శారదా సంతతి — 22 : ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్
శ్రీశారదా దయా దీప్తిః
10—12—2017; ఆదిత్యవారము.
శారదా సంతతి—22. ~ ఠుమ్రీ గానంలో మకుటం లేని మహారాజు— ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్
ఉత్తర భారత సంగీత సంప్రదాయాలలో ప్రౌఢ శాస్త్రీయ సంగీతం, ఉప లేక లలిత శాస్త్రీయ సంగీతం అని రెండు విభాగాల విభజనవుంది. ఈ వారం, ఉపశాస్త్రీయ సంగీతవిభాగంలో సుప్రసిద్ధమైన “ఠుమ్రీ” గానసంప్రదాయరీతిలో మకుటంలేని మహారాజైన మజుద్దీన్ ఖాన్ సాహబ్ గురించి పరిచయం చేసుకుందాం!
మజుద్దీన్ ఖాన్ , 1878 వ సంవత్సరంలో, లాహోర్ లో, జన్మించేరు. వారి తండ్రి, గులాం హసన్ , సితార్ వాద్య సంగీతంలో నిపుణుడు. లాహోర్లో హసన్జీకి, జీవితం గడపడం కష్టమైపోయింది. వారికి బనారస్ లో, కాశీ మహారాజు ఆస్థానంలో ఉద్యోగిగావున్న రోషన్ ఆలీ మంచి మిత్రుడు. ఆయన సహాయంతో, హసన్జీ, కాశీ సంస్థానంలో, రాజదర్బారు సితారు వాదకునిగా కుదురుకున్నాడు. ఆ సమయానికి, మజుద్దీన్ కి, 15—16 సంవత్సరాల వయస్సుంటుంది. అప్పటికే మజుద్దీన్ కి మహామధురమైన, ౘక్కగా ఎలాకావాలంటే అలా తిరిగే, సహజ సుస్వర సహిత మృదుగళం దైవదత్తంగా లభించింది. హసన్జీ ఇల్లు, బనారసులోని వేశ్యాగృహవాటికలోవుండేది. ఈ వేశ్యల గృహాలనుంచి, మజుద్దీన్ కి, మహామధురగీతాలు, రాత్రింబవళ్ళు వినిపిస్తూండేవి. అప్పటికే అనేక లలిత గీతాలు బాగా పాడడం అలవాటున్న మజుద్దీన్ , వేశ్యాగృహాలకివెళ్ళి తన పాటలు వినిపించడమేకాక, వేశ్యలు పాడే పాటలని ఒకటి-రెండుసార్లు వినగానే, తాను విన్న పాటలని, విన్నవి విన్నట్టుగానే కాక, అంతకంటే అతిమధురంగాను, సుకుమారంగాను, సులలితంగాను, గీత-సంగీత భావ పూర్ణంగాను, రసస్ఫోరకంగాను, అనితర సాధ్య స్వర-లయ గతుల తతులలోను, శ్రోతలందరినీ మంత్రముగ్ధులనిచేసే ప్రతిభతోను పాడి వినిపించేవాడట! దానితో వేశ్యలందరూ మజుద్దీన్ కి, తమవద్దవున్న “ఠుమ్రీ” నిధి-నిక్షేపాలని సమర్పించుకుని, వారినుంచి ఆ ఠుమ్రీగీతాలనే సున్నితమైన సూక్ష్మ స్వర-లయల అపూర్వ విన్యాసం నిండిన వారి గానం ద్వారా, అవే గీతాలని మరింత శోభాయమానంగా పాడడం నేర్చుకునేవారట. నవయౌవనంలోకి అడుగు పెడుతున్న మజుద్దీన్ కి, ఆ వయస్సులోనే మద్యపానం, స్త్రీవ్యసనం అలవాటైపోయేయి.
ఆ రోజులలో, బనారసువంటి పట్టణాలలోను, మహానగరాల లోను ధనవంతులు, స్థితిపరులైన కళాకారులు వారి-వారి గృహాలలో ప్రత్యేక ఆహూతులైన కళాకారులు, సంగీత రసజ్ఞులు ఐనవారికోసం “బైఠక్ “, లేక “మెహఫిల్ ” లేక “స్వారి“(soiree) అని పిలవబడే సాయంకాలపు “సంగీత గోష్ఠి” గృహసభలు జరిగేవి. ఒకసారి బనారసులో మంచి స్థితిగల ఠుమ్రీ గాన కళాకారుడు, పీరా సాహెబ్ , తన యింట్లో ఒక గోష్ఠి ఏర్పాటు చేసేడు. ఆ గోష్ఠిలో ఉద్దండపండితులెందరో పాల్గొన్నారు. గ్వాలియరు ఘరానా గాయకుడు, ఉస్తాద్ రహమత్ ఖాన్ , ఆగ్రా ఘరానా ఉస్తాద్ కల్లన్ ఖాన్ , సారంగియా ఉస్తాద్ ఛన్ను ఖాన్ , సారంగీ నవాజ్ ఉస్తాద్ బండుఖాన్ , బడీమైనా, విద్యాధరీబాయి మొదలైన మహామహులందరూ సభని అలంకరించేరు. ఉస్తాద్ గులాంహసన్ , తన కొడుకు మజుద్దీన్ని సభకి పరిచయం చెయ్యడంకోసం తీసుకువెళ్ళేడు. పెద్దల సంగీతం ఐపోయినతరవాత, చిట్టచివర మజుద్దీను పేరు సభలోవిని అందరూ ఆశ్చర్యపడ్డారు. లేత మొహంతో, చిన్నవాడు వేదికని అలంకరించి, “సోహినీ“రాగంలో, “ఫుల్వా గినత్ డర్ డర్ ” అనే ఒక రమణియమైన ‘బందిష్ ‘, అంటే, కృతి పాడేడు. అందరూ, అవాక్కై, ఆశ్చర్యచకితులై, తాదాత్మ్యంతో విన్నారు. సభని నిర్వహించిన గృహయజమాని, పీరాసాహెబ్ , ఆ సభలో మజుద్దీన్ని, “ఉస్తాద్ ” గా ప్రకటించేడు. “ఉస్తాద్ ” అనే పదం మన “పండిత్ ” అనే పదానికి సమానార్థకం. ధ్రుపద్ /ఖయాల్ గాయకులకి మాత్రమే పరిమితమైన గౌరవ వాచకం. దానిని కేవలం ఠుమ్రీ పాడేవారి పేరుకి చేర్చరు. ఐతే, మజుద్దీను ఖయాల్ సంగీతాన్నికూడా పాడేవాడు. కాని, ఏ ఖయాల్ సంప్రదాయంలోను, ఏగురువువద్ద సంప్రదాయబద్ధమైన శిక్షణని పొందలేదు. ఠుమ్రీ సంగీతంలోకూడా బాగా పేరు వచ్చినతరవాత, భైయాసాహెబ్ గణ్పత్రావ్ వద్ద, శిష్యరికం చేసేడు.
ఒకసారి కొల్హాపూర్ లో ఒక సంగీతగోష్ఠి జరిగింది. ప్రముఖ పటియాలా ఘరానా గాయకుడు, ఉస్తాద్ కాలేఖాన్ సాహబ్ పాడుతున్నారు. మాల్కౌసు రాగగానం ఆ సాయంత్రం అత్యద్భుతంగా సాగిపోతోంది. తానప్రవాహం ఖాన్సాహబ్ కంఠంలోంచి రసధునిగా బయల్వెడలుతోంది. సదస్యులు సంమోహితులై వింటున్నారు. ఉన్నట్టుండి ఉస్తాదుగారు, పాట ఆపి, సభలోవున్న యువమజుద్దీన్ తో యిలా అన్నారు.
“ఓ మజుద్దీన్ ఖాన్ ! ఇదంతా సయ్యా-గుయ్యా (ౘవకబారుసంగతుల సరుకుతోనిండిన) పాట కాదు. ఇటువంటి తానప్రయోగం చెయ్యాలంటే గుండె నోటిలోకి వచ్చేస్తుంది(శుద్ధ శాస్త్రీయ సంగీత స్వర ప్రయోగ కౌశలంతో మాత్రమే సాధ్యమయ్యే గానం “ఆషామాషీ” వ్యవహారం కాదు, నాయనా!- – – అని హెచ్చరింౘడం అన్నమాట!).”
సభాముఖంగా తాను తన పంచ ప్రాణాలూ పెట్టి పాడే తన ఠుమ్రీ గానకళ యొక్క గౌరవానికి, తన వైయక్తిక గానకళావైభవానికి ఆ మాటలు తుపాకీ తూటాలై సూటిగా మజుద్దీన్ ఖాన్సు న్నిత మనస్సుని గాయపరచి, సభలో కూర్చోలేకుండా చేసేయి. మజుద్దీన్ (మౌజుద్దీన్ అని కూడా కొందరంటారు), బయటకివెళ్ళిపోయి, సమీపంగావున్న ఒకగదిలో విశ్రాంతి తీసుకుంటున్న గురువుగారు, భైయాసాహబ్జీ దగ్గరకివెళ్ళిపోయి విచారవదనంతో కూర్చున్నాడు. గురువుగారికి విషయం తెలిసింది. వెంటనేలేచి, శిష్యుణ్ణి తనతోబాటు వెంటబెట్టుకుని, మెహఫిల్ ప్రాంగణంలోకి అడుగుపెట్టేరు. కాలేఖాన్జీ కచ్చేరి ముగియగానే, భైయాసాహబ్జీ, శిష్యుడితో వేదికని అలంకరించి, హార్మోనియం స్వయంగా శ్రుతి సరిచేసి, వాయిస్తూ, మౌజుద్దీన్ని, భైరవిరాగంలోని ఠుమ్రీ, “రతియా( కహా( గవా(యే – – – ” అనే పాటని పాడమని చెప్పేరు. అంతే! మౌజుద్దీను తన మనోహర గళసౌందర్యంతో ఆ మధురగీతాన్ని, ఆ మనోజ్ఞరాగంతో, మనోరంజక తాళ గతి వైవిధ్యంలో పరమవిరహభావభరితంగా పాడడం ప్రారంభించేడు. పాట తాళ ఆవృత్తి లోని ప్రతి “సం” దగ్గరకి, పాటలోని పదం, దాని విరుపు మొదలైనవి ముగ్ధులై వింటున్న శ్రోతల గుండెలని పిండేస్తున్నాయి. (“సం” అంటే ‘సమానం’, అని అర్థం. తాళ ఆవృత్తిలో, తబలా కళాకారుడు, తాను వాయించే తాళంయొక్క ప్రథమ ప్రహారం లేక మొదటి దెబ్బని “సం” అంటారు. ఆ ప్రహారం లేక దెబ్బని తబలిస్టు, ప్రత్యేకంగా ఒక గట్టి దెబ్బతో సూచిస్తాడు. అలాగ ఒక ఆవృత్తి పూర్తైన ప్రతిసారి, ఆ “సం” ప్రహారాన్ని గట్టిగా కొడతూవుంటాడు. ఈ “సం”ని, “సామ్ ” అని పిలవడంకూడా కద్దు.). ఆ సభలో అట్రౌలీ-జయపూర్ ఘరానాకి బ్రహ్మదేవుడిగా పరిగణింపబడే “ఖాన్ సాహెబ్ ఉస్తాద్అల్లాదియా ఖాన్ సాహెబ్ ” మొదటి వరసలో ప్రముఖ స్థానంలో కూర్చుని వింటున్నారు. ఆయన ఆ విషాదరసమయగాన గాఢతకి తట్టుకోలేక, యిలా అన్నారు:
“మజుద్దీన్ ! ఇంక చాలు! నీ గానంలోని విషాదరసతీవ్రత నా గుండెని ౙల్లడలో వేసి ౙల్లించేస్తోంది. నేను భరించలేకపోతున్నాను”. అక్కడ మెహఫిల్లో సమావేశమైన కళాకారులు, రసికశేఖరులు అందరూ మౌజుద్దీన్ని అవిరళ కరతాళధ్వనులతో చాలాసేపు అభినందించేరు. ఉస్తాద్ కాలేఖాన్ సాహబ్ కూడా మనస్ఫూర్తిగా అభినందించి, తాను మొదట్లో అలా మాట్లాడినందుకు తన పరితాపం తెలియజేసేరు.
మౌజుద్దీన్ ఖాన్ జన్మసిద్ధమైన కళాకారుడు. వారికి గురుకులక్లిష్టమైన సంగీతవిద్యాభ్యాసంలేదు. కాని భైయాసాహబ్ గణ్పత్రావ్జీ నుంచి లభించిన సులువులు-మెలకువలు, వారి అపారశిష్యవాత్సల్యమూ, మౌజుద్దీన్ సంగీతకళాజీవితంలో అమోఘపాత్ర పోషించేయి.
వారు వివిధవ్యసనాల కారణంగా 48 ఏళ్ళ మధ్యవయస్సులోనే దివంగతులయ్యేరు.వారు అతిసామాన్యకుటుంబంలో పుట్టినా, విశ్వవిఖ్యాత ఠుమ్రీ గానకళాకారుడిగా మరణించేరు.
విదుషీమణులు, బడీమోతీబాయి, గిరిజాశంకర చక్రవర్తి వంటి గొప్ప ప్రత్యక్ష శిష్యపరంపరని ఇక్కడ వదిలి వెళ్ళేరు. వారిని గురించిన మరికొన్ని విశేషాలని, ఈ వారం “కదంబకం”లో వివరించుకుందాం!
స్వస్తి |
భగవద్దత్తమైన సుమధుర గళంతో ఠుమ్రీ గానానికి జీవం పోసిన
ఉస్తాద్ మజుద్దీన్ ఖాన్ జీవితవిశేషాలు చదువుతోంటే, అనేక
మలుపులతో నిండిన ఒక మంచి నవల చదివిన భావన కలిగింది.
అంత ఆసక్తికరంగానూ రాశావు.
అద్భుత కళాభినివేశంతో, తమ కాలంలోఒక వెలుగు వెలిగి,
తదనంతరకాలంలో మరుగున పడిపోయిన ఇలాంటి మహాకళాకారులని
ఈతరం వాళ్ళకి పరిచయం చెయ్యాలనే నీ ప్రయత్నం మెచ్చుకోదగ్గది.
కారణమేదైనా, అంతటి ప్రతిభావంతుడైన కళాకారుడు అలా
అకాలమరణం చెందడం సంగీతప్రపంచానికి తీరని లోటు.
Ustad Majuddin’s biography is really heart touching . A great artist born with a natural talent of excellent skill in singing Thumris , the most adored and melodious style of Hindustani Music, His vitality in mesmerizing the audience,even the legends like Alladiya khan makes one irresistible to listen to his God gifted voice. I searched the You tube desperately but couldn’t find His Thumris. This week’s Mehfil in our blog is truly amazing and beautiful because you made it more musical by giving us one of the rarest icons of Hindustani music world.