శారదా సంతతి — 43 : దక్షిణభారత సంగీత అభ్యాసవిద్యా దక్షుడు – శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి
ఐం శ్రీశారదాదేవ్యై నమోనమః|
06—05—02018; ఆదిత్యవాసరము|
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తి|
“శారదా సంతతి ~ 43″| దక్షిణభారత సంగీత అభ్యాసవిద్యా దక్షుడు – శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి| ( 17వ శతాబ్ది? )|
శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారి గురించి తెలుసుకోవడమంటే, కేవలమూ వారు దక్షిణభారత సంగీతానికి, సంగీతశాస్త్రానికి చేసిన మహోన్నత సేవలని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడమే! అంతకిమించి ఏమైనా తెలుసుకోవడానికి వారియొక్క వ్యక్తిగతమైన వివరాలేవీ మనకి లభ్యంకావడంలేదు. అందువలన వారు శాస్త్రీయసంగీతానికిచేసిన మహనీయసేవలని పరిచయం చేసుకుందాం! వారు చేసిన ఈ సేవలు రెండురకాలుగా కనిపిస్తున్నాయి.
(1) సంగీతం నేర్చుకునే విద్యార్థులకోసం వారు “అభ్యాస సంగీత బోధన” రంగంలో చేసిన అపార మౌలిక కృషి.
(2) “సభాసంగీత నిర్వహణ” రంగంలో వారొనర్చిన శాశ్వత సపర్య.
ముందు, మొదటి విషయంగురించి పరిచయం చేసుకుందాం! పై రెండింటినీ గమనిస్తే, శాస్త్రీయసంగీతం రెండు పాయలుగా విలసిల్లుతోందని వెల్లడౌతోంది.
మొదటిదైన అభ్యాస సంగీతంలో,
(1) సరళీస్వరాలు; (2) జంటస్వరాలు; (3) దాటుస్వరాలు; (4) అలంకారాలు;(5) గీతాలు; (6) జతిస్వరాలు; (7) స్వరజతులు; (8) వర్ణాలు, వంటివి ఈ విభాగానికి చెందినవి.
ఇంక, రెండవదైన సభాసంగీతంలో,
(1) కృతులు; (2) కీర్తనలు(ఉత్సవసంప్రదాయ/దివ్యనామకీర్తనలు/సంకీర్తనలు);(3) రాగం-తానం-పల్లవిలు; (4) రాగ/రాగ-తాళ మాలికలు; (5) పదాలు; (6) జావళీలు; (7) తిల్లానాలు; (8) తరంగాలు; (9) అష్టపదులు; (10) దరువులు; (11) తిరుప్పుగళ్ ; (12) తేవారం; (13) విరుత్తం; (14) భజన్లు; (15) ఉత్సవ ప్రబంధాలు మొదలైనవి ఈ విభాగానికి చెందినవి.
ఐతే, స్వరజతులు, వర్ణాలు, ఈరెండూ, అభ్యాస సంగీతం-సభాసంగీతం విభాగాల రెండింటికీ వారధి వంటివి. అందువలన ఈ రెండూ, అంటే “స్వరజతులు–వర్ణాలు” తరచుగా సభాసంగీతాన్నికూడా శోభాయమానం చెయ్యడం, రసహృదయుల అనుభవంలో ఉన్న అంశమే! ఉదాహరణకి, శ్యామాశాస్త్రిగారి యదుకుల కాంభోజి, భైరవి, తోడి స్వరజతులు వాటికి అవిగా సంపూర్ణ సంగీత పరిపుష్ట కళారూపాలు! అందువలన, కొన్ని సందర్భాలలో, కొందరు ప్రాచీన- అర్వాచీన మహావిద్వాంసులు, తమ సభలని స్వరజతులతో ప్రారంభించడం మాత్రమేకాక, తమ సభలలో ప్రధానమైన సంగీతరచనగా కాని, ద్వితీయ ప్రధాన ప్రయోగ యోగ్యమైన సంగీత రచనగా కాని స్వరజతిని పాడడం అనే సంప్రదాయం ఆ స్వరజతుల సంగీత రచనా సౌష్ఠవ వైశారద్యాన్ని, వైశిష్ట్యాన్ని ౘాటుతున్నాయి. అంతేకాక, మన సంగీతమూర్తిత్రయంలో ఒక విలక్షణ ప్రౌఢ సంగీత రచనాశీలి, మహావాగ్గేయకార మహితప్రతిభాశాలి ఐన శ్యామాశాస్త్రిగారియొక్క లోకోత్తర స్వర-తాళ నిర్మాణవైదుష్యం, ఈ స్వరజతి త్రయం ద్వారా సంగీత రసిక భావుకోత్తముల ఎదలకి ఎల్లలులేని పసందైన విందులని అందిస్తోనేవుంది.
అభ్యాస సంగీత విభాగానికి ఆద్యవంద్యులు పురందరదాసులవారైతే, ఆ తరవాత ఆరాధనీయులలో, గురుమూర్తి శాస్త్రి గారు ప్రథమ శ్రేణికి చెందిన మహనీయులు. ఈ అభ్యాస సంగీత ప్రణాళికలో మొట్టమొదటి నాలుగు అంశాలు పరిశీలిస్తే, అవి ఏ విధమైన సాహిత్య స్పర్శ లేని కేవలం స్వరాలకూర్పుతో కూడిన “స్వరశిక్షణ” అంశాలుగా మాత్రమేవుంటాయి! సాహిత్యాంశం అనేది “గీతాలు“తో, మొట్టమొదటిసారిగా ప్రారంభం ఔతుంది.
పాడడానికి అనువైన ఏ సాహిత్య రచననైనా, “గీతం” అని సామాన్యార్థంలో మనం వాడుకలో అంటాం, అనుకుంటాం, కూడాను!
కాని సాంకేతికంగా, సంగీతశాస్త్రం ప్రకారం, “ఒక రాగంయొక్కఅతిసరళమైన స్వర రచనతో కూర్చబడి, ఆ రాగస్వరూపాన్ని అత్యంత లఘువుగాను, సామాన్యంగాను ప్రదర్శిస్తూ, సంగీతవిద్యార్థులకి, సాధారణరాగలక్షణాన్నితెలియపరిచే, తాళనిబద్ధ, సులలిత ఏకలయాత్మక గేయం” మాత్రమే గీతం. ఇది, ఏ విధమైన పునరావృత్తి, సంగతులు లేని రాగలక్షణ నిర్వచనాత్మక అవిచ్ఛిన్న గేయం అన్నమాట! దీంట్లో ఆలాపనకి, గమకప్రయోగాలకి తావులేదు. ఈ గీతాలు, మధ్యమకాల లయలో వుంటాయి. ఇవి సాధారణంగా సంస్కృతం, కన్నడం, లేక భాండీరం అనే ఒక ప్రాకృతభాష, లయందు ఎక్కువగా రచించబడి వుంటాయి.
గీతాలు, (1) సంచారి లేక సామాన్య గీతాలు; (2) లక్షణగీతాలు అని రెండు రకాలు. మొదటివి, స్వరప్రయోగ అభ్యాస సంగీతం పూర్తికాగానే, నేర్పిస్తారు. ఆ తరవాత, లక్షణగీత అభ్యాసం చేయిస్తారు. లక్షణగీతాలలో, రాగలక్షణాలు, జనక-జన్యరాగ వివేచన, రాగాంగ-ఉపాంగ-భాషాంగ రాగాది వివరణ, స్వర ఆరోహణ-అవరోహణ మొదలైన అనేక శాస్త్రవిషయాల బోధన సంగీతరమ్యంగా చేయబడుతుంది. సాహిత్య నిర్మాణం సూత్రఖండం, ఉపాంగఖండం, భాషాంగఖండం అనే పద్ధతిని అనుసరించివుంటుంది. మనకి తెలిసిన, కృతినిర్మాణశైలిలోని పల్లవి-అనుపల్లవి-చరణం వంటి విభాగం గీతాలలోవుండదు.
ఈ పరిచయసంగ్రహం సహాయంతో మనం ముందుకి వెళ్ళాలి. మన సంగీతప్రపంచంలో కృతి-కీర్తనాది సభాసంగీతవిభాగానికి చెందిన వాగ్గేయకారులకి ఉన్న కీర్తి-ప్రతిష్ఠలు, అటువంటి గొప్ప సభాసంగీత మహాసౌధానికి పునాది నిర్మాణంచేసే అభ్యాస సంగీత వాగ్గేయకారులు చేసిన సేవలకి రసజ్ఞలోకంలో వుండవలసిన గౌరవాదరాలమాట దేవుడెరుగు, ఆ వివరాల గురించిన కనీసమైన ఎరుకకూడా లేకపోవడం శోచనీయమే! విద్యార్థుల అధ్యయన/పరీక్షల ప్రణాళికలకిమాత్రమే ఆ వివరాలు పరిమితమైపోవడం మన సంస్కృతియొక్క సమగ్ర అధ్యయనశీలతలో తగని లోటు; సరిదిద్దుకోదగ్గ దోషం. ఆ దిశలో మనంచెయ్యతగిన అధ్యయన ప్రయత్నంలో భాగంగానే ఈ చిన్నమెత్తు చింతనచేస్తూ, పైడాల గురుమూర్తి శాస్త్రి గురుదేవుల సేవని పరిచయంచేసుకునే భాగ్యమే ఈ వారం ఈ చిరు పూనిక!
ఐతే, మౌలిక మానవనైజాన్ని పరికిస్తే, ఈ హ్రస్వదృష్టిదోషం మనకి అవగతం ఔతూనేవుంటుంది. ఒక ప్రాచీన మహావృక్షం కంటబడగానే ఆ ప్రత్యక్షదృశ్య వైభవ దర్శన పారవశ్యంలో, అంతటి గొప్పచెట్టుని, అంత దీర్ఘకాలంగా బలంగా పట్టివుంచి, పోషించే కంటికి కనిపించని వృక్షమూలాల లేక చెట్టు వ్రేళ్ళ వ్యవస్థయొక్క గొప్పతనాన్ని, కంటికి కనిపిస్తూ ఆ వ్రేళ్ళకి ఆహారసారాన్ని అందించే మట్టిని, అందులోని నీరుని, ఇతర పంచభూతాల సహాయసహకారాలని, ఆ పరమాద్భుత సమైక్యవ్యవస్థయొక్క సౌహిత్యాన్ని ఏకకాలంలో, స్ఫురణలో కలిగివుండడం ౘాలా అరుదైన విషయమే కదా!
పైడాల గురుమూర్తి శాస్త్రిగారి లక్షణగీతాలు, పురందరదాసుగారి గీతాల తరవాత, అంతటి స్థాయి కలిగిన గీతాలుగా అభ్యాస సంగీతలోకంలో ప్రశస్తిని పొందేయి. వారి గీతాలు, వారికి సంగీతశాస్త్రంలోవున్న అపారవైదుష్యానికేకాక, వారి ప్రామాణిక శాస్త్రజ్ఞానాన్ని విద్యార్థులైన చిన్న వయస్సులోని బాలబాలికలకి, ఆచార్యులవారి బోధనసహకారంతో, అవగతమయ్యేలాగ సరళపద్ధతిలో తెలియచెప్పగలిగిన నేర్పుకికూడా ౘక్కగా అద్దంపడుతున్నాయి. వారి లక్షణగీతాలలో, జనక-జన్య రాగవివరాలు, వర్జనీయస్వరాలు, వక్రసంచారాలు, గ్రహ-న్యాస-అంశ స్వరాల వివరణలు మొదలైనవన్నీ సరళంగాను, సుబోధకంగాను వారు తెలియజేసేరు. ఇష్టదైవస్తోత్రాన్నేకాక, విద్యాగురువులని, ఆచార్యులని గీతాలలో స్తుతించడం ఆయన ఆరంభించేరు. ఆనందభైరవిరాగం/ధ్రువతాళంలో, “పాహి శ్రీరామచంద్ర“, నాటరాగం/ధ్రువతాళంలో, “గానవిద్యా ధురంధర” (గురుమూర్తిగారి గురువులైన శ్రీ శొంఠి వెంకటసుబ్బయ్యవర్యుల స్తుతిపరమైన గీతం), కాంభోజిరాగం/ ధ్రువతాళంలో “భువనత్రయ“, గౌళరాగం/రూపకతాళంలో “రామచంద్రపుర నివాస“, ధన్యాసిరాగం/ధ్రువతాళంలో “జయ కరుణాసింధో“, నీలాంబరిరాగం/త్రిపుటతాళంలో “జానకీరమణ“, ఆరభిరాగం/ఝంపతాళంలో “ఆరభిరాగలక్షణ“, శహానరాగం/మఠ్యతాళంలో “కంసాసుర ఖండన” మొదలైన లక్షణగీతాలు, ౘాలా ప్రసిద్ధమైనవీ, గీతరచనకి లాక్షణిక నిర్వచనప్రాయమైన ప్రశస్తి కలవీను! వీటి సాహిత్యరచనద్వారా, “శ్రీరామచంద్రుడు“, గురుమూర్తిగారికి ఉపాస్యదైవం అని విజ్ఞులైన విమర్శకుల అభిప్రాయం. రాములవారిపైన ఎక్కువ రచనలు చేసినా, ఇతర దైవాలైన శివుడు, కృష్ణుడు, సభాపతి మొదలైనవారిపైనకూడా వారి రచనలు ఉన్నాయి.
శాస్త్రిగారు సంగీతశాస్త్రరహస్యాలు, సంగీతప్రయోగధర్మమర్మాలు సమగ్రంగా తెలిసిన సంస్కృతసాహిత్యపండితులు. వారి గురువులైన శొంఠి వెంకటసుబ్బయ్య రచించిన, బిలహరిరాగంలోని “నెనరుంచి ఏలుకోరా!”, పూర్వికల్యాణిరాగంలోని “నిన్నుకోరి” అనే అటతాళవర్ణాలు లోకప్రసిద్ధమైనవి. ఆయన కుమారుడు, శొంఠి వెంకటరమణయ్యగారు త్యాగరాజస్వామికి గురువులై సర్వజగద్యశస్సుని ఆర్జించిన కారణజన్ములు.
గురుమూర్తిశాస్త్రిగారు స్వచ్ఛమైన సంస్కృతభాషలో సంచారిగీతాలు, లక్షణగీతాలు, ప్రబంధాలు, కీర్తనలు విరివిగా విరచించేరు. వారి గీతరచనాపాటవం వారికి “వేయి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి” అనే ప్రసిద్ధిని తెచ్చి పెట్టింది. అంతేకాక, ఆయన రాగసంగీతజ్ఞానవైశారద్యం ఆయనకి “నలుబదివేల రాగాల గురుమూర్తి” అనే ప్రఖ్యాతిని కలుగజేసింది. “ఘన–నయ–దేశ్య సంస్థాపనాచార్య” అని, “రాగభేద ధురీణ” అని, “గీతశాస్త్ర పారీణ” అని, “సంగీతశాస్త్ర సర్వజ్ఞ” అని ఆనాటి పండితలోకం ఆయనని ప్రస్తుతించినట్లు ఆయన సంగీతరచనల ద్వారా మనకి తెలుస్తోంది.
ఆయన తిరునల్వేలి జిల్లాలోని ‘కయత్తారు’ గ్రామంలో, ఆంధ్రబ్రాహ్మణ ములకనాడుశాఖకి చెందిన కుటుంబంలో, 17వ శతాబ్దిలో జన్మించినట్లు చరిత్రవలన తెలుస్తోంది. తంజావూరుసామ్రాజ్యప్రభువైన తులజాజీ (1765~1787) మహారాజుచేత సంస్థానపురస్కారం పొందిన గురుమూర్తి శాస్త్రిగారికి రాజుగారు ప్రత్యేకమైన “పల్లకి”ని బహూకరించేరు.
అనేక కీర్తనలు రచించిన గూడాల శేషయ్యరు, స్వరజతులు, లక్షణగీతాలు, వర్ణాలు రచించిన శోభనాద్రి, శాస్త్రిగారి ముఖ్యశిష్యులు.
ఇంక వారుచేసిన “సభాసంగీత సేవ” ౘాలా విశిష్టమైనది. వారు గొప్ప గానసౌలభ్యంతో విరాజిల్లే గాత్రమాధుర్యంకలిగిన మహాగాయకచక్రవర్తి. వారి సమకాలికులైన విద్వాంసులందరూ ఏకకంఠంతో వారిలాగ శాస్త్రీయసంగీతం పాడగలిగిన విద్వత్కళాకారులు లోకంలో లేనేలేరని ప్రకటించేరు. ఆయన ఆనాటి చెన్నపట్టణంలోని మణలి చిన్నయ్యమొదలియారుగారి సమ్మానాలని స్వీకరించి కొన్ని సంవత్సరాలపాటు చెన్నపట్టణంలోనే నివాసమున్నారు. ఆ కాలంలోనే వారు చెన్నపట్టణాన్ని, మొత్తం ప్రపంచంలోనే, దక్షిణభారత సంగీతకేంద్రమై విరాజిల్లగలిగిన ఒకానొక మహానగరంగా సందర్శించి, అందుకు అనువైన సంగీతసమైక్యస్థానంగా చెన్నపట్టణాన్ని తీర్చిదిద్దడానికి కావలసిన గట్టి పునాదులనన్నీ ఆ రోజులలోనే వేసిన మహా స్ఫూర్తిమయ భవితవ్య దర్శి(a great visionary).
గురుమూర్తిశాస్త్రిగారు విరచించిన పరిపక్వమైన ప్రౌఢసంగీతకృతులలో, ధన్యాసిరాగం/ఆదితాళంలో “నీరజ నయన“; మోహనరాగం/తిస్రరూపక తాళంలో “సభాపతిం హృదంబుజే“; దేవగాంధారిరాగం/ఆదితాళంలో “స్ఫురతు తే చరణ నలిన” మొదలైన రచనలు పండితజనసమాదరణని పొందినవి.
వారి తమ్ముడు పైడాల సుబ్బరాయశాస్త్రిగారు ఆ కాలంలో గొప్ప గాయకులే కాక, ౘక్కని వర్ణాలని రచించిన వాగ్గేయకారులు. గురుమూర్తిగారి కుమారుడు, పైడాల సుందరయ్యగారుకూడా మంచి గాయకులేకాక, దేవగాంధారిరాగంలో శ్రీకృష్ణుడిని గురించిన కీర్తనని రచించిన వాగ్గేయకారుడట!
అటువంటి మహనీయ సంగీత-సాహిత్య పుంభావ సరస్వతీమూర్తి, శ్రీ పైడాల గురుమూర్తిశాస్త్రిగారికి మన సవినయాంజలిని ఇలాగ సమర్పించుకుందాము:—
“ఘనము, నయము, దేశ్య గాన ఫణితిలందు,
జనక-జన్య రాగ సంగతులను,
స్వరలయాది సూరి, పైడాల గురుమూర్తి,
గీత గాన బోధనీ తిలకుడు!”|
“సర్వ సంగీత శాస్త్రార్థ సార వేది,
ధాతు-మాతు కల్పనలందు దక్షుడతడు,
గానవిద్యను బోధించు ఘనకుశలుడు,
ప్రణతి నర్పింతు, గురుమూర్తి పదములందు!”||
స్వస్తి||
శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రిగారు కర్ణాటక శాస్త్రీయ
సంగీతానికి చేసిన సేవ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం
కలిగింది. సాధారణంగా సరళీ స్వరాలతో మొదలుపెట్టి,
పిళ్ళారి గీతాలవరకూ ఒక భాగంగానూ ఆతరువాత కృతులనీ…
ఏదో అరకొర జ్ఞానం తప్ప, ఇంతటి శాస్త్రబద్ధమైన, సంప్రదాయ
రీతిలో సంగీతబోధనా /సభానిర్వహణా పద్ధతులను ఏర్పరిచారని
ఈ వ్యాసం ద్వారా తెలిసింది.
‘పురందర విఠల’ అని కొన్ని గీతాల్లో రావడం వల్ల పురందర దాసు
గారి పేరు పరిచయం కానీ… గురుమూర్తి శాస్త్రిగారు ఇంత కృషి
చేశారని కానీ, వారి పేరు కానీ ఇదే తెలుసుకోవడం.
త్యాగరాజుల వారికి పూర్వులే అయిన వీరి గురించి ఎంతో
విలువైన విశేషాల్ని అందించినందుకు ధన్యవాదాలు.
సంగీతం నేర్చుకునే విద్యార్థుల కు ఇది అమృత భాండాగారం. దీన్ని అందించిన మీకు ధన్యవాదములు