Fun facts – 22

శ్రీశారదా దయా చన్ద్రికా :—
18—11—2017; శనివారము.

వాస్తవాలు—వినోదాలు/Fun-Facts~22.

1. ఛార్లెస్ డికెన్స్ ప్రఖ్యాత బ్రిటిష్ నవలాకారుడిగా మనందరికీ తెలుసు.  వారికి ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి అనే వ్యాధితో బాధపడేవారు.అందువల్ల వారు రాత్రి నిదురించే శయ్య, వారి పడకగదిలో(తలగడ వైపు) ఖచ్చితంగా ఉత్తరదిశగా ఉండాలని నిర్దేశించేవారు. ఇంక రాత్రి నిదురించేసమయానికి కొలబద్దతీసుకువెళ్లి రాత్రి తెల్లవార్లూ గదిని, మంచాన్ని జాగ్రత్తగా కొలిచి శయ్య గదికి సరిగ్గా మధ్యకి ఉండే విధంగా సర్దడం, ఆపైన పరుపు మంచానికి సరిగ్గా మధ్యకి ఉండేలాగ సరిచెయ్యడమూ, చివరగా తాను పరుపుమధ్యలో పడుకునేటట్లు తనని తాను సరిచూసుకోవడమూ- ఈ ప్రయత్నాలతో ఎప్పటికో, ఎలాగో కాస్త కునుకు తియ్యడమూ జరిగి వుండవచ్చు. విన్స్టన్ చర్చిల్ మహాశయుడికీ ఈ బాధవుండేది. ఐతే వారి మెథడాలజీ మరొకరకంగావుండేది. వారు పడకగదిలో రెండు విడి పడకలు ఏర్పాటు చేయించేవారు. మొదటిమంౘంమీద అర్థరాత్రి దాటేవరకూ అటూ ఇటూ దొర్లి, ఆ తరవాత తన “నిద్రా ప్రయత్న ప్రహసనం—2” అనబడే డైలీ సీరియల్ ని కాస్త ౘల్లగావున్న రెండవమంచంమీద కొనసాగించేవారు.

2. ప్రపంచంలోని పంచ మహాసముద్రాలు మనకి తెలుసు. పసిఫిక్ , అట్లాంటిక్ , అంటార్క్ టిక్ , ఆర్క్ టిక్ , హిందూ, ఈ ఐదూ ఆ మహాసముద్రాలు. ఈ ఐదూ కలిసి మొత్తం భూమి ఉపరితల వైశాల్యంలో 71% పంచుకుటున్నాయి. వీటి అన్నింటిలో పెద్దది పసిఫిక్ మహాసముద్రమని మనకి తెలుసు. దీని వైశాల్యం 18,10,00,000 చతురపు కిలోమీటర్లు లేక 7 కోట్ల మైళ్ళు.

3. ఒక ఫ్రెంచి వార్తాపత్రికలో ప్రత్యేకంగా ఒక ఆర్ట్స్ పేజ్ ఉంది. కళాప్రియులకి ఆ పుట అంకితం. ఆ పుటలో ఒకరోజు ఒక ప్రశ్న పోటీ పెట్టేరు. ఆ ప్రశ్న యిది: “ప్రపంచ ప్రఖ్యాతమైన ‘లూవ్ర’ చిత్రకళాఖండ ప్రదర్శన శాల ప్రమాద వశాత్తు అగ్ని ప్రమాదానికి లోనైతే నీవు అక్కడవుండి ఒకే కళాఖండాన్నిమాత్రమే రక్షింౘగలిగితే ఆ ఒక్క కళాఖండమూ ఏది”? అని  ఆ ప్రశ్న. 65 శాతం జవాబులు “మోనా లీసా” అనే వచ్చేయి. కాని న్యాయనిర్ణేతలు, ట్రిస్టాన్ బెర్నార్డ్ యుక్తియుక్తంగా వ్రాసిన ఈ సమాధానానికి బహుమానం యిచ్చేరు:—
బయటకి వెళ్ళే ద్వారానికి బాగా దగ్గరగావున్న చిత్రాన్ని కాపాడతాను“!

స్వస్తి ||

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. పాపం పెద్ద పెద్ద వాళ్లందరినీ ఈ
    నిద్రలేమి సమస్య బాగా బాధించింది. నిద్రలేమి ఉన్న వాళ్లకి తెల్లవారదు–నిద్రలో ములిగిన వాళ్లకి తెల్లవారింది తెలీదు.
    పసిఫిక్ పెద్దదని తెలుసు కానీ ఏడు కోట్ల మైళ్ళు వైశాల్యం అని తెలీదు.
    ఇక బెర్నార్డ్ ‘బ్రతక నేర్చిన ‘ వాడు కనక బహుమానం పొందేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *