కదంబకం — 12 : మహాకవి భవభూతి

శ్రీశారదా కారుణ్య కౌముదిః :—
17—09—2017; ఆదివారము.

కదంబకం—12.

మహాకవి భవభూతి పవిత్ర భావ ప్రపంచం—జనజీవనకాంతిపుంజం.

ఈ రోజు “శారదా సంతతి”లో భవభూతివర్యులగురించి సంక్షిప్తంగా తెలుసుకుని, వారి బోధ, సందేశం గురించి ఈ శీర్షికలో వివరించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఆ విషయంలో
నిమగ్నమౌదాం!

1. “తపస్వీ! కాం గతోsవస్థాం
ఇతి స్మేరాననావివ |
గిరిజాయాః స్తనౌ వందే
భవభూతి సితాననౌ ” ||

“ఓ తపస్వీ! ఇలాగ ఇబ్బంది పడుతున్నావేమిటయ్యా” ? అని చిరునవ్వులు చిందిస్తున్నాయేమో అన్నట్లు (శివుని కౌగిలి వలన) విభూతి పూతచే తెల్లని చూచుకాలు కలిగిన పార్వతీదేవి స్తనయుగళానికి భక్తితో అంజలి సమర్పిస్తున్నాను.

2. “సర్వథా వ్యవహర్తవ్యం
కుతో హ్యవచనీయతా |
యథా స్త్రీణాం తథా వాచాం
సాధుత్వే దుర్జనో జనః ” ||(ఉ.రా.చ.)

స్త్రీలు మృదుప్రవర్తన కలిగి, మెత్తగా మాట్లాడితే సాధారణమానవులైనా దౌష్ట్యం ప్రదర్శిస్తారు. అందువలన లోకంలో స్త్రీలు కాఠిన్యం వహించి ప్రవర్తించడం మేలుచేస్తుంది.

3. “అంతఃకరణ తత్త్వస్య
దంపత్యోః స్నేహ సంశ్రయాత్ |
ఆనందగ్రంథిః ఏకోsయం
అపత్యం ఇతి కథ్యతే“||(ఉ.రా.చ.)||

భార్యాభర్తల భావప్రపంచ అనురాగ ఫలంగా ఏర్పడిన ఆనందరసమూలమే సంతానమని చెప్పబడుతోంది.

4. “వజ్రాదపి కఠోరాణి
మృదూని కుసుమాదపి |
లోకోత్తరాణాం చేతాంసి
కో హి విజ్ఞాతుమర్హతి” ||(ఉ.రా.చ.)||

లోకంలో శ్రేష్ఠులైన మహానుభావుల మనస్సులని ఎవరు తెలియగలరు? వారి మనస్సులు ఆయా సమయాలని అనుసరించి ఒకసారి కుసుమకోమలములుగాను, మరొకసారి వజ్రసదృశ కఠోరంగాను ఉంటాయి.

5. “ప్రియప్రాయా వృత్తిః వినయ
మధురో వాచి నియమః|
ప్రకృత్యా కల్యాణీ మతిరనవగీతః
పరిచయః|
పురో వా పశ్చాద్వా తదిదమవి
పర్యాసిత రసం|
చరిత్రం సాధూనాం అనుపథి విశుద్ధం
విజయతే” ||(ఉ.రా.చ.)||

నడవడిక చాలా ప్రీతిపాత్రంగావుంటుంది. మాటలు అణకువతో మధురంగావుండడమేకాక నియమబద్ధత కలిగి వుంటాయి. బుద్ధి స్వాభావికంగానే మంగళమయమైనది. అటువంటి వారితో పరిచయం దోషరహితమైనది. ఆ పరిచయానికి ముందుకాని-వెనుకకాని ఏ వైపరీత్యంకాని, రసహీనత వుండనేవుండదు. సాధుచరిత్ర కలవారి జీవితమంతా అడుగడుగునా పరమపవిత్రంగానే వుంటుంది కదా”! || (ఉ.రా.చ.) ||

6. “లౌకికానాం హి సాధూనాం
అర్థం వాగనువర్తతే |
ఋషీణాం పునరాద్యానాం
వాచమర్థోsనుధావతి” ||(ఉ.రా.చ.)||

లౌకికులైన సాధుజనుల మాటలు వారి భావాలని అనుసరిస్తూంటాయి. కాని, ఆద్యులైన ఋషుల వాక్కులని అనుసరించే వారి భావాలు లోకహితం చేస్తాయి. అంటే ఋషులు వశ్యవాక్కులన్నమాట!

7. “యే నామ కేచిదిహ నః
ప్రథయంత్యవజ్ఞాం
జానన్తు తే కిమపి తాన్
ప్రతినైషయత్నః |
ఉత్పత్స్యతేsస్తి మమ కోsపి
సమానధర్మా
కాలో హ్యయం నిరవధిః
విపులా చ పృథ్వీ“||(మా.మాధవమ్ )||

మా రచనలు నచ్చని కొంతమంది వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. వారికి తెలిసినదేదో అలాగే వుండనివ్వండి.నా ఈ ప్రయత్నం వారికోసంకాదు. అనంతకాలంలో, సువిశాలభూమిపై నా వంటి సరసహృదయుడు మరొకడు పుట్టకపోడు.

8. “యద్వేదాధ్యయనం తథోపనిషదాం
సాంఖ్యస్య యోగస్య చ జ్ఞానం తత్కథనేన కిం న హి తతః కశ్చిత్
గుణో నాటకే “||(మాలతీమాధవం)||

వేదాలు, ఉపనిషత్తులు, సాంఖ్యం, యోగం చదివిన జ్ఞానాన్ని ఇక్కడ నాటకానికి వినియోగాంచే అవకాశం ఏమీలేదుకదా?

9. “సాక్షాత్కృత ధర్మాణః ఋషయః“|
(ఉ.రా.చ.)
ఋషులకి ప్రత్యక్షధర్మదర్శనశక్తి ఉంటుంది.

10. “వాక్య ప్రతిష్ఠాని దేహినాం
వ్యవహార తంత్రాణి” ||(మా.మా.)||

మానవ లోకవ్యవహారాలన్నీ మాటల కూర్పులతోనే ముడిపడివున్నాయి.
స్వస్తి||

You may also like...

1 Response

  1. సి.యస్ says:

    ఉత్తర రామ చరిత , మాలతీమాధవం నుంచి ఉదహరించిన శ్లోకాలు చాలా రసవంతంగానూ, భావయుక్తంగానూ ఉన్నాయి.
    ఆయన “విపులా చ పృథ్వీ” ఉదహరించనివారెవ్వరూ ఉండరు.
    పదవ శ్లోకం ,లోకంలో అందరికీ అనుభవపూర్వకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *