శారదా సంతతి — 17 : ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్
శ్రీశారదా దయా సుధ:—
05—11—2017; ఆదిత్యవారము.
శారదా సంతతి~17 – శ్రీశారదా ప్రియ తనయుడు~గానగంధర్వోత్తముడు-ఖాన్ సాహిబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహిబ్ – హిందుస్తానీ సంగీత గాయకుడు.
ఉత్తరప్రదేశ్ లోని కిరానా అనే ఊరిలో ఉస్తాద్జీ, 11—11—1872వ తేదీన, సత్సంప్రదాయ శాస్త్రీయ సంగీత కుటుంబంలో పుట్టేరు. చిన్నతనంనుండి, తండ్రి కాలేఖాన్ ,పినతండ్రి అబ్దుల్లా ఖాన్ లవద్ద సంగీతవిద్య నేర్చుకున్నారు. వారి మరొక పినతండ్రి ఉస్తాద్ నన్హేఖాన్ , హైదరాబాదు- నిజాం సంస్థానంలో, ఆస్థానసంగీతకళాకారుడిగావుండేవారు.వీరి శిక్షణలో కరీంఖాన్సాహిబ్ ,కిరానా ఘరానాకి చెందిన సంగీతకళామర్మాలని బాగా ఆకళింపు చేసుకున్నారు. బాల్యంనుంచీ ఖాన్జీ సంగీతంలో తన వయస్సుకిమించిన అపార ప్రతిభని కనపరిచేవారు. ఉత్తరభారత వీణ, సారంగి, జలతరంగిణి, నగారా, సితార్ , తబలా మొదలైన వాద్యాలు పూర్తిస్థాయి కళాకారులలాగ వాయించేవారు. వారు వీణపై వాయించిన దర్బారి, పీలూ రాగాల గ్రామఫోను రికార్డులు ప్రస్తుతం ఎక్కడా లభింౘవేమో!
వారు మన శ్రీ బాలమురళీకృష్ణ, శ్రీ చిట్టిబాబు, శ్రీ మేండొలిన్ శ్రీనివాస్ మొదలైనవారిలాగ బాలకళాకారుడు. తమ 11వ సంవత్సరంలోనే సంగీత సభలో పాడి సదస్యులని తమ పాటతో మోహపరవశులని చేసేరు. ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ అక్కగారు, గఫూరన్ బీబీని పెళ్ళి చేసుకున్నారు. ఈ పెళ్ళి ఆయనకి అనువుగా అనిపించక భార్యతో వారు దూరమైపోయేరు. అందువల్ల ఖాన్జీకి,వహీద్జీకి మధ్య ఈ చేదు అనుభవం ఒక దాటరాని గోడగా నిలిచిపోయింది. ఖాన్జీ సోదరిని, మైసూరు సంస్థానంలో ఆస్థాన సారంగీ కళాకాకారునిగావున్న, ప్రఖ్యాత ఉస్తాద్ హైదర్ బక్ష్ వివాహం చేసుకున్నారు. అందువల్ల బక్ష్ జీ, ఖాన్జీని మైసూరు దర్బారుకి తీసుకొచ్చేరు.అక్కడవుండగానే ఖాన్జీకి కర్ణాటక సంగీత సంప్రదాయంగురించి తెలుసుకుని, దానిలోని స్వరకల్పనాది విశిష్ట అంశాలని నేర్చుకునే అవకాశం అందివచ్చింది. ఆ కారణంగానే, వారు, తమ కిరానాఘరానాకి చెందిన గాయనశైలిలో కర్ణాటకపద్ధతిలోని స్వరప్రయోగ నైపుణ్యం ప్రదర్శిస్తారు. అంతేకాక, వారు కర్ణాటకసంగీతంలోని మనోహర, సుప్రసిద్ధ రాగాలని హిందుస్తానీ సంగీతంలోకి ప్రవేశ పెట్టేరు. ఐతే ఈ విషయంలో ఇండోర్ ఘరానా వ్యవస్థాపక మహాకళాకారులు ఉస్తాద్ అమీర్ ఖాన్ సాహిబ్ వారి సృజనాత్మక మహిమ అపూర్వాపరమైనది, అనుపమానమైనదీను! వారిగురించి ప్రత్యేకంగా మరొకసారి మనవిచేసుకుంటాను.
కరీంఖాన్జీ, ఖరహరప్రియ, శుద్ధధన్యాసి, సావేరి, హంసధ్వని, ఆ(అ)భోగి, ఆనన్దభైరవి మొదలైన రాగాల కృతులని పాడేరు. వాటిలో, ఖరహరప్రియ రాగంలో “రామ నీ సమానమెవరు”, శుద్ధ ధన్యాసిలో “ఎంత నేర్చినా” అనే త్యాగరాజస్వామివారి కృతులు ఖాన్ సాహబ్ కంఠంద్వారా అమృతపు సోనలని కురిపిస్తుంటాయి. ఈ రెండు నా కలెక్షన్ లోవున్న కలికితురాయిలలో నాకు అత్యంతప్రీతిపాత్రమైనవి. వీటిని నాకు, USAలోవున్న నా beloved cousin శ్రీ బాలాంత్రపు వెంకట కృష్ణరావు, ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చి, సంపాదించి పెట్టేడు. అతడు నాకు యిచ్చిన సంగీత మహా నిధికి, అతడికి నేను సదా ఋణపడివున్నాను.
కరీంఖాన్జీకి, అబ్దుల్ హక్ సాహబ్ తమ్ముడు, శిష్యుడూ కూడాను. కొంత కాలం వారిద్దరూ కలిసి బరోడా మహారాజా సియాజీరావు గైక్వాడ్ ఆస్థానంలో యుగళగాయకులుగువున్నారు. అప్పటికే అక్కడ ఆస్థాన గాయకులుగా వున్న పటియాలాఘరానా మహాగాయకులైన ప్రసిద్ధ ఆలియా-ఫట్టు జంటని మించి కరీంజీసోదరులు తమ కళావైదుష్యంతో రాజుగారిని, సదస్యులని మెప్పించి అక్కడ ఆస్థాన గాయకులై కొంతకాలంవున్నారు. బరోడాలో రాజమాత మేనకోడలు, తారాబాయి మానేకి ఖాన్సాహబ్ , సంగీతం పాఠాలు చెప్పేవారు. ఆ సందర్భంలో, తారాబాయి ఖాన్జీని ప్రేమించింది. అది గమనించిన రాజకుటుంబం, ఖాన్జీని, తారాబాయిని, అబ్దుల్ హక్జీని బరోడానుంచి బయటకి పంపివేసేరు. బొంబాయిలో ఖాన్సాహబ్ , తారాబాయి మానేని వివాహం చేసుకున్నారు. ఈ రెండవపెళ్ళిద్వారా ఖాన్జీకి, ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిగేరు. హీరాబాయి బరోడెకర్ , కమలాబాయి, సరస్వతీ రాణే కుమార్తెలు. సురేశ్ బాబు మానే, పాప కుమారులు. వీరిలో హీరాబాయిజీ, సురేశ్ బాబుజీ, సరస్వతీజీ సంగీతరంగంలో సుప్రసిద్ధులే!
ఖాన్జీ ఒక సంచార సంగీత మహా ఐంద్రజాలికులు, అద్భుత నాదయోగివరులూ కూడాను. వారు బరోడా, బొంబాయి, పూనా, పాట్నా, మైసూరు, మదరాసు, హుబ్లీ, హైదరాబాదు మొదలైన చాలా ఊర్లలో వుండేవారు. పూనా, బొంబాయి నగరాలలో సంగీత పాఠశాలలు స్థాపించి, గురుకులపద్ధతిలో, భోజనమూ-వసతీ, శిష్యులకి తానే తన ఖర్చుమీద ఏర్పాటుచేసి, విద్య నేర్పేవారు.
వారు రచించిన గ్రంథాలని, “ఓం తత్ సత్ | సామవేదాయ నమః“|| అని ప్రారంభించి రచన కొనసాగించేవారు. ఖాన్జీ ఖయాల్ , ఠుమ్రీ సంగీతాలని కిరానాఘరానా సంప్రదాయబద్ధమైన, తనకి మాత్రమే సాధ్యమైన వైయక్తిక శైలిలో ఖయాల్నికాని, ఠుమ్రీనికాని, ఇతర కృతులనికాని పాడేవారు. కంఠంద్వారా రాగసంబంధమైన కంఠనాద ఉత్పత్తి(voice-production) సంపూర్ణ సామర్థ్యంతోను, శ్రుతి+స్వర+తాళ+లయాదుల సమగ్రవినియోగ దక్షతతోను అనుపమ, అఖండ, అలౌకిక రాగభావపూర్ణ మహిమతో, రసమయగరిమతో పాడడంలో ఆయన అద్వితీయుడు. “అద్వితీయుడు” అన్న ఈమాట ఇక్కడ రెండు అర్థాలలోను వర్తిస్తుంది.
1. ఆయన ఈ రంగంలో మొదటివాడు. ఆయనముందు మరొకడెవడూ లేడు కనుక, ఆయన “అద్వితీయుడు”. అంతేకాదు.
2. ఆయన ఈ రంగంలో, వారి తరువాతకూడా మరొకడులేడు. వారికి ద్వితీయుడులేడు.
వారు, బ్రిటిష్ సంగీతశాస్త్రవేత్త, Mr. E. Clementsతో కలిసి “శ్రుతి సంవాదం” అనే, సంగీతరంగంలో విప్లవాత్మకమైన సిద్ధాంతాన్ని ప్రచారం చేసేరు.
Dr.C.V.Raman అధ్యక్షతన జరిగిన సంగీతశాస్త్రసభలో రెండు వీణలని ఉపయోగించి, 22 సంగీత శ్రుతులని ప్రయోగాత్మకంగా ప్రదర్శించేరుట! వారి “ఆలాపి”, ఆలంకారిక సూక్ష్మ స్వర ప్రయోగాలు, గమకాలు, మీండులు ఇంకా అనేక ప్రత్యేక సంగీత ఆభూషణాలు అనితర సాధ్యాలు. వారి తరవాతవచ్చిన గాయకులలో ముఖ్యమైనవారంతా వారి శిష్యోప శిష్య పరంపరకి చెందినవారే! కపిలేశ్వరి బువా, సవాయి గంధర్వ, బెహ్రె గణేశ్రా మచంద్ర బువా, రోషనారాబేగం(అబ్దుల్ హక్ కుమార్తె), సురేశ్ బాబు మానె, హీరాబాయి, ఫిరోజ్ దస్తూర్ , గంగూబాయి హంగల్ , భీంసేన్ జోషి, ప్రభా అత్రే మొదలైనవారు ఎందరో ఈ పరంపర వారే!
వారు పూనాదగ్గర మిరాజ్ లో ఇల్లుకట్టుకుని అక్కడ స్థిరపడ్డారు.ఖాన్జీ చూడడానికి సన్నగా కనిపించినా, వారు దృఢకాయులు. క్రమశిక్షణతో జీవించేరు.ౘక్కని శరీర వ్యాయామం చేసేవారు. మంచి పొడగరి. సంగీత స్వప్న లోకంలో విహరించే నేత్రాలు విలక్షణంగా వారి ముఖంలో ప్రకాశిస్తాయి. మంచి తలపాగా, అందమైన దుస్తులు, ఆకర్షణీయమైన మీసకట్టు, చేతిలో బెత్తం, ఆయన అంతా మంత్రలోకంనుంచి మనవంటి సంగీతప్రియులకోసం దిగివచ్చిన సుందరగంధర్వుడు, అనిపిస్తారు, వారు!
1937లో దక్షిణభారతంలో సంగీతసభాయాత్రని మహోత్సాహంతో, శిష్యబృందం తోడుగా నిర్వహిస్తున్న ఖాన్ సాహెబ్ మదరాసునుంచి, పాండిచ్చేరి ప్రయాణం చేస్తున్నారు ఉన్నట్లుండి, శరీరంలో ఏదో భరింౘలేని అసౌకర్యం కలిగింది. మార్గమధ్యంలో ఒక స్టేషన్లో దిగి అక్కడ పడుకుని, విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. పడుకుంటూనే, దర్బారీ రాగంలోభగవత్ప్రార్థనలు పాడుకున్నారు. అప్పుడు పడుకున్నారు. అది శాశ్వత నిద్ర. ప్రత్యేక వాహనంలో వారి పవిత్ర దేహం మిరాజ్ తీసుకువెళ్ళి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించేరు. ప్రతిసంవత్సరం ఆగస్ట్ నెలలో, వారి స్మారక సంగీతోత్సవాలు జరపబడుతున్నాయి. వారి గురించి కొందరు పెద్దలు చెప్పిన మాటలు:
“ఆయన(ఖాన్ సాహబ్ ) ఏమి పాడినా అదంతా సంగీతమే!”
—రబీంద్రనాథ్ టాగోర్ |
“స్వరం(సంగీతం) మరణించి హిందు స్తానంనుంచి వెళ్ళిపోయింది”.
ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ |
కరీంఖాన్ సాహబ్ దైవభక్తి పరాయణులు, వారిది సూఫీ దివ్య భావమయమైన భగవత్ప్రేమ, భక్తకబీరుదాసుని విశ్వమయ దేవ భక్తి మార్గంవంటిదే వారిదీను. సాధువులని, ఫకీర్లని దర్శించి, వారి ఆశీస్సులు అర్థించి, పొందేవారు. షిర్డీ సాయిబాబా, తాజుద్దీన్ బాబాలని దర్శించేవారు. తరచు, నాగపూర్ లోని తాజుద్దీన్ బాబాని దర్శించి, వారి ఆశీస్సులు కోరేవారు. వారి సంగీతం అంటే తాజుద్దీన్ బాబాకి పరమప్రీతి. ఒకసారి ఖాన్జీ, బాబా ఆశీస్సులని అడిగేరు. వెంటనే బాబా “నాయనా సాక్షాత్తు అల్లాహ్ నీమీద ఆశీర్వర్షం కురిపిస్తూంటే, నీకు నా ఆశీస్సులు ఏ పాటివి?” అన్నారట. మరొకసారి, ఖాన్జీ సంగీతాన్ని ఆద్యంతం విన్న తాజుద్దీన్ బాబా, పరవశించిపోయి, “నీవు ఈ రోజునించి గాయకలోకానికి నాయకుడివి“, అని దీవించేరుట.
ప్రసిద్ధ సారంగి విద్వాంసుడు, ఉస్తాద్ బాదల్ ఖాన్ ఒకసారి ఇలా అన్నారు: “వారి కంఠంలో పలికే స్వరం, పంచమం ఐనా, ధైవతమైనా, ఏదైనా అదే స్వచ్ఛమైన స్వరం. ఒకవేళ ఆ స్వరం ప్రక్క వాద్యంతో కలవకపోతే, అది ఆ వాద్యం లోపమే!”.
ప్రొఫెసర్ డి. పి. ముఖర్జీ ఇలా అన్నారు: “ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహబ్ శ్రోతలని సంగీత దేవతా పవిత్ర ఆలయంలోకి తనతో తీసుకు వెడతారు. అక్కడ వారే ప్రధాన ఆలయపూజారి. ఆయన మామూలు గాయకుడు కాదు. ఆయన కృతిని పూర్తిగా పాడరు. ఆయన పాడిన పల్లవి ఎందరో సంప్రదాయబద్ధ గాయకులు పాడిన రీతిని అనుసరించదు. వారు మన ఊహకి అందని సంగీత సమీకరణాలని ప్రయోగిస్తారు. పాడేది ఖాన్ సాహబ్ ఐతే, అవన్నీ ఎవరికి కావాలి? ” అంటే శ్రోత సంగీతాధిదేవతయొక్క అనుగ్రహం పొందగలిగేటట్లు పాడగలిగిన మహాగాంధర్వయోగి గాయకుడైనప్పుడు, సాధారణ గాయకులకి అవసరమైన విధి-నిషేధాలనుంచి, ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ సాహబ్ వంటి ఆ గాయకులకి, శ్రీశారదామాత ప్రత్యేక స్వేచ్ఛని ప్రసాదిస్తూంటుంది.
ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ పాదపద్మాల ముందు నతమస్తకుడిని.
స్వస్తి ||
ఒక పరిపూర్ణ కళాత్మక కావ్యంలా ఉంది అబ్దుల్ కరీంఖాన్ జీవితం.
తగ్గట్టుగానే రసాత్మక పదచిత్రాల సమాహారంలా ఉంది రచన.
అద్భుత సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజు ఆయన. మహోన్నత శిఖర సమానులైన వారి శిష్యుల గురించీ పిల్లల గురించి చదివితే ఆశ్చర్యం వేసింది. అనన్యసామాన్యమైన వారి ప్రతిభా విశేషాలు ఎంతో సమగ్రంగానూ, భావస్ఫోరకంగానూ
మనసుకి హత్తకునేలా తెలియచేసినందుకు సంతోషంగా ఉంది.
Ustad Abdul Karim khan Saheb,the legendary Hindustani Music singer’s introduction this week is very important to the lovers of music. His entire life, achievements and his greatest contribution to both Hindustani and Carnatic music is very awesome. Khan saheb’s style, the ease with which he sings and particularly his introduction of Carnatic Ragas into Hindustani is given by you so musically that one feels for sure you were a live audience. I feel proud to be born in this country and pay tribute to the king of Music .