కదంబకం — 16 : కాలం
శ్రీశారదా దయా సుధ :—
15—10—2017; ఆదిత్యవారము.
కదంబకం—16.
ఈ రోజు మన తెలుగు సాహిత్యంలో “కాలం(ము)” గురించి పెద్దలమాటల రత్నాలమూటలని ఒక్కసారి తెరిచి చూద్దాము:—
1.కాలంబొక్క విధంబుననుండక పెక్కు ప్రకారములనుండు భిన్నావస్థన్ |
—నన్నయ-భారతం-ఆరణ్యపర్వం-3.
“కాలం ఒకే విధంగా ఉండదు. ఆయా స్థితి-గతులనిబట్టి రకరకాలుగా మారుతూవుంటుంది”
2.”ధరణి మొదలైన పంచభూతములకంటె
మనసుకంటెను బుద్ధికంటెను మహత్త
రంబు కాలంబు కాలతత్త్వంబు మిగిలి
యుండు విభుడిజ్జగంబులకొడయు డతడు“.
— తిక్కన-భారతం-శాంతి-4.
“భూమి మొదలైన పంచభూతాలకన్న మనస్సు, మనస్సుకన్న బుద్ధి పెద్దవి. ఐతే వీటన్నింటికంటె కాలంబాగాపెద్దది. అటువంటి కాలాన్నికూడా మించి,(ఇటువంటివాటినన్నింటినీ తన వశంలో పెట్టుకున్న) దేవుడు అన్నింటికన్న, అందరికన్న అధికమైనవాడు. అతడు అన్నింటికి ఉత్కృష్టుడు. అన్నింటికి ప్రభువు.”
3.”కళలున్ కాష్ఠలు లోనుగ
కల చిదురుల కూర్చుకొనుచు
కాలంబు జనం
బుల వడ్డికిచ్చు నాతని
వలె అలవడ పొదవి తనకు వశ్యుల
చేయున్ “||
—తిక్కన-భారతం-శాంతి-4.
“కాలం కళలు, కాష్ఠలు మొదలైన చిన్న-చిన్న ముక్కలుగా తనని తాను విభజించుకుని (తన వశంలోవున్న లోకాన్ని)క్రమంగా కబళించివేస్తుంది. కాలం వడ్డీవ్యాపారి వంటిది. వడ్డీవ్యాపారి ఏ విధంగా చిన్న-చిన్న మొత్తాలతో ప్రారంభించి చివరకి మన సర్వస్వాన్నీదోచేసి మనలని ఏమీలేనివాళ్ళని చేస్తాడో అలాగే కాలమూ మనలని క్రమంగా కొంచెం-కొంచెంగా కబళించివేస్తుంది”.
4.”కాలమడగించు జను క
ల్లోలిని గిరి త్రెంచు కరణి లోభక్రోధా
శీలత్వ కామ భయముల
తేలు జనుడు కాలవృత్తితెరగు
నెరుగునే?“|
—తిక్కన-భారతం-శాంతి-4.
” కాలం నది వంటిది.అవిరామంగా అది ప్రవహిస్తూనేవుంటుంది. నది తన ప్రవాహవేగంతో కొండని కోసివేస్తుంది. అలాగే కాలంకూడా తన గమనవేగ తీక్ష్ణతతో నరుడిని తనలోకి కబళించి వేస్తుంది. కాని మనిషి ఈ వాస్తవాన్నిగమనించి తగుజాగ్రత్తలు తీసుకోకుండా కామ,క్రోధ,మోహ,లోభాదులలో చిక్కుకుపోయి, భయంలోపడి కొట్టుమిట్టాడుతున్నాడు.”
5.”కాలము నెవ్వండు కడిమి
గడవగ నోపున్ ?”
భాస్కరరామాయణం-అరణ్యకాండ-3.
“కాలాన్ని తన ప్రతాపంతో ఎవడు దాటగలుగుతాడు?”
6.”కాలమన్నియున్ చేయుచునుండు
కాలము విచిత్రము
దుస్తరమెట్టివానికిన్ “||
పోతన-భాగవతం-|-177.
“విచిత్రమైన కాలం అన్నీ తానే చేస్తూ వుంటుంది. ఎవరైనా కాలాతీతులు కాలేరు”.
7.”కాలము పోవును కడకు మాట
నిలచు“.
—క్షేత్రయ్య.
“కాలం గడిచిపోతుంది. చివరికి మాట మిగిలిపోతుంది”.
8.”కాలమందరికిని కర్తయౌ, కాని
కాలమునకు ఒరుల్ కర్తలు కారు“.
—వరదరాజరామాయణం-కిష్కింధ-378.
“అన్నింటికీ కాలమే కర్త. కాలానికి మరొక కర్త లేడు”.
9.”కాలమొకరీతి ఎవరైన గడుప
గలరె?”
ఆదిభట్ల నారాయణదాసు—సావిత్రీ చరిత్ర—23.
“ఎవరైనా కాలాన్ని ఒకే రకంగా గడపగలరా?”
10. “కాలమా! నీదు మాహాత్మ్య
గరిమ దాట
ధరను సాధ్యంబె జీవనధారులకును?”
—పానుగంటి—సారంగధర—4.
“ఓ కాలమా! నీ మహిమాతిశయాన్నిఈ లోకంలోవున్న మానవులకి దాటడం సాధ్యమేనా?”
స్వస్తి
కాలము మారిన దంత
ర్జాలము బడి చిక్కి జనత సంతస మందెన్,
పూలకు పేపరు వలసెను,
పాలకు పౌడర్లు వలసె బాలాంత్రపు రే!
కాలయాపనమ్మె కడకు జీవన మెల్ల
కత్తిమీద సాము ఉత్తిమాట;
కోర్కె యెంత యున్నొ గొడవయు నంతయే
విశదకిరణసోమ వినుర హేమ!
దేశకాలగతులు దేహసంబంధముల్
బ్రహ్మనైష్ఠికులకు బరువు కావు
బరువు లేనివారె పరమహంసలు సుమా
సూక్తి నాచరించు సుగుణకిరణ!
అన్ని కాలాల్లోనూ కవులూ, మేధావులూ, వేదాంతులూ కాలం మహిమ గురించి ఎంతో చెప్పేరు. ఇక్కడ ఉల్లేఖించిన మన సాహిత్యకారుల కావ్యాలలోని వాక్యాలు ఆలోచనామృతాలు.
కాలాన్ని గురించి భావన చెయ్యడమే ఓ గొప్ప అనుభూతి.
కాలగమనంలో అనేక సంవత్సరాలు గడిచిపోయినా, ఈకాలానికీ సజీవంగా ఉన్న ఈ పలుకులు ,ఆ కవులను కాలాతీత వ్యక్తులను చేశాయి. కూర్చిన కృష్ణ కి అభినందనలు
కాల ప్రవాహ రతుడును,
కాలధునీ తటనివాస కౌశల యుతుడున్ |
కాలాకాల జ్ఞానియు,
ఫాలాక్ష ద్యుతి కిరణుడు, బాలాంత్రపు రే! ||
కాలం గురించి ఎంతో
కూలంకషమైన మేర కొత్తరకంగా
column రాసిన కృష్ణ క
పాలం కావ్యాల పుట్ట బాలాంత్రపు Ray!