సంగీతం—నాదవేదం—51
19—06—2021; శనివారం.
ॐ
29వ మేళకర్త అయిన “ధీరశంకరాభరణరాగం” యొక్క బాగా ప్రచారంలో ఉన్న కొన్ని ప్రధానజన్యరాగాల సంక్షిప్తపరిచయం చేసుకుందాం!
మొదటగా “అఠాణ రాగం” పరిచయం చేసుకుందాం! ఇది ఔడవ — వక్ర సంపూర్ణరాగం. గ—ధ స్వరాలు ఆరోహణలో వర్జ్యస్వరాలు. (“గ” వర్జ్యస్వరంగా షాడవ ఆరోహణతో కూడా అఠాణరాగం ప్రయోగంలో ఉంది.). అన్యస్వరాలైన సాధారణగాంధారం, కైశికి నిషాదం కూడా ఈ రాగంలో చోటుచేసుకోవడంవలన ఇది భాషాంగరాగమై విలసిల్లుతోంది. ఈ రాగసంచారాలు ఎక్కువగా మధ్యస్థాయి ఉత్తరాంగంలోను, తారాస్థాయి పూర్వాంగంలోను ఉండడం మనం గమనించవచ్చు. ఇది వీరరసప్రధానరాగం. రాజసమూ, అధికారదర్పంతో అడగడమూ, శాసించడమూ మొదలైన రజోగుణప్రధానభావాలు ఈ రాగంలో బాగా పలికించవచ్చు. ఈ రాగం జనన-మరణ పాశాలని నిర్మూలింపజేస్తుందని శాస్త్రజ్ఞులైన పెద్దలు అంటారు.
త్యాగరాజస్వామివారు అఠాణా రాగంలో రచించిన కృతుల పరిచయం ఇప్పుడు చేసుకుందాం:— “అట్ల బలుకుదు విట్ల బలుకుదు — వందు కేమి సేతు రామ? ॥అట్ల బలుకుదు॥ (ఆదితాళం); అనుపమగుణాంబుధి! యని నిన్ను — నెరనమ్మి యనుసరించినవాడనైతి ॥అనుపమ॥ (ఖండచాపుతాళం); అమ్మ! ధర్మసంవర్ధని! — ఆదుకోవమ్మ! మా ॥యమ్మ!॥ (ఆదితాళం); ఇలలో ప్రణతార్తిహరుడనుచు పే — రెవరిడిరే? శంకరుడని? నీ ॥కిలలో॥ (ఆదితాళం); ఏ పాపము జేసితిరా? రామ! — నీ-కేపాటైన దయరాదు, నే ॥నే పాపము॥ (మిశ్రచాపుతాళం); ఏల దయరాదు? పరాకు జేసే — వేల? సమయము గాదు ॥ఏల దయరాదు?॥ (ఆదితాళం); కట్టు జేసినావో! — రామబందు ॥కట్టు జేసినావో!॥ (ఆదితాళం); చెడే బుద్ధి మానురా! ॥చెడే॥ (ఆదితాళం); నారద గాన లోల! — నతజన పరిపాల! ॥నారద॥ (రూపకతాళం); భజన సేయ రాదా? రామ! ॥భజన॥ (రూపకతాళం); ముమ్మూర్తులు గుమిగూడి పొగడే — ముచ్చట వినుకోరే! ॥ముమ్మూర్తులు॥ (ఆదితాళం); రామనామము జన్మరక్షక మంత్రము — తామసము సేయక భజింపవే! మనసా! ॥రామనామము॥ (ఆదితాళం); రారా! రఘువీర! వెంటరారా! తోడు ॥రారా! రఘువీర!॥ (ఆదితాళం); శ్రీపప్రియ! సంగీ — తోపాసన చేయవే! ఓ మనసా!” అనే కృతులు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి.
దీక్షితస్వామి కృతుల ఎత్తుగడలు ఇప్పుడు పరిచయం చేసుకుందాం:— “బృహస్పతే! తారాపతే! — బ్రహ్మజాతే! నమోస్తు తే ॥బృహస్పతే!॥ (త్రిపుటతాళం); హేరంబాయ నమస్తే — హరి బ్రహ్మేంద్రాది సేవితాయ శివకుమారాయ ॥హేరంబాయ॥ (రూపకతాళం); మహాలింగేశ్వరాయ నమస్తే — శ్రీ మధ్యార్జునపురి విలసితాయ ॥మహాలింగేశ్వరాయ॥ (ఆదితాళం); శ్రీదక్షిణామూర్తిం సదా చింతయేsహం — సదానంద విద్యాప్రద గురుగుహకీర్తిమ్ ॥శ్రీదక్షిణామూర్తిం॥ (ఖండ ఏక తాళం); శ్రీమధురాంబికయా రక్షితోsహం — సదానందకర్యా ॥శ్రీమధురాంబికయా॥ (మిశ్రచాపు తాళం); శ్రీవైద్యనాథం భజామి — శ్రితజన వందిత బాలాంబికేశం ॥శ్రీవైద్యనాథం॥ (ఆదితాళం); త్యాగరాజో విరాజతే మహారాజ శ్రీ — త్యాగరాజో విరాజతే శ్రీమత్ ॥త్యాగరాజో॥ (రూపకతాళం); వామాంకస్థితాయ వల్లభాయాశ్లిష్టం — వారణ వదనం దేవం వందేsహం ॥వామాంకస్థితాయ॥ (ఖండ ఏక తాళం)” మొదలైన కృతులు దీక్షితులవారివి లభ్యం ఔతున్నాయి.
సర్వశ్రీ ఘనం కృష్ణయ్యరు, కవికుంజరభారతి, క్షేత్రయ్య, మైసూర్ సదాశివరావు, పాపనాశం శివన్, పెరియసామి తూరన్, పొన్నయ్యా పిళ్ళై, స్వాతిరునాళ్ మహారాజావారు, ఉపనిషద్ బ్రహ్మయోగి, వేదనాయకం పిళ్ళై మొదలైన ప్రముఖ వాగ్గేయకారులెందరో “అఠాణ/ణా రాగం” లో కృతులను రచించేరు.
(సశేషం)