సంగీతం—నాదవేదం—18
31—10—2020; శనివారము.
సంక్షిప్తంగా 20—వ మేళకర్తరాగం ఆ పైన ఆ జనకరాగం నుండి జన్యరాగాలు అయినవాటిలో ప్రధానమైన కొన్ని రాగాలని, ఆ రాగాలలో కూర్చబడిన కొన్ని ముఖ్యకృతులని గురించి తెలుసుకున్నాం. ఈ వారం 21—వ మేళకర్తరాగం ఐన కీరవాణి గురించి ఇప్పుడు పరిచయం చేసుకుందాం! కీరవాణి నాలుగవదైన వేదచక్రంలోని మూడవ జనకరాగం. ఇది మేళకర్తరాగం కనుక సంపూర్ణ—సంపూర్ణ రాగం. వేదచక్రంలోని మూడవరాగంలో స్వరాలు(రి—గి—ధ—ను లతో కలిపి) షడ్జం—చతుశ్శ్రుతి రిషభం—సాధారణ గాంధారం—శుద్ధమధ్యమం—పంచమం—శుద్ధధైవతం—కాకలి నిషాదం అనే సప్తస్వరాల కూర్పుతో ఆరోహణ—అవరోహణ లు వరుస(సవ్య)క్రమంలోనే ఉంటాయి.
కీరవాణి రాగం లో, త్యాగరాజస్వామి వారు కలిగియుంటేగదా! కల్గును కామితఫలదాయక! అనే పరమరమ్యమైనకృతిని ఆదితాళం లో రచించేరు. అయ్యవారిది ఇది ఒక్కటే ఇప్పుడు ఈ రాగంలో లభ్యమౌతోంది. దీక్షితులవారు, శ్యామాశాస్త్రులవారు ఈ రాగంలో కృతులు రచించినట్లుగా తెలియరాలేదు. మూర్తిత్రయంవారి తదుపరి కాలానికి చెందిన శ్రీ పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారు వరములొసగి అనే ౘక్కనికృతిని రూపకతాళం లో కూర్చేరు. పట్నంవారే కీరవాణి—వర్ణం రచించేరు. కడలూరు ఎం. సుబ్రహ్మణ్యంగారు కూడా కీరవాణిలో వర్ణం ఒకటి రచించేరు. శ్రీ గోపాలకృష్ణభారతి మహోదయులు కీరవాణిరాగం—చాపుతాళం లో ఇన్నముం సందేహ అనే అందమైన కృతిని రచించేరు. తమిళత్యాగరాజుగా సుప్రసిద్ధులైన మహావాగ్గేయకారులు పాపనాశం శివన్ * వర్యులు ఈ కీరవాణి రాగంలో *దేవీ! నీయే తుణై అనే అద్భుతమైన ఆదితాళబద్ధకృతిని స్వరపరిచేరు. మహారాజా స్వాతిరునాళ్ వారి కృతులు కూడా కీరవాణిరాగం లో కూర్చబడినాయి.
21వ జనకరాగం కీరవాణి నుండి జన్యరాగమైన కిరణావళిరాగం లో పరాకు నీకేలరా రామా! అనే కృతి దేశాదితాళంలో కూర్చబడింది. కిరణావళిలోనే, దేశాదితాళంలోనే ఏటి యోచనలు జేసేవురా? ఎదురుబల్కువారెవరూ లేరురా ఇంకొక కృతినికూడా అయ్యవారు కూర్చేరు. కీరవాణి జనకరాగ జన్యమైన మరొక మధురమైన రాగం అయిన కల్యాణవసంతరాగం లో, రూపకతాళంలోనే రెండుకృతులు, నాదలోలుడై బ్రహ్మానందమందవే మనసా అనే ప్రశస్తమైన ఒక కృతి, కనులు తాకీని పరకాంతల మనసెటులో రామ! త్యాగరాజస్వామివారు రచించేరు.
కీరవాణి, చారుకేశి వంటి దక్షిణభారత శాస్త్రీయసంగీతరాగాలు అనేకం యథాతథంగా ఉత్తరభారతసంగీతంలోకి ప్రవేశించి అక్కడ ఎంతగా స్థిరపడిపోయేయంటే, అటువంటి మహారాగాలన్నీ ఉత్తరభారత—దక్షిణభారత సంగీతపద్ధతులు రెండింటికీ శాశ్వత సేతువుని రమణీయశైలిలో నిర్మిస్తున్నాయి. దక్షిణభారత సంగీతశైలి రాగాలైన కీరవాణి, చారుకేశి, హంసధ్వని, బైరాగి(రేవతి), కళావతి వంటి రాగాలు ఉత్తరభారతసంగీత ఖయాల్ పద్ధతిలోకి ఖాన్ సాహబ్ ఉస్తాద్ అమీర్ ఖాన్ వర్యుల సంగీత సృజనాత్మక దక్షతతో ప్రవేశించి సువ్యవస్థితం చేయబడ్డాయి.
కర్ణాటక సంగీత పద్ధతిలోని కీరవాణిరాగంయొక్క సర్వసామాన్య చలనగతి, హిందూస్థానీ సంగీతపద్ధతిలోని పీలూరాగం యొక్క కొన్ని పోకడలకి ౘాలా సన్నిహితంగా ఉంటుంది. ఉత్తరభారత సంగీత సంప్రదాయం ప్రకారం కీరవాణి రాగం లో స్వరసంపుటీకరణ ఈ విధంగా ఉంటుంది:—
షడజ్ – తీవ్ర రి – కోమల్ గ – శుద్ధ్ మ – ప – కోమల్ ధ – తీవ్ర ని – షడజ్|
పీలూరాగం లో కొన్ని సంచారాలలో కోమల్ ని – తీవ్ర గ ల ప్రయోగాలు కూడా పై స్వరాలతోబాటు ఉంటాయి. పీలూ రాగం హిందుస్థానీ సంగీతం లోని కాఫీ థాట్ (దక్షిణభారత సంగీత పద్ధతిలోని ఖరహరప్రియ—22వ మేళకర్త రాగం) కి చెందిన షాఢవ-సంపూర్ణ రాగం. ఆరోహణలో రి(షభం) వర్జ్య స్వరం.
సినీ-సంగీతదర్శకులకి, అందునా హిందీ చలనచిత్రసీమలోని సంగీత దర్శకులకి, హిందీ సినిమా పాటల ప్రేమికులకి పీలూరాగం లోని గీతాలు ప్రాణప్రియమైనవి. అందువలన పీలూని పోలిన కీరవాణి సోయగాలు సంగీతదర్శకులని, గీతప్రియులని ఇట్టే ఆకట్టుకున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక విశేషాంశం గమనించాలి. సినిమా కీరవాణి రాగంలో పీలూతో జతకట్టడానికి వీలుగా రాగంలో సరసజన హృదయ రంజకత్వ గుణం కల్పించడం కోసం అన్యస్వర ప్రయోగం చేయడం అనే విలక్షణ ప్రక్రియ ఉంటుంది. అప్పుడు అది మిశ్రకీరవాణి గా ముస్తాబు ఔతుంది. మన దక్షిణభారతసంగీత కీరవాణి అంత తీవ్రమైన క్రమశిక్షణతో కూడిన మడి-పూర్వాచారం-కట్టు-బొట్టు-కట్టుబాటులు మిశ్రకీరవాణిలో మనకి క(వి)నిపించకపోవచ్చు. ఐనా మనసు మారలేదు-రాగం తీరు మారబోదు అన్నట్టుగానే మిశ్రకీరవాణి ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందువలననే దాని ప్రత్యేకమైన గుర్తింపు దానికి చెరిగిపోదు.
హిందీ చలనచిత్ర సంగీతదర్శకులలో హేమాహేమీలైన కల్యాణ్‌జీ-ఆనంద్జీ, రవిజీ, శంకర్-జైకిషన్, O.P.నయ్యర్జీ వంటి వారు మిశ్రకీరవాణి రాగం లో ౘక్కని పాటలు వరసకట్టి గీతప్రియుల హృదయాలని దోచుకున్నారు.
(సశేషం)
