సంగీతం—నాదవేదం—33
13—02—2021; శనివారము.
ॐ
కుంతలవరాళి రాగం జనకరాగమైన హరికాంభోజికి జన్యరాగమే! కుంతలవరాళి రాగంలో త్యాగరాజస్వామి వారు, “కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా? (దేశాది తాళం)”; “చెంతనే సదా యుంచుకోవయ్యా! (దేశాది తాళం)”; “శరశరసమరైకశూర! శరధిమదవిదారా! (ఆది తాళం)” అనే మూడు కృతులను వెలయించినట్లు తెలియవచ్చుచున్నది. దీక్షితస్వామి, శ్యామాశాస్త్రివర్యులు కృతులను కూర్చినట్లు కానరాలేదు. తరువాతి వాగ్గేయకారులలో హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతులు, పాపనాశం శివన్ గారు, సదాశివబ్రహ్మేంద్రయతివరులు, వేదనాయకం పిళ్ళై, వీణ కుప్పయ్యరు మొదలైనవారు కుంతలవరాళి రాగంలో రచనలు చేసేరు.
తరువాత తప్పకుండా చెప్పుకోవలసిన గొప్పరాగం కేదారగౌళ రాగం. ఈ రాగం ఔఢవ — సంపూర్ణ రాగం కేదారగౌళరాగ ఆరోహణలో గాంధారం – ధైవతం వర్జ్య స్వరాలు. ఇది ఉపాంగరాగం. ఇది మూర్ఛనకారక రాగం. గ్రహభేదప్రక్రియద్వారా కేదారగౌళ రాగం, ఆరభి (ధీరశంకరాభరణరాగజన్యం); అభేరి (ఖరహరప్రియరాగజన్యం); మోహనకల్యాణి (మేచకల్యాణిరాగజన్యం) రాగాలుగా రూపొందుతుంది.
మహాసుకుమారమైన, పరమసున్నితమైన రాగం ఈ కేదారగౌళ రాగం. ఈ రాగంలో పలకని రసరమ్యమృదులభావవైభవ వైవిధ్యం లేనేలేదు అని చెప్పవచ్చు. లలితసుందరమైన భక్తి భావాన్ని, ప్రేమభావాన్ని, విరహానురాగభావాన్ని మొదలైన సరళభావాలని వ్యక్తపరచడంలో కేదారగౌళరాగానికి సహజశక్తి ఉంది. మహామహులైన అనేకవాగ్గేయకారులహస్తస్పర్శలో ఈ రాగం వేలార్చని రసం లేదనడం అతిశయోక్తి కాదు. వివిధసుమసౌరభ తుల్యమైన సరస నానాత్వవైభోగం శబ్దబంధాలకి అతీతమైనదికూడా ఈ రాగంలో హృదయరంజకంగా వెలుగులీనుతూ వెలివడుతుంది. ఇప్పుడు, త్యాగరాజస్వామి కృతులలోని ఆ మహాసౌందర్య వైవిధ్యాన్ని, వైపుల్యాన్ని ౘవి చూడగలం. — ఓ జగన్నాథా! యని నే పిలిచితే ఓయని రారాదా! (ఆది తాళం); కరుణాజలధీ! దాశరథీ! / కల్యాణ సుగుణనిధీ! (చాపు తాళం); తులసీ బిల్వ మల్లికాది జలజ(సుమ)ముల పూజల గైకొనవే! (ఆది తాళం); ధర్మాత్మ! నన్నిపుడు దయజూడవే యన (ఝంప తాళం); మా రామచంద్రునికి – జయమంగళం (ఆది తాళం); రాముని మరవకే ఓ మనసా! (ఆది తాళం); లాలి లాలయ్య లాలి / లాలి గుణశాలి వనమాలి సుహృదయన! లాలి మృదుతర! హంసతూలికాశయన! (ఝంప తాళం); వారిజనయన! నీ వాడను నేను / వారము నను బ్రోవు (ఆది తాళం); వేణుగానలోలుని గన – వేయి కనులు కావలెనే (రూపక తాళం); సిగ్గుమాలి నా వలె ధరనెవ్వరు తిరుగజాలరయ్యా! (ఝంప / ఆది తాళం); వారిజనయన! నీవాడను నేను / వారిజానన! బ్రోవు (ఆది తాళం); రఘునందన! రఘునందన! రఘునందన! రామ! (రూపక తాళం) అనెడి సర్వరసశోభితకృతులని అయ్యవారు ఈ కేదారగౌళ రాగం లోనే విరచించేరు.
దీక్షితస్వామి మహోదయులు — అభయాంబా నాయక! వరదాయక! ఆత్మరూపప్రకాశకావావ (ఆది తాళం); అభయాంబికాయాః అన్యం న జానే – – – – – అపరోక్షజ్ఞానే (ఝంప తాళం); నీలకంఠం భజేsహం సతతం నీరజాసనాదినుతం (రూపక తాళం); నీలోత్పలాంబికాయై నమస్తే జగదంబికాయై (రూపక తాళం) అనే కృతులని కేదారగౌళరాగంలోనే రచించేరు.
అన్మమాచార్యులవారి సంకీర్తనలు, స్వాతితిరునాళ్ మహారాజావారి కృతులు, కనకదాసరు, పురంధరదాసరు, క్షేత్రయ్య, ముత్తయ్యభాగవతులు, పాపనాశం శివన్, వాలాజాపేట వేంకటరమణ భాగవతులు మొదలైనవారి రచనలు కేదారగౌళరాగంలో కూర్చబడినాయి.
(సశేషము)