కదంబకం — 13 : శ్రీ కాసుల పురుషోత్తమకవి
శ్రీశారదా కారుణ్య కౌముది :—
24—09—2017; ఆదిత్యవారము.
కదంబకం—13.
శ్రీ కాసుల పురుషోత్తమకవిగారి పద్యపుష్పాలు:—
1. “అచటలేవనికదా అరచేతచరచె
క్రుద్ధత సభాస్తంభంబు దైత్యరాజు
అచటలేవనికదా అస్త్రరాజంబేసె
గురుసుతుండుత్తరోదరము నందు
అచటలేవనికదా యతి కోపిననిచె పాం
డవులున్న వనికి కౌరవ కులేంద్రు
డచటలేవనికదా యత్నించె సభనుద్రౌ
పది వల్వలూడ్వ సర్పధ్వజుండు
లేక అచ్చోటులను కల్గ లేదె? ముందె
కలవు, కేవలమిచ్చోట కలుగుటరుదె?
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్ర దేవ”!
“ఆంధ్రవిష్ణుమహాదేవా! అక్కడ నీవు లేవనుకునేకదా, హిరణ్యకశిపుడు తన సభలోని స్తంభాన్ని క్రోధయుతుడై అరచేతితో చరిచేడు? నీవక్కడలేవనుకునేకదా, అశ్వత్థామ ఉత్తరాదేవి గర్భంమీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేడు? అక్కడ నీవు లేవనుకునేకదా అరణ్యవాసంచేస్తున్న పాండవులని కష్టపెట్టడంకోసం దుర్యోధనుడు ముక్కోపి ఐన దూర్వాసుడిని ధర్మజాదులదగ్గరకి పంపేడు? అక్కడ నీవుండవనేకదా, కురుసభలో దుర్యోధనుడు వస్త్రహరణంద్వారా ద్రౌపదిని అవమానించే యత్నం చేసేడు? లేనట్లుగానే అనిపించినా, నీవు ఆయా స్థలాలలో నీ ఉనికిని చాటేవుకదా! ఆయా సందర్భాలలో ముందు లేకుండా, అప్పటికప్పుడు క్రొత్తగా పుట్టుకొచ్చేవా? కాదు. నీవు అన్నిచోటులలోనూ, ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటావు. నీ భక్తుల అవసరాలనిబట్టి, నీ సంకల్పానుసారంగా బహిర్గతం ఔతావు. అంతేకాని లేనిచోటునుంచి క్రొత్తగా పుట్టుకురావు. అలాగే ఈ నీ శ్రీకాకుళం గుడిలోనూ నీవున్నావు“.
2. అఖిలపోషకుడవన్నాఖ్యమాత్రమెకాని
కర్తవు నీవె, భోక్తవును నీవె
అక్షరుండవను ప్రఖ్యాతిమాత్రమెకాని
చర్చింప వేరొండు సాక్షి సాక్షి కలడె?
సుగుణాబ్ధివని నిన్ను స్తుతియించుటయె కాని
నిర్గుణుండెవ్వండు నిన్ను మించి?
విశ్వాత్ముడవటంచు వినుతించుటయె కాని
చొచ్చి నిన్నెవ్వడు చూచినాడు?
వినికిడియెకాని నిన్ను నీ విశ్వములను
మొదలెరుంగుదురే నిజంబునకు చెపుమ?
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్య భావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్ర దేవ!
శ్రీకాకుళాంధ్ర విష్ణు దేవా! అందరూ నిన్ను సృష్టికి అంతటికీ పోషకుడివి అంటారు. నిజం ఆలోచిస్తే కర్తవీ, భోక్తవీ రెండూ నీవే! అంటే పెట్టెవాడివి, తినేవాడివీ ఇద్దరూ నీవే! నీవు శాశ్వతమైనవాడివంటారు. నీవు నిజంగా శాశ్వతుడవే అని నిరూపించడానికి సాక్ష్యం ఏముంది? నిన్ను సర్వగుణశోభితుడంటారు? కాని నీ కంటె నిర్గుణుడు ఎవరు ఉన్నారు? నీవు విశ్వాన్నంతటినీ వ్యాపించి ఉన్నావంటారు? అది ఎంతవరకూ నిజమో ఎవరు తేల్చి చెప్పగలరు? ఈ వివరాలన్నీ వినికిడివలన తెలిసేయి తప్ప నీ చేతల మొదలు-తుద ఎవరైనా స్వయంగా చూసేరా?
3. జీవిని జీవి భక్షింపచేసితివింతె,
కొనిపెట్టినావె చేతనుల కెల్ల,
చేసినంత భుజింప చేసినావింతె, కా
కెక్కువ లెవ్వరి కిచ్చినావు?
కర్మ సూత్రంబున కట్టి త్రిప్పెదవు, కా
కిచ్చ ఒక్కని పోవ నిచ్చినావె?
వెస పృథక్ప్రకృతుల వేరుపెట్టితివి,కా
కందరికైకమత్యమిడినావె?
తెలిసె నీ రక్షకత్వంబు దేవదేవ!
వేరె గతిలేక నిన్ను సేవించ వలసె,
చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకికుళాంధ్రదేవ!
“ఓ దేవాదిదేవా! ఒక ప్రాణికి మరొక ప్రాణి ఆహారం అయ్యే పద్ధతిపెట్టేవు. అంతేకాని క్రొత్తగా ఏమైనాఐకొనితెచ్చి పెట్టడంలేదు. ఎవరి కర్మఫలాన్ననుసరించి వారికి ఏదైనా లభించే ఏర్పాటుచేసేవేతప్ప ఎవరికైనా పిసరఃతైనా ఎక్కువ ఇచ్చేవా? అందరినీ కర్మ అనే తాడుతో కట్టి తిప్పుతావేకాని, ఒక్కడినైనా కాస్తంత స్వేచ్ఛగా విడిచిపెడుతున్నావా? అందరికీ విడివిడిగా, వేర్వేరు స్వభావాలు పెట్టి, ఏమాత్రమూ ఐకమత్యం లేకుండా చేసేవు కదయ్యా? నీ రక్షకత్వమహిమ ఏపాటిదో తెలిసి పోయిందిస్వామీ! వేరే గతిలేక నిన్నే పట్టుకుని వేళ్ళాడవలసిన అగత్యం పెట్టేవుకదా మాకు?”
ఈ విధంగా చాలా తాత్త్వికంగాను,హేళనాత్మకంగాను, వ్యంగ్యంగాను ఉంటూనే అంతర్వాహినిగా లోతైన దైవతత్త్వావగాహనతో ఈ రెండు శతకాలలోని పద్యాలు ఉంటాయి. శతకం చివరలో కవికిగల పరమభక్తి, అనన్య ఆశ్రయ భావం, ఇహలోక సంపదలపట్ల వైముఖ్యం, మొదలైన ఉత్తమశీలధనాన్ని కలగజేసే ఆదర్శపుణ్యమయజీవితానికి సోపానాలని
ఆర్షసంప్రదాయబద్ధంగా కవివరులు బోధించి గ్రంథసమాపనం చేస్తారు.
స్వస్తి ||
మూడు ‘ సీసాలు’ — తియ్య మామిడి రసాలు! భక్తి, వేదాంతము, చమత్కారము – మూడూ కలగలిపిన రసాయనము. విశ్వనాథ అంతటివారిచే ప్రశంసలు అందుకున్న భక్త కవి శ్రీ కాసుల పురుషోత్తముడు. నువ్వు అందించిన పద్య పుష్పాలు శిరస్సున ధరించవలసినవి .