శారదా సంతతి — 37 : ప్రసిద్ధ గాయక వాగ్గేయకారుడు~పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్
ఐంశ్రీశారదాపరదేవతాయై నమః||
25—03—2018; ఆదిత్యవారము.
శ్రీశారదా దయా చంద్రిక :— “శారదా సంతతి~37″| “ప్రసిద్ధ గాయక వాగ్గేయకారుడు~పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ “|
పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారు 1845వ సంవత్సరంలో, తంజావూరులో జన్మించేరు. వారి తండ్రిగారు, భరతం వైద్యనాథయ్యరు. తాతగారు, తంజావూరు,శర్ఫోజీ మహారాజుగారి సంస్థాన విద్వాంసులైన భరతం పంచనదయ్యరుగారు. అందువలన సంప్రదాయశుద్ధమైన సంగీతకుటుంబంలో పుట్టిన సుబ్రహ్మణ్య అయ్యరుగారు దక్షిణభారత సంగీత పద్ధతిని, కేవలమూ తన అద్భుతగానం ద్వారా ప్రభావితంచెయ్యడమేగాక, తమ అమూల్య సంగీతకృతి రచనలద్వారా సుసంపన్నంచేయడానికి అవతరించిన సంగీతశారదానుగ్రహాంశ సంభూతులైన కారణజన్ములుగా మనం గ్రహించగలగాలి. అప్పుడే వారి బాహ్య – ఆంతరిక, ప్రాపంచిక – అలౌకిక ప్రకృతులని, ప్రయోజనాలని సరిగా అర్థంచేసుకోగలుగుతాం. వారు తమ ప్రారంభిక సంగీతశిక్షణని మేలట్టూరు గణపతిశాస్త్రిగారివద్ద పొందేరు. తదనంతరం, తమ ఉన్నత సంగీతాభ్యాసాన్ని, త్యాగరాజస్వామివారి బావమరిది-శిష్యుడు అయిన మానాంబుౘావడి వెంకట సుబ్బయ్యరుగారి అంతేవాసిగావుండి, వారివద్దే దక్షిణభారతసంగీతంలో ఉద్దండవిద్యాకోవిదులై ప్రకాశించేరు. వారి గాత్రం సంగీతగానానికి సహజమైన మార్దవంతోను, సంగీత భావ వ్యక్తీకరణకి అనువైనదిగాను ఉండేదికాదు. దానితో ౘాలా గొప్ప సాధన చేసి, అత్యద్భుత గాత్రధర్మంకలిగిన కంఠాన్ని వారు మహాతపఃఫలంగా స్వంతం చేసుకున్నారు. అంత మధురమైన కంఠసంస్కారం(voice culture) చేసినవారు దక్షిభారత సంగీతలోకంలో అరుదుగానేవుంటారు. అంతటి గొప్ప గాత్రధర్మం సాధించడంవలన ఆయన గాత్రంలో రాగ ఆలాపనలు, స్వరప్రస్తారాలు, తానప్రయోగాలు మొదలైన సంగీతపరిణతిని సూచించే వివిధ అంశాలు, వారి కంఠగాఢత, గాంభీర్యం, మార్దవం మొదలైన గొప్ప లక్షణాలతో సుశోభితమై, రసజ్ఞులని అనంతంగా అలరించేవి.
మానాంబుౘావడి వెంకటసుబ్బయ్యరుగారివద్ద ౘాలామంది సంగీతం నేర్చుకుని గురుప్రశస్తిని ఇనుమడింపజేసేరు. వారిలో
(1) పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరు,
(2) మహావైద్యనాథ అయ్యరు,
(3) శరభశాస్త్రి(వైణవికుడు-వేణువాదకుడు),
(4) ఫిడేలు వెంకోబారావు,
(5) త్యాగరాజు(త్యాగయ్యగారి దౌహిత్రుడు) — వీరు ఐదుగురు “పంచరత్నాలు” అని ఆ రోజులలో ప్రసిద్ధి పొందేరు.
32వ సంవత్సరంలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, పట్ణంవారు, తిరువైయారులో స్థిరపడ్డారు. ముప్ఫైఏళ్ళ వయస్సునుంచి, గురువుగారి ఆశీస్సులు, అనుమతి తీసుకుని శాస్త్రీయసంగీత గాయక కళాకారుడిగా వృత్తిని చేపట్టేరు. అప్పటినుంచి, వారు వెనుకకి తిరిగి చూసుకోవలసిన అగత్యంరాలేదు. త్యాగరాజస్వామి విరచించిన కృతులని స్వచ్ఛమైన మనోధర్మంతోను, గాఢగంభీరమైన గాత్ర సౌలభ్యంతోను పాడడంలో వారికి వారేసాటి అని చరిత్రకారులు గ్రంథస్థం చేసేరు. మధ్యమకాల గానఫణితి(తాన వైశారద్యం)లో వారు మకుటంలేని మహారాజు. శుద్ధసావేరిరాగంలో “ద(దా)రిని తెలుసుకొంటి“, బేగడరాగంలో “నాదోపాసనచే శంకర, నారాయణ, విధులు వెలసిరి – – -“, మోహనరాగంలో “భవనుత! నా హృదయమున రమింపుము బడలిక తీర – – -“, ఖరహరప్రియరాగంలో “విడ(డె)ము సేయవే నన్ను-విడనాడకవే“, మొదలైన అయ్యవారి కృతులని పట్ణంవారు గానంచేస్తూంటే త్యాగయ్యగారే వారి హృదయంలో ప్రవేశించి, వారి గాత్రంద్వారా హృదయంగమమైన సంగీత-సాహిత్య సంపూర్ణ సమన్వయ స్వరూపాన్ని రసపిపాసువుల ఆంతర్యంలో సాక్షాత్కరింపచేస్తున్నట్లుగా ఉండేదట! వారి రాగాలాపన సృజనాత్మక సౌందర్యంతో రసజ్ఞశ్రోతల హృదయాలని అలవోకగా హరించేసేదట! వారు అపూర్వరాగాలని సైతం అంత మనోహరంగానూ సదస్యులకి వినిపించి, వీనులవిందు చేసేవారట! రాగస్వరూపం గాఢంగా శ్రోతల ఎదలో హత్తుకుని చెరగని ముద్రవేసేవిధంగా పాడడం వారి సహజశైలిగా ప్రొఫెసర్ పి. సాంబమూర్తి, శ్రీ ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరువంటి మహామహులు వర్ణించేరు. వారి రవ్వై-జతులు, రకరకాల ౘక్కనికూర్పులతోకూడిన విభిన్నతానప్రయోగాలు, అపూర్వ సృజనాత్మకతతో కూడిన కల్పన-స్వరాలు మొదలైన గొప్ప-గొప్ప అంశాలన్నీ, వారి కచేరీలని మహాశోభాయమానంగా తీర్చి దిద్దేవి. మహావైద్యనాథ అయ్యరువంటి సంగీత పుంభావ సరస్వతి పట్ణంవారి కచేరీలంటే చెవికోసుకునేవారట! “ఇంక దీనికి మించి చెప్పడానికి ఏముంది?” అని శ్రీ పి. సాంబమూర్తిగారు వ్రాసేరు.
బేగడరాగం, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారి గాత్రంలోను, గానంలోను అనుపమానమైన అందౘందాలని సంతరించుకుని, పట్ణంవారి పేరుకి ముందుచేరిపోయి, “బేగడ”సుబ్రహ్మణ్యఅయ్యరుగా వారికి ప్రత్యేక ప్రతిష్ఠని తెచ్చి, తానుకూడా తన ప్రశస్తిని పెంచుకుంది. ఒకసారి మైసూరు మహారాజావారి దర్బారులో పట్ణంవారు పాడిన బేగడ చరిత్రప్రసిద్ధిని పొందింది. పట్ణంవారు మైసూరు మహారాజా మనసుని మెప్పించడానికి బేగడరాగాన్ని ఎంచుకుని, ఆ రాగాన్ని మూడురోజులు పాడేరట! మొదటిరోజు, అతివిస్తారమైన రాగాలాపనచేసి, అద్భుత-అపూర్వ రాగసంచారాలని అన్నిటినీ ప్రదర్శించి, స్థాయీభేదాన్ని విశదంగా నిరూపించి బేగడరాగంలోని మీగడలరుచులని శ్రోతలు తనివితీర అనుభవించేటట్లు చేసేరట! రెండవరోజు తానాన్ని వివిధ లయవిన్యాసాలద్వారా ప్రస్తారంచేసేరట! మూడవరోజున “రామనామమే జీవనము, ఓ మనసా – – -” అనే పల్లవిని లయత్రయంలో నెరవల్ , కల్పనస్వర ప్రయోగాలతో కలకాలమూ లోకంలో రసికజనులు మాటి-మాటికి చెప్పుకుని మురిసిపోయేరీతిలో పాడి “బేగడ”రాగ అధిదైవతాన్ని పూర్తిగా ప్రసన్నంచేసుకున్నారట!
మరొక సందర్భంలో, మైసూరు రాజదర్బారులోనే, రసజ్ఞుల అభీష్టం మేరకి, “కన్నడ గౌళ” రాగంలో అత్యద్భతమైన రాగం-తానం-పల్లవిని సర్వజనరంజకంగా చేసేరట! రాజావారు అయ్యరుగారి రసపూర్ణవైదుష్యానికి సంతోషాంతరంగులై రెండుచేతులకి రెండు సువర్ణ కంకణాలని బహూకరించేరట! అలాగే విజయనగరం సంస్థానానికిచెందిన ఆనందగజపతి మహారాజుగారినుంచికూడా పట్ణంవారు రాజసమ్మానాన్ని అందుకున్నారు. అంతేకాక, మైసూరు, విజయనగరం, తిరువనంతపురం, రామనాథపురం సంస్థానాలనుండి ఏటా వార్షికబహుమానాలని వారు అందుకొనేవారు.
పట్ణంవారు పరిపూర్ణ లక్షణ-లక్ష్య విద్వాంసులు. రాగవిభాగంలో ఎంతటి పరిణతవిద్వత్తువుండేదో, తాళవిభాగంలోనూ అంతటి పరిపూర్ణవైదుష్యం వారికివుండేది. వారు సింహనందనతాళంలో పాడిన పల్లవి వారికి నిరుపమ యశస్సుని సంపాదించిపెట్టింది. మనకివున్న 108 తాళాలలోను ఇది అత్యంత దీర్ఘ కాలప్రమాణం కలిగినది. ఒక ఆవృత్తిలో, 32 మాత్రలు, 108 అక్షరకాలాలు ఇమిడివుంటాయని పెద్దలు చెపుతారు.
ఆయన త్యాగరాజకృతులని ఎంతో దీక్షతో అధ్యయనంచేసేరు. అంతటి గొప్ప అధ్యయనం, వారిని “రెండవత్యాగరాజు” అని లోకం కొనియాడేవిధంగా చెయ్యడమేకాక, వారు వాగ్గేయకారులుగా అనేకకృతులని రచించడానికి తోడ్పడింది అని చెప్పాలి. అవి అన్నీ అచ్చం త్యారాజకృతులంత సులభ మనోహరశైలిలో శ్రోతలని అలరిస్తాయి. వారు తెలుగు, సంస్కృతం, తమిళం భాషలలో తమ కృతులని రచించేరు. వారి కృతులు “(శ్రీ)వేంకటేశ్వర” అనే ప్రధానముద్రని కలిగివుంటాయి. “(శ్రీ)వెంకటేశ”/ “ఆది వేంకటేశ”/ “(శ్రీ)వరద వేంకటేశ్వర లేక వేంకటేశ” అనే ముద్రలుకూడా అక్కడక్కడ ప్రయోగించబడ్డాయి. వారు కృతులని, తాన/పద వర్ణాలని, తిల్లానాలని, జావళీలని సుమారుగా ఒక వంద సంగీతరచనలని చేసేరు. ౘాలావరకు ఆది, దేశాది, రూపక, చాపు, ఝంప తాళాలలో కూర్చబడ్డాయి. పరిపుష్టమైన సంగతులకి వారి కృతులు రసనిధానాలు. కృతులకి ౘక్కని చిట్ట స్వరాలు శ్రోతృహృదయరంజకంగా కూర్చడంలో వారు కోవిదులు. వారి “ఆభోగిరాగం“, ఆదితాళంలోని తానవర్ణం, “ఎవ్వరి బోధన విని ఈలాగు జేసేవురా” అనేది జగత్ప్రసిద్ధి పొందింది. అలాగే, “లతాంగిరాగం“లో, “అపరాధములను“, “బిలహరిరాగం“లో, “పరిదానమిచ్చితే“, “భైరవిరాగం“లో, “నీపదములే“, “సౌరాష్ట్రరాగం“లో, “నినుజూచి“, “షణ్ముఖప్రియరాగం“లో, “మరి వేరే దిక్కెవరయ్య రామ?” మొదలైన కృతులు నిసర్గసౌందర్యంతోకూడిన సాహిత్యభావానికి, సంగతుల సౌష్ఠవంతో విలసిల్లే సంగీతభావుకతకి నిధినిక్షేపాలు.
“కదన కుతూహలం” అనే రాగాన్ని కన్న మాతృస్వరూపులు, వారు. ఈ రాగంలో, ఆదితాళంలో, వారు రచించిన “రఘువంశ సుధాంబుధి చంద్ర” అనే కృతి పరమలోకప్రియమైనది.
రామనాథపురంరాజావారి సోదరుడైన పండిదురైగారికి, పట్ణంవారి గానం పరమప్రియమైనది. అందువలన దురైగారు తరచు తిరువైయారు వచ్చి, పట్ణంవారి గానంవిని మురిసిపోయేవారు. ఆ స్నేహంవలననే, పట్ణంవారు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగారు(పూచ్చి అయ్యంగారు)ని, తమ శిష్యుడిగా స్వీకరించేరు. వారివద్దనే పూచ్చి అయ్యంగారు గొప్ప సంగీత విద్వాంసునిగానే కాకుండా, మహావాగ్గేయకారునిగా రూపు దిద్దుకున్నారు. మైసురు వాసుదేవాచారి, టైగర్ వరదాచారి, కాకినాడ సి.ఎస్ . కృష్ణస్వామి అయ్యరు, జి. నారాయణస్వామి అయ్యరు, గురుస్వామి అయ్యరు మొదలైన మహామహులందరూ వారి శిష్యులే! వారు విసుపు, అలుపు తెలియని అపార శిష్యవాత్సల్యం కలిగిన ఆదర్శ ఆచార్య వర్యులు.
మహావైద్యనాథ అయ్యరుగారికి, పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారికి ఒకరి సంగీతమంటే మరొకరికి అంతులేని ఆదరణ, గౌరవం ఉండేవి. శ్రావణపూర్ణిమ పర్వదినం రోజున పట్ణంవారు నూతన యజ్ఞోపవీతధారణ ఐన వెంటనే, ప్రతిసంవత్సరమూ తనకంటె ఏడాదిన్నర పెద్ద అయిన మహావైద్యనాథఅయ్యరుగారికి సాష్టాంగ దండ వందనం చేసేవారు. మహావైద్యనాథ అయ్యరుగారు, “అయ్యో! మీ వంటి విద్వాంసులు ఇలాగ చెయ్యడం తగునా?” అంటే, “నేను సాక్షాత్తు శివుడి అనుగ్రహం కోసం ఇలాగ చేస్తున్నాను” అని సుబ్రహ్మణ్య అయ్యరుగారు అనేవారట!
పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరు గారు గణపతి ఉపాసకులు. అందువలన ప్రతిసంవత్సరమూ వినాయకచతుర్థి పండగని మహావైభవంగా చేసేవారు.
మడవాళ ముత్తయ్య భాగవతర్ అనే విద్వాంసులు పట్ణంవారి సంగీతం కోసం పంచప్రాణాలూ పెట్టేవారు. ఒకసారి తిరువైయారులోనే అయ్యరు గారి కచేరి అద్భుతంగా జరిగింది. ఆ కచేరిలో, పట్ణంవారు రసజ్ఞహృదయ రంజకంగా రాగం-తానం-పల్లవి చేసేరు. కచేరి తరవాత పట్ణంవారు తమ ఇంటికి వెళ్ళిపోయేరు. భాగవతర్ గారు భోజనానంతరం, రాత్రి, పట్ణంవారిని దర్శించి, వారి సంగీతం పట్ల తన ప్రీతిని వ్యక్తంచేసుకోవాలని, కరదీపిక(torch) పట్టుకుని వెళ్ళేరు. అలిసిపోవడంవలన, అప్పటికే పట్ణంవారు తమ మంచంమీద నిద్రించడం కటకటాలతలుపులలోనుంచి కనిపిస్తోంది. లోపలి దీపం వెలుగులో పట్ణంవారి ఉదరభాగం తానవిన్యాసాన్ని అనుసరించి చలించడం గమనించిన భాగవతర్ గారు గౌరవంనిండిన ఆశ్చర్యానికి లోనయ్యేరట!
ఒకసారి మదరాసులోని తిరువళ్ళిక్కేణికిచెందిన తన మిత్రుడి ఇంటిలో పట్ణంవారు విడిదిచేసేరు. ఒక రోజు ఉదయం, నిత్యానుష్ఠానానంతరం, వారు, ఆ ఇంటిలోని విశాలమైన హాలులో ఒకస్తంభానికి ఆనుకుని కూర్చుని, నాభితానాన్ని సాధనచేస్తున్నారట! అలాగ తానం అభ్యాసంచేస్తున్న ఆయన కంఠనాదంయొక్క శబ్దస్థాయి పౌనఃపున్యం, అనుకోకుండా, ఆ హాలుయొక్క, స్తంభంయొక్క పౌనఃపున్యస్థాయితో ఐక్యం కావడం వలన, ఆ ఇంటి నేలకూడా వారి నాదపౌనఃపున్య కంపనాన్ని అనుసరించి ప్రకంపించిందట! ఆ ఇంటివారి అభ్యర్థనతో వారు వెంటనే తమ సాధనని విరమించేరట!
వారి అభిమానులు, వారిని, “అయ్యా! చిన్నత్యాగయ్యగారూ! తమరు ‘కల్యాణి’ రాగంలో ఒక కృతిని రచించి పాడితే వినాలనివుందండి” అని అర్థించేరట! వెంటనే ఆయన, “మా పరమగురువుగారు వారి అనేక కల్యాణి రాగకృతులలో వివిధరాగసంచారాలనన్నింటినీ ప్రయోగించేసి తమ ప్రశిష్యుడికి ఏమీ విడిచిపెట్టలేదు. అయినా మీరింతగా అడుగుతున్నారుకనక వారి ఆశీర్వచనబలంతో ఒక కృతిని నిర్మించే ప్రయత్నం చేస్తాను.” అన్నారట! ఆ పైన, “కల్యాణి” రాగం, ఆదితాళంలో, “నిజదాస వరద” అనే కృతిలో త్యాగరాజులవారి బహుజనాదరణ పొందిన కల్యాణి రాగప్రయోగాలని వీలైనంతమేరకి ఉపయోగించకుండా, తనకోసం ఆయన ప్రసాదంలాగ మిగిల్చిన ప్రయోగాలని అయ్యరుగారు తమ కృతిలో విరివిగా వినియోగించేరని పెద్దలు అంటారు.
ఈ విధంగా సంగీతశారదకి తమ జీవితాన్నంతా అంకింతంచేసుకుని, కృతకృత్యులైన పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారు, తిరువైయారులో, జూలై, 31; 1902న శివైక్యం చెందేరు.
ఆ శారదాతనయుడికి సాష్టాంగ వందనం అర్పించుకుందాం!
స్వస్తి||
సాష్టాంగ వందనమ్.
ఇటు వంటి మహా నుభావుని చరిత్ర ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు .
అత్యంత ప్రతిభా విశేషాలతో సంగీత సరస్వతికి తన
జీవిత పర్యంతం పరమ భక్తిశ్రద్ధలతో అర్చన గావించిన
కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రపంచంలో
ప్రాతః స్మరణీయుడు….శ్రీ పట్ణం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి
మీద వ్రాసిన ఈ వ్యాసం సమగ్రంగానూ, హృద్యంగానూ ఉంది.
ఉత్కృష్టమైన గురు సంపద !
ఉత్తమోత్తమమైన సహాధ్యాయులు !
ఉద్దండులైన శిష్య పరంపర !…..ఇంతటి పరిపూర్ణత జీవితంలో
అందరికీ దక్కేది కాదు.
‘ పరిదానమిచ్చితే ‘ , ‘ మరివేరే దిక్కెవరయ్య ‘ , ‘ అపరాధములను’ వంటి కృతులు త్యాగరాజస్వామి వారి కృతులతో
సమానంగా అనేక సభలలో మహా విద్వాంసులచే
ఆలపించబడుతున్నాయి. అంతటి మన్నన పొందగలుగుతున్నాయి.
ఇంతటి వాగ్గేయకారుడు కనకనే వారిని ” చిన్న త్యాగయ్య” , ‘రెండవ త్యాగరాజు ‘అని అన్నారు.
ఇక వారు కన్న ” కదనకుతుహలం” నిత్యనూతనం.
శ్రీరామనవమి కి తియ్యటి పానకం పోశావు.
Today’s article on Sri Pattam Subrahmanya Ayyar is very interesting and informative in many aspects. His life is a great message as to how one can achieve perfection with practice though not gifted in his respective field. A great singer,writer and composer of several kritis and a Guru of highest order who is regarded as second Tyagaraja Sri Subramanyam Ayyar is unique among the legends of Carnatic classical musicians. I was thrilled to learn that the most popular kritis Mari vere dikkevarayya Rama and Raghu vamsa sudhambhudhi are His contributions. My salutations to Him with all respect and reverence.
పట్ణం సుబ్రహ్మణ్య అయ్యరుగారివద్ద గురుకులపద్ధతిలో
సంగీతంనేర్చుకున్న, వారి ప్రియశిష్యుడు మైసూరు వాసుదేవాచారిగారు, ఆయన సమక్షంలో జరిగిన ఒక అద్భుత
సంఘటనగురించి ఆయన రచించిన “నా కండ కళావిదరు”,
అనే కన్నడ గ్రంథంలో వ్రాసేరు.
పట్ణంవారు ఒక షావుకారుకి వెయ్యిరూపాయలు బాకీ
పడ్డారట! వారికి రావలసిన వెయ్యిరూపాయలు రాగానే ఆ అప్పు చెల్లించవచ్చని ఆ రావలసినసొమ్ముకోసం ఎదురు
చూస్తున్నారట! ఆ సొమ్ము అనుకున్న సమయానికి అందలేదు. కాని షావుకారు తన బాకీకోసం పట్ణంవారిని
బాగా పట్టుపట్టి, ఒత్తిడిచేసేడట! ఒకరోజు షావుకారు స్వయంగావచ్చి తన సొమ్ము చెల్లిస్తేనే వారి ఇంటినుంచి బయటకి అడుగు పెడతానని భీష్మించుకుని కూర్చున్నాడట! పట్ణంవారికి ఏమి చెయ్యాలో పాలుపోక, తన పూజామందిరంలోకివెళ్ళి, దేవుడి సింహాసనంముందు సాష్టాంగపడిపోయి, భక్తితోనిండిన అమేయ ఆర్తిభావంతో, అప్పటికప్పుడు, “కన్నడ”రాగం, రూపకతాళంలో,
“ఇంతకన్న కావలెనా, ఈ కష్టము ౘాలదా, రామ!”
అంటూ ఒక క్రొత్త కృతిని పాడేరట! ఆ కృతి పూర్తి అయ్యేసరికి,
ఆయనకి అందవలసినసొమ్ము అందిందిట! ఆ సొమ్ము
షావుకారుకి ఇచ్చేసి ఆయన అతడిని పంపించేసి, ఆ క్లిష్ట
సమయంనుంచి గట్టెక్కేరుట!
ఆ తరవాత, అదేరోజున, తన ప్రియశిష్యుడికి ఆ కృతిని
గురువుగారు నేర్పించేసేరుట!