సాహిత్యము-సౌహిత్యము – 43 : అందరు అందరే కడకు అందిరి కొందరె కొందరందరే

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః|
03—03—2018;  శనివారము.”సాహిత్యము—సౌహిత్యము~43″.శ్రీ కిరణ్ సుందర్ బాలాంత్రపు, చెన్నై, “సాహిత్యము – సౌహిత్యము~41” (17—02—2018) లోని “అందరు అందరే – – –” సమస్యాపూరణకి అందంగా స్పందిస్తూ, తమ “Comments” విభాగంలో, మన ప్రస్తుత ప్రకరణానికి అనుగుణమైన (ఉత్పలమాల పద్యపాదంలో) ఒక సరసమైన భావనని ఉల్లేఖించేరు. దానిని ఇక్కడ ఉదహరిస్తున్నాను:—

అందరు అందరే కడకు అందిరి కొందరె కొందరందరే“!|

‘మనం అందరినీ అందుకొనే ప్రయత్నం చేస్తున్నాం. అయితే, అందరూ అందడంలేదే! చివరికి చూసుకుంటే కొందరే మనకి అందేరు. కొందరు అందడంలేదే’! అని దీని భావం. మూలసమస్యలో, “అందరు” అనేమాటకి, “సర్వులు/all” అనే ఒకే ఒక అర్థం హ్రస్వ-దీర్ఘాక్షరప్రయోగాలతోను, పలుకుబడిలోని విరుపుల తోను కొంచెం వ్యంగ్యాన్ని పులుముకునివుంది. కిరణ్ సుందర్ , సి.యస్ ., వంటి వారికి అనన్యగోచరమైన అర్థాలు, అందాలు వాటినుంచి వెలికి వెల్లడి చేయజాలిన విలక్షణ ఐంద్రజాలిక శక్తివుంటుంది. అందువల్ల, మొదటి ‘అందరు’కి సామాన్యార్థమే స్వీకరించినా, కిరణ్ రెండవ “అందరే”కి మన గ్రహణశక్తికి ‘అందడంలేదే!’ అనే విశేషార్థాన్ని, “శ్లేష”/”Pun” ద్వారా రాబట్టేరు. ఇదొక సొగసైన సాహిత్యక్రీడ. స్వాయత్తమైన అంతఃస్ఫురణ దీనికి అసలైన ఆలంబనైతే, శబ్దశాసనవైదగ్ధ్యం వ్యుత్పత్తి ద్వారా సిద్ధిస్తుంది. ఆ విధంగా మనం ఆరంభంలో చెప్పుకున్న అర్థం, ఇక్కడ, ఈ సమస్యకి సమకూడుతుంది.

ఇది ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న “శారదా సంతతి” శీర్షిక విషయంలో నా మనస్సులో నేను పడుతున్న తర్జన భర్జనకి పాక్షికంగా అద్దం పడుతోంది. పాక్షికంగా అద్దం పడుతోంది అని ఎందుకు అనవలసివచ్చిందో,  తరవాత వివరిస్తాను. ఏది ఎలావున్నా, ఈ వారం దీనినే సమస్యగా స్వీకరించి, నాకు కిరణ్ సుందర్ కలిగించిన ఈ ౘక్కని అవకాశం వినియోగించుకుని, నా లోని సమస్యని రసజ్ఞశేఖరులైన మన సత్సంగసభ్యులముందు ఈ సాహిత్య’సమస్య’ని పూరించడంద్వారా  మనవిచేసుకుంటాను.

ఇంక సమస్యాపూరణం ఇది:—

ఎందరొ పూర్ణమానవులు, ఎన్నొ విభిన్న విశిష్ట దర్శనా

నంద సరస్వతీ విహసనాద్భుత ధన్య సనాతనాంశువుల్ ,

వందన ముంచి, వారి వర వైభవ గాథలు వ్రాయబోవగా,

అందరు అందరే! కడకు, అందిరి కొందరె, కొందరందరే“!|

“ఎందరో మహానుభావులు వేరు-వేరు గొప్ప దివ్యానుభవానందాలనెడి శారదా మృదుహాస ధన్యమైన శాశ్వత కాంతి కిరణాల స్వరూపాలైనవారు ఉన్నారు. వారికి నమస్కరించుకుని వారి ఘనతకి చెందిన కథలు వ్రాయడానికి ప్రయత్నంచేస్తే, వారందరూ నా భావస్థాయికి అందడంలేదే! చివరకి చూస్తే, కొందరే అందేరు;  కొందరు అందడంలేదే”!

మళ్ళీ ఆలోచిస్తే, ఇలాగ కొందరు అందేరు అని నేను అనుకోవడంకూడా సమంజసం కాదేమో! అందేరు అనుకుంటున్నానుకాని, నిజానికి అందలేదేమో! అందనిదే అందేరనుకోవడంకూడా అతిశయమే కదా, అనిపించింది.  అందుకనే పాక్షికంగా అద్దంపడుతోంది, అనవలసివచ్చింది.  దానివలన ఆ పద్యాన్ని ఈ విధంగా తిరగరాసుకుంటున్నాను. సరసహృదయులు చిత్తగించండి.

ఎందరొ పూర్ణమానవులు, ఎన్నొ విభిన్న విశిష్ట విద్యలం

దందలమెక్కువారు, నెర హారతులిచ్చిరి శారదాంబకున్ ,

వందనమాచరించి మది, వారి గురించియె వ్రాయబోవగా,

అందరి కందరూ మదిని అందకె ఉండిరిదేమి భాగ్యమో“?|

చిట్టచివరికి, ఈ దిగువ పద్యంతో ఈ వారం శీర్షికకి ‘శుభం’ పలుకుదాం!

ఎందరొ పూర్ణ పూరుషులు ఎన్నియొ విద్యల భిన్న రంగరా

ట్సుందర పండితోత్తములు శోభను కూర్చిరి శారదాంబకున్ ,

వందనమాచరించి తగ వారికథాదుల చెప్పపూన వా

రందెనొ, లేదొ, సందియము లయ్యెను తీర్చుము నీవె శారదా“!|

ఈ విధంగా ఒకభావాన్ని పట్టుకుని ఏదో ఒక కొసకి తీసుకువెళ్ళి చమత్కార సహిత విరామంతో ముగింపు పలకడంకూడా ఒకరకమైన సాహిత్యక్రీడ అనవచ్చు! It can be called a resourceful extension of literary ideas. దీనిని రసభంగంకాని, కుతూహల భావనైజానికి అనుగుణమైన, మోతాదులో నిర్వహించగలగాలి.

ఇతి శివమ్ ||

You may also like...

7 Responses

  1. చాలా బాగున్నాయి పూరణ లు. ఒక దాన్ని మించి మరొకటి ఉంది.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    ఇతి సుందరమ్!

  3. Sampathkumar ghorakavi says:

    Maatalaa vinyaasam Adhbhutam guruvugaaru.

  4. సి. యస్ says:

    ఒక ‘సమస్య’ ఎన్ని ‘సమస్యల’కి దారితీసింది?
    ఎన్ని పూరణలకి దారి చూపించింది. కూతకి తరుము
    కూత లాగ వెంటాడుతూ వచ్చాయి పద్యాలు. అన్నీ
    భావస్ఫోరకంగా ఉన్నాయి.
    అందక నుందురా తుదకు అందరు అందక కొందరుందురే?
    సందేహం లేదు.

    • వ.వెం.కృష్ణరావు says:

      చందన శీతలమ్మగుచు, శారద రాత్రుల చన్ద్ర దీధితుల్ |
      చిందెడి పద్య పాదమున, స్నేహముతోడను, ఊరడించుచున్ |
      సందియమంత బాపితివి, సాదర సోదర! పల్కుచిట్లుగా,
      అందక ఉందురా తుదకు,అందరు అందక కొందరుందురే?

      • కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

        డెందమునందు ధైర్యము ఘటిల్లగజేసుకు, పూజ్య శారదా
        మందిర మందు భక్తిగ సుమాంజలు లర్పణ మిచ్చి, ఆత్మసం
        స్పందన చూపు మార్గమున చక్కగ వ్రాసుకుపోవు నీ కహో
        అందక నుందురా తుదకు అందరు అందక కొందరుందురే!

        • వ.వెం.కృష్ణరావు says:

          బంధు మిత్రులందు బాలాంతరమువారి
          పాల గుమ్మ; చెరుకువాడవారి
          ౘక్కెర; ఇతరులిడ సరసంపు దినుసులు;
          పాయసమ్ము నేను వండి పెడితి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *