సాహిత్యము-సౌహిత్యము – 33 : ఇంద్ర పదద్వయంబు కవిసెన్ , కట్టా! అయఃశృంఖలల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
23—12—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~33.

ఈ వారమూ శ్రీ కనుమలూరి వెంకట శివయ్యకవివరుల సమస్యాపూరణమే పరికిద్దాము!

“ఇంద్ర పదద్వయంబు కవిసెన్ , కట్టా!
అయఃశృంఖలల్ “||

ఇదొక అరుదైన సమస్య. ఇది పద్యపాదం లోని భాగం మాత్రమే! ఈ పాదానికి ముందు ఒక “సగణం” (IIU) చేర్చి, ఆ సగణంయొక్క మొదటి అక్షరం, “కట్టా!” అన్న పదంలోని “క”తో యతిమైత్రి కలిసే విధంగా కూర్పు చేసుకుని, ఆ మీదట పద్యపూరణం చెయ్యాలి. అప్పుడు ఆ పద్యం మత్తేభ వృత్త ఔతుంది. మొదటి మూడు అక్షరాలు గురువులు(UUU)గా, అంటే మగణం చేసి కూడా పద్యంచెప్పవచ్చు. అప్పుడది శార్దూలవిక్రీడిత వృత్తం ఔతుంది. ఐతే కవిగారు ఇక్కడ మత్తేభాన్నే స్వీకరించేరు. దానికి ఔచిత్యంవుంది. వారు ఇంద్రపాత్రధారిగా రంగస్థలంపై వున్నప్పుడు ఈ సమస్య యివ్వబడింది. ఇక్కడ ఇంద్రదురవస్థ ప్రస్తావనని తొలగ చెయ్యడానికి, ఇంద్ర వాహనం ఐరావతం అనే మత్తేభం కనక ఆ ఛందస్సుని స్వీకరించి, ఈ మహాపద్యాన్ని, కవిరాజేంద్రుడు, శ్రీనాథుని దయనీయ జీవిత చరమాంక చరిత్రని వర్ణిస్తూ, అద్భుతంగా ఆశువుగా రచించేరు.

ఆ పద్యం యిది:—

“స్తవనీయమ్మగు సత్కవిత్వ నిధియై,
శాస్త్రార్థ సంవేదియై,

అవనిన్ కల్గిన భోగభాగ్య పరి
తృప్తానందుడై, పొంగి, క్రూ

ర విధిన్ , హాలికుడై, విషాదములు
మీరన్ , క్రుంగు శ్రీనాథ సత్ ,

కవిరాజేంద్ర పద ద్వయంబు కవిసెన్ ,
కట్టా! అయఃశృంఖలల్ ” ||

పద్యభావం యిది:—

“శ్రీనాథకవిసార్వభౌముడు శాశ్వతమైన గొప్ప కవిత్వనిధి. సకలశాస్త్ర పారంగతుడు. ఇహలోకసంబంధమైన భోగభాగ్యాలన్నీ పూర్తిగా అనుభవించి లోకంలో ఘనయశస్సు సాధించేడు. అటువంటి మహానుభావుడు, క్రూరమైన విధి వక్రింౘడంచేత, వ్యవసాయం చెయ్యవలసివచ్చింది. అంతటితో ఆగలేదు. నానావిషాదాలూ పెచ్చు పెరిగేయి. చివరకి, ఏ పాదాలకి గండపెండేరాలు అలంకరింౘబడ్డాయో అవే పాదాలకి వాటిబదులుగా ఇనప సంకెళ్ళు వెయ్యబడ్డాయి-అయ్యో! దుష్టవిధీ! ఎంత దురవస్థ వచ్చి పడిందో కదా!”

అయః శృంఖలల్ = ఇనప సంకెళ్ళు,
కవియు=వచ్చి మీదపడు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి. యస్ says:

    దీనారటంకాల తీర్థమాడిన శ్రీనాథుడి జీవితగాథ లోని ఆఖరి దశని
    వర్ణిస్తూ వెంకట శివయ్య గారు ఆశువుగా చెప్పిన ఈ పద్యం,
    కవిరాజు కంఠంబు…….అంటూ మొదలై
    “ఆంధ్రనైషధ కర్త అంఘ్రి యుగ్మంబున
    నొదిగియుండెను కదా నిగళ యుగము.” అని సాగే పద్యంతో సమాన
    స్థాయిలో సాగింది. చాలా గొప్పగా చెప్పేరు. ముందు ఈ పద్యం తెలిసుంటే
    ఆకెళ్ళ గారు రాసిన శ్రీనాథుడు నాటకంలో పెట్టి ఉండేవాళ్ళం. మంచి
    పద్యం చక్కని వివరణతో అందిచావు.

  2. Kbj srinivas says:

    సమస్యా పురణం ఎంత బాగుందో శ్రీనాధుని అవస్థ అంత జాలిని తెప్పించింది బావ garu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *