శారదా సంతతి — 10 : భవభూతి మహాకవి
శ్రీశారదా కారుణ్య కౌముదీ :—
17—09—2017; ఆదివారము.
శారదా సంతతి — 10 : భవ్య దృశ్య కావ్య రససిద్ధుడు— భవభూతి మహాకవి:—
సంస్కృత మహాకవుల ఘనసంప్రదాయ పరంపరలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు, దండి, భాసుడు, మొదలైన అద్భుత శారదా సంతతిలో ఒక దివ్యకర్పూరకళిక భవభూతి మహాకవి ఒకరు.
భవభూతి పేరు నుంచి ఆయన కాలం నిర్ణయంవరకు అన్నీ నిర్వివాదంగా చెప్పడం కష్టమనేచెప్పాలి. వీరు దక్షిణ భారతదేశంలోని పద్మపురంలో, వైదిక అనుష్ఠానపరులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేరు. వాజపేయయాగం చేసిన ఒక మహాకవి వీరి వంశపరంపరకి చెందినవారని చరిత్ర చెపుతోంది. ఈ వాజపేయ యాజివర్యుల తరంనుంచి లెక్కిస్తే భవభూతి ఐదవతరానికి చెందినవాడు. ఆ పరంపరలో భట్టగోపాలురవారు జన్మించేరు. వీరు వైదిక, లౌకిక విద్యలలో ఆరితేరి,అఖండఖ్యాతిని ఆర్జించేరు. వీరి పుత్రుడు నీలకంఠుడు కూడా తండ్రి అడుగుజాడలలో నడిచి అంతగానూ గణుతికెక్కేడు. నీలకంఠుడి కుమారుడే భవభూతి. ఐతే భవభూతి అసలుపేరు శ్రీకంఠుడు అనే వాదంవుంది. కొన్నిచాటూక్తులవల్ల ఇది నిజమేమోననిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం:—
“తపస్వీ కాం గతోsవస్థాం
ఇతి స్మేరాననావివ |
గిరిజాయాః స్తనౌ వన్దే
భవభూతి సితాననౌ” ||
“భవాత్ శంకరాద్వా భూతిః కావ్యనిర్మాణ దక్షతా విభూతిః ప్రజ్ఞా వా
సంప్రాప్తత్వేన భవభూతిరితి” |
“భవుడు అంటే శంకరునినుంచి, కావ్యనిర్మాణదక్షత అనే ఐశ్వర్యం లేక ప్రజ్ఞని పొందడంచేత భవభూతి అనే (పేరు వచ్చింది).” అని కొందరు నిర్వచించేరు.
భవభూతి తనరూపకాలు కాలప్రియానాథదేవ మహోత్సవాలలో భాగంగా ప్రదర్శితమైనట్లు చెప్పేడు. ఈ దేవుడు యమునాతీరంలోని “కాల్పి” లేక ‘కాలప్రియ’ లోవున్న సూర్యదేవుడని చరిత్ర నిర్ణయం.
సంస్కృతకవి ఐన భవభూతి, ప్రాకృత కవి ఐన వాక్పతిరాజు సమకాలికులే కాక వీరిద్దరూ యశోవర్మమహారాజు పాలించిన కనోజురాజ్యంలో ఆస్థానకవులుగా ప్రశస్తి పొందేరని చరిత్ర చెపుతోంది. వాక్పతిరాజు, భవభూతి రచనలగురించి ఇలాగ అన్నాడు:—
“సాగరసదృశాలైన భవభూతి రచనలు ఆఖ్యానరచనకు మార్గదర్శకాలు“. భవభూతి గురువు “జ్ఞాననిధిపరమహంస” అని తెలుస్తూంది. భవభూతి సాహిత్యంలోనేకాక వేద, వేదాంగాలలోను, వివిధశాస్త్రాలలోను అపారజ్ఞానం కలవాడు. ఆయన సాహిత్యంలో అనేకగ్రంథాలు రచించడమేకాక, అనేకశాస్త్రగ్రంథాలుకూడా వ్రాసిన దాఖలాలువున్నా,
1. “మహావీరచరితమ్ ” |
2. “మాలతీమాధవమ్ ” |
3. “ఉత్తరరామచరితమ్ ” |
అనే ఈ మూడు గ్రంథాలు మాత్రమే మనకి మిగిలేయి. మిగిలిన గ్రంథాలలోని శ్లోకాదులు అనేక ఇతర రచయితల రచనలలో ప్రాస్తావికంగానో లేక ఉదాహరణప్రాయంగానో మనలని పలకరిస్తాయి. వారి “మహావీరచరితమ్ ” రాముడి కథనే ఉత్తరకాణ్డ ముందు జరిగినది నాటకంగా మలచి మనముందుంచింది. “ఉత్తరరామచరితమ్ “లో వాల్మీకి ఉత్తరకాండలోని కథనే దృశ్యకావ్యరూపంలోపరమరమణీయంగా భవభూతి మనకి అందించేడు. కాళిదాసు, భవభూతి వంటి నాటకకర్తలు షేక్స్పియర్ , సోఫోక్లిజ్ వంటివారు. భాసుడు మాత్రం హెన్రిక్ ఇబ్సెన్ , బెర్నార్డ్ షా వంటివాడు. శూద్రకుడు, దిఙ్నాగుడు ఈ రెండు రకాలవారికి మధ్యలో ఉంటారు. సోమదేవుడు, ధనంజయుడు, కుంతకుడు, క్షేమేంద్రుడు, మమ్మటుడు, మహిమభట్టు మొదలైనవారెందరో కవులు, లాక్షణికులు భవభూతిని శ్లాఘించి, వారి రచనలలోని అనేక శ్లోకాలని తమ-తమ గ్రంథాలలో ఉదాహరణాత్మకంగా వినియోగించుకున్నారు. వీటి అన్నింటిని అనుసరించి చూస్తే భవభూతి రచనాకాలం క్రీ.శ.700—730 ప్రాంతంగా చరిత్ర నిర్ణయం చేసింది. కవి,లాక్షణికుడు ఐన రాజశేఖరుడు తాను భవభూతికి అపరావతారంగా వర్ణించుకునేస్థాయికి, ఆయనకి భవభూతి పట్ల ఆరాధనాభావం వుంది.
తన తరవాత కాలంలో ఎంతో కీర్తి, ప్రతిష్ఠలు పొందిన భవభూతి, తన జీవితకాలంలో జనబాహుళ్యంలోను, రాజాస్థానాలలోను, సమకాలీన కవులలోను కూడా పేరు -ప్రఖ్యాతులు సంపాదించేడు. కాని కొందరు విమర్శకులు లేక రంధ్రాన్వేషకుల కాఠిన్యానికికూడా ఆయన గురి ఐనట్లు ఆయన రచనలలోని వారి ప్రతిస్పందనలు నిరూపిస్తున్నాయి. కవులకి, కళాకారులకి చరిత్రలో ఇవి క్రొత్త అంశాలు ఏమాత్రమూకాదు. మహాకవి భవభూతి మహామృదుహృదయుడు కావడంవల్ల వాటికి అంతగా నొచ్చుకున్నాడు. ఆయన బోధ, సందేశము ఈ నాటి “కదంబకం—12″ శీర్షికలో తెలుసుకుందాం”.
స్వస్తి ||
భవభూతిని గురించిన పరిచయం సంక్షిప్తంగా నైనా సమగ్రతతో ఉంది. సంస్కృత కవులలో కాళిదాసు తో సమాన స్థాయి కలిగిన భవభూతి జీవితాన్ని తెలియచేసినందుకు సంతోషం.