శారదా సంతతి — 24 : చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ .

శ్రీశారదా వాత్సల్య దీపికా :—

24—12—2017; ఆదిత్యవారము.

శ్రీశారదా సంతతి—24. ~ చలనచిత్ర స్వరసామ్రాజ్య చక్రవర్తి—(K.L.) సైగల్ సా(హ)బ్ .

కాలం ఇంచుమించు 1922—23 ప్రాంతం అనుకోవచ్చు. స్థలం ఉత్తర భారత దేశంలో, జనసమ్మర్దంలేని ఒక రైల్వే ప్లాట్ ఫాం. విశ్వవిఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ సంగీత సభలలో, ఉస్తాద్జీకి సారంగీమీద సహకారం అందించే ఇంతియాజ్ అహ్మద్ , ప్లాట్ ఫాంమీద, రైలుబండికోసం ఎదురుచూస్తున్నారు. అంతకి ముందురోజురాత్రి ఆ ఊరిలో, ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహబ్ అద్భుత సంగీత సభ జరిగింది. ఆ సభలో వారికి, ఇంతియాజ్ అహ్మద్జీ, సారంగీ పైన, తన వాద్యసహకారం అందించేరు. ఆ సంగీతసభలో, ఉస్తాద్జీ, “ఝంఝోటీ” రాగంలో ఒక మంచి ఠుమ్రీని ఆ రాత్రి, సర్వజన సమ్మోహనకరంగా పాడేరు. అది ఇంతియాజ్జీ మనస్సులో మెదులుతూ, వెన్నంటి వస్తూనేవుంది.

ఆశ్చర్యకరంగా, ఇంచు-మించు, ఇరవై ఏళ్ళైనా లేని ఒక సుందర నవయువకుడు, ఖాన్ సాహబ్ రాత్రి పాడిన, ఆ “ఝుంఝోటీ” రాగంలోని,”పియా బిను నహీc ఆవతుచైన్ ” ఠుమ్రీని అలవోకగా “హం” చేస్తున్నాడు; అంటే ౘక్కగా కూనిరాగం తీస్తున్నాడు; ఇంకా బాగా చెప్పాలంటే అవ్యక్త మధురంగా పాడుతున్నాడు. పక్కనేవున్న ఇంతియాజ్ చాలా శ్రద్ధగా, ఉత్సుకతతో, ఆశ్చర్యభావంతో వింటూ, అతనివైపు పరీక్షగా చూసేడు. ఆజానుబాహువు. బంగారంరంగు దేహచ్ఛాయ. ౘక్కని, కొనదేరిన ముక్కు. విశాల నేత్రాలు. బాగా ఒత్తైన, అందమైన జుట్టు.ఎక్కడా బాహ్యస్పృహలేకుండా పాడేసుకుంటున్నాడు.

ఠుమ్రీగానంలోని సులలిత ప్రయోగాలని, సున్నితమైన తాన అలంకృతులని, సూక్ష్శ స్వర ఆభూషణాలని, ఖాన్ సాహబ్ ఎంత భావభరిత శోభామయంగా తన గానంలో పొదిగి, పొందుపరిచేరో, యించుమించు అంతటి అందమైన మనోధర్మసహిత ఉపశాస్త్రీయ గాన సరణిని, ఆ యువగాయకుడు, మనోహరంగా అనుసరిస్తూ, అలవోకగా పాడేస్తున్నాడు. అతడి పాట పూర్తి అయ్యింది.

సంతోషంగా అంతా మనసుపెట్టి విన్నాక, ఇంతియాజ్ ఆ స్ఫురద్రూపియైన యువకుడి వద్దకి వెళ్ళి, “మీరు సంగీతం ఏ గురువువద్ద నేర్చుకుంటున్నారు?” అని అడిగేరు.

అయ్యా! నాకు గురువు ఎవ్వరూ లేరండి. నాకు సంగీతం ఏమీ తెలియదండి.” అని ఆ అబ్బాయి, దాపరికం లేకుండా, పాట పాడినంత అలవోకగానూ చెప్పేడు.

“ఐతే ఉస్తాద్ సాహబ్ ఠుమ్రీని అంత యథాతథంగా, ఏ విధమైన ౙంకూ-గొంకూ లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఎలా పాడగలుగుతున్నావు?” అని కుతూహలంతోను, విమర్శకదృష్టితోను ఇంతియాజ్జీ, చిరునవ్వుతో అడిగేరు.

“అబ్బే! నేను కేవలం ఖాన్ సాహెబ్ ని, జాగ్రత్తగా అనుసరించి పాడే ప్రయత్నం చేస్తున్నానండి. అంతకన్న మరేమీ లేదండి.” అన్నాడు, ఆ అబ్బాయి, అమాయకంగా!

ఇంతియాజ్ సాబ్ , ఖాన్ సాహెబ్ ఆభోగీ కానడా రాగంలో పాడిన మీర్జా గాలిబ్ గజల్ని, అడిగి పాడించుకుని, సంతోషంతో ఆ అబ్బాయిని మాటలలో అభినందించి, మనస్సులో దీవించి, స్వస్థలమైన మొరాదాబాదులోని తన స్వగృహానికి, ఆ అబ్బాయిని, తీసుకువెళ్ళేరు. అక్కడ, అతడిచేత ఇంకా చాలా, సంప్రదాయసిద్ధమైన భజనలు, జానపదగీతాలు, ఉత్తరభారతంలో యోగులు, సిద్ధులు, సాధువులు పాడుకునే తత్త్వాలు, ఇళ్ళల్లో హోలీవంటి రకరకాలపండగలకి, పెళ్ళిళ్ళవంటి వేడుకలకి పాడుకునే అనేకగీతాలని, గేయాలని పాడించుకుని విని, అతడిక చాలా గొప్ప భవిష్యత్తువుంటందని దీవించి, నాలుగు రోజులు తన యింట్లోవుంచుకుని, ఆ ఊరిలో కొందరు రసికులైన పెద్దలకి, స్థానిక సభలకి, కళాకారులకి ఆ అబ్బాయిని పరిచయంచేసి అతడిని పంపించేరు.

మొరాదాబాదులో ఆ అబ్బాయి కొంతకాలంవున్నాడు. అతడు అక్కడవున్న సమయంలో, ఆవూరి రైల్వే స్టేషన్ మాస్టర్ , ఇంగ్లండు దేశస్థుడు. ఆయన భార్య ఆ అబ్బాయికి, ఆంగ్లభాషని వ్రాయడం, ౘదవడం, మాట్లాడడం ౘక్కగా నేర్పించింది.

ఆ అబ్బాయి మరెవరో కాదు; మన ఈ వారం కథానాయకుడైన శ్రీశారదా ప్రియతనయుడు, శ్రీ కుందన్ లాల్ సైగల్ !

04—04—1904వ తేదీన, జమ్మూలో, సైగల్ , జన్మించేడు. ఆయన తల్లిపేరు కేసర్దేవి, తండ్రిపేరు అమర్ చంద్ . అతడికి తలిదండ్రులు, కుందనలాల్ అని పేరు పెట్టేరు. వారికి, కుందన్ మూడవ కొడుకు. కుందన్ కి, రాంలాల్ , హజారీలాల్ , అని ఇద్దరు అన్నగార్లు, మొహిందర్ లాల్ , అనే ఒక తమ్ముడు, ఒక చెల్లెలు వున్నారు.

తండ్రి, అమర్ చంద్ సైగల్ , జమ్మూ-కశ్మీరు రాజుగారి సంస్థానంలో తహసిల్దారుగా గౌరవప్రదమైన పదవిలో ఉద్యోగం చేస్తున్నారు. వారి కుటుంబం, ఉన్నత మధ్య తరగతిస్థాయికి చెందినది. స్థానికసమాజంలో, వారి కుటుంబం, మంచి పరువు-ప్రతిష్ఠలు కలిగినది.

ఆ రోజులలో, నాటకాలు, సినిమాలు, సంగీతం, నాట్యం, పాటలు మొదలైనవన్నీ గౌరవహీనమైనవిగా పరిగణించబడేవి. అందువల్ల పాటలు నేర్చుకోవడం, పాడడం కూడా నిషిద్ధం.

కాని, కుందన్ తల్లి కేసర్బాయి భజనలు, లోకసంగీతము, తత్త్వాలు మొదలైనవి పాడడంలో గొప్ప కళాకారిణి. ఆమె పోలిక మిగిలిన పిల్లలెవరికీ రాలేదుకాని, కుందన్ కి, పుట్టుకతోనే, రక్తమాంసాలలోనుంచి, హృదయంలోను,బుద్ధిలోను, తల్లిగారి పోలికలు, లక్షణాలు, అభిరుచులు అన్నీ, అణువణువునా సంక్రమించేయి. ఇంట్లో, తల్లినుంచి, బయట సాధువులు, సిద్ధులు, ఫకీర్లు, ఔలియాలు, భిక్షువులు మొదలైనవారందరినుంచి, వీరు-వారు అనే భేదంలేకుండా, అందరినుంచీ నేర్చుకుని, తండ్రికి తెలియకుండా, రహస్యంగా, తల్లికి పాడి వినిపించేవాడు. తండ్రికి తెలిస్తే తిట్టడం, కొట్టడం, శిక్షలు విధించడం చేసేవాడు. అయినా, వాటిని కుందన్ కాని, అతడి తల్లికాని పట్టించుకునేవారుకాదు. ఒకసారి, కొడుకు చెప్పినా వినకుండా చెడిపోతున్నాడని బాధపడి, తండ్రి, కుందన్ కి, వంటింట్లో వంటచేసే శిక్షవిధించేడు. తరుచు ఈ శిక్షకి గురైన కుందన్ ,గొప్ప గాయకుడవ్వడమేకాక, పాకశాస్త్ర ప్రావీణ్యాన్నికూడా సంపాదించేడు.

ఐతే, తండ్రి సనాతనధర్మ సంప్రదాయాలని తాను అనుసరింౘడమేకాక, తన కుటుంబాన్నికూడా భక్తి, ప్రపత్తులతో ఆచరింపజేసేవాడు. ప్రతి సంవత్సరం జరిగే “రామలీలా” ఉత్సవాలలో, పదేళ్ళ వయస్సునుంచి, తండ్రి గారి ప్రోత్సాహంతో, బాలకుందనుడు, సీతాదేవి పాత్రని ధరించి, అధ్భుతమైన తన గానంతో ప్రేక్షకులని, పరవశింపజేసేవాడు. 12 సంవత్సరాల వయస్సులో, జమ్మూ-కాశ్మీరు మహారాజుగారి సంస్థానంలో, ప్రభువు ప్రతాప్ సింగ్ జీ సమక్షంలో, మహాసాధ్వి మీరాబాయి మధురాతిమధురమైన భక్తిమయభజనలని, కుందనలాల్ అత్యద్భుతంగా పాడేడు. కొడుకు కుందనుడినేకాక, తండ్రి అమరచందునికూడా మహారాజు గౌరవించేరు.

కేసర్దేవిగారు, కొడుకు కుందన్ , కలిసి దేవాలయాలలోను, సత్సంగాలలోను భజనలని, కీర్తనలని శ్రవణపేయంగా గానంచేసేవారు.

సంగీతమయమైన సైగల్జీ మనస్సులో, ౘదువుకి తగినంత స్థానంలేకపోయింది. అందువల్ల ౘదువుకి స్వస్తి చెప్పేడు, సైగల్ ! అమర్ చంద్ ఉద్యోగవిరమణానంతరం, తన స్వస్థలమైన జాలంథర్ కి వచ్చేసి, తన స్వగృహంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.

సైగల్ యుక్తవయస్సు వచ్చేసరికి, తన సంగీతాభ్యాసం నిరంతరాయంగా, నిరవధిక ఉత్సాహంతో నిర్వహించుకుంటూ, తన నిత్యజీవితం గడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి, ఉద్యోగంకోసం విశాలప్రపంచంలోకి అడుగుపెట్టేడు. ఆయన ఏ విధమైన దినచర్యపుస్తకాన్నీ వ్రాయలేదు. అందువల్ల, ఆయన పరిచయస్థులు, సన్నిహితులు, బంధుమిత్రులు మొదలైన అనేకవ్యక్తుల లేక సంస్థలనుంచి సేకరించిన సమాచారం ఆధారంగా శ్రీ రాఘవమీనన్ , శ్రీ ప్రాణ్ నెవిలే మొదలైన సైగల్ జీవిత చరిత్ర కారుల రచనలనుంచి, పత్రికలలోని ఇతర సంభాషణలు వంటి రచనలనుంచి ఆయన జీవితానికి చెందిన, కొన్నిముఖ్యవిషయాలు తెలుసుకోగలం. ఐతే, అనేక ఆధారాల నుంచి సేకరింౘబడిన విషయాలుకనక అనేక సందర్భాలలో పరస్పరవిరుద్ధమైన సంఘటనలు లెక్కకి మిక్కుటంగా వుంటాయి.

శ్రీ ప్రాణ్ నెవిలే రచించిన, “K.L.SAIGAL : The Definitive Biography” అనే పుస్తకం, “పెంగ్విన్ బుక్స్ ” వారిచే ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని, నాకు ప్రాణప్రియమైన, మా కజిన్ , శ్రీ బి. ప్రభాకర్ & శ్రీమతి గౌరీ ప్రభాకర్ బహూకరించేరు. ఇదే కాదు, మన్నాడే, నౌషద్ పుస్తకాలని, చాలా-చాలా న్యూస్ పేపరు కటింగ్సుని, అన్నింటికన్న ముఖ్యంగా, టి.టి.డి. వారుప్రచురించిన, టీకా-తాత్పర్య-లఘువ్యాఖ్యాసమేతమైన “కవిత్రయ-మహాభారతం” పవిత్ర గ్రంథాన్ని ఇలాగ అనేక పుస్తకాలని, కంప్యూటర్ని(డెస్క్ టాప్ ), డి.వి.డి. మొదలైన వాటిని ఎన్నో నాకు ఈ దంపతి బహూకరించేరు. ఇవన్నీ నేను నా జీవితంలో మరువలేనివి.

సైగల్ సాబ్ తరచు ఉద్యోగాలు మారుతూ, రైల్వేశాఖలో, టైంకీపరుగా కొంతకాలం పనిచేసేరు. ఆ తరువాత, “రెమింగ్టన్ రేండ్ “వారి టైపుమెషిన్ల కంపెనీలో సేల్సుమన్గా కొంతకాలం పనిచేసేరు.

ఉద్యోగంవల్ల ఆయన, వారి ఆఫీసుయొక్క ప్రధాన కార్యాలయంవున్న కలకత్తా వెళ్ళ వలసివచ్చింది. ఆ రోజులలో, కలకత్తా మహానగరం భారతదేశసాంస్కృతిక రాజధానిగావుండేది. వివిధరంగాలలో, గొప్ప-గొప్ప కళాకారులు అక్కడేవుండేవారు. అనేక ప్రఖ్యాతనాటక రంగాలు, సినీమా స్టూడియోలు, నటీ-నటులు, గేయరచయితలు, సంగీతదర్శకులు, గాయకులు మొదలైనవారెందరో అక్కడేవుండేవారు.

సైగల్జీ, బి.ఎన్ . సర్కార్ ని ఎలాకలిసేరో వర్ణించే కథనాలు, కనీసం మూడు లోకంలో ప్రచారంలోవున్నాయి. ఎలాగైతేనేం, సైగల్జీ, సర్కారుగారి “న్యూ థియేటర్స్ ” స్టూడియోలో, పాటలుపాడే కథానాయకుడిగా ఉద్యోగంలో చేరేడు. ఇది కేవలం దైవ సంకల్పంవల్ల మాత్రమే జరిగింది. ఆ తరవాత జరిగినదంతా భారతీయ చలనచిత్ర చరిత్రలో అవిభాజ్య మహా కాంతివంత ప్రతిభావంతుడి కథగా మిగిలిపోయింది. వారి సినీజీవితం, వారికి 28 సంవత్సరాలుండగా ప్రారంభమై, 42 సంవత్సరాల వయస్సులో, అంటే 14 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. కాని ఆ 14 సంవత్సరాల చరిత్ర భారతదేశ కళాసంస్కృతుల వారసత్వం కథలో ధగద్ధగాయమానమైన అద్భుత ఘట్టాలలో ఒకటిగా శాశ్వతంగా నిలిచిపోయింది. వారి ఆ 14 సంవత్సరాల జీవితం కొంతకాలం కొలకొత్తాలో జరిగితే, మిగిలిన భాగం ముంబైలో జరిగింది.

ఆయన మొత్తం, 37 చిత్రాలలో నటించి, 110 పాటలు పాడేరు. చలనచిత్రేతర గీతాలు కొన్ని పాడేరు. హిందీ, బెంగాలీ, ఉర్దూ, పంజాబీ, పార్సీ, తమిళం భాషలలో పాటలు పాడేరు.

సైగల్జీభార్యపేరు శ్రీమతి ఆశారాణీసైగల్ , పెద్దకుమార్తె పేరు నీనా సైగల్ , చిన్నకుమార్తెపేరు బీణా సైగల్ , కొడుకు పేరు మదన్ మోహన్ సైగల్ . మద్యపానప్రభావం వలన ఆయన తన 42 వ ఏట, 18—01—1947(అంటే 42 సంవత్సరాల 9 నెలల వయస్సులో), కాలేయవ్యాధి(Cirrhosis of the liver)తో పరమపదించేరు. చలనచిత్రరంగంలో ఆయన ఎప్పటికీ మకుటంలేని మహారాజు.

ఆయన పాటలలో కొన్నింటిని, నేడు “కదంబకం”లో తెలుసుకుందాం!

ఆ అపూర్వ శారదాతనయుడికి, నతమస్తకులమై, శ్రద్ధాంజలి ఘటిద్దాం!

స్వస్తి ||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    గాన గంధర్వుడు, హిందీ చలనచిత్ర గాయక సమ్రాట్ స్వర్గీయ
    కె.ఎల్. సైగల్ గురించి అనేక తావుల (sources) నుంచి ఎన్నో
    వివరాలు సేకరించి, ఆయన జీవిత సంగ్రహాన్ని సుమనోహరమైన
    భాషలో, రమణీయ పదచిత్రం గీసినట్టుగా కళ్ళముందు
    ఆవిష్కరించావు. ఆయన గాయకుడిగా రూపుదిద్దుకున్న ఆనాటి
    సంగతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
    కేవలం ఆయన సినిమా జీవిత విశేషాలు మాత్రమే కాక, తల్లిదండ్రులు,
    అన్నదమ్ముల వివరాలూ, భార్యాబిడ్డల సంగతులూ కూడా తెలిశాయి.
    సినిమా పాటలు పాడే విధానంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి,
    తదనంతర గాయకులకి మార్గనిర్దేశనం చేసిన మహా గాయకుడు సైగల్
    జీవిత విశేషాలు ఇంత హృద్యంగా అందించినందుకు ధన్యవాదాలు.

  2. Devi says:

    What can I say and write any comment or views on Saigal ,the unparalleled king of music in Bollywood whose influence is forever,ever and ever as long as music exists in this world. I can only pay a humble tribute to the legendary singer with all my heart and soul . We are very thankful to you again and again for giving us these precious articles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *