సాహిత్యము—సౌహిత్యము~61 : వృక్షదేవో భవ
ఐంశ్రీశారదాపరదేవతాయై నమోనమః|
14—07—2018; శనివారము|
శ్రీశారదాంబికా దయాచంద్రికా|
“సాహిత్యము—సౌహిత్యము ~ 61″| “వృక్షదేవో భవ”|
వృక్షానికి “తరువు” అని ఇంకొక అందమైన పేరువుంది. “తరంతి ఆతపం అనేన ఇతి తరుః” అని శబ్దవ్యుత్పత్తి! “పశుపక్ష్యాది మానవులవరకు అందరు దీనిని ఆశ్రయించి ఎండ తీవ్రతని తప్పించుకుంటారు” అని తరుశబ్దానికి విపులభావం!
వృక్షాలు, అంటే చెట్లు, మహాపురుషులవంటివి. మననుంచి ఏమీ ఆశించకుండానే చెట్లు, మహానుభావులలాగే మన దుఃఖాలని తీసుకుని మనకి సుఖ-సంతోషాలు అందిస్తాయి. తల్లితండ్రులుకూడా బిడ్డలపైన ఒకొక్కసారి చిరాకు పడతారేమో! కాని వృక్షాలు తమని విచ్ఛేదనం చేసేవారికికూడా సహాయంచేస్తాయి. తమని నరకడానికి మనిషి ఉపయోగించే గొడ్డలిని చేతితోపట్టుకోవడానికి ఉపయోగించే చేతిపట్టుకర్రని లేక పిడిని కూడా వృక్షాలు తామే మనిషికి ఇచ్చి, తమని సులువుగా మనిషి నరకడానికి సహాయపడతాయి! ఇంతటి కారుణ్యం సృష్టిలో మరెక్కడవుంది?
మనకి భూమిమీద హానికారకమైన బొగ్గుపులుసుగాలిని చెట్లు తాము పీల్చుకుని,మన జీవనాధారమైన ప్రాణవాయువుని మనకి అందిస్తున్నాయి. అందుకనే అథర్వణవేదం సృష్టినంతటిని ఒక మహావృక్షంగా సార్థక్యతతో ఉత్ప్రేక్షించింది. ఋగ్వేదం సృష్టిని తలక్రిందైన వృక్షంగా సంభావనచేస్తే, శ్రీమద్భగవద్గీత ఆ ఊర్థ్వమూల-అథశ్శాఖయుత మహాశ్వత్థవృక్షాన్ని మానవీయ సాంసారికభావనామయజీవనానికి సమన్వయించి ఆ సార్థక ఉత్ప్రేక్ష ద్వారా మనకి తత్త్వప్రబోధం చేసింది.
శ్రీమన్మహాభారతంలోని “అనుశాసనపర్వం“లో గల 58వ అధ్యాయంలో భీష్మపితామహులవారు ధర్మరాజుకి జలాశయనిర్మాణం, వేరు-వేరు జాతుల మొక్కలు, చెట్లు నాటడం, ఉద్యానాది సామాజికవనాలని పెంచడం మొదలైన రాజ్యపరిపాలనావ్యవస్థయొక్క వివిధ విధినిర్వహణలగురించి విపులంగా వివరించడం జరుగుతుంది. ఆ సందర్భంలో భీష్మాచార్యులవారు చేసిన బోధ మనందరికీ ఆచరణీయమే! ఎందుకంటే మనది “ప్రజాప్రభుత్వం” వ్యవస్థకదా!
“స్థావరాణాం చ భూతానాం జాతయః షట్ ప్రకీర్తితాః|
వృక్ష, గుల్మ, లతా, వల్ల్యః, త్వక్సారాః, తృణ జాతయః”||
“స్థిరమైన జీవులు (1) వృక్షాలు, (2) గుల్మాలు-అంటే పొదలు, (3) లతలు-అంటే చెట్లమీద, పందిరిలమీద పాకే సన్నని తీగలు, (4) వల్లిలు-అంటే నేలమీదపాకే బలమైన తీగెలు, (5) త్వక్సారాః-అంటే వెదురు, చెరకు వంటిజాతులు, (6) తృణాలు-అంటే గడ్డిజాతి మొలకలు అని ఆరు రకాలుగావుంటాయి”.
“అతీతానాగతే చోభే పితృవంశం చ భారత!|
తారయేత్ వృక్షరోపీ చ తస్మాత్ వృక్షాన్ చ రోపయేత్ “||
“చెట్టును నాటినవాడు తన ముందుతరాలవారిని, తన తరవాత తరాలవారిని కూడా తరింపజేస్తాడు. అందువలన చెట్లని నాటుతూవుండాలి”
“తస్య పుత్రాః భవంత్యేతే పాదపాః నాత్ర సంశయః|
పరలోకగతః స్వర్గం లోకాంశ్చాప్నోతి సోsవ్యయాన్ “||
“చెట్లను నాటువారికి ఆ చెట్లే పుత్రులయ్యెదరు. దీనిలో సందేహమేమీ లేదు. అందువలన అటువంటివారు మరణానంతరం స్వర్గలోకానికి, ఇతర అక్షయ పుణ్యలోకాలకి వెళ్ళిపోతారు”.
“పుష్పైః సురగణాన్ వృక్షాః ఫలైః చాపి తథా పితౄన్ |
ఛాయయా చాతిథిం తాత! పూజయన్తి మహీరుహాః”||
“(మన పుత్ర, పౌత్ర, ప్రపౌత్రాది వారసులు మన మరణానంతరం, తదుపరి తరాలలో వేదోక్తమైన దేవ-పితృ-అతిథి గణపూజాదికాలు పరంపరగా నిర్వహించే విధంగా మనం నాటిన మహావృక్షాలుకూడా) తమ పూవులతో దేవతాగణాలని పూజిస్తాయి. తమ ఫలాలతో పితృదేవతాగణాలని ఆరాధిస్తాయి. తమ నీడతో అతిథిగణాలని అర్చిస్తాయి, నాయనా, ధర్మరాజా!”
“వృక్షదం పుత్రవత్ వృక్షాః తారయంతి పరత్ర తు”
“తమని నాటి పోషించేవారిని చెట్లు పుత్రుడిలాగ పరలోకంలోకూడా తరింపజేస్తాయి” అంటూ భీష్ములవారు మనకి ధర్మరాజు ద్వారా బోధించేరు. ఆత్మశ్రేయస్సుని కోరుకునేవారు విరివిగా వృక్షాలని, వనాలని పెంచి పోషించాలని మహాభారతం ఉపదేశిస్తోంది.
శివతత్త్వరత్నాకరం, “దశపుత్రసమో ద్రుమః” అనే మహామంత్రతుల్యమైన ఉద్బోధ చేసింది. అంటే ఒక వృక్షాన్ని పెంచిపోషించడం పదిమంది కొడుకులని కని, పెంచడంతో సమానం అని చెప్పింది.
విష్ణుధర్మోత్తరపురాణం, “తృణాన్యపి సజీవాని తేషాం కుర్యాత్ న పీడనమ్ “|
అని హెచ్చరించింది. “సజీవమైన పచ్చగడ్డి మొలకలనికూడా ఏ మాత్రమూ బాధించకూడదు” అని శాసించింది.
“వృక్షచ్ఛేదకః అసిపత్రనరకే పతతి“, “చెట్లని నరికేవాడు అసిపత్రనరకంలో పడతాడు” అని ఆర్షవచనం!
Henry C. Bunner (హెన్రీ సి. బన్నర్ ), తన “The Heart of the Tree” “వృక్షహృదయం” అనే పద్యంలో ఇలాగ అన్నారు:—
“What does he plant who plants a tree?
He plants the friend of sun and sky;
He plants the flag of breezes free;
The shaft of beauty towering high.”
“తరువు నాటువాడు తరణికి, దివికిని,
మంచి మిత్రునిచ్చు మహితమూర్తి!
పవన చాలితమగు ధ్వజమౌను ఆ చెట్టు,
సుందరోర్ధ్వ దండ శోభ కలుగ!”
(స్వేచ్ఛానువాదం)
ప్రపంచ ప్రఖ్యాత కళాకారుడు, తాత్త్విక కవి ఐన Khalil Gibran తనదైన దార్శనికశైలిలో తన అనుభూతిని మనతో ఇలాగ పంచుకున్నారు:—
“Trees are poems that the earth writes upon the sky;
We fell them down and turn them into paper that we may record our emptiness.”
“అవని తనదు కవిత ఆకాశ పత్రాన
వృక్షతతుల విధిని వెలయజేయు;
తరుల చెరచి కాగితముచేసి, దానిపై
వ్రాతుమర్థ రహిత రచన, మనము!”
(స్వేచ్ఛానువాదం)
షేక్స్పియర్ మహాకవి వృక్షాలలో నిక్షిప్తమై ఉన్న ఉపదేశించే నాలుకలని (tongues in trees), జలప్రవాహాలనుండి బోధించే మహాగ్రంథాలని (books in the runnig brooks), సూక్తాలని వెలువరించే శిలలని (sermons in the stones) దర్శించి, ప్రకృతితో మానవులు ఏ విధంగా చెలిమి చేసి తమ జీవితాలని ధన్యమయం, పరిపూర్ణ విజ్ఞాన విశోభితం చేసుకోవాలో ఉపదేశించేడు.
స్వస్తి||
సమకాలీన సమాజానికి అత్యంత ఆవశ్యకమైన విషయం
ఈరోజు ‘సాహిత్యం’లో చర్చించావు. చాలా అద్భుతంగా
విశదీకరించావు. పర్యావరణ కాలుష్యం నివారించడానికి
మొక్కల/ వృక్షాల పెంపకం గురించి అనేక స్వచ్ఛంద సంస్థలూ,
ప్రభుత్వాలూ దృష్టి పెడుతోన్న ఈ సమయంలో ఇలాంటి రచనల అవసరం ఎంతైనా ఉంది.
ఇది చదివేదాకా, ఇన్నిగ్రంథాలలో వృక్షాల ప్రాముఖ్యత గురించి
ఇందరు మేధావులు అంత లోతుగా ఆలోచనలు చేశారనే విషయం
తెలిసింది. వాళ్ళు అందుకే ద్రష్టలయ్యేరు.
స్వార్థపూరితుడై, స్వీయ లాభం కోసం పెద్ద పెద్ద వృక్షాల్ని, అడవుల్నీ
నరికేసే మనిషి తన జీవితకాలంలో ఒక్క వృక్షాన్ని కూడా పెంచలేడు.
రోటరీ సంస్థకూడా ఈ మొక్కలపెంపకం విషయంలో చాలా ప్రచారం చేస్తోంది. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో చెట్ల అవసరం
గురించి శాస్త్రజ్ఞులు ఎంతో ఘోషపెడుతున్నారు.
వృక్ష సంరక్షణ మీద ఉపన్యాసాలు ఇచ్చేవారికి, వ్యాసాలు రాసేవారికీ
నీ ఈ వ్యాసంలోని సమాచారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
వృక్ష సంపద నాశనం చేస్తూ తమ సంపద పెంచుకునే వాళ్ళకి
ఇలాంటి రచనలు కనువిప్పు కావాలి.
భూరుహంబులన్న భువిలోన వేల్పులు
చెట్లు నరికి యిలకు చెడుపు తేకు!
జీవకోటి కవియె జీవనాధారంబు
తరులు లేక ముందుతరము లేదు!
మంచి వ్యాసం అందించారు.
Good article on the importance of trees which is very relevant and useful to the society. Today’s modern life in which green trees are disappearing replaced by concrete jungles is a misery to the future generations. This article which has quotes from the Mahabharata and other great poets and thinkers is a special message to the people of today’s society.