సాహిత్యము-సౌహిత్యము – 28 : పగలు శశాంకు డంబరము పైన వెలింగెను తీక్ష్ణకాంతితో
శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
18—11—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము~28.
ఈ వారంకూడా శ్రీ ప్రతాప సుబ్రహ్మణ్య శాస్త్రివర్యుల సమస్యాపూరణం చూద్దాం. సమస్య చంపకమాల చతుర్థపాదం.
“పగలు శశాంకు డంబరము పైన
వెలింగెను తీక్ష్ణకాంతితో” ||
“పగలు చంద్రుడు పైన ఆకాశంలో వేడి వెన్నెలతో వెలుగులు చిమ్ముతున్నాడు” అని ఈ పద్యపాదానికి అర్థం. ఇప్పుడు పూరణ చూద్దాం!
“మొగ మటు త్రిప్పె దేల! వలపుం
బువుబోణి! చలమ్ముతో సుమా
శుగముల గ్రుమ్ముచుండెను ప్రసూన
శరుం డిటు శీతవాతముల్ |
తగిలెడు వెచ్చగా, చరణదాసుడ, నే
నెటుబోదు, నెందుకీ
పగలు? శశాంకు డంబరముపైన
వెలింగెను తీక్ష్ణకాంతితో” ||
ఇక్కడ కవిగారు చేసిన అనితర సాధ్యమైన చమత్కారంవుంది. సమస్యలో “పగలు” అనేమాట “రోజులో రాత్రికానిభాగము, దివము లేక పవలు” అన్న అర్థంలో యివ్వబడింది. ఆ మాటని తెలుగులోవున్న “పగ” అనే ద్వేషభావం అర్థాన్ని కలిగిన శబ్దంగా తీసుకుని, దానికి బహువచనరూపం ఐన “పగలు” గా మార్చి సమస్యాపూరణం చేయగలగడం శాస్త్రివర్యులకి చెల్లింది. అందరికీ ఈ ప్రజ్ఞ అందుబాటులోవుండేది కాదు. ఇప్పుడు భావం చూద్దాం.
తీవ్రంగా అలిగిన ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రియుడు చాలా సుకుమారంగాను, దీనంగాను బ్రతిమాలుతున్న ప్రణయఘట్టాన్ని మనోజ్ఞ వర్ణ చలనచిత్రంగా మన ముందు ప్రతిభావంతులైన కవిగారు మనోహరంగా ప్రదర్శిస్తున్నారు. రసజ్ఞులైనవారు దర్శించి ప్రశంసింౘగలగాలి.
“ఓ నా కుసుమ సుకుమార ప్రాణ ప్రియా! నా నుంచి నీ సుందర వదనారవిందాన్ని ఎందుకు మరలిస్తున్నావు? నావలన ఏమి అపరాధం జరింగిందనీ? ఒకప్రక్క, పట్టువిడవని మన్మథుడు తన పూలబాణాలతో నన్ను బాధిస్తున్నాడు. ౘల్లని గాలులు కూడా వేడిగా వీస్తున్నాయి. నేను నీ పాదదాసుడిని. నేనెక్కడికి వెళ్ళను? నాకు నీవు తప్ప వేరే గతిలేదు. నీకు-నాకు మధ్య ఎందుకీ వైరాలూ- పగలూను? నీ ఈ వాడిగా, వేడిగావున్నక్రోధాగ్ని జ్వాలల ప్రభావంవలన నేడు రాత్రి ఆకాశంలోవిహరిస్తున్న చంద్రుడు కూడా తన సహజధర్మం కోల్పోయి, వేడివెన్నెలలని వెదజల్లుతున్నాడు“.
స్వస్తి ||
శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గావించిన ఈ సమస్యా పూరణం కూడా ఎంతో కవితాత్మకంగా ఉంది.ఈ పూరణ చూసేకా ఆయన
“కల్పనా ప్రతాప” సుబ్రహ్మణ్య శాస్త్రి గారేమో అనిపిస్తోంది.
మన్మథుని శరాఘాతాలకి శీతగాలులు వెచ్చనైనాయి అనే అర్థాన్ని
చెబుతూనే, వాటిని ఆమె క్రోధాగ్ని జ్వాలలుగా అన్వయించి, వాటివలన వెన్నెల వేడెక్కి పోయిందని నువ్విచ్చిన వివరణ ఇంకా బాగుంది.
మొదటిపాదంలో “త్రిప్పెదవేల” అన్నది “త్రిప్పెదేల” అని ఉండా లనుకుంటాను.
ఆఖరిపాదంలోని మొదటి పదాన్ని మూడవపాదం అన్వయంతో కలిపేసి సమస్య పూరించడం సామాన్యమే అయినా, ఆ పదం “పగలు” అన్నదాన్ని ఈరకంగా శ్లేషించడం చాలా బాగుంది. ఆ బుద్ధికి వందనాలు.
సవరించబడింది, ధన్యవాదం.