సాహిత్యము—సౌహిత్యము ~ 74 | సందేహ బీజాలు – సమాధాన అంకురాలు
ఐం శ్రీశారదాపరదేవతాయై నమో నమః|
17—11—2018; శనివారము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“సాహిత్యము – సౌహిత్యము ~ 74″| “సందేహ బీజాలు – సమాధాన అంకురాలు”|
మన “శారదా వైభవము” ప్రారభించబడినప్పటినుంచి మన సముదాయంలోని మాన్యసభ్యులైన శ్రీ కామేశ్వరరావుగారు, శ్రీ బి.యస్ . మూర్తిగారు మొదలైన విద్వద్వరేణ్యులు కొన్ని ౘక్కని సందేహాలని వెలిబుచ్చేరు. వాటికి సంబంధించిన వివరణలు అన్నీ మన సముదాయ సభ్యవరిష్ఠులందరినీ అలరించేవే! అందువలన ఈవారం “పైప్ లైన్ ” లో ఉన్న ఆ సందేహాలు నివృత్తిచేసుకునే ప్రయత్నం చేసుకుందాం!
I) “సాహిత్యము-సౌహిత్యము~10″లో ప్రస్తావించబడిన శ్లోకంలోని పంచభూతాలకి చెందిన బీజాక్షరాలకి సంబంధించిన ప్రస్తావనని గురించిన వివరణ! ముందు ఆ శ్లోకం మరొకసారి ఇక్కడ ప్రస్తావించుకుందాం!
అంబా కుప్యతి తాత! మూర్ధ్ని విలసత్ గంగేయముత్సృజ్యతాం|
విద్వన్ ! షణ్ముఖ! కా గతిః? మయి చిరాత్ అస్యాః స్థితాయాః వద!|
కోపావేశవశాత్ అశేష వదనైః ప్రత్యుత్తరం దత్తవాన్ |
అంభోధిః! జలధిః! పయోధి రుదధిః! వారాంనిధిః! వారిధిః!||
మనకి భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం పంచభూతాలని తెలుసు. మంత్రశాస్త్రంలో బీజాక్షరసంప్రదాయం అనేది ఒకటి ఉంది.
బీజాక్షరం=seed-letter=అక్షరరూపంలోని విత్తనం. అంటే అవసరమైన కొన్ని అనుకూలపరిస్థితులు లభిస్తే ఒక బీజం మొలకెత్తి, ఆ బీజజాతికి చెందిన వృక్షాన్ని ఉత్పత్తిచేసి ఏ విధంగా వృద్ధిపొందించి ఆ జాతికిచెందిన పూలని పండ్లని అందిస్తుందో అదే విధంగా నాదరూపంలోని మౌలికబీజం తత్సంబంధమైన దివ్యఫలాలనికూడా మంత్రసాధకులకి గురుమార్గదర్శనంలో సక్రమసంప్రదాయంలో సాధననిచేస్తే సంక్రమింపచేస్తుందని మంత్రశాస్త్రవేత్తలైన ఋషుల సందేశం!
ఆ విధంగా పంచభూతాలకి పంచబీజాక్షరాలు ఉన్నాయని “తంత్రాభిధానం”వంటి అనేక బీజాక్షరనిఘంటువులు తెలియజేస్తున్నాయి. అవి వరసగా,
భూమి=ల; జలం=వ(“వ” ని అమృతబీజం అనికూడాఅంటారు. ఎందుకంటే “అమృతమాపః” అని వేదం చెపుతోంది. “అమృతం అంటే జలం లేక జలం అంటే అమమృతం” అని ఆ వేదవచనానికి అర్థం); అగ్ని=ర; వాయువు=య; ఆకాశం=హ; అని బీజాక్షరనిఘంటువు వెల్లడి చేస్తోంది. ఇప్పుడు పంచభూతాలకి సంబంధించిన “ల – వ – ర – య – హ” అనే ఐదు బీజాక్షరాల ఉనికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (అంటే కనీసం ఉచ్చారణరూపంలో) పైన ఉదహరించబడిన “అంబా కుప్యతి – – –” అనే శ్లోకంలో ఉంది అని చెప్పవచ్చు. నాదరూపంలోవున్న ఈ పంచబీజాక్షరాలు బాహ్యమైన సృష్టిలోని పృథివ్యాది పంచమహాభూతాలకి, ఆ పంచమహాభూతాలకి అధిదైవతాలైన వివిధదేవతలకి ప్రాతినిధ్యంవహిస్తూ, సాధకులలోని పాంచభౌతిక దేహానికి, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలనే సూక్ష్మరూపంలోని పాంచభౌతిక జ్ఞానేంద్రియలక్షణయుతమైన ఇంద్రియజన్యజ్ఞాన ప్రదాయకమైన పంచతన్మాత్రలకికూడా ప్రాతినిధ్యం వహిస్తాయి.
సాధకుల మంత్రసాధనకి అనువైన స్పందనని ప్రతిఫలించే ఇష్టదేవతానుగ్రహరూపంలోఈ రెండింటికీ అనుసంధానంగా కూడా నాదరూపంలోని ఈ పంచబీజాలు వ్యవహరించి సాధకజీవుల సక్రమపరిణతికి దోహదం చేస్తాయి. అది నాదంయొక్క సూక్ష్మవ్యాపకశక్తివలన ఏర్పడుతుంది. నాదిశక్తి అటువంటిది. (It can be construed as supremely derived subtlest aspect of sound-energy).
ఉదాహరణకి పై శ్లోకాన్ని సూక్ష్మంగా పరిశీలిద్దాం! జలధిలో “ల” ఉంది. వారాంనిధిఃలో “వ”/ “ర” దీర్ఘరూపంలో ఉన్నాయి. పయోధిలో, “య”, “య+ఉ”=యో రూపంలో ఉంది. విసర్గల(ః) ఉచ్చారణ రూపంలో “హ” ఉంది. అంటే పంచభూతాల బీజాక్షరాల కూర్పు ఈ విధంగా ఈ శ్లోకంలో ఉంది. అంటే పంచభూతాల బీజాక్షరసంపుటీకరణ ఏకస్థానంలో, ఏకకాలంలో ఉన్నట్లుగా గుర్తించగలగడంవలన “పంచపూజ” అని చెప్పబడే మానసికపూజా పరికల్పనయొక్క ఫలం లభిస్తుందని భావించవచ్చు! దానిని ఇష్టదేవతాపరంగా భావనచేయగలిగితే విశేషఫలదాయకం.
ఎందువల్లనంటే “భావేషు విద్యతే దేవః” అని శాస్త్రవాక్యం! అంటే భావనాబలం వలననే పూజాఫలంయొక్క ఆధిక్యం ఆ పైన జపసాఫల్యం ఉంటుందని సంప్రదాయజ్ఞులు అంటారు. ఈ విషయాన్నే సంక్షిప్తంగా డా. చాగంటి రామారావుగారు, శ్రీ కె.బి.జె. శ్రీనివాస్ గారు తమ స్పందనలు(responses)లో ఉల్లేఖించేరు(alluded).
II) “సాహిత్యము – సౌహిత్యము ~ 32”. a) కాయజుడు/కాయజసూనుడు:— ఈ రెండుపదాలు సమానార్థకాలుగానే ప్రయోగంలోవున్నాయి. ఇటువంటి ప్రయోగాలు సంస్కృతసారస్వతంలో క్రొత్త కాదు. ఉదాహరణకి “తార్క్ష్యుడు=గరుత్మంతుడు” అని అర్థంకదా! “తృక్షస్య ఋషేః అపత్యం పుమాన్ ” తృక్షుడనే ఋషియొక్క కొడుకు తార్క్ష్యుడు అని వ్యుత్పత్తి చెపుతాము. కశ్యపప్రజాపతికి తృక్ష ఋషి అనే పేరుకూడావుంది. కనుక కశ్యపుని భార్య ఐన వినతకి కశ్యపప్రజాపతి అనుగ్రహంవలన జన్మించిన అపూర్వ దైవీయశక్తికలిగిన గరుత్మంతుడికే “తార్క్ష్యుడు” అని పేరు. కాని భాగవతమహాపురాణంలోని తృతీయస్కంధంలోవున్న రెండవ అధ్యాయం, 24 వ శ్లోకం, తృతీయపాదం,చివరలో, “గరుత్మంతుడు” అనే అర్థంలోనే “తార్ క్ష్య పుత్రమ్ ” అనే ప్రయోగం ఉంది. తార్ క్ష్యుడు అన్నా, తార్ క్ష్యసుతుడు సూనుడు/ పుత్రుడు/తనయుడు అన్నా గరుత్మంతుడనే అర్థం. మన్మథుడి అవతారమైన ప్రద్యుమ్నుడి కొడుకు ఐన “అనిరుద్ధుడు” కూడా తండ్రితో సమానమైన సౌందర్యవంతుడే! ఆ అర్థంలోకూడా ఇక్కడ తీసుకోవచ్చు. “సూనుడు” అంటే కొడుకు అనే అర్థమేకాక తమ్ముడు/అనుజుడు అనే అర్థంకూడావుంది. అప్పుడు మన్మథసహోదరుడు లేక మన్మథుడికి ఈడైనవాడు అని చెప్పవచ్చు. “సూనుడు” అంటే సూర్యుడు అనే అర్థంకూడావుంది. ఆ అర్థంలో సూర్యశబ్దాన్ని శ్రేష్ఠవాచకంగా గ్రహించి, మన్మథశ్రేష్ఠుడు అనికూడా అర్థం చెప్పవచ్చు. సాధారణ మన్మథుడైతే మనసుని కామభావాలతో కలుషితంచేసి ఆంతరికజగత్తుని అల్లకల్లోలం చేస్తాడు. శంకరుడు మన్మథునిలోని తమోగుణమయమైన కామాన్ని దగ్ధంచేసి, సత్త్వగుణమయమైన ప్రీతిభావంతో పార్వతీదేవిని భార్యగా చేపట్టిన ఉదంతం “మన్మథ సూర్యుడు” అనే అర్థంతీసుకోవడం వలన ద్యోతమానమౌతుంది.
II) b)”హరిబాణుడు” అంటే “శ్రీమహాహావిష్ణువు బాణముగా కలవాడు” అని బహువ్రీహిలో విగ్రహం చెపితే ఇక్కడ బాగుంటుంది. త్రిపురాసురసంహారసమయంలో దేవతలందరూ తమ-తమ దివ్యశక్తులని శంకరభగవానుడికి వివిధప్రకారాలుగా ప్రదానం చేసేరు. ఆ సందర్భంలో శ్రీహరి తన వైష్ణవతేజస్సుని శంకరునికి త్రిపురాసురసంహారప్రధానశక్తి అయిన బాణరూపంలో ప్రదానం చేసేడు. అందువలన శంకరునికి “హరిబాణుడు” అని ప్రసిద్ధి వచ్చింది.
II) c) “సినీవాలి” శబ్దవ్యుత్పత్తి. “అః విష్ణుః, తేన సహ వర్తతే – ఇతి ‘సా’ లక్ష్మీః – సా అస్యాం వర్తతే ఇతి ‘సినీ’ – సినీ శుక్లా బాలా – చంద్రకలా అస్యాం వర్తతే ఇతి – సినీవాలీ” “అ” అంటే విష్ణువు(అక్షరాణాం అకారోsస్మి—భగవద్గీత) ఆయనతో నివసించే ఆమె లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి నివాసస్థానం కనుక “సినీ”! సినీ – శుక్లా – అంటే “సినీ” అనే పదానికి గౌరవర్ణం లేక స్వచ్ఛమైన తెల్లనిరంగు అని అర్థం. “సినీవాలా, సినీబాలా వా అస్యాం వర్తతే ఇతి సినీవాలీ” అంటే నునులేత చంద్రకళని కలిగిన అమావాస్యని “సినీవాలీ” అంటారు. “సినీ” అనే పదానికి స్వచ్ఛమైన తెలుపు అనే అర్థం ఉంది కనుక వర్ణసారూప్యంచేత లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురుకీ ఆ మాటని అన్వయించవచ్చు. అందులో పార్వతీదేవికి గౌరీదేవి అనే పేరు ఉందికదా! అంతేకాక, “మేదినీకోశం“లో, “సినీవాలీ తు దృష్టేందుకలాsమా, దుర్గయోరపి” అని ఉంది. అంటే “చంద్రకలతోకూడిన అమావాస్య, దుర్గ(గౌరి/పార్వతి) అని సినీవాలీశబ్దానికి అర్థం” అని చెప్పవచ్చు! ఇంకా వివరాలు “సినీవాలీ” బ్లాగు లింకులో “స్పందనలు”లో లభిస్తాయి.
III) సాహిత్యము – సౌహిత్యము ~ 38. “దోస్సారా” అంటే, “దోః బాహౌ”, “సారా – బలే” అనే అర్థాలని సమన్వయించుకుంటే “బాహుబలసంపన్నుడా!” అని ఆంజనేయస్వామిని సంబోధించడం అన్నమాట!
కొన్ని అనారోగ్యసమస్యలకారణంగా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం జాప్యంమైపోయింది. మన్నించమని మనవిచేసుకుంటున్నాను. ఇంతవరకు పెండింగులోవున్న సందేహాలకి సమాధానాలని ఇవ్వడంజరిగిందని భావిస్తున్నాను.
స్వస్తి||
Haribhanudu ante ardham adhaa
సందేహ బీజములపై
స్పందించిన అంకురముల ప్రశ్నోత్తరి ఆ
నందామృత మందించెను
వందారువు డెందమలర బాలాంత్రపు రే!
ఎండింగులు, బిగినింగులు,
పెండింగులు లేని సిట్యువేషన్లోనే
నిండైన బతుకుపంటను
పండించుకునేటి ఛాన్సు బాలాంత్రపు రే!