కదంబకం — 10 : రబియా (Rabia)
శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
03—09—2017; ఆదివారం.
కదంబకం—10.
ఈ నాడు ఈ శీర్షికలో ఈశ్వరవరపుత్రిక రబియాసాధ్వి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. “శారదా సంతతి”లో కూడా ఈరోజు ఆమె గురించి మాధ్యమపరిమితికి లోబడి అసంపూర్ణంగానే తెలుసుకున్నాం. రబియాని సూఫీ మీరాబాయి అనీ, సూఫీ సెయింట్ థెరీసా అనీ ఆమె జీవితచరిత్రకారులు వర్ణించేరు. ప్రార్థనయోగంలో పరిపూర్ణసిద్ధిపొందిన పరమయోగిని రబియా. ఆమె చేసిన ప్రార్థనలు అలౌకికమైనవి. ఆ ప్రార్థనలలో కొన్ని తెలుసుకున్నా సాధకులకి ప్రార్థనాయోగతత్త్వరహస్యం కొంతైనా అర్థం ఔతుంది. అప్పుడు ఆ సాధకుల సాధన సఫలీకృతపథంలో పయనిస్తుంది.
1. “నీకూ, నాకూ మధ్య ‘అది నేను’ అనేభావం చేరి ఇంకా నన్ను తీవ్రవ్యధకి గురిచేస్తోంది. ఓ దయామయప్రభూ! ఈ “నేను” అనే “అహంస్ఫురణని” మనిద్దరిమధ్యనుంచి పూర్తిగా నిర్మూలించివెయ్యి”!
2. “మనిద్దరం మహాభవనంలో ఏకాంతంగావున్న ఆ క్షణం మధురమైనది, నీవూ-నేనూను. రెండురూపాలలో, ఇద్దరుగా- కాని ఒకేఒక ఆత్మచైతన్యస్ఫూర్తితో- నేనూ-నీవూను“!
3. “వివాహమా! అది నాకెలా జరుగుతుంది? ఇక్కడ “నేను” లేనేలేదు. ఈ “నేను” ఆ “నేను” కాదు. నా ఉనికి ఆయనయందేవుంది. నేను కేవలం ఆయనకి చెందిపోయిన దానిని. ఆయన ఆజ్ఞయొక్కనీడలోనే
నా మనుగడవుంది. నా పై సర్వాధికారాలు ఆయనవే! నాగురించి ఏమి అడగాలనుకున్నా నాస్వామినే అడగాలి. ఇక్కడ దేహమాత్రావశిష్టంగా వున్న ఈ “నన్ను”కాదు.
4. “నేను నిరంతరం ప్రేమించే ఆయన యందే నేను ఉన్నాను. ఒకే దేహంలో మేమిద్దరం చైతన్యరూపంలో ఇమిడి ఉన్నాం! నాలో మీరు ఆయననే చూడగలరు. ఆయన దర్శనంద్వారా మీరు మాఇద్దర్నీ చూడచ్చు”!
5. “నా ప్రియ సఖా! నా ఆశయం ఒక్కటే! ఇహలోకంలోవున్న అన్నిటినీ మించి కేవలం నిన్నొక్కడినీ సదా స్మరించుకోవడమే అది. నా ఎదలో మరొక గాఢలాలసవుంది. పరలోకంలోకూడా నేను కేవలం నిన్నే ముఖాముఖిగా కలవాలి.
6. “ఓ నాప్రాణప్రభూ! ఓ నాజీవనసఖా! సంపూర్ణంగా నేను నీదాననే! మరి నీవు అంతా నావాడివి కావా“?
7. “నిశ్శబ్దం దైవంకాదు; సంభాషణా దైవంకాదు. ఉపవాసమూ దైవం కాదు, భొజనమూ దైవం కాదు. ఏకాంతమూ దైవం కాదు, జనసాంగత్యమూ దైవం కాదు. నీ జీవలక్షణమైన కర్మద్వారాకూడా దైవం పట్టుబడడు. నీ హృదయజన్య అనురాగంద్వారా మాత్రమే ఆయన లభ్యం ఔతారు. హేతువువలనకాని, ఆలోచచనద్వారా కాని ఆయనని పొందలేరు. బుద్ధిప్రజ్ఞకి ఆయన అతీతుడు.కేవలం నీ హృదయభవప్రేమద్వారా ఆయననిమాత్రమే వరించి ధన్యతని పొందగలవు”.
8. “ఓ నా జీవా! ఎంతకాలం? ఇంకా ఎంత కాలం ఇలా నిద్రలో జీవితం వ్యర్థం చేసుకుంటావు? ఎన్ని మారులు తాత్కాలికంగా నిద్రనుంచి మేలుకుంటావు? కాలుడు నీ జీవిత కుటీరం తలుపులు తట్ట బోతున్నాడు. నీ దేహం మెలకువలేని శాశ్వతనిద్రలోకి జారుకోబోతోంది. పునరుత్థాన దిన తూర్య నినాదం వినబడేవరకు జడంగా అలాగే ఉండిపోతావా”?
9. “జీవా! నీకింక పశ్చాత్తాపం తప్పితే వేరే గతిలేదు. ఇహలోకజీవితమూ, ఇక్కడి సుఖసంతోషాలూ అన్నీ కదిలిపోయేవీ, కరిగిపోయేవీనూ! అందువల్ల పశ్చాత్తాపం కాక ఇంక ఏమి మిగిలింది, నీ జీవిత చరమాంకంలో”?
10. ” ఓ నా ఆనందస్వరూపా! నా హృదయగత ఏకైక కాంక్షా స్వరూపా! ఓ నా ప్రియ సఖా! నా జీవన సర్వస్వమా! నా అనురాగపూర్ణరూపా! నా స్వామీ! నా వల్ల నీవు పూర్తిగా సంతోషాన్ని పొందితేనే నా జీవితం
సఫలం ఔతుంది. అనంత ఆనందమయినై నీ పవిత్రపాదద్వయంవద్ద నేను శాశ్వతసుఖస్థితిని పొందుతాను”.
11. “ఓ ఈశ్వరా! నా ప్రభూ! ఆకాశంలో నక్షత్రాలు ధగధగలాడిపోతున్నాయి. కునికిపాట్లతో మానవుల కన్నులు నిద్రకి చేరువౌతున్నాయి. రాజులు తమ భవనద్వారాల తలుపులు మూసివేసేస్తున్నారు.
ప్రతి ప్రియుడు తన ప్రేయసితో ఏకాంతంగా ఉన్నాడు. నేనిక్కడ నా ఏకాంతంలో నీతో, నా మనోహరుడివైన నీతో ఉన్నాను“.
12. ” నా ఆశయం నెరవేరుతుందని నా ఆశ. ఆయనతో ఐక్యం చెందడమే నా ఆశయం. నా హృదయకాంక్షకి పరమగమ్యం అదే “!
స్వస్తి||
చాలా బావుంది. బాపురే (“బాలాంత్రపు రే!”) పద్యాలు 105, 106 జ్ఞాపకానికి వస్తున్నాయి.
Rabiyaa saadhivi gurinchi ippudee telusukunna. Chaalaa baagundi. Puurti advaiti
రబియా ప్రార్థనలు ఎంత స్వచ్ఛతతో నిండి ఉన్నాయి!
ఎంత నిర్మల హృదయ ఆమె!
మన అద్వైత తత్త్వం తో పాటు నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన ‘సఖ్యం’ కూడా స్ఫురణ కొస్తోంది.
ఇంకొక కోణంలొంచి చూస్తే ఆప్రార్థనల నిండా అత్యద్భుతమైన పోయిట్రీ నిండి ఉంది ఖలీల్ జిబ్రాన్ రాసిన ‘ది ప్రాఫెట్ ‘ లో లాగ.
నువ్వు చేసిన తెలుగు -అనువాదం లాగ లేదు. మంచి నుడికారంతో హృదయంగమంగా ఉంది.
ఈ ప్రార్థనలు అందరికీ నిత్య పారాయణా యోగ్యములు.