సాహిత్యము—సౌహిత్యము ~ 72 | భక్తిమార్గము — ఆప్తోపదేశము
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
29—09—2018; శనివారము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“సాహిత్యము—సౌహిత్యము ~ 72″| “భక్తిమార్గము — ఆప్తోపదేశము”|
తత్త్వదర్శనశాస్త్రాలన్నింటికీ ఆయా దర్శనశాస్త్రాలద్వారా సువ్యవస్థితం చేయబడిన శాస్త్రరూపంలోని జ్ఞానానికి పునాదిగావుండే “జ్ఞానమీమాంసాశాస్త్రం” లేక “జ్ఞానప్రమాణశాస్త్రం” లేక “Epistemology” అనే శాస్త్రానికి సంబంధించిన వివిధప్రమాణాలు మన భారతీయ తత్త్వశాస్త్రంలో ప్రముఖస్థానాన్ని పొంది ఉన్నాయి. ఈ ప్రమాణాలద్వారా పూర్తిగా శోధించబడి అధ్యాత్మవిద్యా సాధకులచేత సంపాదించబడిన జ్ఞానమే అధ్యాత్మవిద్యాశాస్త్ర ప్రామాణికతని సంతరించుకుని ఆ మార్గంలోకి అడుగుపెట్టిన క్రొత్త విద్యార్థులకి కరదీకగా భాసిస్తుంది. అధ్యాత్మవిద్యలన్నింటిలోకి “నారదీయభక్తి” సాధకులకి కలియుగంలో సర్వవిధాలా అనువైనది అని “అవతారవరిష్ఠులు” అయిన శ్రీరామకృష్ణగురుదేవులు బోధించేరు. నిరాకార-నిర్గుణ పరబ్రహ్మతత్త్వం, సాకార-సగుణ పరబ్రహ్మతత్త్వం రెండూ అభిన్నమని ఒకే నాణెంయొక్క రెండు పార్శ్వాలని శ్రీవారు వారి అద్భుత అమేయ సాధనద్వారా మనకి నిరూపించి మన దారిని మరింత సుగమం చేసేరు.
“మాతా తే సగుణోపాస్తిః నిర్గుణోపాసనం పితా|
ఉభౌ క్రమౌ త్వయా పూజ్యౌ అర్థనారీశ్వరౌ యథా”||
“సగుణోపాసన నీ తల్లి. నిర్గుణోపాసన నీ తండ్రి. అర్థనారీశ్వరరూపంకలిగిన సర్వసృష్టియొక్క జననీ-జనకుల రెండు రూపాలనీ నీవు సమాన ఆదరణతో ఎలాగ అర్చిస్తావో, అలాగే సగుణ-నిర్గుణ ఉపాసనలని నీవు అర్చించాలి”. అంటే, భక్తియోగంలో, సగుణోపాసనని సాధకుడు ఆదరంతో అనుసరించినా, నిర్గుణోపాసనని నిరాకరించకుండా, రెండూ తన ఇష్టదైవంయొక్క రెండు దివ్యవిభూతులని గ్రహించి, ఆ సమన్వయభావంతో తన సగుణోపాసనని నిర్వహించుకోవాలి, అని శ్రీశారదామాత బోధించేరు.
అధ్యాత్మవిద్యాశాస్త్రం (The Science of Spirituality) అధ్యయన ప్రణాళికలో జ్ఞానప్రమాణశాస్త్రంయొక్క పాత్ర అమూల్యమైనది. అధ్యాత్మవిద్యలలో భక్తియోగం బహుజనప్రీతిపాత్రమై, అనేకసాధకుల ఆచరణలో అనుభూతం అవుతోంది. అందువలన భక్తియోగశాస్తంలోకూడా తత్త్వశాస్త్రసంబంధమైన ప్రమాణాల పాత్ర ప్రయోజనవంతంగావుంది. సాధారణంగా అనేక దర్శనశాస్త్రాలలో ఉమ్మడిగా అంగీకరించబడిన
(1) ప్రత్యక్షప్రమాణం (Direct Perception);
(2) అనుమానప్రమాణం (Inference);
(3) ఉపమానప్రమాణం (Comparison);
(4) శబ్దప్రమాణం లేక ఆప్తోపదేశం (Verbal Testimony)
అనే నాలుగు ప్రమాణాలూ భక్తియోగశాస్త్రంలోకూడా ప్రమాణాలుగా స్వీకరించబడ్డాయి. ఈ ప్రమాణాలన్నీ సమప్రాధాన్యత, సమాన ప్రామాణికత కలిగినవే! వీటిలో నాలుగవది అయిన “ఆప్తోపదేశం” అనే విషయం గురించి మన ప్రస్తుత చర్చ కొనసాగుతుంది.
ముందు ప్రమాణం అంటే ఏమిటో తెలుసుకుందాం! “ప్రమీయతే అనేన ఇతి ప్రమాణం” అని వ్యుత్పత్తి అర్థం చెప్పాలి. “దీనిద్వారా శాస్త్రీయంగా ఆధారపడ దగిన జ్ఞానాన్ని పొందుతాము” అని దీని భావం. “ప్రమ” అంటే యథార్థజ్ఞానం (True Knowledge). “భ్రమ” అంటే అయథార్థజ్ఞానం (False Knowledge). యథార్థజ్ఞానాన్ని ఇవ్వగలిగినదే “ప్రమాణం (Well-founded knowledge). అటువంటిజ్ఞానాన్ని ఇచ్చేదే ఆప్తోపదేశం లేక శబ్దజ్ఞానం లేక వేదప్రోక్తజ్ఞానం అని మహర్షుల బోధ!
“ప్రత్యక్షేణానుమిత్యా వా యస్తూపాయో న బుద్ధ్యతే|
ఏతం విందంతి వేదేన తస్మాత్ వేదస్య వేదతా”||
“ప్రత్యక్ష, అనుమానాది ఏ ఇతర ప్రమాణంద్వారానూ తెలుసుకోవడానికి వీలులేకుండా తప్పనిసరిగా తెలుసుకోవలసిన అనింద్రియగ్రాహ్యమైన, తత్త్వదర్శనసంబంధమైన జ్ఞానాన్ని మనకి అందించగలిగిన శ్రుతిజ్ఞానం (Revelatory Knowledge) వేదం ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి వీలౌతుంది కనుక వేదానికి “వేదత్వం”(body of a priori knowledge) అనే పరమప్రామాణిక అలౌకికస్థితి సిద్ధించింది”.
ఈ వేద వాక్యానికే ఆప్తోపదేశం అని పేరు. “ఆప్తః యథార్థః, ఉపదేశః శాబ్దబోధః, యస్మాత్ | యథా బ్రహ్మసూత్ర, న్యాయసూత్రాదిః ఆప్తోపదేశః“|”నిజాన్ని నిరూపించేది ఆప్తమైనది. మాటలలో దానిని విశదంచెయ్యడమే ఉపదేశం. ఉదాహరణకి, “బ్రహ్మసూత్రాలు“, “న్యాయసూత్రాలు” మొదలైన వేదతత్త్వ ప్రతిపాదక, బోధాత్మక గ్రంథాలలోని సందేశమంతా ఆప్తోపదేశమే!” అని దీని భావం. అంటే, భక్తియోగమార్గనిష్ఠులకి ఆప్తోపదేశం ప్రత్యేక ప్రాముఖ్యం కలిగివున్న శాస్త్రప్రమాణం అన్నమాట! ఆప్తోపదేశబోధకి సంపూర్ణప్రభావవంతమైన ప్రయోజనం భక్తియోగంలో ఉంది. అందుకనే “భక్తవిజయం“లోని భక్తుల జీవితచరిత్రలలో ఉన్న బోధలు, “నారద భక్తిసూత్రాలు“, “శాండిల్య భక్తిసూత్రాలు“, “భక్తిమీమాంసాసూత్రాలు“, “పరభక్తిసూత్రాలు“, మొదలైన గ్రంథాలు ఆప్తోపదేశాన్ని భక్తజనులకి అందిస్తున్నాయి. ఈ ఆప్తోపదేశ ప్రయోజనాన్ని శాస్త్రం ఈ విధంగా విశదం చేసింది:—
“ఆప్తోపదేశప్రజ్ఞానం ప్రతిపత్తిః చ కారణమ్ |
వికారాణాం అనుత్పత్తౌ ఉత్పన్నానాం చ శాంతయే”||
( చరక సంహిత — 7 : 55 )
“శాస్త్రబోధిత ప్రభావయుత జ్ఞానమూ, ఆ జ్ఞానచోదిత స్వానుభవప్రాప్తి శరీరంలోను, మనస్సులోను ఆరోగ్యభంగకారకమైన వికారాలు కలుగకుండా చేస్తాయి. అప్పటికే వికారాలు లేక అస్వస్థతలు కలిగివుంటే వాటిని ఉపశమింపచేస్తాయి”.
అందువలననే ఆప్తోపదేశం భక్తులకి పై శ్లోకంలో వివరించబడిన అంతటి ప్రభావభరితమైన అధ్యాత్మ జ్ఞాన ప్రయోజనాన్ని కలిగించి జన్మాంతరకర్మభవమై సాధనకి అంతరాయంగావున్న ప్రతికూల సంస్కారాలని ఉపశమింపచెయ్యడంలో భక్తుడికి తోడ్పడుతుంది.
అంతేకాదు. భక్తుడు ఆర్షధర్మ ప్రతిపాదితమైన ఈ దిగువ శ్లోకంలో విశదీకరించ బడిన ఉత్తమ సంస్కారాన్ని వృద్ధి చేసుకోవాలి:—
“ప్రామాణ్యబుద్ధిః వేదేషు సాధనానాం అనేకతా |
ఉపాస్యానాం అనియమం ఏతత్ ధర్మస్య లక్షణమ్ “||
“భక్తుడికి వేదాలయందు ప్రమాణబుద్ధి ఉండాలి. లోకంలోవున్న వివిధ సాధన పద్ధతులయందు సమాన ఆదరణ, గౌరవం ఉండాలి. అదే విధంగా తన ఆరాధ్యదైవంయందు తనకి ఎంతటి పూజ్యభావంవుంటుందో, అలాగే ఇతర సాధకులకి అనుకూలమైన ఉపాస్యతత్త్వాలయందుకూడా అటువంటి భావననే తాను కలిగివుండాలి. ఇది సనాతన భారతీయ ధర్మ మౌలిక లక్షణం“.
ద్వైత, కేవలాద్వైత, విశిష్టాద్వైత, భేదాభేదాద్వైత, ద్వైతాద్వైత, శుద్ధాద్వైత, అచింత్యభేదాభేదాద్వైత, అవిభాగలక్షణాద్వైతాది అనేక తత్త్వదర్శనాలకి; సృష్టి ఆరంభ, పరిణామ, వివర్తాది వాదాలకి మొదలైన అనేక తాత్త్వికాంశాల వైవిధ్యానికి వేదమే మూలం. అందువలన వేదం అందరికీ ప్రమాణమే! సమన్వయాలని సమకూర్చుకోగలగడం భక్తుడి లక్షణం. సంఘర్షణలని ఉత్పన్నంచేయడం భక్తుడి పని కాదు.
వైవిధ్యం దైవనిర్మితమని, వైరుధ్యం మానవకల్పితమని భక్తుడు గ్రహిస్తాడు. ఈ విషయంలో “చరకసంహిత” ఉపదేశం, భక్తులందరికీ ఉపాదేయం.
“పురుషోsయం లోకసమ్మితః – – – యావంతః లోకే భావాః తావంతః పురుషే|
యావంతః పురుషే తావంతః లోకే| (చరకసంహిత — శారీరక అధ్యాయం : 5)|
“మానవుడు లోకానికి సరిసమానమైనవాడు. లోకంలో ఎన్నిరకాల భావాలు ఉన్నాయో, అన్నిరకాల భావవిశేషాలూ మానవుడిలోనూవున్నాయి. అదే విధంగా మానవుడిలోవున్న భావాలన్నీ లోకంలోనూ ఉన్నాయి (Man is a miniature world, while world is a mega-human being)”.
ఇక్కడ లోకం అంటే ప్రధానంగా ప్రపంచంపట్ల మానవీయ సంసారభావాలు. అంతేకాక, ప్రపంచమూ, మనిషి రెండూ ఇద్దరూ స్థూల పంచభూతాత్మకమైనవే/వారే! ఆ పైన మనిషి సూక్ష్మభూతరూపాలైన పంచతన్మాత్రల ప్రమేయం కలిగినవాడుకూడాను! స్థూలసంసారం స్థూలజగత్తులో పాంచభౌతికంగావుంటే, సూక్ష్మసంసారం సూక్ష్మమానసికలోకంలో పంచతన్మాత్రభవమైన భావరూపంలో ఉంది. సాంసారికతాదాత్మ్యభావమయమై సర్వసంకటాలనీ కొనితెచ్చుకుని రాగ-ద్వేషాది ప్రతికూలభావాలతో సతమతమయ్యేమనస్సుని, ఆప్తోపదేశ ప్రజ్ఞానంద్వారా ఆ సాంసారికదాస్యంనుంచి విముక్తంచేసి, ఇష్టదేవతారాధనాంకితం చేసుకుని భక్తుడు పరమానందాన్ని పొందగలడు.
భక్తజనప్రయోజనకారి అయిన “ఆప్తోపదేశం“గురించి వ్రాయవలసినదిగా సూచనచేసిన మన కార్డియాలజిస్ట్ మిత్రులు డా. పి. నిశాంత్ వర్యులకు నా కృతజ్ఞతలు. నాకు స్ఫురణలోలేని సాధకజనప్రయోజనవంతమైన విషయాన్ని ఆయన ప్రస్తావనచేసి నాకు సూచించడం జరిగింది.
స్వస్తి||
తాత్విక చింతనాశీలురైన వారికి, సాధకులకు, ఉపాసకులకు, ఉపకరించే చక్కని వ్యా సం.
“సమన్వయాలని సమకూర్చుకోగలగడం భక్తుడి లక్షణం. సంఘర్షణలని ఉత్పన్నం చేయడం భక్తుడి పనికాదు”. ఇది చాలాబావుంది.
ఆప్తోపదేశ మంత్రము
సుప్తశ్రోతలకు చెవుల సోకిన, అంత
ర్దీప్తియును భక్తియున్ సం
ప్రాప్తములై పరిఢవిల్లు బాలాంత్రపురే!
మహనీయులైన ఋషులూ, మహాపురుషులూ
అనన్యసామాన్యమైన తమ ఉపాసనద్వారానూ,
అతీంద్రియజ్ఞానం తోనూ పొందిన తమ అనుభవసారాన్ని
అందించడంకోసం ఉపదేశించిన ఆప్తవాక్యాలని
సప్రమాణంగా వివరించిన ఈవాల్టి వ్యాసం ఆధ్యాత్మిక దిశా
నిర్దేశం చేసే మార్గదర్శిగా ఉంది.
జ్ఞానము, యోగము, తపస్సు, భక్తి మొదలైన మార్గాలే
కాకుండా వైవిధ్యం కలిగిన ఇతర తాత్వికాంశాలన్నింటికీ
మూలం…వేదమే కనక అందరికీ వేదమే ప్రమాణము అని
ఇచ్చిన ఆప్తసందేశం ఎంత లోతుగా ఉంది!
శబ్ద ప్రమాణమైన వేదం (శ్రుతి) గురించిన వివరణ , అలాగే
భక్తి యొక్క ప్రాధాన్యతా బాగా అర్థవంతంగా తెలియచేశావు.