సంగీతం—నాదవేదం—19
07—11—2020; శనివారము.
ఇప్పుడు 22—వ మేళకర్త రాగం అయిన ఖరహరప్రియ రాగం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం! జనకరాగం ఐన ఖరహరప్రియ—వేదచక్రం లోని నాలుగవరాగం. దీనిలోని స్వరక్రమం యిది:—
ఆధార స-చతుశ్శ్రుతి రి-సాధారణ గ-శుద్ధ మ-ప-చతుశ్శ్రుతి ధ-కైశికి ని-పై స
ఆరోహణ—అవరోహణ లలో ఇవే స్వరాలు ఉంటాయి. అందువలన ఇది సంపూర్ణ—సంపూర్ణ రాగం. ఈ 22-వ మేళకర్త రాగమైన ఖరహరప్రియని హిందుస్థానీ పద్ధతిలో కాఫీ థాట్ అని పిలుస్తారు.
జనకరాగమైన ఖరహరప్రియ లో అనేక మహారమణీయకృతులని త్యాగరాజస్వామివారు కమనీయవైవిధ్యభరిత పుష్కల ప్రయోగాలతో నింపి ఈ రాగాన్ని మహాసంపన్నవంతంచేసేరు. వారు ఈ రాగంలో కూర్చిన కొన్ని ప్రముఖకృతులని ఇక్కడ ప్రస్తావించుకుందాం!
రామ! నీ సమానమెవరు? రఘువంశోద్ధారక!—రూపకతాళంౘక్కని రాజ మార్గము యుండగ—సందుల దూరనేల? ఓ మనసా!—ఆదితాళంపక్కల నిలబడి గొలిచే ముచ్చట బాగ దెల్పరాద!—త్రిపుటతాళంరామ! నీ యెడ ప్రేమరహితులకు—నామరుచి తెలుసునా?—మధ్యాదివిడము సేయవే నన్ను—విడనాడకవే!—ఆదితాళంకోరి సేవింపరారె—కోర్కులీడేర—ఆదితాళంనడచి నడచి చూచేరయోధ్యానగరము గానరే!—ఆదితాళంరామ! కోదండరామ! పాహి—రామ! పట్టాభిరామ!—చాపుతాళంమిత్ర భాగ్యమే భాగ్యము మనసా! సౌ(మిత్ర భాగ్యమే – – -)—ఆదితాళం
మొదలైన కృతులు అయ్యగారివి లోకంలో తరచుగా వింటూంటాం!
ముద్దు(త్తు)స్వామి దీక్షితులవారు, శ్యామాశాస్త్రిగారు ఖరహరప్రియ రాగంలో కృతులు రచించిన దాఖలాలు కనిపించడంలేదు. గోవిందాచార్య పద్ధతి ఐన సంపూర్ణమేళకర్త రాగ విభాగ పద్ధతి లేక 72—మేళకర్త రాగపద్ధతి ని త్యాగరాజస్వామివారు అనుసరించేరు. మూర్తిత్రయంలో మిగిలిన ఇద్దరు వారి పరంపరకి అనుగుణంగా అసంపూర్ణ మేళరాగ పద్ధతి ని అనుసరించినట్లు శాస్త్రజ్ఞులైన విమర్శకుల అభిప్రాయం. ఆ విధంగా పరికిస్తే సంపూర్ణ మేళకర్త రాగ పద్ధతిలోని ఖరహరప్రియ కి బదులుగా అసంపూర్ణ మేళకర్త రాగ పద్ధతిలోని శ్రీరాగం లో దీక్షితులవారు, శ్యామాశాస్త్రిగారు కృతులని కూర్చేరు.
జనకరాగమైన ఖరహరప్రియ నుండి అనేక లోకప్రియ జనరంజక రాగాలు ఏర్పడడం గమనిస్తే ఆనందసహితమైన ఆశ్చర్యం కలుగుతుంది. ఆభోగి, కన్నడగౌళ, కాఫి, కానడ, జయంతసేన, దర్బారు, దేవమనోహరి, నాయకి, పూర్ణషడ్జం, బృందావనసారంగ, మణిరంగు, మధ్యమావతి, మయూరధ్వని, మంజరి, మాళవశ్రీ, ముఖారి, శుద్ధధన్యాసి, శుద్ధబంగాళ, శ్రీరంజని, శ్రీరాగం, సాళగభైరవి, హుసేని, నాదచింతామణి, ఫలమంజరి, పుష్పలతిక, రుద్రప్రియ మొదలైన రాగాలలో సుప్రసిద్ధకృతులని మూర్తిత్రయంవారు మనకి అందించేరు.
మూర్తిత్రయ ఉత్తర కాలంలోని వాగ్గేయకారులు (Composers of Post-Trinity period) ౘాలా మంది ఖరహరప్రియరాగం లో కృతులని రచించేరు. ఈ రాగంలోని విశేషమాధుర్యం, విమలసౌందర్యం, విలక్షణసౌకుమార్యం, విపులభావ వైవిధ్యభరిత సంచారవిస్తృతి మొదలైన అనేక అలౌకిక అద్భుత గుణాలు, అనిర్వచనీయ దివ్యభావానుభూతులు ఖరహరప్రియరాగం కృతికర్తలకి, రసజ్ఞులకి, సంగీత విమర్శకులకి ప్రియాతిప్రియమైన రాగం గా చేసి పెట్టేయి.
ఉదాహరణకి అంబుజం కృష్ణ, అరుణగిరినాథర్, బాలమురళీకృష్ణ, గర్భపురివాస, గోపాలకృష్ణభారతి, జగన్నాథ పండితర్, కోటీశ్వర అయ్యర్, లక్ష్మణన్ పిళ్ళై, లలితదాసర్, మాయూరం విశ్వనాథశాస్త్రి, మీనాక్షీసుందరం పిళ్ళై, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతర్, నారాయణతీర్థ యతీంద్రులు, పాపనాశం శివన్, పట్ణం సుబ్రమణ్య అయ్యర్, పూచ్చి శ్రీనివాస అయ్యంగార్, పెరియసామితూరన్, తిరువత్తియూర్ త్యాగయ్యర్, వాదిరాజర్, మైసూర్ వాసుదేవాచార్, వేదనాయకం పిళ్ళై, వీణ కుప్పయ్యర్, నేదునూరి కృష్ణమూర్తి మొదలైన వారు ఎన్నెన్నో కృతులని ఖరహరప్రియరాగం లో కూర్చడం జరిగింది.
(సశేషము)