సాహిత్యము-సౌహిత్యము – 44 : నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
ఐం శ్రీశారదాదేవ్యై నమః| శ్రీశారదా దయా చంద్రికా|
10—03—2018; శనివారము.
“సాహిత్యము—సౌహిత్యము~44”.
ఈ వారంకూడా “పునరుక్తి చమత్కృతి”కి చెందిన మరొక సమస్యాపూరణం తెలుసుకుందాం.
సమస్య:—
“నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ |”
ఈ సమస్యాపూరణం చేసిన సరసకవివరులు శ్రీ మోచర్ల వెంకన్నగారు.
పై సమస్య “చంపకమాల” పద్యపాదం. న-జ-భ-జ-జ-జ-ర అనే 7 గణాలు, 21 అక్షరాల కూర్పుతో ఈ పద్యపాదం ఉంటుంది. 11 వ అక్షరం యతిస్థానం. దీనిని రామాయణార్థంతో పూరించాలి. ఇప్పుడు సమస్యాపూరణం చూద్దాం.
“అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాలిపుత్ర! ఓ
పనస! సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేంద్రు డ
ద్దనుజ పురంబు వే గెలువ దైత్యుల చంపగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ “|
ఇక్కడ 8 నిన్నులున్నాయి. ఆ 8 నిన్నులకి అనుకూలంగా ఎనిమిదిమంది వానర వీరులని రాములవారు వెనువెంటనే రావణుడిమీద యుద్ధానికి రమ్మని లక్ష్మణస్వామిచేత కబురు పంపడం ఇందులోని ఇతివృత్తం.
“ఓ ఆంజనేయా! జాంబవంతా! సుగ్రీవా(సూర్యనందనా)! అంగదా! పనసా(వానరసైన్యంలో ఒక విభాగానికి అధిపతి)! సుషేణా! నీలా! నలా! మిమ్మల్నందరినీ పేరుపేరునా లంకాపురిలోని దైత్యసేనని సంహరించడానికి రమ్మని శ్రీరామచంద్రులవారు పిలవమన్నారు”
భారత, భాగవత పరంగావున్న పూరణలని రాబోయే వారాలలో చూద్దాం!
స్వస్తి||
ఈ సమస్య కూడా ఎన్నో పర్యాయాలు అవధానాల్లో ఇవ్వబడినదే. వెంకన్న గారు రామాయణ ఘట్టం ఆధారంగా
చేసిన పూరణ చక్కగా ఉంది. పద్యం నడక మలయమారుతం
వీచినట్టుంది.
Chaala baagundi bava garu
చలిపితివే సమస్యలను చంపక మాలల పూరణమ్ములన్!
ససవరణ:
చలుపుదురే సమస్యలను….
పూరణ చాలా హృద్యంగా ఉంది.మంచి విషయాలను పంచుతున్న నీకు అభినందనలు