శారదా సంతతి – 1 : వారణాసి రామసుబ్బయ్యగారు

శ్రీశారదా దయా దీప్తిః (28-5-17):—

శారదా సంతతి–1

ఈ శీర్షికలో వివిధరంగాలలో  అపూర్వ ప్రజ్ఞని ప్రదర్శించి తెరమరుగైన మహామేధావులు అయిన పూర్ణవ్యక్తులగురించి ముచ్చటించుకుందాం.

మొట్టమొదటగా నాకు చిన్నప్పటి నుంచి నేను తెరమరుగయ్యేవరకు నన్ను అబ్బురపరచే మహానుభావులలో ఒకరైన ఒక గొప్ప మనీషి గురించి కొన్ని నాకు గుర్తున్న విషయాలు అనుకుందాం. ఆయనగురించి చెప్పడానికి నేను చాలా అల్పుడిని. అయినా ఒక పే—–ద్ధ ప్రయత్నం చేస్తాను. అమ్మ తప్పక నన్ను కరుణించి చక్కగా వ్రాయిస్తుంది. అది చిత్రభాను సంవత్సరం. కార్తికమాసం. శుద్ధ పాడ్యమి తిథి. 1882వ సంవత్సరం. గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామం. స్వచ్ఛమైన తెలగాణ్యశాఖలో కౌశిక గోత్రం వారైన వారణాసి కోటయ్యగారు ఉత్తమస్మార్త బ్రాహ్మణులు ఆ గ్రామప్రాంతాలలో ప్రశస్తి కలిగినవారు. వారికి మనం పైన చెప్పుకున్న కార్తిక శు.పాడ్యమి రోజున శారదానుగ్రహభవుడైన ఒక మగబిడ్డ పుట్టేడు. ఆ బిడ్డ పసితనంలోనే మనం ప్రస్తుతం అంతర్జాలంలో గమనిస్తున్న baby prodigies లాగ నవ్వినా,

ఏడ్చినా సస్వరంగానే ఉండేది. ఆయన 12 సంవత్సరాల వయస్సుకే గాత్ర-వాద్య సంగీతాలలో చుట్టుప్రక్కల బాలకళాకారుడిగా గొప్పపేరు పొందేడు. ఆ రోజులలో మంచి పేరున్నశ్రీరాజనాల వెంకటప్పయ్యగారి శుశ్రూషలో కోహినూరువజ్రంలాగ ధాగధగ్యాన్ని సంతరించుకున్నాడు. ఆయన గాత్రమాధుర్యాన్ని వర్ణించడానికి భాషాప్రాగల్భ్యం ఏమాత్రమూ సరిపోదుట. ఆయన పై స్థాయిలో పాడేటప్పుడు సహకార వాద్యమైన వాయులీననాదమూ, ఆయన కంఠజనితనాదమూ నాదసమైక్యాన్నిపొంది శ్రోతలని అలౌకిక అనుభవశోభకి పాత్రులని చేయడం జరిగేదిట. వీరి గురువుగారైన రాజనాల వేంకటప్పయ్యగారు శ్రీ సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రిగారి శిష్యుడు. ఆ శాస్త్రిగారు తన ప్రశిష్యుడైన రామసుబ్బయ్యగారి సంగీత వైదుష్యానికి, గాత్రమాధుర్యానికి ముగ్ధులై వీరు గంధర్వాంశ సంభూతులని, వీరికంఠంలో సూక్ష్మాతి సూక్ష్మమైన గాంధర్వవిద్యానిక్షిప్త సునిశిత కళాంశాలెన్నో అలవోకగా ఆవిర్భవిస్తున్నియని వక్కాణించేరట. అంతేకాక అటువంటి ప్రశిష్యుడున్నందుకు తన జన్మ ధన్యమైందని ఆనందాశ్రువులతో ప్రశిష్యుణ్ణి ఆశీర్వదించేరుట.

రామసుబ్బయ్యగారు ఆజానుబాహువు, సౌందర్యవంతుడు. ఆ ప్రాంతంలోనే ఉన్న పేటేరు జమిందారు ఈయన మిత్రుడు. పేటేరు జమిందారు పేరు రావు సూరయ్యగారు. సూరయ్యగారు సుబ్బయ్యగారిని తీసుకుని ఒకసారి తిరువయ్యారు త్యాగరాజ ఆరాధనోత్సవాలకి వెళ్ళేరుట. అక్కడకివెళ్ళడం అదే మొదటిసారి. ఎలాగైనా మన సుబ్బయ్యగారి పాట అక్కడివారికి వినిపింపజేసి వారి మెప్పు సంపాదించాలని సూరయ్యగారికి చాలా తాహతహ్యం ఉంది. ఐతే అక్కడి విద్వాంసులకి మిగిలిన వారంటే ఏమాత్రమూ గౌరవం లేదు. ఎంత ప్రయత్నించినా యువకుడైన సుబ్బయ్యగారిలోని గానకళ, సంగీతవిద్వత్తు వాళ్ళు ఏమాత్రమూ పసిగట్టలేకపోయేరు. పైగా ఈసడింపుతో ఇలా అన్నారు:

“ఉత్తరదిశనించి వచ్చిన మీకు సంగీతం విని ఆనందించడమైనా సరిగా తెలియదు. అటువంటిది తగుదునమ్మా అని పాట పాడడానికే తెగిస్తున్నారే! ఇదేమి వింత! ముందు విని వెళ్ళండి. మీ జన్మకి అదే ఎక్కువ”.అని వెటకారం చేసేరట. వారేమన్నా నిరుత్సాహపడక సూరయ్యగారు వారిని వెంటపడి, వేధించి ఏదోవిధంగా నొప్పించైనా ఒప్పించి అందరికి అంతో ఇంతో ప్రతికూలంగా ఉండే మధ్యాహ్నం

2-00 గంటల సమయానికి పావుగంట మింౘనివ్యవధిలో సుబ్బయ్యగారు పాడడానికి ఏర్పాటు జరిగింది. అంతకు ముందు మహావైద్యనాథ అయ్యరు, రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ (అరియక్కుడి రామానుజ అయ్యంగారి గురువుగారు) మొదలైన హేమాహేమీలంతాపాడేరు. సుబ్బయ్యగారు తనకి ముందు పాడిన పెద్దల బాణిలన్నీ వివరంగా తను పాడి వినిపించేసరికి శ్రోతలంతా ఆశ్చర్యపోయేరు.
“ఇప్పుడు ఈ ఉత్తరాది సుబ్బడి బాణీవినండి” అని ఆయన తన సంగీతం పాడివినిపించడం ప్రారంభించి తన గానాన్ని వినిపించేసరికి రాత్రి 11 గంటలవరకు శ్రోతలందరూ కదలక, మెదలక మంత్రముగ్ధులై ఆ అలౌకిక గానామృతాన్ని తనివితుర సేవించారట. సదస్యులందరూ మహాకళాకారులూ, మహావిద్వాంసులే! వారంతా ముక్తకంఠంతో సుబ్బయ్యగారి అపూర్వ, అపార, అమేయ సంగీత శేముషీ వైభవాన్ని ప్రస్తుతించి వారిని సమ్మానించేరట. ఆ దెబ్బతో మన సూరయ్యగారికి చాలా ఉత్సాహం వచ్చింది. సుబ్బయ్యగారితో ఒక పోటీ పెట్టేరట. “ఒక సారికే” అనే క్షేత్రయ్యగారి పదాన్నిఆయనతో సమంగాపాడగలిగితే
ఆ రోజులలో అపూర్వధనరాశి ఐన రూ.1,116/-లు బహుమతిగా యిస్తానని ప్రకటిస్తే యెవ్వరూ చొరవచెయ్యలేదట! ఆ విద్వత్సభలో సుబ్బయ్యగారికి “స్వరజ్ఞాన కళానిధి”‘ అని,”పల్లవి స్వరకల్ప వల్లరి” అని
రెండు బిరుదులిచ్చి గౌరవించారట. కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో మకుటంలేని మహారాణి ఐన “రాగం-తానం-పల్లవి” ప్రక్రియలో అనితరసాధ్యమైన కళాత్మక వైదుష్యం ఉండడంవల్ల సుబ్బయ్య

గారికి పై రెండవ బిరుదు లభించింది. అట్టి బిరుదు ఆ కాలంలో మరొకరికెవ్వరికీ లభించినట్టు తెలియదు.

శ్రీనివాస అయ్యంగారు వీరి కళాకౌశలానికి ముచ్చటపడి వీరిని తమవద్ద కొంతకాలం తన శిష్యుడి లాగ శిక్షణనిచ్చి ఎంతో సంతోషించేరట. ఆ సమయంలో వారు వీరికి సుమారు ఏడువందల కీర్తనలు నేర్పేరట. ఒక రోజులో సుబ్బయ్యగారు 30 కీర్తనలని క్షుణ్ణంగా నేర్వగలిగేవారట. సుబ్బయ్యగారు దేశవ్యాప్తంగా సంగీతవిద్యని ప్రచారంచేస్తూ ఆబాలగోపాలాన్నీ రంజింపచేసేరట.

ఆ సమయంలో ఉత్తరభారతసంగీతం లో ప్రఖ్యాతిగన్న కలకత్తాలోని మహాకళాకారిణి, విదుషి ఐన గౌహర్ జాన్ వద్దకి ఆ సంగీతం నేర్చుకోడానికి వెళ్ళేరట, మన రామసుబ్బయ్యగారు. వీరు ఆమె భవనానికి వెళ్ళేసరికి ఆమె తూగుటుయ్యాలలో అనేక స్త్రీ శిష్యగణం సేవలందుకుంటూ, వారందరికీ సంగీతం నేర్పుతూ ఉన్నదట. వీరిని గుమ్మం వద్దే నిలబెట్టి విషయమేమిటని అడిగిందట. వీరు సంగీతంలో తనని శిష్యుడిగా స్వీకరించుమని అభ్యర్థస్తూ, తను ఆంధ్రుడినని చెప్పేరట. మీ దక్షిణభారతీయులకి ఉత్తరభారతసంగీతం పట్టుబడడం కష్టమని చెప్పి ఏదో ఒకటి పాడి వినిపింౘమందట. వీరు అలా గుమ్మం దగ్గరేనిలబడి ఆ రోజులలో ప్రసిద్ధమైన ఒక గొప్ప ఉత్తరభారతసంగీత కృతి వంగవాణిలో అన్ని సంగతులతోటి అద్భుతంగా పాడి వినిపించేరట. ఆ పాట వినగానే ఆమె పరవశించి పోయి అమాంతంగా లేచి వచ్చి సుబ్బయ్యగారిని కౌగలించుకుని నీకు నేను నేర్పవలసినది ఏమీ లేదు. నేను నీ శిష్యురాలినై నీ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అని వీరిని కలకత్తాలో కొంతకాలం ఉంచేసి తను, తనశిష్యులు ఎన్నోమెలకువలు వీరినుంచి నేర్చుకున్నారట. వీరికి గురుదక్షిణగా కలకత్తాలో చాలా సభలలో పాడించి గొప్ప, గొప్ప సమ్మానాలు చేయించి, బహుమానాలు ఇప్పించిందట. ఆ రోజులలో ఆంగ్లప్రభుత్వంచేత 26తులాల బంగారుపతకం యిప్పించి స్వగృహానికి వీరిని సకలమర్యాదలతో పంపించినదట. ఈ విధంగా వీరు కలకత్తాలోను, ఎట్టయాపురంలోను, విజయనగరంలోను, రామనాథపురంలోను మన సంగీతవైభవాన్ని దశదిశల వ్యాపింపజేసిన ఆ అపూర్వ శారదాతనయుడికి నతమస్తకులమౌదాము.

స్వస్తి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *