శారదా సంతతి ~ 60 : భారతీయ ప్రాచీన ఆర్ష మంత్ర-తంత్ర జగదాచార్యవరిష్ఠులు”—సర్ జాన్ వుడ్రాఫ్
ఐంశ్రీశారదా పరదేవతాయై నమో నమః|
16—09—2018; ఆదిత్యవాసరము|
“శ్రీశారదాంబికా దయాచంద్రికా”|
“శారదా సంతతి ~ 60″| “భారతీయ ప్రాచీన ఆర్ష మంత్ర-తంత్ర జగదాచార్యవరిష్ఠులు”—సర్ జాన్ వుడ్రాఫ్ | (కలం పేరు ఆర్థర్ ఏవ్లాన్ . 15-12-1865 నుండి 18-01-1936 వరకు)|
ప్రాచీన భారతీయ ఆర్ష వైదిక మంత్ర-తంత్ర గుప్త వైభవాన్ని మిగిలిన లోకానికి ఆధునిక శాస్త్రీయ సహేతుక భావనా మాధ్యమంద్వారా, స్పష్టమైన సప్రమాణ ఆంగ్ల భాషద్వారా, ప్రపంచానికి పరిచయంచేసి, పఠితలకి సమగ్రమైన స్ఫుటమైన అవగాహనని కలగజేయడమేకాక, శతాబ్దాల పరాయి పాలనవలన ఏర్పడిన సాంస్కృతికరుగ్మతలతో శిథిలమైపోతున్న భారతీయ యువసమాజ మనోబుద్ధుల వైకల్యాలని, వైక్లబ్యాలని ప్రక్షాళనచేసే ప్రక్రియని చేపట్టిన అత్యాధునిక మహోన్నత ఋషిసత్తములు, మహనీయ మంత్ర-తంత్ర-తత్త్వ దార్శనికమేధాపూర్ణులు, ఆధునికమానవధీశక్తికి సహేతుకంగా సనాతన ఆర్షచైతన్యస్ఫూర్తిని సన్నిహితంచేయగలిగిన సుధిసుధానిధులు అయిన సర్ జాన్ వుడ్రాఫ్ వర్యులగురించిన సంక్షిప్త జీవనరేఖాచిత్రణ చేయగలిగిన యోగ్యతని, శక్తియుక్తులని ప్రసాదించవలసినదిగా శ్రీశారదాంబికని ప్రార్థించుకుంటూ ఈ వారం “శారదా సంతతి ~ 60″ని తమ సమక్షంలో సమర్పించుకుంటున్నాను.
సర్ జాన్ జార్జ్ వుడ్రాఫ్ (Sir John George Woodroffe, also known by his pen-name, Arthur Avlon) 1865వ సంవత్సరంలో, డిసెంబరునెల, 15వ తేదీన కలకత్తా మహానగరంలో జన్మించేరు. బెంగాలుప్రాంతానికి అప్పటి అడ్వొకేటు-జనరలు (Advocate-General of then Bengal) గా ఉన్న జేమ్స్ టిస్డాల్ వుడ్రాఫ్ (James Tisdall Woodroffe) కి సర్ జాన్ వుడ్రాఫ్ , పెద్దకొడుకు. ఫ్లారెన్స్ వుడ్రాఫ్ (Florence Woodroffe) సర్ జాన్ కి తల్లి.
ఆయన విద్యాభ్యాసం ఇంగ్లండులోని వోబర్న్ పార్క్ స్కూల్ లోను, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ కళాశాలలోను జరిగింది. ఆయన న్యాయశాస్త్రం (Jurisprudence)లో విద్యని అభ్యసించేరు. బి.సి.ఎల్ ., (B.C.L., Bachelor of Civil Law లో గ్రేడ్యుయేషన్ డిగ్రీ) పట్టభద్రులయ్యేరు. ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉండగా, అంటే, 1890లో కలకత్తా ఉన్నత న్యాయస్థానం – హైకోర్టు – లో, న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించేరు. త్వరలోనే వారు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ తోబాటు, “టాగోర్ లా ప్రొఫెసర్ “గా ఉద్యోగ బాధ్యతలని స్వీకరించేరు. ఆ పదవిలో ఉండగానే, ఆయన అమీర్ ఆలీగారితో కలిసి “సివిల్ ప్రొసీజర్ ఇన్ బ్రిటిష్ ఇండియా” అనే ఆ కాలంలోని సుప్రసిద్ధగ్రంథం రచించేరు. 1902లో భారతప్రభుత్వానికి న్యాయ-సలహాదారుగా నియమించబడ్డారు. రెండు సంవత్సరాలతరవాత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసేరు. 18 సంవత్సరాలు నిరాఘాటంగా ఆ పదవిలో సమర్థవంతమైన సేవలని అందించేరు. 1915లో ఉన్నతన్యాయస్థాన ప్రధానన్యాయమూర్తిగా అఫీషియేట్ చేసేరు. ఇంగ్లండు దేశానికి తిరిగి వెళ్ళినతరవాత, 1923 నుండి 1930 వరకు, ఏడేళ్ళపాటు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, భారతీయ న్యాయశాస్త్ర విభాగంలో, “రీడర్ “గా పనిచేసేరు. 1936వ సంవత్సరం, జనవరినెలలో, 18వ తేదీన ఫ్రాన్సుదేశంలో ఆయన పరమపదించేరు.
న్యాయశాస్త్రశాఖకి సంబంధించిన విధినిర్వహణ ఆయనకి వృత్తిగా ఉండేది. వారి ప్రవృత్తి అంతా సంస్కృతభాషాధ్యయనం, భారతీయ దర్శనశాస్త్రాధ్యయనం, అందునా, మంత్ర-తంత్రశాస్త్రాధ్యయనం లో నిండుగా నిమగ్నమైవుండేది. తంత్రశాస్త్రాధ్యయనంలో వారు సాధించిన పరిణతి అసాధారణమైనదీ, అనితరసాధ్యమైనదీను! ఆయనకాలంనాటికి, ఇక్కడ మనదేశంలోను, విదేశాలలోను కూడా తంత్రశాస్త్రానికి తగిన గౌరవ-ప్రపత్తులు ఉండేవికావు. మనదేశంలో ఎక్కువగా క్షుద్రవిద్యలరూపంలోను, శిష్టాచారసంప్రదాయవిరుద్ధమైన ఆచరణలరూపంలోను తంత్రశాస్త్రప్రక్రియలు ౘాలా ఎక్కువగావుండేవి. విదేశీయులకి ఇక్కడి తాంత్రికవిధివిధానాలపట్ల చులకన చూపు, ఏహ్యభావము, ఆటవికజాతులకి చెందిన మూఢాచారప్రక్రియలనే ఏవగింపు ఉండేవి. అటువంటి పరిస్థితులలో సర్ జాన్ వుడ్రాఫ్ తంత్ర దర్శన శాస్త్రమూలాలని వైదిక సదాచార క్షేత్ర మృత్తికా భవమైనవిగా తాను దర్శించి, లోకానికి తంత్రాన్ని ఒక మహోన్నత దర్శనంగాను, సర్వజనమోక్ష ప్రదాయక అధ్యాత్మశాస్త్రవిద్యగాను, శిష్ట గురూపదిష్ట గుప్తసంకేతాత్మక సహేతుక ఉపాసనామార్గంగాను సోపపత్తికంగా నిరూపించి చూపించేరు. అనేక పరమప్రామాణిక తంత్రశాస్త్రగ్రంథాలని శ్రీశారదాదేవి అపారకృపతో అధ్యయనంచేసి, ఆ సంస్కృత మూల గ్రంథాలని ౘక్కని, సరళమైన ఆంగ్లభాషలోకి అనువదించి, వాటికి సమగ్రపీఠికలని కూర్చి ఆ పుస్తకాలని ప్రకటించేరు. ఆయన రచించి/అనువదించి/సంపాదకత్వం వహించి ప్రకటించిన ప్రధాన గ్రంథాలలో యివి సువిఖ్యాతమైనవి:—
(1) Shakti and Shakta.
(2) Principles of Tantra. ( by Shiva Chandra Vidyarnava Bhattacharya & Sir John Woodroffe )
(3) The Garland of Letters.
(4) Mahanirvana Tantra of The Great Liberation : With the Commentary of Hariharananda Bharati.
(5) The Serpent Power : The Secrets of Tantric and Shaktic Yoga. (Satcakra-nirupana and Paduka-pancaka)
(6) The World As Power.
(7) Introduction to Tantra Sastra.
(8) Hymns to the Goddess and Hymn to Kali.
(9) Tantraraja Tantra.
(10) Tantrik Texts.
(11) The seed of race.
(12) Sarada-Tilaka Tantram.
(13) Isha Upanishat : With a New Commentary by Kaulacharya Sadananda.
(14) Universal Magnetism.
(15) Bharati Shakti : Essays and addresses on Indian Culture.
(16) Kamakalavilasa of Punyanandaswamy.
(17) India : Culture and Society.
(18) Is India Civilised? : Essays on Indian Culture.
“మదరాసు విశ్వవిద్యాలయం” తత్త్వశాస్త్రశాఖాధిపతి అయిన డా. టి.ఎం.పి. మహాదేవన్ గారు, సర్ జాన్ వుడ్రాఫ్ గారి వివిధ రచనలగురించి, తంత్రశాస్త్రసంప్రదాయానికి ఆయన చేసిన సేవలగురించి వివరిస్తూ ఈ విధంగా అన్నారు:—
“సర్ జాన్ వుడ్రాఫ్ వర్యులు అనేక ప్రాచీన భారతీయప్రామాణిక గ్రంథాలని తమ సంపాదకత్వ పర్యవేక్షణలో ప్రకటించడంద్వారాను, భారతీయ శాక్తేయదర్శనానికి సంబంధించిన అనేక అంశాలపై వివిధవిపుల వ్యాసాలు రచించి ప్రచురించడంద్వారాను శాక్తేయ మతమూ, దానిలోని ఉపాసనా విధానమూ వెనుక గంభీరమైన తత్త్వదర్శనసత్యం దాగి ఉందని, దానిలో హేతువిరుద్ధతకాని, గోప్యతకాని ఏమీలేదని ఆయన స్పష్టపరిచేరు”.
“ఆయన బహిరంగంగా న్యాయమూర్తిగాను, భారతీయ న్యాయశాస్త్ర పండితుడిగాను ఉన్నారు. వ్యక్తిగతంగా భారతీయ ప్రాచీన తంత్రశాస్త్ర అధ్యనంలో నిమగ్నులై ఉండేవారు. ఆ శాస్త్రరంగంలో ఆయన అనేక ఆంగ్లగ్రంథాలు రచించేరు. వాటితోబాటు అనేక ప్రాచీన సంస్కృత తంత్రదర్శనగ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించేరు. ఆ విధంగా పాశ్చాత్య దేశాలలో తంత్రశాస్త్రసంబంధమైన ఆధునిక విద్యాధ్యయనానికి నూతన మార్గాలని నిర్మించేరు. ఆయన అంతటితో ఆగిపోలేదు. పాశ్చాత్యదేశాలలోని అనేక తంత్రశాస్త్రవిమర్శకుల దురభిప్రాయాలని దూరంచేస్తూ ప్రాచీనభారతీయ తంత్రదర్శన ఔత్కృష్ట్యాన్ని రుజువుచేస్తూ తమ గ్రంథరచనని నిర్వహించేరు. ఆ విధంగా ఆయన తంత్రదర్శనం ఉన్నతమైనదని, పవిత్రమైనదని, సామాజికనీతి,నియమాలని పరిరక్షించేదని ఆ శాస్త్రగరిమని ఉగ్గడించేరు. ఆ రకంగా అది వేద-వేదాంత ప్రతిపాదిత సత్యానికి, తత్త్వానికి అనుగుణమైన దర్శనం అని సర్ జాన్ వుడ్రాఫ్ , తమ రచనలద్వారా సహేతుకంగా నిరూపించేరు”. (Urban : 2003; p.135)
ఆయన రచించిన “The Serpent Power” అనే పుస్తకం, సంస్కృతంలోని “షట్చక్రనిరూపణమ్ “, “పాదుకాపంచకమ్ ” అనే యోగశాస్త్రగ్రంథాలకి ఆంగ్ల అనువాదం. అది ఆ తరవాతవచ్చిన ఆంగ్లంలోని “కుండలినీయోగం” మీద వచ్చిన పుస్తకాలకి ఆధారం అని విమర్శకుల అభిప్రాయం.
తంత్రశాస్త్రం జ్ఞానపాదం, యోగపాదం, క్రియాపాదం, చర్యాపాదం అనే నాలుగు విభాగాల సమగ్ర సువ్యవస్థీకృత నిర్మాణం ద్వారా మానవీయ ఇహ-పరజీవనసాఫల్య ప్రణాళికని సంసిద్ధంచేసింది. తంత్రదర్శనానికి సిద్ధాంతం, ప్రయోగం, గురుసమక్షంలో దీక్షాస్వీకారం, గురుప్రోక్త మార్గ నిర్దేశంద్వారా కృతకృత్యతని సాధించి సిద్ధినిపొందడం జరుగుతుంది. తంత్రదర్శనబోధకూడా విలక్షణంగావుంటుంది. ఉదాహరణకి “కులార్ణవతంత్రం” (I : 110)లో, ఈశ్వరుడు కైలాసంలో పార్వతీదేవికి తత్త్వబోధని చేస్తూ సాధకలోకానికి తన సందేశాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు:—
“అద్వైతం కేచిదిచ్ఛంతి, ద్వైతమిచ్ఛంతి చాపరే|
మమ తత్త్వం న జానంతి ద్వైతాద్వైత వివర్జితమ్ “||
“కొందరు సాధకులు అద్వైతతత్త్వం ఉపాసించకోరుతున్నారు. మరికొందరు ద్వైతతత్త్వోపాసనాభిమానులైవున్నారు. కాని ద్వైత-అద్వైత అతీతమైన నా మౌలికతత్త్వాన్ని వారందరూ గ్రహించలేకపోతున్నారు”.
ఇటువంటి అద్భుతబోధలతో నిండిన తంత్రదర్శనశాస్త్రంలోని అనేక మహామహిమాన్విత సందేశాలని ఆధునిక సాధకలోకానికి సాన్నిహిత్యం కలిగించడానికి సర్ జాన్ వుడ్రాఫ్ ఉద్యమస్ఫూర్తితో ఉద్యుక్తులయ్యి తమ రచనలని నిర్వహించేరు. “మహానిర్వాణతంత్రం“వంటి గ్రంథానువాదాలకి, వ్యాఖ్యానాలకి పూనుకున్న సందర్భంలో ఆయన, శ్రీ రాజా రాంమోహనరాయ్ గారి దీక్షాగురువులైన హరిహరానందభారతి మహాస్వామివారి సంస్కృత వ్యాఖ్యానాన్ని, స్వామివారి మార్గదర్శనాన్ని శిష్టాచారసంప్రదాయశుద్ధంగా గ్రహించి తమ రచనలని చేసేరు. మహానిర్వాణతంత్రంకూడా, కైలాసంలో, శివ-పార్వతుల సంవాదరూపం (dialogue-form) లో ఉంటుంది. ఈ తంత్రంలో ఇహ పరలోకసంబంధమైన మానవజీవితమౌలిక సత్యాల ఆవిష్కరణ సమగ్రంగా చేయబడింది. మానవ వైయక్తిక-సామాజిక జీవన వైలక్షణ్యాలన్నీ దీనిలో చర్చించబడ్డాయి. మానవజాతిగమ్యం, అవిద్యావిముక్తి, పరబ్రహ్మోపాసన, మంత్ర-స్తోత్ర-అర్చన-విధినిర్వహణ-సంస్కార ఆచరణ- దోష ప్రక్షాళన-వర్ణాశ్రమవ్యవస్థ-అవధూతసంప్రదాయవర్ణన-వివిధదేవతా మూర్తుల ప్రతిష్ఠ– మొదలైన అనేకానేక విధి-నిషేధాత్మక సాధకజన నిత్య-నైమిత్తిక సాధనా విషయ వివరణలన్నీ కూలంకషంగా ఒక ప్రణాళికని అనుసరించి ఈ తంత్రగ్రంథంలో విపులీకరించబడ్డాయి.
“Principles of Tantra“, శ్రీ శ్రీయుక్త శివచంద్ర విద్యార్ణవ భట్టాచార్య మహోపాధ్యాయులవారి “తంత్రతత్త్వం” అనే అపూర్వ పరమప్రామాణిక తంత్రదర్శనగ్రంథానికి సర్ జాన్ వుడ్రాఫ్ ఆచార్యవర్యుల ఆంగ్లానువాదం. ఈ గ్రంథంలో తంత్రదర్శన ఆవశ్యకత, వేద-తంత్ర భేదాలు, పోలికలు, మంత్రంయొక్క వాచ్య-వాచకశక్తి, శివ-శక్తి తత్త్వదర్శనం, శబ్దంయొక్క ధ్వని-వర్ణ విభేదం, గురుసంప్రదాయవివేకం, ఉపాసనా ప్రక్రియ మొదలైన అనేకానేక మూల అంశాలు మహావిపులంగాను, గాఢగాంభీర్యంతోను చర్చించబడ్డాయి.
“The Garland of Letters – Studies in the Mantra-Sastra” అనేది సర్ జాన్ వుడ్రాఫ్ ఆచార్యమహోదయుల పరమప్రామాణికమైన మహారమణీయరచన. దీనిలో ఆయన వాక్కు, అర్థం, ప్రత్యయం, శబ్దం, స్ఫోటవాదం, శక్తి, నాదం,మాయాతత్త్వం, హంస, కామకల, వర్ణమాల, ప్రణవం, బీజమంత్రం, షడధ్వాలు, మంత్రసాధన, ఆత్మసాధన మొదలైన కీలక గభీర విషయాలపై సప్రమాణ విపులచర్చని చేసేరు.
ఈ విధంగా ఆయన రచనలన్నీ ఆధునిక అధ్యాత్మవిద్యాసాధకులకి కరదీపికలై భాసిస్తున్నాయి. ఆ జగదాచార్యవరిష్ఠుల పాదపద్మాలవద్ద
ప్రణమిల్లి, ఆయన చూపించిన దివ్యమార్గంలో పయనించి తరిద్దాం!
స్వస్తి||
సాధన లని, సాధనలకు
బోధన లని పెద్దపెద్ద పుస్తకములతో
సాధువులను మేధావులు
వేధింతురు వక్కలంక వెంకటకృష్ణా!
చెప్పినట్టు వ్రాసి, చెప్పుచేతల నుండి,
వ్రాసినట్టు లచ్చువేసుకొందు;
చెప్పమనకపోతె చెప్పనేచెప్పను
చెప్పునై ధరింతు శ్రీపదముల!
భారతీయ తత్వశాస్త్రాన్ని…ముఖ్యంగా అంత ప్రముఖంగా.
చూడబడని తంత్ర శాస్త్రాన్నీ, శాక్తేయమతాన్నీ ప్రపంచ
దేశాలకి హేతుబద్ధమైన తత్త్వదర్శన శాస్త్రాలుగా చాటి
చెప్పిన మహా మేధావి, ఋషితుల్యుడు…. సర్ జాన్ ఉడ్రాఫ్
జీవిత విశేషాలు చదవడం సంతోషం కలిగించింది.
వేరొక భాషాసంప్రదాయాలకి చెందిన ఒక విదేశీ మతస్థుడు
మన భారతీయ తత్త్వ శాస్త్రాధ్యయనం, సంస్కృత భాషాధ్యయనం
ఎంతో లోతుగా చెయ్యడమేకాదు, అనేక గ్రంథాల్ని ఆంగ్లంలోకి
అనువాదం చేయడం సామాన్యమైన విషయం కాదు. వారికి జోహార్లు.
In the first half of 19nth century,purity was restored to all tantric practises as dakshinamurthy himself did tantra sadhana under bhairava brahmani in dakshineswar temple unser the conjoined name of two poorna avatars of the stithikara,Sri Ramakrishna deva.isnt it coinciderntal that this purified tantra,is now brought to the world in general in the second half of the same century by another saint in white of kiratha lineage(wood-ruff).play of the mother,sitting at that time in jayarambati and giving necessary directions to his intellect,without anyself glorification is sublime.
Two striking things,he was from bengal also and hus guru was harihara ananda.i feel he was a adept tantric practitioner in prior life who mother just back like that for presenting this exotic,wonderful and sublime sastra to the world