శారదా సంతతి — 11 : శ్రీ కాసుల పురుషోత్తమకవి
శ్రీశారదా కారుణ్య కామధేనువు :—
24—09—2017; ఆదిత్యవారము.
శారదా సంతతి — 11.
అచ్యుతవరలబ్ధకవితా విదగ్ధుడు — ఆంధ్రనాయకశతక కర్త శ్రీ కాసుల పురుషోత్తమకవివరుడు.
ఈ శారదాతనయుడు ఆంధ్రశతక సారస్వతచరిత్రలోనే శాశ్వత నిరుపమ స్థానాన్ని సంపాదించుకున్న అకళంక, అపూర్వ పుణ్యమయ గ్రంథరచయిత. వీరి రచనలగురించి విశ్వనాథ సత్యనారాయణగారు “సాహిత్య సురభి” అనే తమ గ్రంథంలో ఇలా అన్నారు:
“– – -కాసుల పురుషోత్తమకవి- – -శతకములు మాత్రమే వ్రాసెను. అతని కవిత్వము కావ్యదోషము లెరుంగనిది“.
మరొక సందర్భంలో ఒక సభలో మాట్లాడుతూ విశ్వనాథవారే ప్రస్తావవశంగా ఇలాగ అన్నారట:
“తెలుగులో భాగవతాన్ని పోతనగారు రచించి ఉండకపోతే, పురుషోత్తమకవి తప్పక వ్రాసివుండేవాడు“.
అంటే పురుషోత్తమకవి పోతనగారి స్థాయికిచెందిన సహజకవి,పండితుడు, మహాభక్తుడు అన్నమాట.కృష్ణా జిల్లాలోని దివిసీమకిచెందిన పెదప్రోలు పురుషోత్తమకవిగారి స్వస్థలము. అప్పలరాజు-రమణమ్మ దంపతుల కుమారుడు పురుషోత్తమకవి. చిన్నతనంలో వారి పేరు ‘పుల్లంరాజు’ట! కాని పురుషోత్తమ నామధేయమే ఆయనకి స్థిరపడింది. వారు “వంది”(తెలుగులో భట్రాజులు) కులానికి చెందినవారు. “వందంతే ఇతి వందినః” అంటే స్తోత్రముచేసేవారని అర్థం! “వది” ధాతువు-root-నుంచి ‘వంది’ అనేమాట వచ్చింది. ఈ ధాతువుకి “అభివాదనమూ,స్తుతి చేయుట” అని అర్థం. ఈ వందిపరంపర గురించి కాళిదాసమహాకవి తన రఘు వంశ మహాకావ్యం(IV—6.) లో ఇలాగ తెలియచేసేరు:
“పరికల్పిత సాన్నిధ్యా
కాలే కాలే చ వందిషు |
స్తుత్యం స్తుతిభిః అర్థ్యాభిః
ఉపతస్థే సరస్వతీ” ||
“ఆయా సందర్భానుసారంగా సరస్వతీ దేవి వందిలకి సన్నిహితంగావుంటూ, వారు స్తోత్రంచెయ్యవలసిన విషయానికి అనుగుణమైన అర్థ-శబ్దాలని వారియందు కలిగింప చేస్తూంటుంది”.
దీనివలన మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే వంది-మాగధులు ప్రత్యేక వాగ్ధేవతానుగ్రహం-అంటే పలుకులవెలది ప్రసన్నతని సహజంగానే కలిగివుంటారన్నమాట.
కాసుల పురుషోత్తమకవిగారు ఈ దివ్యానుగ్రహాన్ని తన ఇష్టదైవమైన పురుషోత్తముడికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. ఈ దివ్యానుగ్రహంతో వారు నాలుగు శతకాలు రచించేరు:
1. ఆంధ్రనాయక శతకం.
2. హంసలదీవి గోపాలశతకం.
3. రామా! భక్త కల్పద్రుమా! శతకం.
4. మానసబోధశతకం.
వీటిలో మొదటిరెండు శతకాలే లభ్యం ఔతున్నాయి. ఈ కవి గురువు శ్రీ అద్దంకి తిరుమలాచార్యులు. వీరు దేవరకోట ప్రభువుల ఆస్థానకవిగా ప్రసిద్ధి పొందేరు. కవిగారు చుమించుగా
క్రీ.శ. 1740 నుండి 1800 సం.ల కాలవ్యవధిలోవుండినట్లు భావించవచ్చని ఆచార్య డా. యార్లగడ్డ బాలగంగాధరరావు మహోదయులు వారు తాత్పర్య,లఘువ్యాఖ్యలు కూర్చిన “ఆంధ్ర నాయక శతకం”, “హంసలదీవి గోపాలశతకం”లో విశదంచేసేరు.
ఇప్పుడు ఈ రెండు శతకాల గొప్పతనం చూద్దాం. మొదట ఆంధ్రనాయకశతకం చూద్దాం.
ఇది శ్రీకాకుళ ఆంధ్రవిష్ణువుని సంబోధించి కవిచెప్పిన శతకం. దీని మకుటం ఇలావుంటుంది.
“చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్య భావ!
హత విమత జీవ! శ్రీకాకుళాంధ్ర దేవ“!
ఇది పేరుకి శతకమైనా, దీనిలోని భావ-భాషా ఔన్నత్యాన్నిబట్టి దీనిని, హంసలదీవి గోపాలశతకాన్ని ఉదాత్తకావ్యాలుగానే రసికాగ్రేసరులైన సాహిత్యకారులు పరిగణిస్తున్నారు.
బాహ్యనిర్మాణాన్నిబట్టి శతకాలైనా, ఆంతరిక గుణసౌష్ఠవాన్ననుసరించి మహాకావ్యాలుగానే మనం వీటిని స్వీకరించాలి. లోకంలో పామరులనుండి పండిత వరేణ్యులవరకు అందరికీ నోటికి వచ్చిన ఈ శతకంలోని అనేకపద్యాలలో ఒకటి బాగా ప్రచారంలో ఉన్న పద్యం ఇది:—
“ఆలు నిర్వాహకురాలు భూదేవియై
అఖిలభారకుడన్న ఆఖ్య తెచ్చె,
ఇష్టసంపన్నురాలిందిర భార్యయై
కామితార్థదుడన్న ఘనత తెచ్చె,
కమలగర్భుడు సృష్టికర్త తనూజుడై
బహుకుటుంబికుడన్న బలిమితెచ్చె,
కలుషవిధ్వంసిని గంగ కుమారియై
పతితపావనుడన్న ప్రతిభ తెచ్చె,
ఆండ్రు బిడ్దలు తెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటినుండియునీవు దామోదరుడవె
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ”!
“ఓ ఆంధ్రదేవ! అన్నింటినీమోసే భూదేవినీ భార్య ఐంది. అందుచేత నీకు లోకభారమంతామోసేవాడని పేరొచ్చింది. కోరిన సంపదలిచ్చే లక్ష్మీదేవి భార్య అవ్వడంచేత భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చేవాడవని కీర్తిని పొందుతున్నావు. సృష్టికర్త బ్రహ్మ నీ కొడుకేకదా! అందుకని నీకు బహుకుటుంబి అనే పేరొచ్చింది. ప్రజల పాపాలు పోగొట్టే గంగ నీ కూతురైందికదా! అందుకని నీకు పతితపావనకరుడు అని నిన్నులోకం కీర్తిస్తోంది. మొత్తంమీద నీ ఆలుబిడ్డల సామర్థ్యం వల్ల నీవు లోకంకో గొప్పవాడివని చెలామణీ ఐపోతున్నావుతప్ప, లేకపోతే నీవు దామోదరుడివే సుమా! ”
(దామోదరుడంటే విశ్వసంరక్షకుడవని అసలు అర్థం. కాని ప్రత్యేకంగా మన తెలుగులో దామోదరుడంటే పనికి మాలినవాడనే నిందార్థం కూడావుంది. “వాడు దరిద్ర దామోదరుడు” అంటూ ఉంటాం నిందాత్మకంగా! కవి “వ్యాజనిన్ద” లేక “నిన్దాస్తుతి” అనే అలంకారశాస్త్ర ప్రక్రియ ద్వారా ఈ రెండు శతకాలు రచించేడు. బాహ్యస్థాయిలో స్థూలదృష్టికి నిందగా తోచినా ఆంతరిక స్థాయిలో స్తోత్రపరమైన భావపారమ్యంతో ఈ రచనలు అలౌకిక సౌందర్య నిక్షేపాలుగా భక్తవరులు, సాహిత్య ప్రియులు ఈ కవి కవిత్వాన్ని ఆరాధిస్తారు.)
పురుషోత్తమకవిగారి రచనల సొగసులు ఈ రోజు “కదంబకం—13” కొన్ని ఐనా తెలుసుకుందాం!
స్వస్తి ||
Chaalaa information vundi.
కాసుల పురుషోత్తమ కవి గురించి చేసిన పరిచయం కమనీయంగానూ , విపులంగానూ ఉంది. చదువరుల హృదయాల్లో నిలిచిపోవాలంటే ‘నిందాస్తుతి’ బాగా తోడ్పుతుంది. ఆ ప్రక్రియను ఈయన చక్కగా వాడుకున్నారు. ఈ శతకాలకి కావ్య మర్యాద ఇవ్వాలి అనడం సరియైనది.