శారదా సంతతి — 30 : శ్రీమతి పూళ్ళ భానుమతి+శ్రీ పూళ్ళ వెంకట్రాజు (కొండ్రాజుగారు) దాంపత్య వైభవ స్ఫూర్తి

శ్రీశారదా వాత్సల్య చన్ద్రికా :—
01—02—2018; గురువారం. (04—02—2018; ఆదిత్యవారంనాటి వ్యాసానికి బదులుగా ప్రత్యేక వ్యాస సమర్పణ) :—“శారదా సంతతి—30” ~ శ్రీమతి పూళ్ళ భానుమతి+శ్రీ పూళ్ళ వెంకట్రాజు (కొండ్రాజుగారు) దాంపత్య వైభవ స్ఫూర్తిఈ రోజు, అంటే, హేమలంబివర్ష, మాఘ కృష్ణ ప్రతిపత్తిథి(పాడ్యమి); అంటే 2018; ఫిబ్రవరి, 1వ తేదీ, గురువారం, మా చిన్న అమ్మమ్మగారైన శ్రీమతి పూళ్ళ భానుమతిగారి ప్రథమ సాంవత్సరిక వర్థంతి పావన దివస సందర్భంగా, ఈ సంక్షిప్త వ్యాసరచనని అందించడం జరుగుతోంది.మా అమ్మమ్మగారు, శ్రీమతి బాలాంత్రపు సుబ్బమ్మగారి చివరి చెల్లెలైన మా భాను అమ్మమ్మ, మా వెంకట్రాజుతాతగార్ల పవిత్ర స్మృతి సంకేతంగా ఈ నాటి “శారదా సంతతి—30” వ్యాసాన్ని, నేను, ఆర్ష వైదిక దాంపత్య ధర్మ నిర్వహణ పరాయణులయిన వారిద్దరి దివ్య పాద సన్నిధిలో సభక్తికంగా సమర్పించుకుంటున్నాను.

తూర్పుగోదావరిలో, (చెన్నై-కొలొకత్తా జాతీయ రహదారినవున్న) కత్తిపూడి కూడలినుంచి, శంఖవరం-శరభవరం మీదుగా వెడితే “రౌతులపూడి” అనే అందమైనవూరు వస్తుంది. అది మా భానుఅమ్మమ్మ, వెంకట్రాజుతాతగారల స్వగ్రామం.

నాకు 17—18 సంవత్సరాల వయస్సున్నప్పుడు, మా తమ్ముడు సి.యస్ .,(మా పాప పిన్నిగారి అబ్బాయి, మాయింట్లోనేవుండి ౘదువుకునేవావాడు) ఇద్దరమూ కలిసి(అప్పుడు, వాడికి 11—12 ఏళ్ళ వయస్సుంటుంది) వేసవి సెలవలకి ఒక వారం-పదిరోజులుగడపడానికి మా భానుఅమ్మమ్మగారి ఆప్యాయమైన పిలుపే ఆదేశంగా అనుకుని రౌతులపూడికి వెళ్ళేం! ఆ ఊరికి బస్సు ప్రయాణం మొదలుకొని, మళ్ళీ మాయింటికి తిరిగి వచ్చేవరకు, ఆ వారం-పదిరోజుల రౌతులపూడి నివాసం, ఒకానొక అపూర్వ అలౌకిక  మధుర దృశ్య కావ్యదర్శన అనుభూతిని కలిగించి, నాలో నిరంతరమూ నిలిచిపోయే మధుర రసవత్ ఘట్టంగా మలిచివేసింది.

ఆ ఊరి సహజ సౌందర్యమే వేరు. చుట్టూ అలకాపురీప్రాకారాలవంటి తూర్పు కనుమల కొండలవరుసలు, అందమైన వివిధ హరితచ్ఛాయల శోభతో నిండిన ఆకుపచ్చ పచ్చిక చీరలని రమణీయంగా ధరించిన గిరికల తరుణీ శ్రేణులై, నా మనస్సుకి అపార నయనోత్సవ హేలని కలిగించి, నా మధుర జ్ఞాపకాల రూపంలో ఎప్పటికీ నన్ను వెన్నంటివున్నాయి.. ఊరిముందరి ఏరు ఒక ప్రత్యేక అలంకారంగా శోభించేది. ఊరికి ఒక చివర ప్రశాంతమైన శివుడి దేవళంవుంటుంది. ఆ వూరికి, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకి పెద్దదిక్కు, మా వెంకట్రాజుతాతగారే!

“మహాభారతమ్ ” లో, వ్యాసభగవానులు, ధర్మరాజుగురించి అమోఘమైన మాట ఒకటి అన్నారు:-

“తస్య కీర్తిమతోవృత్తం అవేక్ష్య సతతం నరాః |
ధర్మ ఏవ పరః కామాత్ అర్థాచ్చేతి వ్యవస్థితాః” ||

“ఆయన(ధర్మరాజు)యొక్క కీర్తిప్రదాయకమైన, ధర్మాచరణతో నిండిన నడవడిని అనుదినమూ గమనిస్తూన్న సామాజిక జనులు, అర్థ-కామాల రెండింటికన్న ధర్మమే గొప్పది అని గ్రహించి, ధర్మప్రాధాన్య బద్ధమైన జీవన విధానంతో తమ-తమ బ్రతుకులని తీర్చి దిద్దుకున్నారు”.

పై శ్లోకంలోని భావం మా తాతగారి జీవిత దృక్పథాన్ని, దినచర్యని నిర్వచిస్తోంది. తాతగారు అజాతశత్రువు. సర్వజన శ్రేయస్సు వారి ఆదర్శం. ఊరి రాజకీయాల విషయంలోను, సామాజిక సమస్యల సందర్భంలోను వారు ఈ ఆదర్శంతోనే ఆలోచించి, నిదానంగా అడుగు వేసేవారు. ఎవరెంత ఆవేశపడినా, ఆయన ఆలోచనలు, ఆచరణలు సంయమన మార్గంలోనే నడిచేవి. వారి మాటలన్నీ  అనుద్వేగకరంగాను, చేతలన్నీ నిరుపద్రవంగాను వుండేవి. అంత నింపాదిగా కర్తవ్యాలని ఆలోచించడం, అంత నిదానంగా విధులని ఆచరించడం వారిలోనే నేను చూడగలిగేను. తన కంటిముందు జరిగే విషయాలని రాగ-ద్వేషాలతో నిండిన సాంసారికుడిలాగ కాకండా, స్వ-పర భేదంలేని సమ్యక్ భావనతో,సనాతన ఆర్ష చైతన్య స్ఫూర్తితో, సర్వజన శ్రేయోదాయక యోజనా గరిమతోచూడడం వారి నైజమైవుండేది. బహిర్గత సాధనకి దూరమైన ఆర్ష గార్హస్థ్య ధర్మనిర్వహణ వారి నిత్యానుష్ఠానం! ఒక ఋషికల్పుడు గృహస్థుగా సంసారంలో ఎలావుంటాడో, సంసారం అనేది గృహస్థైన ఆ ఋషికల్పుడితో ఎంత సత్త్వగుణమయంగా వ్యవహరిస్తుందో ప్రత్యక్షంగా వారు నిర్వహించి, నిరూపించి లోకానికి చూపించేరు. వారికి ఇద్దరు కొడుకులు, వేంకటేశ్వర్లు మావయ్య, సత్తిబాబు.ఏడుగురు కుమారిలు, వాణిపిన్ని, చిన్నపాప, ప్రకాశి, రాజా, మణి, అరుణ, వల్లి. ఆడపిల్లలందరినీ, మా రామచంద్రపురం తాతయ్యగారిలాగే ౘాలా ప్రత్యేక ప్రేమతో చూచేవారు. ఈ ఇద్దరు తాతలూకూడా మనుధర్మశాస్త్రవిధి మర్మం తెలిసిన విజ్ఞులని నా అభిప్రాయం.

“పితృభిః భ్రాతృభిః చైతాః పతిభిః దేవరైః తథా|
పూజ్యాః భూషయితవ్యాః చ బహుకల్యాణమీప్సుభిః”||(lll:55).

“తమ-తమ గృహాలలో మేలు జరగాలని కోరుకొనే గృహపతులు, తమ-తమ కుమారిలని, సహోదరిలని, భార్యలని, కోడళ్ళని, వదినలని, మరదళ్ళని మొదలైన స్త్రీలనందరినీ గౌరవించి, అలంకారాలతో సమ్మానింౘాలి”.

అనునిత్య గృహనిర్వహణ విధులని అలసటతెలియని మా భానుఅమ్మమ్మగారు, వారి తోడికోడలు తోడ్పాటుతో ఏ లోటు-పాటులూ లేకండా సంపూర్ణ సమర్థవంతంగా, పూర్తి దక్షతతో నిర్వహించేవారు. వారిది ఉమ్మడి కుటుంబం. మా తాతగారితమ్ముడు, కాంతారావుతాతగారు, శ్రీరామచంద్రుడికి, లక్ష్మణస్వామి లాగ, ఆ పైన భరతులవారిలాగ, ఆమాటకి వస్తే, భరత-లక్ష్మణ సమ్యక్ స్వరూపంలాగ వుండేవారు. ఆ ఉమ్మడికుటుంబానికి ౘాలా పెద్ద ఉమ్మడి సేద్యమూ, పశుపాలన, ముఖ్యంగా ఆవుపాడి వుండేవి. ఆ చుట్టు-ప్రక్కల పెద్ద సేద్యాలలో వారిదికూడా ఒకటి అని నేను విన్నాను.

మా కాంతారావుతాతగారి వ్యక్తిత్వం విలక్షణమైనది. వారు పొలానికి సైకిలు మీద బయలుదేరినా, అక్కడినుంచి యింటికి వెనుతిరిగినా, దారిలో వారికి హరి-హర-బ్రహ్మ-మహేంద్రాదులు ఎదురు పడినా, సైకిలు దిగేవారుకాదు. కాని, ఆమడదూరంలో అన్నగారి అలికిడి ఐతే, సైకిలు దిగిపోయి, అన్నగారి నీడ కనుమరుగైపోయేకకాని మళ్ళీ సైకిలు ఎక్కేవారేకాదు. ప్రతిదినము, పగలు-రాత్రి భోజనాలలో అన్నదమ్ములిద్దరూ, సహపంక్తిన భోజనం చేసేవారు. అన్నగారు పరిషించిన అనంతరమే, తమ్ముడుగారు పరిషేచనం చేసేవారు.

ఇహ-పరాలకి ఆదర్శవంతమైన వారి అమేయ భ్రాతృభక్తి పరాయణతకి  ఒకే ఒక ఉదాహరణ ౘాలు. దురదృష్టవశంగా వారు మధ్యవయస్సు దాటగానే పరమపదించేరు. దశదిన కర్మనిర్వహణ రోజులలో, కాకికి పిండం పెట్టేరు. కాకులన్నీవచ్చి “కావు-కావు”మంటూ అరవడమేతప్ప, పిండాన్ని ముట్టుకోలేదు. ఎంత ప్రయత్నంచేసినా, ఎన్నిరకాల దణ్ణాలు పెట్టుకున్నా పని జరగలేదు. ఇంటి మనుష్యులు, వారి కట్టుబాట్లు బాగాతెలిసిన గృహపురోహితుడు,అన్నగారిని ఒప్పించి, భోజనానికి కూర్చోపెట్టి, పరిషేచనం దగ్గరవుండి చేయించేరు! అంతే! వెనువెంటనే కాకులు పిండాన్ని ఎగరవేసుకుని పోయేయి. ఇటువంటి అరుదైన ఆత్మీయతాభావాలు రామాయణాది కావ్యగాథలకి, మహాభారతాది ఇతిహాస ఇతివృత్తాలకి, భాగవతాది పురాణ వృత్తాంతాలకి మాత్రమే పరిమితం కాకుండా, మా కుటుంబాలలో పుట్టిన మహానుభావుల జీవితాలతోముడిపడి, మా అందరి ప్రత్యక్షానుభవాలలో భాగమై నిలిచిపోవడం మా జన్మాంతర మహాసుకృతంగా నేను భావిస్తున్నాను.

మా కాంతారావుతాతగారికి, వారి సహధర్మచారిణి మా చిన్నమ్మమ్మగారికి, ఇద్దరు కుమారులు. నారాయణ, సుబ్రహ్మణ్యం. ఇద్దరు కుమారిలు. చిన్నరాజా, సుధ.

మా భాను అమ్మమ్మగారు తొంభై ఏళ్ళ నిండు జీవితం అనంతరం, క్రితం సంవత్సరం తనువు ౘాలించేరు. గత ఐదారు దశాబ్దాల కాలంగా నేను వారిని ౘాలా ఎడ్మిరేషన్ తో,  గమనిస్తున్నాను. వారి వంటి గృహిణి అరుదుగానేవుంటారు. వారి ఉమ్మడికుటుంబానికిమాత్రమే వారి ప్రజ్ఞలు, వనరులు పరమితంకాలేదు. ఊరంతా, ఊరిలోని ఆర్తులూ, దీనులూ, ఆశ్రితులూ, బడుగు జీవులూ — వీరందరూ ఆమెకి తమ కుటుంబ సభ్యులకి ఏమీ తీసిపోరు. ఇంతేకాదు. రౌతులపూడినుంచి, రామచంద్రపురం వరకు, కొంచెం ఇటూ – అటూగా వున్న అన్ని ఊర్లలోవున్న బంధు – మిత్రులు అందరూ ఆమె హృదయానికి ఆత్మీయ స్వజనమే! ఆ బంధుమిత్రులందరిలోను, ఎవరు దైన్యంలోను, ఆర్తిలోను, అవసరాలతోను ఇబ్బందులు పడుతూంటారో అటువంటివారు మా భానుఅమ్మమ్మగారికి మరీ ఆప్తులుగా వుండేవారు. ఆ రోజులలో పెద్ద ఇనపరేకు పెట్టెలలో ఎన్నెన్నో సరుకులు, సామాన్లు, పప్పులు, తినుబండారాలు, బస్తాలలోను, మూటలలోను ప్రయాణం-బస్సులు మారుతూ శ్రమ-అలసట వంటివాటికి తావీయకుండా అవసరంవున్న కుటుంబాలనెన్నో ఆదుకునేవారు. బంధువుల పిల్లలని తనతో తీసుకువెళ్ళి, కొన్నినెలలపాటు వారి బాగోగులుచూసి పంపించేవారు. ఏ సమయంలోనైనా ఒకపూటకి కనీసం పాతిక-ముప్ఫైమంది భోజనానికివుండే రోజులు – సందర్భాలు లెక్కకి మిక్కుటంగావుండేవి. భానుఅమ్మమ్మ, వారి తోడికోడలు చిన్నఅమ్మమ్మ, వారిద్దరూ ఎంతమందికైనా ఏ లోటు-పాటులూ లేకండా అన్నింటినీ,  సమయానుకూలంగా అమిర్చేసేవారు. ఆ అన్న-దమ్ముల అన్యోన్యత ఎంత ఆదర్శవంతమైనదో, ఈ తోడికోడళ్ళ ఆత్మీయత అంత అమృతమయంగా వుండేది. ఏ కాలంలోను, అటువంటి గొప్ప ఇంటినికాని, అలాంటి అద్భుత వ్యక్తులనికాని, అంతటి మహోన్నత మానవీయ విలువల సంచారాన్నికాని, అనుపమ ఆదరాభిమానాలనికాని నేను చూడలేదు. ఆ గృహం అనే క్షేత్రానికి సారభూతమైన మృత్తికాజీవచైతన్యశక్తి మా భానుఅమ్మమ్మ. భద్రాద్రిరామదాసు, “ఏ తీరుగ నను దయ చూచెదవో- – –“అనే ‘నాదనామక్రియ‘ రాగంలోని  కృతిలో, ఒకచోట, “నిను కన్నది కానుపు, రామా!” అంటాడు. అలాగే, నేను, మా భానుఅమ్మమ్మగురించి, “నీ కడుపున పుట్టుట వరము“అని అంటాను. వారి బిడ్డలందరూ నవరత్నాలే! వారందరికీ, అందునా, ఉమ్మడికుటుంబంలోని ఆడబిడ్డలందరికీ అరమరికలులేని ఆదర్శపరిసరాలని అందించి, వారందరికీ ఆత్మవిశ్వాసాన్ని, ధార్మిక-ఆర్థిక స్వావలంబనశక్తిని, పరస్పర సదవగాహనకి అనుకూలమైన దృక్పథాన్ని, ఎవరికివారే ఆలోచించుకుని వారి-వారి జీవనోపాధులని కుటుంబసంప్రదాయ-గౌరవాలకి అనువుగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యాన్ని ఇలాగ అన్ని విధాలా తరవాత తరంవారి అభ్యున్నతికి, పురోగమనానికి అవసరమైన ధృతిని-నియతిని ఆమె అందించేరు. వారందరికి కాకినాడలో అన్నివిధాలా ఆలంబన, ఆశ్రయం మా వాణి పిన్ని. వాణిపిన్ని అంటే మా భాను అమ్మమ్మ, వెంకటరాజు తాతగారు కూడా తాము కన్న బిడ్డ శక్తిసామర్థ్యాలని గమనించి గర్వపడవలిసిన అపూర్వ వ్యక్తిత్వం కలిగిన గృహిణి. కనీస వనరులనుంచి, మా అమ్మమ్మ గరిష్ఠ కుటుంబాలకి మేలుచేస్తే, వాణిపిన్ని, మా తల్లిగారిలాగ, శూన్యంనుంచి వనరులని తయారుచేసి వ్యక్తులకి, కుటుంబాలకేకాక, సంస్థలకి శ్రేయస్సుని కలగజేసింది. వాణిపిన్ని అంటే ౘదువులతల్లి. అందరికీ అన్ని విద్యలని అందించేది. జీవితం అనే  “ఓపెన్ యూనివర్సిటీ“లో మా తల్లిగారిలాగ, మా జ్యోతిపిన్నిగారిలాగ, ఒక “ఛాన్సెలర్ ” వంటిది. Formal educationలో కృషికి, పరిస్థితులు అనుకూలింౘకపోయినా, కేవల సృజనాత్మక రచనలలో, ఆమెకి, ఆమే సాటి. “బుక్కా బూరయ్య” వంటి రచనలు  అలాంటి సహజ ప్రతిభతోను, అంతటి ప్రభావవంతమైన తెలుగు నుడికారంతోను ఈ కాలంలో రాయగలగడం ౘాలా అరుదైన ప్రజ్ఞ! ఆమె రచించిన కొన్ని ఆటవెలది పద్యాలు, పలుకులవెలదికి సహజమైన ఆభూషణాలు.  రకరకాల స్థాయిలలో, మనిషి మనుగడలో భాగమైవున్న గతకాల సంస్కృతియొక్క సజీవ శకలాలని అందంగా, సుమధుర శబ్దబంధురంగా, రాబోయే తరాలవారికోసం ఆమెయొక్క వ్యాసాలలో భద్రం చెయ్యబడ్డాయి.

వచనంలోను, పాటలోను, పద్యంలోను, వ్యాసంలోను, కథానికలోను, ఇలాగ అనేక సాహిత్య రచనావిభాగాలలో ఆమె రచనలు మణిమయదీపకళికలై పత్రికలలోను, సంచార దూరవాణి(mobile phone) యొక్క సామాజిక మాధ్యమాలు(social media) ద్వారాను, అభిరుచి కలవారినందరినీ అలరిస్తున్నాయి.

మా తాతగారలు- మా అమ్మమ్మగారలు అందజేసిన ఆ ఉమ్మడికుటుంబ వ్యవస్థయొక్క ఆదర్శశక్తి ఆ తరవాత తరంవారందరిలోను ప్రసరించి, వ్యష్టి కుటంబవ్యవస్థే జీవకేంద్రమైపోయిన ఈ రోజులలోకూడా, సమగ్రశోభతో ప్రభావదీప్తమై ఈ నాటికీ, ముందుకి కొనసాగిపోవడమంటే దైవానుగ్రహమూ,పెద్దల ఆశీస్సులూను!

మా పూళ్ళ భానుమతిగారు ఒకవ్యక్తి కాదు. ఆమె అప్రతిహత శక్తి. అంతే కాదు! ఒక సమష్టికుటుంబవ్యవస్థకి పునాదిరాయి. కుటుంబ భవిష్య పరంపరా మహాభవన నిర్మాణంలో ఉత్తమోత్తమశిల్పకళానిపుణురాలు.  “సుఖం వా యది వా దుఃఖం, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి” “సుఖమైనా, కష్టమైనా, తనకి కలిగితే ఎలావుంటుందో అలాగే అందరికీ వుంటుందని గ్రహించడం(యోగసిద్ధిని పొందడమే!)” అనే గీతాచార్యుని బోధయొక్క లక్షణానికి ఆవిడ సహజ నిత్య జీవితం లక్ష్య స్వరూపం.

మా వెంకటరాజుతాతగారు, కాంతారావుతాతగారు వారి-వారి నిత్యజీవితప్రవాహాలని ఏ దీర్ఝ ఉద్విగ్నతలకి లోనుకాకండా, బ్రతుకుల వరదల ఉరవళ్ళు-పరవళ్ళతో అవివేక తాదాత్మ్యానికి తావుని ఇవ్వకండా, ప్రశాంత తటస్థ భావంతో ఆర్షసంప్రదాయయోగ్యమైన గార్హస్థ్యధర్మవిధులని సఫల ఆశయ పూర్ణంగా నిర్వహించి, అమోఘమైన లోకోత్తర ఆదర్శాన్ని మనందరికి ప్రసాదించి పరమపద వాసులై, వారి దివ్య ఆకాంక్షలరూపంలో, వారి ఉత్తమాశయాలద్వారా మనలని ఉత్తేజితులని చేస్తూ మనమధ్యే మన పుణ్యమయభావరూపంలో మసలుతూవున్నారు.

ఈ పావన సందర్భంలో వారందరికి మన సాష్టాంగప్రణామాలు అర్పించుకుందాం. వారి ఆశయాలని కొనసాగిస్తూ, ఈ పుణ్యపూర్ణ ఉత్తేజాన్ని మన తరవాత తరంవారికి అందజేసి, మన ఆచరణధర్మంతో వారినికూడా ఉత్తేజితులనిచేసే సదాచారయత్నం చేద్దాం!

Let us continue this holy family cultural relay-run and try to help this grand family-mission go ahead for ever and ever from one generation to the other.

స్వస్తి||

You may also like...

6 Responses

  1. వాసుదేవరావు says:

    కుటుంబ వ్యవస్థ పల్లెల నుండి ప్రభవించి పరిఢవిల్లింది. ఆదరణ , ఆప్యాయతలకు, వ్యక్తి అభ్యున్నతికి , సమాజ ప్రగతికి మూలం- మీ భావన, స్పందన చాలా బాగున్నాయి- వాసుదేవరావు

  2. Devi says:

    Felt very happy and excited to read today’s article on Bhanu Ammamma and tatagaru. I have never seen him but I very well remember Bhanu ammamma, her tall and heavy personality, her dominating voice and her affectionate talk. My mom’s dearest friend Vani Ammamma her life and the way she handled the obstacles ,her courageous attitude very my childhood tales often told to us. Today you have given a new angle of a great writer in her which we never knew.The unity of the two brothers and co sisters is the highlight of this presentation. We all join you in paying homage to his ideal couple.

  3. సి. యస్ says:

    జ్ఞాపకాలు కేవలం వ్యక్తిగతమైనవే అయితే, అవి
    ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమై పోతాయి. అలాకాకుండా
    అవి…ఒకనాటి వ్యవస్థనీ, ఒకప్పటి సంప్రదాయాల్ని తెలియ
    చెప్పేవి అయినప్పుడు పదిమందికీ ప్రయోజనకారిగా ఉంటాయి.
    అందుకు వాటిని తెలుసుకోవడం అవసరం. రికార్డు చేసి ఇలా
    చెప్పడమూ అవసరమే. ఆ పని నువ్వు ఈ రచనలో అద్భుతంగా
    చేశావు. ఒకప్పటి రౌతులపూడి, ఆ ఇంటి వాతావరణం, తాతయ్య
    గార్లు, అమ్మమ్మల వ్యక్తిత్వాలు, వారి బంధుప్రీతి, అనుసరణీయమైన
    వారి నడవడిక ఇందులో ప్రతిఫలిస్తూ, గడిచిన కాలాన్ని ఆ కుటుంబ
    సభ్యులకే కాక అందరికీ కూడా కళ్ళముందు నిలిచేట్టు చేసింది.
    మరుగున పడిపోతున్న ఉమ్మడికుటుంబ సంస్కృతిని మళ్లీ
    గుర్తుచేసింది.
    తాతయ్యగారి గురించి రాసిన ” బహిర్గతసాధనకి దూరమైన ఆర్ష
    గార్హస్థ్య ధర్మనిర్వహణ వారి నిత్యానుష్ఠానం.” అనేది గొప్ప పరిశీలన.

  4. సి. యస్ says:

    తమ తల్లిదండ్రుల మీద కృష్ణ రాసిన ఈ మాటలు చదివి, ఆ దంపతుల
    పెద్దకుమార్తె అయిన శ్రీమతి కుంటముక్కల సత్యవాణి ( వాణి పిన్ని)
    స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను……. సి. యస్.

    బాబీ! కృష్ణ కి మనవారందం కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం.తాతయ్యగారిని,అమ్మమ్మని కాంతారావు తాతగారిని అమ్మమ్మని కృష్ణ అర్థంచేసుకొన్నట్లు మేమెవరం
    అర్థంచేసుకోలేదు.ఈ వ్యాసం చదువుతున్నప్పు మా అమ్మానాన్నలగురించీ,పిన్నీ చిన్నాన్నలగురించీ మాఅందరికీ ఆనందంతో,గర్వంతో మనసులు వుద్వేగభరితమయ్యాయి.కళ్ళవెంట నీరు జాలువారింది.ఆనందంమో, దుఃఖమో తెలియని స్థితిలో పడిపోయాము.
    కృష్ణకి మా కృతజ్ఞతలు తెలియజేయి.

  5. వ.వెం.కృష్ణరావు says:

    వాణిపిన్నీ!
    నీవు నాకన్న వయస్సులో మాత్రమే చిన్నదానివి. మిగిలిన
    అన్నివిధాలా పెద్దదానివి. మాకన్దరికీ మధ్యబిన్దువువి.
    నీద్వారానే నేను, సత్తిబాబు మిగిలినవారమన్దరమూ
    తాతగారలకి, అమ్మమ్మలకి, మిగిలిన కుటుమ్బానికి,
    దేవాలయమైన ఆ ఇణ్టికి, ఆ అన్దమైన ఊరికి మేము
    చేరువయ్యేము. అన్తటి మహామహుల ప్రేమకి నోచుకున్నాము. నీవు ఎప్పుడూ మా ఆరాధ్య దైవానివి.
    మీరన్దరూ నాకు ఎప్పుడూ ప్రియమైనవారూ, పూజ్యులూను.

  6. V.V.Krishna Rao says:

    Here our grand aunties and uncles, their lives/life-styles, the
    values for which those lives stood and above all their inner
    strong ability in creating such a grand and sublime atmosphere in
    the family are all highly inspiring in their eternal and universal
    content. This timeless universality is the very source of my
    inspiration for writing this essay.Thank U all for your warm response.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *