కదంబకం — 20 : శరత్పూర్ణిమ
శ్రీశారదా దయా సుధ :—
12—11—2017; ఆదిత్యవాసరము.
కదంబకం~20.
ఈ వారం, “శారదా సంతతి~18” లో పండిత్ మల్లికార్జున మన్సూర్ గారి పరిచయం చేసుకున్నాము. ఈ రోజు “కదంబకం~20″లో కూడా వారి సంగీతంగురించి చాలా సంక్షిప్తంగా తెలుసుకుందాము!
వారు, 12—09—1992 వ తేదీన పరమపదించేరు అని తెలుసుకున్నాం! ఆ సందర్భంలో HMV సంస్థవారు, వారి సంస్మరణార్థం, “In Memoriam“, పేరుతో ఒక కేసెట్ ని, విడుదల చేసి, “శ్రద్ధాంజలి” సమర్పించేరు. 1933—34 లలో, పండిట్జీ, 78 RPM డిస్కులలో పాడిన 17 అద్భుతమైన కృతులని, ఈ శ్రద్ధాంజలి టేపులో పొందుపరిచేరు. పాతిక సంవత్సరాల వయస్సు లోపే, పండిట్జీ పాడిన ఆ కృతులు రసికజన కర్ణామృతాలు. అప్పటికే సంగీతంలో వారు కఠోరతపస్సుతో సాధించిన అమోఘగానశైలి శ్రోతృజన హృదయ సంమోహనకరమైనది. ఆ గానం, రసజ్ఞ లోకానికి, రాబోయే కాలంలో, కాబోయే విశ్వవిఖ్యాత మహానాదయోగిని, వేనోళ్ళ ప్రకటించింది.
అల్హైయా బిలావల్ , జోన్పురి, తోడి, సారంగ్ , మిశ్రమాండ్ , భీంపలాస్ , దుర్గ, ఛాయానట్ , దేశ్ , మాల్కౌస్ -తరానా, భైరవి వంటి రక్తి రాగాలన్నీ సంగీతనాద వైభవ కాంతితో రసజ్ఞ లోకాన్ని రంజింపజెయ్యడానికి సర్వసమర్థ సంపన్నంగావుంటాయి. ఉదాహరణకి, సారంగ్ రాగంలో, కెహర్వా తాళంలో వారు పాడిన “బిన్ బాదల్ బిజ్లీ కహా, బిన్ బాదలు”, అనే కృతి వారి కంఠనాద కమనీయ వర్ణ వస్త్రాభరణ దివ్యాలంకారాలలో, ధగద్ధగాయమానంగా రసజ్ఞశేఖరుల మనోనయనానందకరంగా నర్తిస్తుంది. “మబ్బు లేని మెరుపు ఎక్కడ” అనే పల్లవి, తనలోని అనూహ్య భావ సౌకుమార్యాన్ని దశదిశల వేలారుస్తూ, రాగంలోని స్వరస్థానాలని, తాళంలోని మాత్రాస్థితి మనోహరగతులద్వారా, మన కన్నులకి తెలియని సొగసులు ప్రదర్శిస్తూ, మన మనస్సులకి అందని వయ్యారాలు ఒలికిస్తూ నర్తించే రీతులు, సరసహృదయైకవేద్యాలు.
పండిట్జీ పరిణత ద్రుతకాల తాన ప్రయోగ విద్యుల్లతలు ఒకవైపు సారంగ్ రాగహృదయ విలక్షణ విన్యాసాలని, విలాసంగా ప్రదర్శిస్తూ, మరొకవైపు, కెహర్వాతాళంలోని ధాగీ-నాతీ-నక్ –
ధిన్ – చతుర్మాత్రా ప్రయోగంలోని, అందమైన అలవోక ఊగూ-తూగూ ద్వారా, ఆ గానదేవతయొక్క పదగతుల తతులని పరమ రమ్యంగా మనకి దర్శింప జేస్తారు. సారంగ్ రాగంలోని ప్రధాన స్వర సమూహ ప్రయోగాలు పండిట్జీ మధుర కంఠంనుంచి, మెరపుల వేగంతోను, మిరుమిట్లుగొలిపే హఠాత్ప్రకాశంతోను రసజ్ఞహృదయాలని తమ వశం చేసుకుంటాయి. వారి తానప్రయోగ వైదగ్ధ్యం, తాళగమన సువ్యవస్థిత “లయకారి” లోని వైదుష్యం, ఈ రెండింటిని ఔచిత్యస్ఫూర్తిసౌభాగ్యంతోమన మనస్సులని దోచుకోగలగడం, పండిట్జీ ప్రత్యేకప్రతిభకి తార్కాణం. నిరంతర సంగీత కళాతపశ్శీలియైన వారి అమృతమయగాత్రశోభతో ఆ పాట, శరత్పూర్ణిమనాటి వెన్నెల వెలుగుల పులుగై, మన ఎద మిన్నులో ఎప్పటికీ ఎగురుతూనేవుంటుంది.
1992 డిసెంబరులో వారి జన్మదినం సందర్భంగా, HMV సంస్థవారు, “Echoes of a Soulful Voice” శీర్షికతో 4 కేసెట్లు కలిపి ఒకపెట్టెలో ఒక సెట్ గా విడుదల చేసేరు. వాటిలో భైరవ్ వంటి ప్రాచుర్యంలో వున్న కొన్ని రాగాలతోబాటు, విహంగ్ , దేవసఖ్ , గారా-బాగేశ్రీ, వంటి కొన్ని అపూర్వ రాగాలూవున్నాయి. వారి భక్తిరసాన్విత దివ్య కంఠంలో, పరంపరాగత “అట్రౌలీ” అద్భుతశైలిలో, అనితరసాధ్య నైపుణ్య సౌలభ్యంతో, పండిట్జీ రసజ్ఞలోకాన్ని ఆనంద పారవశ్యంలో ముంచి ముగ్ధుల్ని చేసేరు.
ఈ 4 కేసెట్ల సెట్ ని, మా వాసుబావాజీ, (శ్రీ కె.బి.జె. శ్రీనివాస్ ), చెల్లి కాసుతల్లి (శ్రీమతి కామేశ్వరి), నేను బెంగుళూరులో వారింటికి వెళ్ళినపుడు, నాకు బహూకరించేరు. వారిద్దరికి నా హార్ద ధన్యవాదాలు, ఈ సందర్భంగా, సమర్పిస్తున్నాను.
స్వస్తి ||

మబ్బు లేని మెరుపు మల్లికార్జున్ మన్సూర్ గారే! సంగీత వినీలాకాశంలో నిశ్చల సౌదామని ఆయన. ఎన్ని రాగాలు !
ఎంతటి వైదుష్యం! చాలా విలువైన , సంగీతాభిమానులు,
సంగీత కళాకారులు అందరూ తెలుసుకోవలసిన సమాచారం
అందించినందుకు ధన్యవాదాలు.