సాహిత్యము-సౌహిత్యము – 40 : నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్
10—02—2018; శనివారము.”సాహిత్యము – సౌహిత్యము ~ 40″|
విశాఖపట్టణం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో, “భువనవిజయం” సాహిత్యరూపక ప్రదర్శన ౘాలా ౘక్కని వాతావరణంలో, ప్రేక్షకజన హృదయహర్షప్రదాయకంగా జరుగుతోంది. అందులో, రసికజనరంజక కవివరులు, “కరుణశ్రీ”జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఒక “సమస్య” వచ్చింది.
“నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్ “|
ఇది ఉత్పలమాల ఛందస్సులోని వృత్తం. ఈ పద్య పాదంలో, ఆరు(6) “నీవు”లువున్నాయి.
పద్యపూరణం:—
“నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తుకోవు, నీ
కా వెనకయ్య ముద్దుకొడుకయ్యెనులే!” అని ఏడ్చు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట కదించి, ముఖంబులు ముద్దుగొంచనెన్
“నీవును నీవునున్ మరియు నీవును నీవును నీవు నీవునున్ “||
ఇది మన కుటుంబాలలో తరచు జరిగే ఒక సుందరమైన సన్నివేశం. దీనిని “కరుణశ్రీ”కవివరులు ఆయనకిమాత్రమే సాధ్యమైన పరమసుకుమారపూర్ణమైన భావము, భాష, పద్యగమనములతో, ఈ సమస్యాపూరణాన్ని అత్యద్భుతంగా రక్తి కట్టించేరు.
ఆదిదంపతుల సంసారంలోకూడా మానవులమైన మనం పడే పాట్లు వుంటాయనిపించే ముగ్ధసందర్భశుద్ధంగా దీని పూరణ జరిగింది. పెద్దకొడుకయిన బుజ్జి బొజ్జగణపయ్యని ౘంకన యెత్తుకుని తిరుగుతూ పార్వతీదేవి పనులు ౘక్కబెట్టుకుంటోంది. మరి, కనీయసకుమారుడు కార్తికేయుడు, తల్లి చీరచెంగుపట్టుకుని వెనకనేతిరుగాడుతూ, తననికూడా ఎత్తుకోమని మారాంచేస్తున్నాడు. పార్వతీమాత పనులహడావుడిలోపడి, పైగా ఎత్తుకోవడం ఆలస్యంచేస్తే ఏమంటాడో వినాలనే ముచ్చటతో, కుట్టికుమారుడిమాటలు పట్టించుకోనట్టు అభినయిస్తోంది. అటువంటి సందర్భంలో గౌరీతనయుడు తల్లికి తన అభియోగం ఇలాగ వినిపించేడు:
“నీవు పొద్దస్తమాను గణపతి అన్నయ్యనే ఎత్తుకునిమోస్తూ, నీ ౘంకనించి దింౘకుండా అలాగ గారంచేస్తూనేవుంటావు! నన్నస్సలు ఎత్తుకోనే ఎత్తుకోవు! నీకు ఆ వినాయక (వెనకయ్య) అన్నయ్య అంటేనే వల్లమాలిన యిష్టం. వాడే నీ ముద్దుల బిడ్డడు. నేను నీకు ఏమీకానులే!” అని పేచీపెడుతూ, పన్నిండు కాటుక కళ్ళని, పన్నిండు బుజి-బుజ్జిచేతులతో నలుపుకుంటూ, బాలకార్తికేయస్వామి ఏడవడం ఆరంభించేడు. పాపం! పార్వతీమాతకి బాలకుమారుడిమీద వల్లమాలిన తల్లిప్రేమ పొంగుకొచ్చింది. ఒక్క ఉదుటున కుమారస్వామిని ఎత్తుకుని వక్షానికి గాఢప్రీతితో హత్తుకుంది. ముఖాలనిండా అలుక్కుపోయిన కాటుకని మృదువుగా పయ్యెదకొంగుతో తుడిచింది. అమాయకత్వంతో అందాలుచిందే ఆ ఆరుముఖాలని అమితఅభిమానంతో చూస్తూ,”నాయనా! నా బంగారుబిడ్డా! నీమీద నా ప్రేమని మాటలలో ఎలాచెప్పనురా? ఇదుగోచూడు! ఇంత ముద్దులు మూటగట్టే ముఖాలు ముల్లోకాలలోను లేనేలేవురాతండ్రీ! నీవే నా వరాలమూట! నీవే నా కాసులపేరు! నీవే నా నవమణిమేఖల! నీవే నా బంగారం! నీవే నా సింగారం! నీవే నా సకల సంపద!” అంటూ ఎడతెరిపిలేకండా షణ్ముఖుడి ఆరుముఖాలనీ శ్రీమాత తెగముద్దులాడి, మురిసిపోయింది.
ఇది ఈ వారంలో రాబోయే “మహాశివరాత్రి” పరమ పవిత్ర పర్వదినం సందర్భంగా సమర్పించబడిన సమస్యాపూరణం.
చాలా బావుంది. ఈ సందర్భంలో, అందునా నీ చక్కని వ్యాఖ్య చదివాక, నాకు మనుచరిత్రలోని ఈ కింది పద్యం జ్ఞాపకం వస్తోంది:
అంకముజేరి శైలతనయా స్తన దుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్టc దొండమున నవ్వలి చన్ కబళింపబోయి ఆ
వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడు గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!
అందాలు చిందే పద్యాన్ని, అనువైన సమయానికి అందరికీ
అందించేవు.
“రసికేషు కవిత్వనివేదన ఫలమిదం ధ్రువమ్ “||
“పుష్ప విలాపం” రాసిన ‘కరుణశ్రీ’ గారే ఇంత హృద్యంగా
పద్యం రాయగలరు. సమస్యా పూరణం లో ఆయన తీసుకున్న
అంశం ఎంత చక్కగా ఉందో, అంత సుకుమారంగానూ ఉంది..
ఆ భావం చెప్పడానికి ఆయన ఉపయోగించిన భాషకూడా.
నువ్వు ఇచ్చిన వివరణ చాలా హోమ్లీ గా ఉంది.
అవధానాల్లో ఒక సమయంలో ఇటువంటి సమస్యలు బాగా
ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా క్రమాలంకారయుతంగా
పూరించే వారు.
“అందరు నందరే మరియు నందరు నందరె అందరందరే ”
ఇలాంటి పోలికలున్న సమస్యలలో ఒకటి.
“లెస్సాతిలెస్స బల్కితివి సోదరా!”
కరుణశీృ అనగానే పుష్పవిలాపం… కుంతీవిలాపంగుర్తుకొస్తాయి. చక్కటి సమస్యా పూరణాన్ని అందించి అలరించారు. శివోహం. జయశీలరావు.