః సత్రం
ఆసతేsద్య సుమేధసః“||

ఈ విశేషప్రయోగాలప్రభావం వలన సంస్కృత మూలరూపమైన “మేధా” శబ్దం తెలుగులో ‘మేధస్సు’ గా మారి పోయివుండవచ్చు.

2.”(ఞి)మిదా-స్నేహనే” – to anoint- తైలలేపనము చేయుట/నూనె పూయుట -అని అర్థం. ఈ ధాతువులోనుంచి “మేదస్ ” అనే సంస్కృతపదం పుట్టింది. దీనికి తెలుగు రూపం “మేదస్సు“. “తళతళ మెరిసే మెత్తని మాంసం” అని అర్థం. “మెదడు” అనికూడా అర్థం. (ఈ ధాతువునుంచే “మేదినీ” పదం పుట్టింది).

ఈ రెండు విశ్లేషణలవలన ఒక అపశబ్దం పుట్టడానికి కారణం వెదకడంజరిగింది. ఇప్పటికీ శిష్టప్రయోగం ఆకారాంత స్త్రీలింగ పదమైన “మేధా” అని చెప్పవలసిందే! సంస్కృతభాషలో అలాగేవ్రాయాలి. ఇంక మరి హార,కేయూర,కిరీటాది సర్వాభరణాలతో ఏనుగు అంబారీ ఎక్కి ఊరేగుతున్న ఈ ‘నకిలీ’ “మేధస్సు” మాటేమిటి? అంటే ప్రస్తుతానికి దానిని “slang” లేక లోకవ్యవహారంలోవున్న గ్రామ్యభాషాపదం అని చెప్పాలి. ఎందుకంటే ఆధునిక తెలుగు నిఘంటువైన (2001) “తెలుగు అకాడమీ”” కోశంలో “మేధ” పదమే గ్రహింౘబడింది. “మేధస్సు” లేదు.–“మేదస్సు” ఉంది. ఇంక “ఆంధ్రశబ్దరత్నాకరం”, వావిళ్ళ వారి “శబ్దార్థచంద్రిక”, “ఆంధ్ర వాచస్పత్యం”, సూర్యరాయాంధ్ర నిఘంటువు”, “ఆంధ్ర దీపిక”, “వావిళ్ళ నిఘంటువు” – ఈ కోశాలలో గ్రహింౘబడలేదు. 1906లో ముద్రింౘబడిన “ఆంధ్రశబ్ద చింతామణి” లో మాత్రం “మేధస్సు” స్వీకరింౘబడిందని శ్రీ కిరణ్ చెప్పేడు. ఆ రూపానికి ప్రాచీన ప్రయోగం ఉందో-లేదో తెలియదు. అంటే 1906లోని కోశకారుడు, 2001 లోని కోశకారుడికన్న ఆధునికంగా ఉన్నట్టా? అంటే సమాధానంలేదు.ఈ పలుకుబడి వడి జ్ఞానమా, అజ్ఞానమా, తటస్థమా, అసలు ఏమీ కాని అయోమయమా అన్నది కాలగతి ఐనా నిర్ణయింౘగలదో,లేదో మనకి తెలియదు.తెలిసినదేదో పైన చర్చించుకున్నాం!

ప్రస్తుతానికి ఇక్కడ విరామం తీసుకుందాం! (వ్యాపార ప్రకటనల కోసంమాత్రం కాదు.)

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    ఒత్తులు చేరిస్తేనే సరియైన పదం అనే భావన వల్ల ఈ పదాలు పుట్టుకొచ్చి స్థిరపడి పోతున్నాయనుకుంటాను. మేధ, మేదస్సు శబ్దాలనుండీ ‘మేధస్సు’ అనే పదావిర్భావ వివరణ – లోతైన వ్యాకరణాంశమైనా, సరదాగా చెప్పినట్టుగా ఉంది. అయితే, ఇటీవలే వచ్చిన శ్రీ నల్లాన్ చక్రవర్తుల సీతారామాచార్యుల వారు వెలువరించిన ‘మందారమాల’ అనే శబ్దకోశంలో, ‘మేదస్సు’అనే మాటకు also ‘మేధస్సు’ అని ఇచ్చేశారు.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    అబ్బ! Beautiful. Very clear. Deductive.Thorough. Thank you so much.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *