కదంబకం — 11 : థేలీజ్ (Thales)
శ్రీశారదా కారుణ్య కౌముదీ :—
10—09—2017; ఆదివారం.
కదంబకం—11.
థేలీజ్ —Thales—c. 624~547 B.C.
థేలీజ్ పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి తండ్రివంటివాడని చరిత్రకారుల అభిప్రాయం. వారు స్వయంగా రచించిన గ్రంథాలేవీ లభించకపోయినా వారితరవాత తత్త్వజ్ఞులు వారిగురించి వ్రాసినవిషయాలు మనకి లభిస్తున్నాయి. గ్రీకుదేశపు సప్తర్షులుగా ప్రసిధ్ధిగడించినవారిగా అనేకమేధావుల జాబితాలన్నింటిలో తప్పనిసరిగా స్థానంపొందిన ఏకైకతాత్త్వికుడు థేలీజ్ ! ఆయన గణిత, ఖగోళ, యంత్ర, రాజనీతి శాస్త్రాదులలో పండితుడిగా ప్రశస్తిపొందేడు. “జలం” విశ్వమంతటికీ మూలద్రవ్యం అని వారు బోధించేరు. మన వేదమంత్రభావానికి యిది అనురూపంగావుంది.
“ఆపోవా ఇదగ్ ం సర్వం విశ్వాభూతా
న్యాపః ప్రాణా వా ఆపః పశవఆపోsన్న
మాపోsమృత మాపః సమ్రాడాపో
విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్ ం
స్యాపో జ్యోతీగ్ ంష్యాపో యజూగ్ ం
ష్యాపస్సత్యమాపః సర్వా దేవతా ఆపో
భూర్భువస్సువరాప ఓమ్ ” ||
క్రీ.పూ., 28—05—585 న సంభవించిన సూర్యగ్రహణంగురించి థేలీజ్ ముందే predict చేసి చెప్పేరట. అంతవరకు వచ్చిన తత్త్వజ్ఞుల ఆలోచనలకి భిన్నంగా థేలీజ్ మొదటిసారిగా ఈ విశ్వసృష్టికి ముడిసరుకు ఏది అని ఆలోచిచించి, తన అన్వేషణని ఆ దారిలో కొనసాగించేరు. ఆ విధంగా సర్వసృష్టికి సహజ ప్రాకృతిక ధర్మాలని అనుసరించి వారు తన తత్త్వశాస్త్ర వివరణలని యిచ్చే ప్రయత్నం చెసేరు. ఇప్పుడు సంభాషణలలో ప్రసంగవశంగా వారు చెప్పినట్లు ప్రచారంలోవున్న కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం :—
1. వారికి యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి, వారి తల్లిగారు “వివాహం చేసుకో నాయనా” అని తరచు అంటూ వుండేవారట. అప్పుడు ఆయన “అప్పుడె తొందరెందుకమ్మా”? అని తప్పించుకునేవారట. వయసు మళ్ళిన తరువాత “వయస్సు దాటిపోయింది కదమ్మా! ఇంక పెళ్ళేమిటి”? అని పెళ్ళిచేసుకోకుండానే వారు జీవితం గడిపేసేరు.
2. తన అదృష్టాన్ని మూడు విధాల వారు ప్రస్తుతించుకున్నారు.
l) జంతువుగాకాక మనిషిగా పుట్టడం.
ll) స్త్రీగాకాక పురుషుడుగా పుట్టడం.
lll) ఆటవికుడిగాకాక గ్రీకు పౌరుడుగా పుట్టడం.
3. ఒకరోజు ఒక ముసలమ్మ నక్షత్రాలని చూడడానికి వారిని బయటకి తీసుకువెళ్ళింది. అలా వెడుతూండగా ఒక చిన్న గొయ్యలో అడుగు పడడంవల్ల తూలి పడబోయి ఆపుకుని నొప్పివల్ల కొంచెంబాధపడ్డాడు. వెంటనే పెద్దావిడ “ఇదేమిటి నాయనా! నేలమీదవున్నవాటినే నీవు సరిగ్గా గమనించలేకపోతున్నావు. ఇంక ఆకాశంలో ఉన్నవాటిని నీవెలాచూస్తావు“? అని అడిగింది.
4. ఒకసారి ఒకవ్యక్తి ఆయనని ఇలా అడిగేడు: “దేవుడికి తెలియకుండా ఎవడైనా తప్పు చెయ్యగలడా“? థేలీజ్ సమాధానం: “ఎవ్వడూ దేవుడికి తెలియకుండా తప్పుడు ఆలోచననైనా చెయ్యలేడు. ఇంక తప్పుపనిచెయ్యడం ఎలాసాధ్యం“?
5. “పూర్తిగా ధర్మమయమైన, పుణ్యమయమైన జీవితం జీవించాలంటే ఎలాగ”? అని ఒకరు అడిగేరు. వారి సమాధానం: “ఇతరులు ఏమి చేస్తే మనం అటువంటి వారిని తప్పు పట్టుకుంటామో అది మనం చెయ్యకుండా ఉండడమే”! మహాభారతంలో వ్యాసమహర్షి ఇలాగఅన్నారు: “న తత్పరస్య సందద్యాత్ ప్రతికూలం యదాత్మనః” ||
దీనినే తిక్కయజ్వ ఇలాగ తెలుగుచేసేరు:
“ఒరులేయవి యొనరించిన
నరవర! అప్రియము తనమనమ్మునకగు తా
నొరులకు అవిసేయకునికి
పరాయణము పరమధర్మ పథముల కెల్లన్ ”
ఈ భావాలు థేలీజ్ సందేశానికి సన్నిహితంగా ఉన్నాయి.
6. “నిన్ను నీవు తెలుసుకో“! అన్నది వారు లోకానికి బోధించిన మహావాక్యం.
స్వస్తి ||
గ్రీకు తత్త్వశాస్త్రానికి మూలపురుషునిగా చెప్పబడే థేలీజ్ గురించి ఇచ్చిన సమాచారం చాలా విలువైనది. ఆయనగురించిన సంగతులన్నీ తెలియాలంటే ఎన్నో పుస్తకాలు ౘదవాలి.అలా అక్కరలేకుండా ఒకేచోట అందించావు. అంతేకాకుండా ఆయన ఆలోచనలతో సామీప్యమున్న మన భారతీయ చింతనలోని భావాలుకూడా తులనాత్మకంగా చెప్పడం ఇంకా బాగుంది. పాశ్చాత్య తత్త్వచింతన థేలీజ్ తోనే ప్రారంభమౌతుంది …అలాగే నీనుంచి ఇదే ప్రారంభంగా ఇంకా చాలామంది తత్త్వవేత్తల పరిచయం కలుగుతుందని ఆశిస్తున్నాను
We only heard about the great Greek philosopher and thinker Thales.But today we had an opportunity to understand him to some extent.As CS mavayya rightly said we await for more such series of great philophers .