శారదా సంతతి — 18 : మల్లికార్జున మన్సూర్

శ్రీశారదా దయా సుధ:—
12—11—2017; ఆదిత్యవారము.

శారదా సంతతి~18.

మహా నాద యోగి ~ మల్లికార్జున మన్సూర్ .

సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి “నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా” అనే కృతి బాగా ప్రజాదరణ పొందినది. ఇది 19వ మేళకర్త ఐన “ఝంకారధ్వని” రాగజన్యమైన “చిత్తరంజని” రాగంలో,  ఆదితాళంలో కూర్చబడిన రచన. ఈ రాగంలో ఇది ఏకైక రచన. ఇది ఒక అపూర్వ(rare) రాగం. కృతి మాత్రం బహుళ ప్రాచుర్యం(popularity)  కలిగినది.

ఇక్కడ ఈ కృతిని ఉదహరించవలసి వచ్చింది. ఈ కృతియొక్క పల్లవికివున్నగొప్ప అర్థంవల్ల దీని ప్రసక్తి వచ్చింది. “నాదశరీరుడైన శంకరుడికి నా మనస్సుతోను, శిరస్సుతోను సదా నమస్కరిస్తున్నాను” అని దీని భావం. శారంగదేవుడు, తన “సంగీతరత్నాకరం” గ్రంథంలో మొదట  ఒక శ్లోకంలో శివస్తుతి చేసేడు.ఆ స్తుతి “వందే నాదతనుం – – – – – శంకరమ్ “|| అని పూర్తి ఔతుంది. దీనినుంచే అయ్యగారు తమ “చిత్తరంజని” కృతికి పల్లవిని ఎంచుకుని, మిగిలిన భాగాన్నిస్వంతంగా రచించేరు. దీన్నుంచే “శంకరాభరణం” చలనచిత్రం లోని వేటూరివారి “శంకరా! నాద శరీరా!” పల్లవిప్రారంభం పూట్టింది.

ఇంతకీ, ఈ చర్చ అంతా దేనికి అంటే, హిందుస్తానీ సంగీత గాయకచక్రవర్తి  శ్రీ మల్లికార్జున మన్సూర్ ఈ త్యాగయ్య గారి పల్లవికి ప్రాణంపోసుకున్న మానవస్వరూపం. హిందుస్తానీ ఖయాల్ సంగీత సంప్రదాయ లోకంలో పండిత్ మల్లికార్జున మన్సూర్ గానశైలి సుప్రసిద్ధమైనది. వారు సంగీతంలో మహా విద్వాంసులేకాక, గొప్ప శివభక్తులు కూడాను! సంగీతంలో పూర్ణకళాతపస్విగా వారి స్థానం సుప్రతిష్ఠితమూ, శాశ్వతమూను! అలాగే శివభక్తి తత్పరతలోనూ పరమావధిని చేరినవారు. అందువల్ల వారి గానమాధుర్యంలో శివానుగ్రహస్పర్శ అంతర్వాహినిలాప్రవహిస్తూంటుంది. ప్రతిభా మందాకిని, విద్వద్యమున, సంపూర్ణ భక్తిరసామృత సరస్వతుల త్రివేణీ సంగమమే వారి గానశైలిగా వర్ధిల్లింది.

రాగ తాల లయాధీనం
శ్రుతి సుస్వర నాదజమ్ |
స్వాత్మానంద భవం దివ్యం
సంగీతం మోక్షదాయకమ్ ” ||

“శ్రుతి ఆధారంతో, స్వరపుష్టికలిగి నాదజనితమై, రాగ-తాళ-లయల సమ్మేళనమై, ఆత్మానందంలోనుండి పుట్టిన దివ్యసంగీతం మోక్షదాయకం”!

ఈ శ్లోకభావానికి మల్లికార్జున మన్సూర్ గానం సజీవ స్వరూపం. వారు, 31—12—1910వ తేదీన కర్ణాటకలోని ధార్వాడజిల్లా-మన్సూర్ గ్రామంలో పుట్టేరు. వారి కుటంబంలో పరంపరగా శాస్త్రీయసంగీతం లేదు. కాని, వారి తండ్రి, భీమరాయప్పగారికి, సంగీతనాటకాలంటే తగని ప్రీతి. మల్లికార్జున్ అన్న బసవరాజ్ , నాటకాలలో బాగా నటించేవారు. ఆ ప్రభావంవల్ల,  8 ఏళ్ళ మల్లికార్జున్ , ౘదువు వదిలి, నాటకసమాజంలో చేరేరు. యౌవనం వస్తూండగానే గొప్ప నటగాయకుడిగా పేరుపొందేరు. ఆ నాటకసమాజంలోనేవున్న కర్ణాటక సంగీత విద్వాంసులైన అయ్యప్పస్వామి, మల్లికార్జున్ ప్రతిభ గుర్తించి, కర్ణాటకసంగీతంలో ప్రారంభ పాఠాలు నేర్పేరు.

ఒకసారి, బీజపూర్ జిల్లా, బగల్కోటలో జరిగిన నీలకంఠబువా అలూర్మఠ్ ,(అంటే జంగంబువా) గారి గానసభకి మల్లికార్జున వెళ్ళి, వారి దివ్యగానం వినడం తటస్థించింది. జంగంబువా,  మహాగాయకుడు, గ్వాలియర్ ఘరానా విద్వాంసుడు. ముఖ్యంగా బాలకృష్ణబువా ఇఛాల్ కరంజికర్ వారియొక్క ప్రథమశ్రేణి శిష్యవర్గంలో జంగంబువా ఒకరు. వారి గానంవిని మల్లికార్జున మంత్రముగ్ధులైపోయేరు. వారివద్ద శిష్యసేవకి ప్రాధేయపడ్డారు. జంగంజీ మల్లికార్జున పాటనివిని, వెంటనే తమ శిష్యునిగా స్వీకరించేరు. కొంతకాలం తరువాత, మల్లికార్జునతన నాటకసమాజంతో మహారాష్ట్రలోని, మిరాజ్ గ్రామం వెళ్ళేరు. అక్కడ, అట్రౌలీ-జయపూర్ ఘరానాకి చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గారి గానం వారు విన్నారు. ఆ రోజులలో అల్లాదియా ఖాన్ సాహిబ్ ఒక లివింగ్ లిజెండ్ . ఖాన్జీ గానవైదుష్యం జగత్ప్రసిద్ధం. ఆ గానమహిమ మల్లికార్జున మనస్సుని దోచుకుంది. తన మిత్రుడైన మరాఠీ నటగాయకుడైన విష్ణుపంత్ పగ్నిస్ ద్వారా ఖాన్జీ పుత్ర-శిష్యుడైన ఉస్తాద్ మంజి(బద్రుద్దీన్ )ఖాన్ వద్ద, మన్సూర్ శిష్యుడై అట్రౌలీ ఘరానా గానం పూర్తి శ్రద్ధాసక్తులతో నేర్చుకోడం ప్రారంభించేరు. దురదృష్టంవల్ల రెండేళ్ళలోపే మంజిఖాన్ అకాలమరణం పొందేరు. ఐతే అనతికాలంలోనే వారు,ఖాన్జీ రెండవ కుమారుడు ఉస్తాద్ భుర్జీ(షంసుద్దీన్ )ఖాన్ వద్ద శిక్షణ కొనసాగించేరు. ఆ విధంగా వారు సాంతంగా విద్యని నేర్చుకున్నారు. ఆ తరువాత వారు తమ స్వస్థలానికి చేరుకుని, కఠినపరిశ్రమతో, గుర్వనుగ్రహంపొంది, నిత్యశివార్చనద్వారా దైవకారుణ్యం సంపాదించి, తమ అట్రౌలీ ఘరానాలో లోకోత్తర గాయకుడిగా ప్రతిష్ఠ గడించేరు. తమ నాదయోగసిద్ధి ఫలస్వరూపమైన గానంతో, తమ శ్రోతలని రసమయ మనోహర జగత్తులోకి తీసుకువెళ్ళడం వారికి దినచర్యఐపోయింది.

వారి కంఠధ్వని(timbre) విలక్షణ మాధుర్యంతో తొణికిసలాడుతూంటుంది. మంద్ర, మధ్య, తారా సప్తకాలు మూడింటిలోను వారి గాత్రం యొక్క ధ్వని పరిమాణం(volume of the voice), ఏకసమానమైన ధాగధగ్యం (uniform luminosity)తో, రసజ్ఞ శ్రోతలకి అమేయ ఆనందం అందిస్తుంది. ఒక చిత్రమైన ధ్యాన స్పర్శ(a typical meditative touch) తో నిండిన వారి గానధర్మం, శ్రోత అంతరంగాన్ని అనంత శాంతి చైతన్యంతో పునీతం చేస్తుంది. వారి గానం అనితరసాధ్యమైన శ్వాసనియంత్రణతో విలసిల్లుతూ ఆదర్శప్రాయమైన కళామయ  ప్రాణాయామంగా ప్రకాశిస్తుంది. శ్రుతి, స్వర, లయాత్మక రాగ,తాళ సరస సమ్మేళన స్వరూపమైన వారి గానం, శ్రోతలందరిని తరింపచేసే భవసాగర తరణి అనడం సముచితం.

అట్రౌలీ ఘరానాలో కంఠాన్ని పూర్తిగా తెరిచి, “అకార తానప్రయోగం” పాడాలి. ఆ పైన, తాళగత కాలప్రమాణ సూక్ష్మ ఉపవిభజనద్వారా ప్రయోగించబడే మధురస్వర విన్యాసం ఈ ఘరానా వైశిష్ట్యాలలో ముఖ్యమైనది. ఎందుకంటే, ఈ విన్యాసం, ఈ ఘరానా స్వరూపాన్ని నిర్వచించే గొప్ప లక్షణాలలో ఒకటి (one of the best defining features). ఇటువంటి గొప్ప విషయాలలో వారి పరిపూర్ణ వైదుష్యం, కళాత్మకత అనితరసాధ్యమైనవి. మన్సూర్జీ ధార్వాడ, కర్ణాటక విశ్వ విద్యాలయంలో, సంగీతవిభాగానికి ప్రొఫెసర్ గా పదవి నిర్వహించేరు.

భారతదేశ కేంద్ర ప్రభుత్వంవారి “పద్మ విభూషణ్ “, కర్ణాటక విశ్వవిద్యాలయం వారి గౌరవ డి.లిట్ ., పట్టం, మొట్టమొదటి కాళాదాస సమ్మాన్ , సంగీత నాటక అకాడమీవారి పురస్కారం మొదలైన అనేక గౌరవాలు వారికి ఇతోధిక నీరాజనాలర్పించేయి.

వారు కర్ణాటకలోని లింగాయతుల మతశాఖకి చెందినవారు. పరమ శివభక్తితత్పరులు. శివబసవస్వామి, సిద్ధారూఢస్వామి, మృత్యుంజయస్వామి, వారి ఆధ్యాత్మిక గురుత్రయం.

నిత్యమూ వారు స్నానాదికాలు ముగించుకుని, శివపూజతో తమ దినచర్య ప్రారంభించేవారు. పూజకి పూలుకోయడం నుంచి పూజలో మంగళ హారతి వరకు వారి భక్తిమయ శివారాధన సంగీతరసప్లావితమై ప్రవహించేది. వారి భక్తి, బహాదురీతోడి రాగంలోని “హే! మాధవ!“, బిభాస్ రాగంలోని “హే! నర! నారాయణ!“, సావని రాగం లోని “దేవ! దేవ! సత్సంగ!” వంటి  అద్భుత కృతుల గానామృత అభిషేకంతో, శ్రీకంఠుని నిత్యాభిషేకం జరిగేది. శంకరుడు గరళకంఠుడైనా, భక్త మల్లికార్జునుడికి అనుగ్రహపీయూషాన్నే అందించి, వారిని తరింపచేసేడు.

వారు 1991లో తీవ్ర అస్వస్థత పాలయ్యేరు. ధార్వాడనుంచి హుబ్లీకి, అక్కడనుంచి బెంగళూరుకి, చికిత్సకోసం వారిని తీసుకుని వెళ్ళేరు. అప్పుడు వారు సగం అపస్మారకస్థితి లోనేవున్నారు. ఆసుపత్రులలో సగం అపస్మారక స్థితిలోవున్నాకూడా వారి గానం నిరాఘాటంగా సాగుతోనేవుంది. శివమత్ భైరవ్ రాగంలో, వారికి ప్రాణప్రియమైన “దుఃఖ్ దూర్ కరో, మురారి!” అనే కృతి నిరంతరాయంగా వారి కంఠ గోముఖంనుంచి, సంగీతగంగరూపంలో ప్రవహిస్తూనే ఉండేదట!

12—09—1992వ తేదీన తంబూరాని తన సమక్షంలో మీటుతూవుండవలసినదిగా ఆదేశించి, శివభక్తవరులు, మహానాదయోగి మల్లికార్జున మన్సూర్ , అదే సమయంలో దేహం విడిచి శివసాయుజ్యం పొందేరు. వారు ప్రసాదించిన సంగీతసంపద మనకి యూట్యూబ్ లో అందుబాటులోవుంది.

స్వస్తి ||

You may also like...

3 Responses

  1. Sampath Kumar says:

    Namaskaaram guruvugaaru. Excellent information and reviews about Mallikarjun Mansur.

  2. సి.యస్ says:

    82 సంవత్సరాల ఫలవంతమైన మహోన్నత జీవితం గడిపిన
    అత్యుత్తమ సంగీతకారుడు శ్రీ మల్లికార్జున మన్సూర్ సమగ్ర జీవిత చరిత్రని, కొండని అద్దంలో చూపించినట్టు గొప్పగా ఆవిష్కరించావు. సంగీతంలో ఎంతటి ఎత్తుకి ఎదిగారో, భక్తిలో
    అంతటి లోతులూ చూసిన ఆ నాదయోగి గురించి నువ్వు రాసిన
    ‘త్యాగయ్య గారి పల్లవికి మానవ స్వరూపం’ అనే ఒక్క మాట చాలు. అత్యంత రసమయం, అందరికీ స్ఫూర్తి మంతం మల్లికార్జున మన్సూర్ గారి సంగీత జీవన గ్రంథం

  3. Devi says:

    No words to express the happiness felt going through the biography of the great music saint Sri Mallikarjun Mansoor. It’s very interesting and inspiring that these legendary singers not only reached the ultimate heights in Music but also made it their spiritual pathway. Panditji’s Siva Bhakti is evident throughout the article. Your expression and presentation of the theme is perfect and natural.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *