సంగీతం—నాదవేదం—7

15—08—2020; శనివారం.

భారతీయ శాస్త్రీయ సంగీతం లేక ప్రౌఢసంగీతం రంగంలోకి ప్రవేశించి రాగవిభాగం లో సంచరిస్తున్నాం. దక్షిణభారత సంగీత సంప్రదాయాన్ని అనుసరించి వర్తమానకాలంలో మేళకర్తరాగపద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ మేళకర్తరాగాలు 72 రాగాలుగా గుర్తించబడ్డాయి. ఇవి జనకరాగాలు అని లోకంలో ప్రశస్తిని పొందేయి. ఈ జనక రాగాలు అన్నీ సంపూర్ణ-సంపూర్ణ రాగాలే! అంటే ఆరోహణలో సప్త(7)స్వరాలు అదే విధంగా అవరోహణలో సప్త(7)స్వరాలు ఉంటాయి. జనకరాగాలలో ఏ విధమైన వక్రసంచారాలు ఉండవు. అంటే జనకరాగంలో ఉండే క్రింది స్థాయిలోని షడ్జం నుండి పై స్థాయిలోని షడ్జం వరకు అన్ని స్వరాలు
సక్రమమైన వరుసలోనే ఉంటాయి. ఆ స్వరాల క్రమంలో వక్రత్వం ఉండదు. అలాగే సప్తస్వరాలలో ఏ స్వరమూ లుప్తం కాదు. అలాగే ఏ మేళకర్త రాగానికి సంబంధించిన స్వరాలు ఆ మేళకర్తరాగంలో ఉంటాయే తప్ప అన్య మేళకర్త రాగ స్వర ప్రయోగం ఉండదు. ఈ కనీస అవగాహనతో ముందుకి వెడదాం!

ఏ రాగంలోనైనా షడ్జం, పంచమం స్థిరమైనవి కనుక ఈ రెండు స్వరాలకి వికృతిరూపాలు ఉండవు అని తెలుసుకున్నాం. ప్రస్తుతానికి మధ్యమం రెండు రూపాలు కలిగినదైనా దానిని ప్రక్కకి పెడదాం. మిగిలిన రిషభం, గాంధారం, ధైవతం, నిషాదం ఈ నాలుగు స్వరాలని తీసుకుందాం! వీటిలో రిషభం —(1) శుద్ధ రిషభం, (2) చతుశ్రుతి రిషభం, (3) షట్ శ్రుతి రిషభం అని మూడు రూపాలుగా ఉంటుంది. అలాగే గాంధారం —(1) శుద్ధ గాంధారం, (2) సాధారణ గాంధారం, (3) అంతర గాంధారం అని మూడు రూపాలలో ఉంటుంది. ఆ తరువాత ధైవతం —(1) శుద్ధ ధైవతం, (2) చతుశ్రుతి ధైవతం, (3) షట్ శ్రుతి ధైవతం అని మూడు రకాలుగా ఉంటుంది. ఇంక మిగిలిన నిషాదం —(1) శుద్ధ నిషాదం, (2) కైశికి నిషాదం,
(3) కాకలి నిషాదం అని మూడు విధాలుగా ఉంటుంది. ఈ స్వరాలని సౌలభ్యంకోసం రి-1; రి-2; రి-3; అని రిషభ విభాగం, గ-1; గ-2; గ-3; అని గాంధార విభాగం, ధ-1; ధ-2; ధ-3; అని ధైవత విభాగం, చివరగా, ని-1; ని-2; ని-3; అని నిషాద విభాగం సాంకేతికంగా ఏర్పరచబడింది.
ఇది పాఠం చెప్పడానికి, నేర్చుకోవడానికి మరింత సౌలభ్యం కలగడానికి, అన్ని స్వరాలకి అంకెలు తొలగించి, వాటికి బదులుగా సంకేతాలని కొంచెం మార్చేరు. రిషభంలోని మూడు రూపాలకి సంకేతం ర-రి-రు అని ఏర్పరిచేరు. ర=రి-1; రి=రి-2; రు=రి-3; అని గమనించాలి. అలాగే,
గ-గి-గు గాంధారంలో వైవిధ్యానికి, ధ-ధి-ధు ధైవతంలో వైవిధ్యానికి, న-ని-ను నిషాదంలో వైవిధ్యానికి సంకేతాక్షరాలుగా ఏర్పరచబడ్డాయి. ఈ సంకేతవిభాగాన్ని అనుసరించి వచ్చేవారం 72-మేళకర్త రాగాలు యొక్క విభజనగురించి, మేళకర్తల పేరులగురించి, ఆ పేర్లు గుర్తుంచుకోవడానికి అనువైన కటపయాది సంజ్ఞలు గురించి తెలుసుకుందాం!

(సశేషం).

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *