సాహిత్యము-సౌహిత్యము – 23 : గ్రహములు రెండె మానవుని కష్ట సుఖమ్ముల కెల్ల హేతువుల్

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
14—10—2017; శనివారము.

సాహిత్యము—సౌహిత్యము~23.

ఈ సారి సమస్యాపూరణము చాలా ఉదాత్తస్థాయిలోను, ఉన్నత సందేశ దాయకంగానువుంది. సమస్య సామాన్యమైనదే ఐనా, అసామాన్య భావగరిమతో పూరణం చేస్తే అటువంటి సాధారణసమస్యకూడా అసాధారణ పూర్ణభావవిలసితమైన పద్యంలో భాగమైపోయినందున, బంగారంలో కలిసిపోయిన రాగికి లాగ ఉత్తమ సువర్ణ ఆభరణమై కంఠాలంకారమై హారంగా దేవుడి మెడలో విలసిల్లే గౌరవం పొందవచ్చు, లేకపోతే శీర్షాగ్రాన కిరీటమై పూజ్యతకి నోచుకోవచ్చు. ఇది అటువంటి ఉత్కృష్ట సమస్యాపూరణం.

దీనిని ఇంతకుముందు ఒకసారి మనం ఈ శీర్షికలోనే 20-వ భాగంలో పరిచయం చేసుకున్న “అన్నను భర్తగా గొనిన అన్నుల మిన్న అదృష్ట రాశియే” సమస్యను పూరించిన మహనీయకవి శ్రీ పి.యస్ .ఆర్ . ఆంజనేయప్రసాద్ వర్యలు. ఇప్పుడు సమస్యని చూద్దాం:

గ్రహములు రెండె మానవుని కష్ట సుఖమ్ముల కెల్ల హేతువుల్ ” ||

ఇంక సమస్యాపూరణం చూద్దాం:—

ఇహపర సాధనమ్ములయి ఈశ్వరి
మాయ ఎరుంగగా నవ
గ్రహములె జీవి జీవికకు కారణమంచు
తలంపబోను నా
తహతహలోని స్వార్థమున దాగిన,
మూగిన ద్వేష రాగముల్
గ్రహములు రెండె మానవుని కష్ట
సుఖమ్ముల కెల్ల హేతువుల్ ” ||

ఆత్మాశ్రయంగా చెప్పిన పరమపుణ్య పరాయణతతో సంపూర్ణ సరళ శైలిలో సర్వమానవులకి అనుదినము ఆచరణ యోగ్యమైన ఉపదేశ గర్భితమైన సమస్యా పూరణం యిది.

పద్యంలోని మాటలు సులభమైనవి. అన్వయం సరళమైనది. శైలి మనోజ్ఞమైనది. బోధ ఎంత ఉదాత్తమైదో పైన పరికించాం! ఐనా పద్యభావం మన సంప్రదాయాన్ని అనుసరించి చెప్పుకుందాం:—

“సృష్టికర్త్రి పరమేశ్వరి మాయలో భాగం గా ఇహ-పరాలు సాధింౘడానికి మనిషి జీవనానికి నవగ్రహాలే కారణమని నేను అనుకోను. నేను లోకవ్యవహారాలు నిర్వహించేటప్పుడు నేను పడే తహతహలోని నా స్వార్థపరత్వంలో దాగివుండి, ఆయా అనుకూల సందర్భాలలో బయటపడి నా వస్తు, విషయ సేకరణలో ముసురుతున్న నా రాగ-ద్వేషాలు అనే రెండు గ్రహాలే మనిషినైన నా కష్ట-సుఖాలకి మూల కారణాలు”.

ఎంత మహనీయ భావనో, ఎంత సులభ సందేశమో రసికవరులైన మన సత్సంగసభ్యులు గ్రహింౘగలరు. అందుకే పరమ పావన భక్తాగ్రేసరుడైన శ్రీ త్యాగయ్యగారు

గ్రహబలమేమి శ్రీరామానుగ్రహ బలమే బలము

అని మనందరికి మహోపదేశంచేసేరు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    సమస్యా పూరణం సాధారణంగా చమత్కారపూరితంగా ఉంటుంది. ఇవ్వబడ్డ సమస్యలూ అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఎందువల్లనంటే, శ్రోతలని రంజింపచేయడం ముఖ్యద్దేశం కనక.ఈ సమస్య కూడా కావాలంటే అలా చేయగలిగే అవకాశమున్నా, కవి ఉదాత్త భావం నింపి పూరణ చేసేరు. వారికీ, పరిచయం చేసినవారికీ జేజేలు.

  2. కిరణ్ సుందర్ బాలాంత్రపు says:

    Very nice samasyaa puuraNam.

    నీ గుట్టు వేచె నీకై
    రాగద్వేషముల అంకురమ్మున కవలన్
    యోగాయోగముల కవల
    వాగర్థమ్ములకు నివల బాలాంత్రపు రే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *