సాహిత్యము-సౌహిత్యము – 35 : కుండలు కొండనెత్తె, కనుగొన్న సురల్ వెరగంది చూడగన్
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :
06—01—2018; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~35.
05—08—2017; శనివారం, “సాహిత్యము—సౌహిత్యము~13” లో, సుప్రసిద్ధ కవి, విమర్శకులు, అవధానవిద్యావిశారదులు, సంచాలకులు, పండితులు ఐన శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారి గొప్ప సమస్యాపూరణం, “స్మితకున్ వందనమాచరింపుము,కవీ!సిద్ధించు నీ కోరికల్ ” పరిచయం చేసుకుని ఆనందించేం!
మళ్ళీ, 2018 లో,మొట్టమొదటి శనివారం, వారి మరొక పుణ్యమయమైన శంకరభగవానుడి కైలాసపర్వత ప్రస్తావన కలిగిన, పరమరమ్య సమస్యాపూరణాన్ని పరికించి, ఆనందాన్ని పంచుకుందాం!
సమస్య:—
“కుండలు కొండనెత్తె, కనుగొన్న సురల్ వెరగంది చూడగన్ “!
“దేవతలు నిశ్చేష్టులై చూస్తూండగా, (మట్టి)కుండలు, కొండని (పైకి) యెత్తేయి“- అని సమస్య భావం. ఇది అందరికీ ౘక్కగా అర్థం ఔతోంది. అయితే, కుండలు, కొండని పైకి ఎత్తడం, అసంబద్ధంగానూ, అసంభవంగానూవుంది. కాని బేతవోలువారు అద్భుతమైన రసస్ఫూర్తితో, అసంబద్ధతని తొలగించి, అసంభవాన్ని, రసజ్ఞ బంధుర సంభావ్య భవంగా చేసిన ఈ పూరణ మన మనస్సులని తప్పక దోచుకుంటుంది.
ఇప్పుడు, సమస్యాపూరణ పద్యం పరికిద్దాం! ఇది ఉత్పలమాల వృత్తంలోని పద్యం. సంస్కృత వృత్త పద్యాలలో
1. ఉత్పలమాల;
2. చంపకమాల;
3. శార్దూలము(శార్దూలవిక్రీడితము);
4. మత్తేభము(మత్తేభవిక్రీడితము).
ఈ నాలుగూ బాగా ప్రాచుర్యంపొంది, వినియోగంలో వున్నాయి.
“చండతరప్రభావమున, చండమయూఖుని గెల్చువాడు, దో
ర్దండకళాభిగుప్త నిజరాక్షసవీరుడు, రావణాఖ్యు డా
ఖండలవైరి, ఘోరతరగాఢ తపంబును చేసి, సర్పరాట్
కుండలు కొండనెత్తె, కనుగొన్న సురల్ వెరగంది చూడగన్ “! |
“తీక్ష్ణకాంతిలో సూర్యుడిని మించిన తేజఃప్రతాపం కలిగిన వాడు, భుజబలపరాక్రమంతో తన రాక్షసవర్గాన్ని రక్షించు కోగల శౌర్యవంతుడు, దేవేంద్రుడి శత్రువు అయిన రావణాసురుడు, దారుణ తపశ్శక్తితో, సర్పజాతి చక్రవర్తి ఐన వాసుకిని అలంకారంగా మెడలో ధరించిన శంకరభగవానుడి నివాసమైన కైలాసగిరిని, దేవతలు నిశ్చేష్టులై చూస్తూండగా, పైకి ఎత్తేడు”.
(ఇక్కడ “కుండలు” అంటే ఏనుగు కుంభస్థలం అనే అర్థం కూడావుంది. ఆ అర్థాన్ని ఇక్కడ తీసుకోవలసినపని లేదు. మనకి బాగా తెలిసిన అర్థం తీసుకుని, పూరణ చెయ్యడం ద్వారా కవిగారు మనకి ఒక సౌలభ్యాన్ని కల్పించేరు. వారికి ధన్యవాదం అర్పిద్దాం!).
స్వస్తి||
బేతవోలు వారి పూరణం రసరమ్యంగా ఉంది.
పూరణ చూశాకా సమస్యలోని క్లిష్టతని ఎంత తేలికగా అధిగమించారో అనిపిస్తుంది. మంచి
చమత్కారం, సరసత ఉన్న కవి, విమర్శకులు
ఆయన. రావణుని వర్ణించడంలో ఆయన ఎన్ను
కున్న పదాలు వారి ప్రతిభకి నిదర్శనం. మంచి
పద్యం ఇచ్చావు. ధన్యవాదాలు.