శారదా సంతతి — 32 : విలక్షణ వేదాంతి—వీరభద్రరావు
శ్రీశారదా వాత్సల్య చంద్రికా :—
18—02—2018; ఆదిత్యవారము.
“శారదా సంతతి~32”. ~ “విలక్షణ వేదాంతి—వీరభద్రరావు”.
“పూర్వ గోదావరీ తీర పూజ్య పురము
సకల రుచినిధి మా రామచంద్రపురము
వేద, విద్యా, కళాదులు వెల్లి విరియు
ఇహ పర శుభప్రద పరమ హృద్య పదము”!
మా బాల్యంలో, ముఖ్యంగా, శీలనిర్మాణ ప్రదాయక వయస్సు(formative years)లో, ప్రభావవంతమైన మహనీయ సాంస్కృతిక వైవిధ్యభరిత వాతావరణం మెండుగా నిండివున్న మా రామచన్ద్రపురంలో, వ్యక్తిత్వవికాసానికి అవకాశం ౘాలా హృద్యంగావుండేది. ఆ రామచంద్రపురంలో భిక్షుకుడినుంచి శిక్షకుడి వరకు అందరూ, బడినుండి గుడివరకు అన్నీ, నీరాది క్షీరపర్యంతము అంతా అధ్యయన కుతూహలాన్ని కలిగించే కమనీయమైన ముడిసరుకే!
ఈ వారం శిక్షకోత్తముడైన భిక్షుకాచార్య వరిష్ఠుణ్ణి ఒకాయనని పరిచయం చేసుకుందాం.
నేను రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు ఉన్నతపాఠశాలలో, పై తరగతులు ౘదువుతున్నరోజులవి. ఊరిలోను, ఊరిచివర,- ప్రభుత్వ విద్యుత్ శాఖవారి ఇనప విద్యుత్ స్తంభాలకి కూలికి రంగులువేసి, వాటిమీద క్రమసంఖ్యలు వేసే 35/40ఏళ్ళ ప్రాయమున్న కూలివాడిని తరచు గమనించేవాడిని. అతడు కొన్నేళ్ళ తరవాత మా పిన్ని/చిన్నాన్న గారల “శ్రీ ఆనందతీర్థ ప్రెస్ ” లోను, ఆ తరవాత వారి యింటిలోను రంగులువెయ్యడం చూసేను. మా చిరంజీవి చిన్నాన్నగారు(ఆనందతీర్థ ప్రెస్ కి, యజమాని), నిజాయితీతో బ్రతికే బడుగువారికి, దిక్కు-మొక్కులేనివారికి ఏదో ఒకవిధమైన పనిని కల్పించి, వారికి తగిన ప్రతిఫలమిచ్చి, అటువంటివారు ఆత్మాభిమానంతో, మానవీయ గౌరవం(human dignity)కి భంగంలేని స్వావలంబనతో జీవితాన్ని నిర్వహించుకోవడానికి యోగ్యమైన విధంగా వారికి ఊతం ఇచ్చేవారు. నా వంటివారెవరైనా వారికి తారసపడితే, అటువంటి బడుగు పనివారిని పరిచయంచేసి, వాళ్ళకి ఏదైనా పనిని చూపించమని చెప్పేవారు. అటువంటి ఒక సందర్భంలో, ఆ రంగులువేసేవ్యక్తిని “వీరభద్రరావు”గా నాకు పరిచయంచేసి, ఏదో ఒక పని చూపించే బాధ్యతని మా చిన్నాన్నగారు నా పైన పెట్టేరు. అప్పుడు దసరా పండగ రాబోతున్న రోజులు. అందువలన ఇంట్లో రంగులు వేయింౘవలసిన పనివుంది. వీరభద్రరావుని మా ఇంట్లో రంగులు వెయ్యడానికి పురమాయించేం! ఆ విధంగా వీరభద్రరావు మా కుటుంబానికి పరిచయమయ్యేడు.
వీరభద్రరావు ఒక్క క్షణంకూడా వ్యర్థంచేయకుండా ౘక్కగా పనిచేసేవాడు. ఎవరినీ సహాయానికి పెట్టుకునేవాడుకాదు. ఎవరిపనీ అతని ప్రణాళికకి, ఆలోచనకి అనువుగావుండదని అతని అభిప్రాయం. అతని అభిమతానికి అనువైన పనిని అతడే నిదానంగా; సమయమూ, సరుకులూ వృధాకాకుండావుండేటట్లు చేసుకునేవాడు. ౘాలా మితభాషి. అతడు S.S.L.C. ౘదువుకున్నాడు. రామచంద్రపురానికి చేరువలోనున్న తాళ్ళపొలం అతడి ఊరని చెప్పినగుర్తు. విశ్వబ్రాహ్మణుకులజుడనని ఒకసారి అతడే ప్రస్తావ వశంగా చెప్పేడు. “మనుచరిత్ర“, “వసుచరిత్ర“, “పారిజాతాపహరణం“, “శృంగారనైషధం“, “బసవపురాణం” మొదలైన ప్రాచీన తెలుగు గ్రంథాలనుంచి, షేక్స్పియర్ , మిల్టన్ మొదలైన ఆంగ్ల కవుల రచనలనుంచి, ఎన్నో ౘక్కని ఘట్టాలని యెంచి, గొప్ప-గొప్ప పద్యాలని, గద్యాలని సందర్భశుద్ధితో అనర్గళంగా ఉదహరిస్తూ శ్రోతలో మంచి శ్రవణ కుతూహలాన్ని రేకెత్తిస్తూ వేరు-వేరు విషయాలమీద, తన పనిని తాను కొనసాగిస్తూనే, మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి మౌనంగానూ, ముభావంగానూ వుండేవాడు. కొన్ని సందర్భాలలో, ఏమైనా అడిగితే, ఆచి – తూచి objective type examination లలోని జవాబులకిలాగ, సంక్షిప్త సమాధానాలని ఇచ్చేవాడు. అతడి “మూడ్ “ని అనుసరించి మేము మెలిగేవాళ్ళం!
కొన్ని సందర్భాలలో తాను వ్రాసిన మనోహర వృత్త-జాతి-ఉపజాతి పద్యాలని వినిపించేవాడు. మరికొన్ని సందర్భాలలో మానవజీవితానికి సంబంధించిన అనేకానేక అంశాలని పూర్తిస్పష్టతతోను, స్వానుభవదీప్తితోను, లోకానుభవ సహితమైన ఇంగితప్రజ్ఞతోను విమర్శించి విశదంచేసేవాడు.
నేను, మా తమ్ముడు సూరిబాబు అచిరకాలంలోనే అతడికి సన్నిహితులమైపోయేం! తెలుసుకునే కుతూహలం మాకు, చెప్పే స్వభావం అతడికి లేకపోవడంవలన వ్యక్తిగతవిషయాలేవీ మాకుతెలియవు. ఐతే, తల్లి-తండ్రులతోను, భార్యతోను సంబంధ-బాంధవ్యాలన్ని పూర్తిగా తెగిపోయేయి అనే విషయాన్ని మా చిన్నాన్నగారు చెప్పడంవలన నాకు తెలిసింది. అంతేకాక, మరొకసందర్భంలో, వీరభద్రరావుద్వారాకూడా ఆ విషయం మాకు వెల్లడి అయ్యింది.
మనిషి దృఢకాయుడు. నెరిసిపోయిన, బిరుసైన, తైలాది సంస్కారహీనమైన జుట్టు; ౘాలా తీక్ష్ణమైనలోతైన కళ్ళు; కొనదేలి, ముందుకి వంగిన ముక్కు; పెద్ద నుదురు; ౘక్కని నోరు-పలువరస; సుమారు 5అ.~5అం. ఎత్తు; సూక్ష్శదృష్టికలవారికి మాత్రమే గ్రాహ్యమైన కొన్ని ప్రత్యేక ముఖ సాముద్రిక లక్షణాలు(significant characteristics of the face); ముఖంలో బ్రహ్మ వ్రాత కన్న బలమైన, లోతైన బ్రతుకువ్రాతయొక్క అయోమయలిపిచిహ్నాలు; కరుకైన కష్టాల కరుడుకట్టిన గాటంపు ఆనవాళ్ళు; మిన్నువిరిగి మీదపడ్డా చలించని మానసిక స్థైర్యం మొదలైన చిహ్నాలు, వీరభద్రరావుయొక్క మానసిక, బౌద్ధిక, తాత్త్విక వ్యక్తిత్వానికి బాహ్య సంకేతాలు. ఉన్నంతలో సరైన దుస్తులువేసుకునేవాడు. మోకాళ్ళకిందికి మడిచిన పొడుగు పంట్లాము, మడతలు పెట్టిన పొడుగుచేతుల చొక్కా లేక పొట్టిచేతుల చొక్కా వేసుకునేవాడు. మనుష్యులెవ్వరివైపైనా ముఖంలోకి చూచి మాట్లాడడం అరుదు. ఎటో శూన్యంలోకిచూస్తూ మాట్లాడడం అతడికి బాగా అలవాటు. అన్ని సందర్భాలలోను శిష్టవ్యావహారికభాషనే మాట్లాడేవాడు. సందర్భానికి ౘక్కగా సరిపోయే పొంకమైన మాటల ఎంపిక అతడి సంభాషణకి వన్నె కూర్చేది. ఆదర్శ అధ్యాపకుడికివుండవలసిన లక్షణాలన్నీ అతడిలో పుష్కలంగావుండేవి. చిన్నలనైనా, పెద్దలనైనా, ఎవరినైనా గౌరవించడం, ఆ విధంగా మాట్లాడడం అతడికి స్వాభావికలక్షణమైవుండేది.
శివభక్తిపరాయణుడైనందున రోజూ ఉదయమే స్నానంచేసి, శివాలయంలో విభూతిని, విశాలమైన నుదుట ధరించి, శివదర్శనంచేసుకుని, పనిలోకివచ్చేవాడు. పని వివరాలు తెలుసుకుని, యజమాని అభీష్టానికి అనుగుణంగా, కష్టపడి, తన శక్తిమేరకి ౘక్కగా పనిచేసేవాడు. పని అయపోయిన తరవాత ఎక్కడో ఒక చోట, ఏదో ఒకలాగ కాలక్షేపం చేసేసేవాడు. పూర్తిగా ఏకాకి జీవితాన్ని గడిపేవాడు. ఎవరితోను స్నేహమూ-విరోధమూ లేకుండా తటస్థంగావుండేవాడు. ఎక్కడైనా, ఏదైనా గొడవకాని, వాదోపవాదాలుకాని జరిగేలాగవుంటే, అక్కడినుంచి మెల్లిగా తొలగిపోయేవాడు. ఎక్కువగా సత్త్వగుణప్రధాన జీవననిర్వహణశైలిని అవలంబించేవాడు.
కష్టపడి సంపాదించినడబ్బుని, జాగ్రత్తగా, అవసరాలకిలోబడి మాత్రమే ఖర్చుపెట్టుకుని, మిగిలినది పోస్టాఫీసు సేవింగ్సుఖాతాలో దాచుకునేవాడు.
వీరభద్రరావుని వార్ధక్య ప్రభావం వడి-వడిగా కబళింౘడం మొదలెట్టింది. క్రమంగా వయస్సు పెరిగి మీదపడేకొద్దీ కంటిచూపుమందగించింది. రోజుకూలి సంపాదించుకోగలిగిన దేహశక్తి సన్నగిల్లిపోయింది. భోజనాన్ని కష్టపడి సంపాదించుకుని భుజించాలనుకున్న పట్టుదల బిగి సడలిపోవడం మొదలైంది. చెయ్యి ౘాచి బిచ్చమెత్తకూడదు అన్న ఆదర్శం ఆకలి మంటల్లో బుగ్గైపోయింది. అతడి చివికిపోతున్న మునిమాపు ముదుసలి బ్రతుకులాగే కట్టుకున్న బట్టలు కూడా దుమ్ముకొట్టుకుపోవడం ఆరంభించేయి. మానవ ఆత్మాభిమానం జీవనశైథిల్యంలో అణగారిపోయింది. అతడి ౘదువు, తెలివితేటలు, నీతి, నిజాయితీ, ఓర్పు, మంచితనం, మానవతకి సంబంధించిన విలువలతో నిత్యజీవితాన్ని నిర్వహించుకునే దీక్ష వంటి సుగుణాలేవీ, వీరభద్రరావుని వీధి- బిచ్చగానిగా మారకుండా ఆదుకోలేకపోయేయి. కాని అటువంటి స్థితిని అతడు దైన్యంగాకాని, హైన్యంగాకాని ఏ మాత్రమూ అనుకోలేదు. మానసికంగా కృంగిపోవడంకాని, అభిమానపడడంకాని, ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోవడంకాని ఏమీ చెయ్యలేదు. ఎప్పటిలాగే, స్థితప్రజ్ఞుడిలాగ, human dignityతో, హుందాగాను, ఆత్మస్థైర్యంతోను, సరస సంభాషణ చేస్తూనేవుండేవాడు. జీవన సంఘటనలని ఎలావచ్చినవాటిని అలాగే ఒకే తటస్థభావంతో స్వీకరించగలిగిన మనోధైర్యమున్నవాడిలాగే మసలుతూండేవాడు.
జీవితంనుంచి ఎప్పుడూ ఏమీ “డిమాండ్ “(demand) చేసిన దాఖలాలు కనిపించలేదు. జీవితంపైన, శృంఖలాలని సృష్టించే ఏ విధమైన అహంకారాన్ని, మమకారాన్ని పెంచుకున్నవాడిగా అనిపించలేదు. అందువల్ల దానిగురించి ఏ ఫిర్యాదులూ చెయ్యలేదు. దానితో ఎప్పుడూ ఏమీ ఘర్షణపడినట్లు మాట్లాడలేదు. అదెలాగవున్నా, దానిగొడవ దానిది – తన ఆదర్శాలు, తన అనుభూతులు తనవి అన్నట్లు అగుపించేవాడు.
భోజనందొరికిననాడు బయట తినేవాడు. లేనిరోజు, మా ఇంట్లో భోజనం చేసివెళ్ళేవాడు. బయట అన్నంమాత్రమేదొరికితే జాగ్రత్తగా మా ఇంటికి వచ్చి, మా అమ్మగారిని, “అమ్మా! ఈ పూటకి అన్నందొరికింది. దానిలోకి, ‘ఆదరువు’ ఏమైనావేస్తారా?” అని అడిగేవాడు. మా అమ్మగారు కూరో, పచ్చడో, పులుసో, ఊరుగాయో, ఏవివుంటే అవి వేసేవారు. అడుక్కునేసమయంలో, తడుముకుంటూ, చెయ్యిజాపి, “అమ్మా!అయ్యా! కళ్ళు కనిపించడంలేదు. ఏ పనీ చేయలేను. దయతో ధర్మంచేస్తారా?” అని అడిగేవాడు. అలాగ లభించిన పైకం నా వద్ద దాచుకునేవాడు. పోస్టాఫీసులో మిగిలిన కాస్తమొత్తంకూడా తీసేసి, నా వద్దే పెట్టుకున్నాడు. ఎక్కడా ఏమీ లభింౘని రోజున అవసరమైనమొత్తంతీసుకుని ఖర్చుపెట్టుకునేవాడు. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు మొదలైన అనేక సందర్భాలలో మా ఇంట్లోనే భోజనం చేసేవాడు. ఇంట్లో, లోపల భోజనంచెయ్యడానికి ఏ మాత్రమూ అంగీకరించేవాడుకాదు. “మీ ఇళ్ళల్లో నిత్యానుష్ఠానాలు, మడులు, తడులు, ఆచారాలు ౘాలా ఎక్కువగా ఉంటాయండి. “ఆచారః ప్రథమో ధర్మః”(శిష్టాచార నిర్వహణ అన్నింటికి మొదటి ధర్మం) అన్నారు కదాండి! అంతేకాక, “ఆచారో హంత్యలక్షణమ్ ” (సదాచారం అవలక్షణాన్ని పోగొడుతుంది) అని మా హైస్కూలు తెలుగు అయ్యవారు వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు తరచు చెప్పేవారండి. పులుగుర్త రామారావుగారు ఛందస్సు, పద్యాలు వ్రాయడం నేర్పేరండి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారు సంస్కృతభాషలోని తియ్యదనంయొక్క రుచిని నాలో కలిగించేరండి. నా ఈ ౘదువు, తెలివితేటలు, కట్టుబాట్లు ఇవన్నీ వారందరూ పెట్టిన భిక్షండి.” అంటూ మహానందంగా ఆ మధుర జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ మాతో పంచుకునేవాడు. ఎంతసేపైనా అలాగ వీధిలోనిలబడే మాట్లాడేవాడు. లోపలకి ఎంతరమ్మన్నా వచ్చేవాడుకాదు. రమ్మన్నప్పుడల్లా, ఎన్నిసార్లైనా, “ఫరవాలేదండి” అనే ఒకే సమాధానం, ఒకే కంఠధ్వనిస్థాయిలో, ఒకే రకమైన ఉదాసీన వైఖరితో అనేవాడు. అలాగే తన భోజనానంతరం, ఆ చోటుని ౘక్కగా శుభ్రంచేసి, గ్లాసునితోమి కడిగి బోర్లించి, మా వద్ద సెలవుతీసుకుని వెళ్ళిపోయేవాడు. అన్నింటిలోను ఔచిత్యం పాటించడం, కట్టుబాట్లతో బ్రతకడం అతడి నైజంగా అనిపించేది. అంతేకాక, ఎక్కడైనా, ఎప్పుడైనా సుశబ్దమేతప్ప, అపశబ్దం మచ్చుకి ఒక్కసారైనా ఉచ్చరించలేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా సందేహంవస్తే నిఘంటువునిచూసి చెప్పించుకునికా
ఒకసారి, ఉదయం, సుమారు తొమ్మిదిగంటల ప్రాంతంలో వీరభద్రరావు యాచనకి వచ్చేడు. కలిగినదేదో ఇచ్చేము. పుచ్చుకున్నాడు. ఆ రోజు ఏదో ఒక ప్రత్యేకమైన “మూడ్ “లో వున్నాడు. అటువంటి “mood”లో వుంటే, తప్పనిసరిగా, ఆ రోజు ఒక ‘sermon’ అంటే “ప్రబోధం” వుంటుంది. నేను, మా సూరిబాబు శ్రద్ధగా అతడి ఉపదేశంవినడానికి, ఒళ్ళంతా చెవులు చేసుకుని సంసిద్ధులమైపోయేం!
దైనందిన జీవితంలో మనిషిచేసే కర్మని గురించి వివరించడం ప్రారంభించేడు. ఆ వివరణకంతటికీ కర్మఫలనిరూపణం కేంద్రబిందువై నిలిచింది. అయత్నసిద్ధమైన భావసంయమనంతో, సహజ సరళ శబ్దప్రయోగ ధారాశుద్ధితో, అతడి గుండె లోతులలోనుంచి అతడి సందేశం బహిరంగంగా ప్రవహించింది.అతడు ఆరోజు చెప్పిన విషయాన్ని, అతివ్యాప్తి-అల్పవ్యాప్తి-అవ్యా
కర్మ బాహ్యవస్తు ప్రమేయంతోవున్నా, కర్మఫలం, కర్మసాధనాలతో ముడిపడి వుండదన్నాడు. స్థూల-సూక్ష్మ కర్మసాధనాలతో నిమిత్తం లేకుండా, కర్మకలాపాన్ని ప్రేరేపించే సూక్ష్మమైన మనస్సుయొక్క కర్మోద్దేశ్యముపైన, దానికిమూలమైన వాసనా ప్రేరణపైన ఆధారపడి కర్మఫలరాశి, జీవుడికిసంక్రమిస్తుందన్నాడు. ఈ వివరణని స్పష్టంచేయడానికి అతడు అందించిన ఉదాహరణని విపులవివరణతో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
“ఉదాహరణకి, రోడ్డుమీద ఒక రూపాయిబిళ్ళ పడివుందనుకోండి. దానిని తీసి మనజేబులోవేసుకుంటే దానివలన ఒకరకం కర్మఫలం వస్తుంది. దానిని దైన్యంలోవున్నవారికి దానంచేస్తే వచ్చే కర్మఫలంవేరు. మనం ఏదైనా కొనుక్కుని తింటే ఆ ఫలం వేరు. అది తీసుకునివెళ్ళి దేవాలయంలో దేవుడిపళ్ళెంలోవేస్తే వచ్చే కర్మఫలం వేరేగా ప్రాప్తిస్తుంది. అలాకాక పోలీసువారికి అందజేస్తే అది మరొకరకం ఖాతాలో ౙమ ఔతుంది. ఇదేదీ కాకుండా, ఆ రూపాయికి మనం యజమానులంకాదుకనుక దానిద్వారా దాన-ధర్మాది ఏ వ్యవహారమూ చెయ్యకుండా వదిలివెయ్యగలిగినవాడికి సంక్రమించే కర్మఫలస్వరూపం అన్నింటికీ విలక్షణంగాను, అనుపమానంగాను ఉంటుంది. చివరిగా చెప్పాలంటే రూపాయిబిళ్ళకి, ప్రక్కనేవున్న బెడ్డముక్కకి వ్యత్యాసంగమనించనిస్థితిలో మనం వుంటే అసలు ఏ రకమైన కర్మఫలమూ ఏర్పడనే ఏర్పడదు. దీనికిమించి ఇంకేమీలేదు”.
ఆ విధంగా తన తత్త్వధర్మ ఉపదేశాన్ని మాకు అందించి వీరభద్రరావు నిర్లిప్తంగా నడుచుకుంటూ వెళ్ళిపోయేడు. ఆ ఉపదేశం, “బృహదారణ్యక ఉపనిషత్తు”లో, ప్రజాపతి, మేఘసందేశంద్వారా, తన సంతానానికిచ్చిన సందేశంయొక్క సందర్భాన్ని నాకు జ్ఞాపకంచేసింది.
ఆ తరువాత, వీరభద్రరావు, రెండుమూడుసార్లు బయట భిక్షాటనంచేస్తూ కనిపించేడేమో! ఇంటికివచ్చిన జాడలేదు. కొంతకాలంగడిచేక, అతడికోసం వాకబు చేయగా, అతడుదివంగతుడయ్యేడని తెలిసింది. అతడు దాచుకున్నమొత్తంలో, తొంభైరూపాయల నిలవ నా వద్ద అప్పటికి మిగిలిపోయింది. ఆ మొత్తానికి మరికొంత పైకంకలిపి, ఆ ఊరిలో భిక్షావృత్తిలోవున్న సాధువులకి వీరభద్రరావుపేరున అన్న వస్త్రదానాలు చేయడం జరిగింది.
పుస్తకాల ౘదువుద్వారా విషయ పరిజ్ఞాన సేకరణచేసి, ఆ పైన అపరిమిత కఠోర జీవనగ్రంథ పఠనంచేసి, స్వానుభవసంప్రాప్తమైన పరిపక్వ తత్త్వచింతన ద్వారా లోకాధ్యయనంచేస్తూ, ఆత్మావలోకనం అనే నిత్యపారాయణని నిర్వహించుకుంటూ, వీరభద్రరావు ఐహిక దారిద్ర్యరూపమైన కఠినతపస్సుచేసి, ఆముష్మిక ఐశ్వర్య సంపన్నుడై, ఆ సంపదకి మమ్మల్ని వారసులని చేసినందుకు వీరభద్రరావురూపంలోని ఆ విమలతత్త్వదర్శికి దండవత్ ప్రణామంతో, హార్దిక ధన్యవాదం సమర్పించుకుంటున్నాము.
బురదలో పుట్టినా, ఆకాశంలోని అరుణ కిరణ కాంతి వైభవ స్పర్శయొక్క అలౌకిక ఆనందంలో పరవశించి ప్రకాశించే అరవిందోపముడైన వీరభద్రవిద్వద్వరిష్ఠుడు, మా రామచంద్రపురీవరనిలయుడైన అగస్త్యేశ్వరస్వామివారి అనుగ్రహరూపంగా మాకు ప్రత్యేకంగా ప్రసాదించబడిన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుడు.
స్వస్తి||
కృష్ణాయ వక్కలంకాయ శాస్త్రాచారానుపాలినే
తే నమో వీతశోకాయ జ్ఞానవిజ్ఞానభానవే!
వీరభద్రరావు వృత్తాంత మను విందు
తేనెలూరు తేటతెనుగులోన
వీధిబ్రతుకు మొదలు వేదాంత పర్యంత
మందజేసితివి నమస్కరింతు!
Wonderful bava garu. I think such happenings should be distributed widely in the present younger generation because most of the people don’t know what humility is and knowledge and wisdom isn’t the property of a select few.
Mind soul body and consciousness lost their identity, tears over flowed and heart filled with unknown and unexplainable ecstasy, this is what today’s article on Veerabhadra Rao has taken me into. Each and every line has a lot of message and the essence of life, its purpose , its acceptance,One’s attitude towards it were unfolded by Veerabhadra Rao in a simple but effective and with deep insight only possible to great Jnanis and yogis. I especially thank u for giving us such series of great writings, and your selection of themes from most reputed icons in music and fine arts, ideal couples to the people in your day to day life and their great personalities unknown to the world, but visualized by you in a completely different angle.
కృష్ణా, వీరభద్రయోగి నీ కంట్లో పడడం , నాలంటి వాళ్ళకు మరో గీతామృతం ..
Guruvugaaru namaskaaram. Mee rachana paatavam Adhbhutam. I can not describe more for your genius. Article excellent.
వీరభద్రరావు మనకి తెలిసిన, ముఖ్యంగా నీకు తెలిసిన
మొదటి దశ, క్రమానుగతంగా అతని జీవిత గమనంలో
ఏర్పడ్డ ఒడిదుడుకులు..అవన్నీ చదువుతోంటే, ఆనాటి
రామచంద్రపురం రోజులు గుర్తుకొస్తున్నాయి. అతన్ని గురించి
రాయడానికి ఎంపిక చేసుకున్న పదబంధాలు హృదయాన్ని పట్టి
బంధించేయి. థామస్ హార్డీ కథ చదివినప్పటి నిర్వేదం!
మనింట్లో మసిలిన ఆ వీరభద్రరావు రూపం, ఒక బేస్ లో ఉండే
ప్రత్యేకమైన గొంతుతో నిదానంగా మాట్లాడే అతని పద్ధతి ఇప్పటికీ
నాకూ జ్ఞాపకాల్లోనే ఉంది.
అతను రంగులు వేయడమే కాకుండా, దుకాణాలకి సైన్ బోర్డులు
కూడా రాసేవాడు. మైన్ రోడ్ లోని మార్కెట్ సెంటర్లో ఉన్న ఒక
బిస్కట్ల కొట్టుకి మనింట్లోనే పెట్టుకుని నాలుగు రోజులు రాసిన
“శ్రీ వీరభద్ర బ్రెడ్ & బిస్కెట్స్” అనే బోర్డు ఇంకా నా కళ్లకు కట్టినట్టుంది.
నేనూ, సూరిబాబూ చిన్నతనం కొద్దీ అతన్ని ఆర్టిస్ట్ అప్పారావు అని
అంటూంటే, “కాదండి, వీరభద్ర రావు” అనేవాడు.
చాలా మంది వేదాంతం వల్లె వేస్తారు. ఉపన్యాసాలిస్తారు.
కానీ ఆచరణలో చూపించరు. వీరభద్రరావు మాత్రం వేదాంతాన్ని
జీర్ణించుకున్నాడు…..వేదాంతిలా జీవించాడు.
కఠినమైన కాలం, పరిస్థితుల ప్రాబల్యం అతన్ని అసహాయుడ్ని చేసి,
ఆత్మాభిమానం చంపేసి, యాచకుడిగా మార్చేసినా, మనిషిగానే
మిగిలేడు. సామాన్యుల్లో అసామాన్యుడయ్యాడు. మాన్యుడయ్యాడు.
ఒక చిన్న సవరణ: వీరభద్రరావు మా ఇంట్లో పెట్టుకుని రాసిన
సైన్ బోర్డ్ “శ్రీ వీరభద్ర……..” కాదు. వీరభద్రరావు పేరు అన్ని సార్లు
రాసి, మళ్ళీ అదే రాసేసేను. ఆ బోర్డు..”జై భారత్ బ్రెడ్ & బిస్కెట్స్”
ఇంకోమాట. రోజంతా ఎక్కడో పని చేసుకుని, ఎక్కడో తినో తినకో
ఎక్కడో పడుకునే వాడు. కానీ ఒక్కోరోజు చీకటి పడేవేళకి వచ్చి
ఇంటి అరుగుమీద కూర్చునేవాడు. అది గమనించిన కృష్ణ అతనికి
టిఫిన్ తినమని డబ్బులిస్తుండే వాడు. (ఇస్తే తీసుకునే వాడు..
లేకపోతే అడిగేవాడు కాడు)
కృష్ణా.. ఈమథ్యకాలంలోనువ్వుసృజించినవిషయాలో… వీరభద్రరావు జీవితం విలక్షణమైనది. ఓవ్యక్తి జీవితాన్ని… జీవనవిధానాన్ని… నిశితంగా పరిశీలించి, పరితపిస్తూ.. అనుభూతి చెందుతూ…ఆవ్యక్తిని ఆవిష్కరించిన విధానం అత్యద్భుతం. పండితుల గూర్చి వివరించడం తేలిక. పామరునిలోని.. పండితుని… వేదాంతిన వెలికి తేవడం… అంత తేలిక కాదు. చరిత్ర పుటలో… కనుమరుగవుతున్న… మరెందరో మహానుభావులను… వారి జీవితాలను గూర్చి… నీద్వారా తెలుసుకొనే భాగ్యాన్ని… దివ్యమాత కలగజేయాలని కాంక్షిస్తూ…. జయశీలరావు.