సంగీతం—నాదవేదం—17
24—10—2020; శనివారము.
20-వ మేళకర్త/జనకరాగం నుండి ఆవిర్భవించిన రాగమైన భైరవి ని సాక్షాత్తూ సకలాలంకార సుశోభిత భైరవీదేవతామాత యొక్క అపురూపమైన అందౘందాలని వ్యక్తం చేసే మహామహిమాన్వితరాగం అని అభివర్ణించవలసినదే! అందువలననే దక్షిణభారత సంగీత మూర్తిత్రయం అంటే త్యాగరాజస్వామి, ముద్దు(త్తు)స్వామి దీక్షితులు,శ్యామాశాస్త్రులవారు ముగ్గురూ వివిధ విలక్షణ సుసజ్జిత సంగీతకృతులని మహామనోజ్ఞమైన భైరవి రాగంలో రచించేరు.
త్యాగయ్యగారు ఉపచారములను చేకొనవయ్యా! (ఆదితాళం);ఏనాటి నోము ఫలమో (ఆది); కొలువైయున్నాడే (ఆది);తనయుని బ్రోవ (ఆది); రక్ష బెట్టరే (ఆది) వంటి అనేక కృతులని రచించేరు.
దీక్షితులవారు ఆర్యాం అభయాంబాం (అ/ఆట తాళం); కమలాంబికాయాః పరమ్ (ఝంప); బాలగోపాల పాలయాశు మాం (ఆది); చింతయ మాకందమూలకందం (రూపక) వంటి అజరామర కృతులని కూర్చేరు.
శ్యామాశాస్త్రులవారు కామాక్షీ! అనుదినము మరవక—అనే స్వరజతిని, చాపుతాళం లోను; సరి యెవ్వరమ్మ అంబ!—అనే కృతిని ఖండ ఝంప తాళం లోను; పార్వతి! జనని! భవాని! శ్రీరాజరాజేశ్వరి!—అనే గీతాన్ని ఖండ మఠ్య తాళం లోను భైరవిలో అద్భుత సంగీత రచనలు చేసేరు.
ఇదే జనకరాగం నుండి పుట్టిన మరొక ముఖ్యమైన, ప్రాచీనకాలంనుండి బాగా జనప్రియమైన రాగం రీతిగౌళ రాగం. ఐతే, దీనిని కొందరు శాస్త్రజ్ఞులు 22వ మేళకర్త ఐన ఖరహరప్రియ రాగం లో నుంచి వచ్చిన రాగంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి భాషాంగ రాగాల విషయంలో ప్రధానంగా అన్యస్వరప్రయోగం కారణంగా ఆ-యా రాగాల జనకరాగ నిర్ణయం ఈ విధంగా వివాదాస్పదంగా ఉండడంలో ఆశ్చర్యమేమీలేదు. రీతిగౌళరాగంలో ఆరోహణలో ప(పంచమం) వర్జ్యస్వరం. అవరోహణలో సప్తస్వరాలూ ఉంటాయి. అందువలన ఇది షాఢవ—సంపూర్ణ రాగం. ఇది భాషాంగరాగమేకాక, ఆరోహణ – అవరోహణ రెండింటిలోను వక్రసంచారాలు ఉండేరాగం. వక్రసంచారం అంటే రాగంలో ఉండే స్వరాలు క్రమగతిలోకాక సామాన్యక్రమాన్ని తప్పి వెనుక-ముందులుగా సంచరిస్తూ ఉండడం.
ఈ రాగంలో లోకప్రియకృతులు, చేరరావదేమిరా; ద్వైతము సుఖమా; రాగరత్నమాలికచే; నీ దయకల్గుటే; నన్ను విడిచి కదలకురా!; పరిపాలయ! పరిపాలయ!;బడలికదీర; బాలే! బాలేందుభూషణి -భవరోగశమని!; సీతానాయక!మొదలైనవి త్యాగరాజుగారివి.
దీక్షితులవారివి (నారీ)రీతిగౌళ రాగంలో నీలోత్పలాంబికాం భజరే; శ్రీనీలోత్పలనాయికే! జగదంబికే జనప్రియమైన కృతులు.
శ్యామాశాస్త్రులవారి నిన్నువినా మరిగలదా గతి; అలాగే వారి పుత్రులైన సుబ్బరాయశాస్త్రిగారి — జనని! నిన్నువినా త్రిలోక జనని! నిన్నువినా దిక్కెవరమ్మా! జగములోనగాన అనేవి అమిత జనాదరణ కలిగిన కృతులు.
ఈ రీతిగౌళకి సన్నిహితంగా ఉండే మరొక మనోహరరాగం ఆనందభైరవి. ఆనందభైరవి రాగంలో త్యాగయ్యగారు—నీకే తెలియకపోతే; క్షీరసాగర విహార! రామ, రామ నీవారము అనే కృతులు ౘాలా లోకప్రీతిని పొందేయి. దీక్షితులవారివి—మానస! గురుగుహరూపం భజ రేరే; త్యాగరాజ యోగ వైభవం, సదాశివం సదాశ్రయామి; ఆనందేశ్వరేణ సంరక్షితోsహం; కమలాంబా సంరక్షతు మాం; దండాయుధపాణిం; ఆనందభైరవిలో ఉన్నాయి. ఇంక శ్యామాశాస్త్రులవారి కృతులు—ఓ జగదంబ! నన్ను నీవు జవమున బ్రోవు; పాహి శ్రీగిరిరాజసుతే! కరుణాకలితే!; మరి వేరే గతి ఎవరమ్మా! మహిలో బ్రోచుటకు; హిమాచలతనయ! బ్రోచుటకిది మంచి సమయము రావే అంబ; వారిదే ఆటతాళ వర్ణం – సామిని రమ్మనవే! ఆనందభైరవి రాగ రచనలు. ఈ ఆనందభైరవి రాగంలో కూడా ఆరోహణలో ని(నిషాదం) వర్జ్య స్వరం. అందువలన ఇది కూడా షాఢవ—సంపూర్ణ రాగం. ఇది కూడా వక్రసంచార రాగమే!
ఆ(అ)భేరి రాగంలోని నగుమోము; జయంతశ్రీ రాగంలోని మరుగేలరా!; హిందోళ రాగంలోని సామజవరగమన!; సారమతి రాగంలోని మోక్షము కలదా! మొదలైనవి ఎన్నో ఈ జనకరాగం లోంచి ఏర్పడ్డ రాగాలలోని కృతులే!
(సశేషం)
