శారదా సంతతి — 20 : ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్
శ్రీశారదా దయా గంగ :—
26—11—2017; ఆదిత్యవాసరము.
శారదా సంతతి~20. అత్యున్నత ఏకైక గాన గౌరీ శిఖరం—ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహబ్ ||
అమీర్జీ గానం అమరగానం. ఆ శైలి లోకోత్తరమైనది. సర్వ రసిక జన సమ్మోహనకరమైనది. సకల సంగీత జగత్తుని సమ్మోదమగ్నం చేస్తూన్నది. అమీర్జీ గొప్ప సంగీత పరంపరవున్న కుటుంబంలో, 1912, ఏప్రిల్ నెలలో,జన్మించేరు. వారి తండ్రి ఉస్తాద్ షామిర్ ఖాన్ మంచి సారంగీ వాద్య కళాకారుడు. ప్రారంభంలో తన పుత్రుడికి, తానే సారంగీ విద్యని నేర్పడం ప్రారంభించేడు.
షామిర్ ఖాన్జీ సారంగీ కళాకారుడేకాక, మంచి స్నేహశీలి, అతిథి మర్యాదలో ఆరితేరిన సద్గృహస్థుడు. అందువల్ల ఆకాలంలో గొప్ప-గొప్ప ఉస్తాదులైన అల్లాబందేఖాన్ , జఫ్రుద్దీన్ , నజీరుద్దీన్ ఖాన్ , వహీద్ ఖాన్ , రౙబ్ ఆలీఖాన్ , హఫీజ్‌ఖాన్ , బండుఖాన్ , మురాద్ఖాన్ , మొదలైన గాన-వివిధ వాద్య కళా కారులు అమీర్జీ బాల్యంనుంచీ, వారి ఇంటికి వస్తూ- వెడుతూ వుండేవారు. అందువల్ల అమీర్జీకి గాత్రసంగీతంలో గాఢరుచి కలిగింది. అప్పటినుంచి పాడడం వారు ప్రారంభించేరు. వారి మధురకంఠధ్వనివిని, తండ్రికూడా, వారిని గాత్రసంగీతవిద్య నేర్చుకోవడం లోనే ప్రోత్సహించేరు. అమీర్జీ ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలోవున్న కిరానా, భేండీబజార్ ఘరానా శైలి గానాలవైపు ప్రబలంగా ఆకర్షితులయ్యేరు. కిరానా ఘరానాలో సుప్రసిద్ధులైన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ , ఉస్తాద్ రౙబాలీఖాన్ గార్ల గానశైలి, భేండీబజార్ ఘరానాకి చెందిన ఉస్తాద్ అమనాలీఖాన్ గారి గానశైలిల ప్రభావం అమీర్జీ గానరీతిమీద గాఢముద్రని వేసింది. ఐతే, కళాకారుడిగా వారి వ్యక్తిగత ప్రజ్ఞ ఎవ్వరి బాణీని అనుకరించకుండా, తన కంఠానికి, గాత్రధర్మానికి, సంగీత అనుభవానికి అనుగుణంగా, తనకి ఇతర కళాకారులలో నచ్చిన అందమైన అంశాలని, మలచుకోగలగడంలోనే వుంది.
అమీర్జీకి, మన కర్ణాటక సంగీతంలో మహామేధాసంపన్నులైన, “GNB“గా ప్రసిద్ధులైన విశ్వవిఖ్యాత శ్రీ జి.ఎన్ .బాలసుబ్రమణియం గారి లాగే, ఏ గురువుగారివద్దా శిష్యరికం చేయకుం డానే, అనితరసాధ్యమైన స్వతంత్ర గానశైలిని శ్రీశారదానుగ్రహ రూపంగా సంపాదించుకున్నారు. ఐతే, శ్రీ జి.ఎన్ .బి. కర్ణాటక సంగీత సభలలో మధ్యమకాలకృతులకి పెద్దపీట వేసేరు. అమీర్జీ తమ సభలలో విలంబితకాల కృతులకే పూర్తి ప్రాధాన్యమిచ్చేరు. ఈ విషయంలో అమీర్ఖాన్జీ, శ్రీ యం.డి. రామనాథన్ కి, సన్నిహితంగా వుంటారు. ఉ.భారత సంగీతానికి అమీర్జీ ఎటువంటి గొప్ప విలక్షణసేవచేసేరో, అంతటిగొప్ప సేవని శ్రీ ఎం.డి.రామనాథన్ ద.భా.సంగీత సంప్రదాయానికి చేసేరు. కాని, అక్కడ అమీర్జీ పొందిన అపూర్వ గౌరవాదరాలని, ఎం.డి.ఆర్జీ పొందలేదు, సరికదా, విమర్శకుల హేళనకి గురికావడం, అత్యంత బాధాకరం. భేండీబజార్ ఘరానాలోవున్న అనేక ప్రత్యేకతలలో, ఒక ముఖ్యాంశంఏమిటంటే, సార్ఙ్గదేవుడు, “సంగీతరత్నాకరం“లో స్పష్టంచేసిన “మేరుఖండ” స్వరప్రయోగ పద్ధతిని అనుసరించి గానంచెయ్యడమే! ఈ సాంకేతికపద్ధతిని రసస్ఫోరకంగా ప్రయోగింౘడంలో అమీర్జీ మేధాశక్తి ఇమిడివుంది. మేరుఖండ స్వర ప్రయోగ పద్ధతి, ప్రధానంగా, సంగీత రస ప్రమేయంలేని సాంకేతిక వ్యవహారం.
వారి గాన శైలి, మన ప్రాచీన సంగీత సంప్రదాయ జనితమైన ధ్రువపద (ధ్రుపద్ ) గానాన్ని, అమీర్ ఖుస్రో ఖయాల్ గానాన్ని – ఈ రెండింటిని రసమయ ఆదర్శంతో, ౘక్కగా మేళవింపు చేయడం ద్వారా సముద్భవించినదిగా గ్రహింౘవచ్చు! ఉత్తరభారత సంగీత సంప్రదాయంలో- ఒక అమీర్ఖాన్సాహబ్ , ఒక కుమార గంధర్వ, ఒక బసవరాజ్ రాజ్‌గురు, ఒక్కొక్కరు ఒక ఘరానాగా పరిగణింపబడవలసినవారు.
వారు 14—02—1974న కలకత్తాలో ఒక కారుప్రమాదంలో మరణించడం, సంగీత రసజ్ఞలోకానికి ఎప్పటికీ తీరని విషాదం. వారి సంగీతశైలి గురించి, వారు పాడిన కృతులగురించి నేటి “కదంబకం”లో ముచ్చటించుకుందాం!
పండిత్ /విదుషి, అమర్నాథ్ , కానన్ , శ్రీకాంత్ బక్రే, సింగ్ సోదరులు, కంకణా బెనర్జీ, పూరబీ ముఖర్జీ, శాంతి శర్మ, గోకులోత్సవజీ మహరాజ్ మొదలైనవారు వారి శిష్యకోటి లేక అనుయాయబృందానికి చెందినవారు.
స్వస్తి ||
దట్టించిన మతాబా వెలిగించినప్పుడు వేల వెలుగు రవ్వలు చిమ్మినట్టు – స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని రాస్తున్న ఈ చిన్న వ్యాసాలు చదివినప్పుడు , వాటినిండా ఎంతో విలువైన సమాచారం అందుతోంది. అంత నేర్పుగా కూరుతున్నావు.
గత కొన్ని వారాలుగా చేస్తోన్న ఈ గాన గంధర్వుల పరిచయ పరంపరలో ఆ మహోన్నత కళాకారుల సంగీతాభినివేశమే కాకుండా, స్ఫూర్తి మంతమైన వారి విస్తృత జీవన గమనం కూడా తెలియచేస్తున్నావు.
అమీర్‌ఖాన్ గారి గురించి చెప్తూ, సందర్భవశంగా కర్ణాటక సంగీత విద్వాంసులైన జి.ఎన్. బి, ఎం. డి. రామనాథన్ వంటి వారిని తులనాత్మకంగా ఉటంకించడం — ఉభయ సంగీత బాణీలలో నీకున్న పరిజ్ఞానం వల్లనే సాధ్యం. హేట్స్ ఆఫ్!
Excellent information.
Ustad Amir khan an artist with his own unique style in the Hindustani music world, being introduced by you this week is really a feast to all of us. Your presentation of these articles is so wholesome that not only we are getting to know the biographies of these legends, but also of the different Gharanas,other popular musicians, names of various Ragas etc. I feel no music university or college can give its students this complete knowledge and education that you are providing us. Thank you so much.