శారదా సంతతి — 8 : రబియా
శ్రీశారదా కారుణ్య కౌముదీ :—
03—09—2017; ఆదివారం.
శారదా సంతతి—8.
సూఫీ యోగిని “రబియా“.
రబియా ఇస్లాంమతవిభాగమైన “సూఫీ”తత్త్వమార్గంలో పయనించి, సాధకలోకానికి దైవాన్ని చేరుకోవడానికి క్రొత్తదారులు చూపిన మొదటితరం సూఫీవేదాంతులకి చెందిన ఉత్కృష్ట యోగిని.
ఆమెఎక్కడ, ఎప్పుడు పుట్టిందో ఖచ్చితంగా తెలియదు. గర్భదారిద్ర్యంలో పుట్టింది. అక్క-చెల్లెళ్ళలో ఆమెనాలుగవది. ఆమె అల్లాహ్ లో ఐక్యం ఐన సంవత్సరం క్రీ.శ.752 లేక 801 అని వివాదంలోవుంది.
ఘోరమైన కరవువల్ల కుటుంబం చెల్లాచెదురైపోయింది. రబియాని చిన్నపిల్లగావుండగానే ఎవరో ఎత్తుకుపోయి ఒకరికి బానిసగా అమ్మడంజరిగింది. క్రూరుడైన యజమాని ఎంతతిట్టినా, కొట్టినా
ఆ చిన్నవయస్సులోనే అదంతా తనని సృష్టించిన ఈశ్వరేచ్ఛవల్లే జరుగుతోందని భావించి ధైర్యంగా అనుభవించింది. ఒకసారి బానిసబ్రతుకులోని దుర్భర బాధ భరించలేక పారిపోవడానికి
చేసిన ప్రయత్నంలో ఎడమచెయ్య విరిగింది. వెంటనే తన ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఇలా ప్రార్థించింది:—
“ఓ ప్రభూ! పరమదయాళువైన నాస్వామీ! నాకు తలితండ్రులు లేరు. అనాథని. రాత్రింబవళ్ళు బాధలోను, దుఃఖంతోను బానిసబ్రతుకుని ఈడ్చుకువస్తున్నాను. ఇలాచూడు. ఇదిగో నా ఎడంచెయ్యి విరిగిపోయింది. నా దివ్యప్రభూ! నీ అనుగ్రహానికి నేను నోచుకోకపోవడంవల్ల ఇదంతా నాకు సంభవిస్తోందా? చెప్పు స్వామీ“!
అంటూ ప్రార్థన చేసింది. ఇదంతా ఆమె బస్రానగరంలో ఉండగా జరిగింది. ఇదంతా ఇలా జరుగుతూండగా ఆమె లోపలనుంచి ఒక కంఠం ఇలా వినిపించింది.
“నా చిన్నారీ! నీతో ఇలా చెపుతూన్న నామీద నీసర్వ సంరక్షణబాధ్యతని ఉంచు. నేను నీస్వామిని. నీ బాధలన్నీ త్వరలో పూర్తిగా పోతాయి. కాని ఈ భూమిపై పుణ్యాత్ములకి నీవు దైవకారుణ్యానికి చిహ్నమై నిలుస్తావు“.
ఇది జరిగినవెంటనే రబియా తన యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇదే ఈశ్వరసంకల్పంగా స్వీకరించింది. కొంతకాలంతరవాత, ఒకరాత్రి నిద్రించే ముందు దినచర్యలోభాగంగా తన శిథిలకుటీరంలో ప్రార్థన చేసుకుంటూంది. యాదృచ్ఛికంగా యజమాని ఇది గమనించి, ఇంతచిన్న పిల్ల ఏంచేస్తోందోగమనిద్దామని చాటుగావుండి, రహస్యంగా ఆమె ఈ ప్రార్థనని విన్నాడు:—
“ఓ ప్రభూ! నీకు సర్వమూ తెలుసు. నీ పట్ల నాకున్న ఆశయాలన్నీ నీకూ తెలుసు. నేను సంపూర్ణంగా నీకు విధేయురాలినైవుండాలని తపించి పోతున్నానని నీకు తెలుసు. నీ పవిత్ర పాదసేవలోనే నా కనులకాంతులు సదా నిమగ్నమైవున్నాయని నీకు తెలుసు. నాకు పూర్తి స్వేచ్ఛవుంటే పిసరంత సమయంకూడావ్యర్థంకాకుండా నేను నిన్నే సేవించుకోవడానికి తహతహలాడుతున్నాను. కాని నీవు సృష్టించిన ఒకజీవికి, నేను బానిసగావుండాలని నీ సంకల్పం. అందువల్ల నీవు నాకు యిచ్చిన సమయంలో చాలాభాగం అతడి సేవకి ఖర్చైపోతోంది“.
యజమాని చాటుగా ఆమె ప్రార్థన అంతా విన్నాడు. ఆమె తలపై ఏ ఆధారమూలేకండా వ్రేలాడుతున్న దీపం చూసేడు. ఆమె చుట్టూ ఒక కాంతివలయాన్ని గమనించేడు. ఆమె కుటీరమంతా విచిత్రదీప్తితో
ప్రకాశించడంచూసి అతడు ఆమెతో ఇలా అన్నాడు:—
“నేను ఘోరపాపం చేసేను. ఈశ్వర భక్తురాలిని నా యింటి బానిసగా చేసేను. ఓధన్యకన్యా! నీవు ఈశ్వరవరపుత్రికవి. దైవం నాయందుదయతో నాకళ్ళుతెరిపించేడు. నీవు నాయింట యింక దాసివి కావు. నేను నిన్ను అల్లా బిడ్డగా సేవించుకుంటాను.” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనని ఓదారుస్తూ రబియా ఇలా అంది:—
“అయ్యా! ఇన్నాళ్ళూ అన్నంపెట్టి నన్ను ఆదరించేరు. మీ మేలు నేను ఎన్నడూ మరవను. కాని నాకు స్వేచ్ఛని ప్రసాదించమని అర్థిస్తున్నాను. అప్పుడు నేను అల్లాహ్ ని స్వేచ్ఛగా సదా సేవించుకుంటాను“.
అని ప్రార్థించి అతడి అనుమతితో బయటకి వెళ్ళిపోయి, బస్రానగరంలోనే ఒక చిన్నిగుడిసెలో ఏకాంతనివాసం ప్రారంభించింది రబియా. సాధ్వి రబియా జీవితం అంటే ప్రార్థనకి పర్యాయపదం. రోజంతా రాత్రీ, పగలు అనుక్షణము ఈశ్వరుణ్ణి పరమప్రేమతో ప్రార్థించడమే ఆమె దినచర్య, వారచర్య, మాసచర్య, వర్షచర్య, ఆమరణ పర్యంత జీవితచర్య అని చెప్పాలి. ఆమె జీవితంలో ఎందరెందరో అనేక
పర్యాయాలు అమితధనాన్ని, వస్తుసముదాయాన్ని, ఆస్తిపాస్తులని ప్రతిఫలాపేక్షలేకండా ఇస్తామని వచ్చేరు. ఆమె ఏ ఒక్కటీ స్వీకరించలేదు. ఆమె ప్రార్థన ఒకసారి ఇలా కొనసాగింది:—
“ ఓ ప్రభూ! ఇహలోకసంపదని నీవు నాకు ఏమైనా ఇవ్వదలిస్తే అదంతా నిన్నుకాదనేవారికి, నీ నామాన్ని దూషించేవారికి యిచ్చెయ్యి. పరలోకభాగ్యాన్ని యివ్వదల్చుకుంటే, ప్రభూ! దానినంతా నీ గుణగణాలని సంకీర్తనచేసే పుణ్యాత్ములకి, నీ పవిత్ర నామజపంచేసే ధన్యాత్ములకి అందించు.నాకు నీవు ఒక్కడివే చాలు! ఇంకేమీ వద్దు కాక వద్దు“.
ఒకసారి రబియాదేవికి కొంచెంఅస్వస్థత కలిగింది. ఆమె సత్సంగసభ్యులైన హసన్ , మలెకె దీనార్ , షకికె బల్ఖి ఆమెని చూడవచ్చేరు. కుశలప్రశ్నలైన తరవాత వచ్చిన ముగ్గురి సంభాషణ ఇలా నడిచింది:
హసన్ :— ఈశ్వరేచ్ఛవల్ల కలిగిన దుఃఖాన్ని ఓర్పుతో భరించగలిగినవాడే దైవ ప్రేమికుడు అనుకోవచ్చు!
రబియా:— ఈ మాటలు జీవాహంకార వాసనతో నిండివున్నాయి.
షకిక్ :— ఈశ్వరేచ్ఛవల్ల కలిగిన దుఃఖం కృతజ్ఞతతో స్వీకరించగలిగినవాడు అసలైన దైవప్రేమికుడు.
రబియా:— ఇంతకంటె ఇంపుగా ఈ విషయం చెప్పలేమా?
మలెకె దీనారు:— దైవప్రేమికుడు ఈశ్వరేచ్ఛతోకలిగిన దుఃఖాన్ని సంతోషంతో స్వీకరిస్తాడు.
రబియా:— ఇంక ఇంతకన్న బాగా ఏమీ చెప్పలేమా?
ముగ్గురూ(ముక్తకంఠంతో):— ఇప్పుడింక నీవే చెప్పగలవు, రబియా!
రబియా:— పూర్ణదైవప్రేమికుడు ఈశ్వరేచ్ఛద్వారా తనకి సంక్రమించినది అసలు దుఃఖమో లేక సుఖమో తెలియని ప్రేమపారవశ్యస్థతిలో ఉంటాడు.
ప్రస్తుతానికి ఈ శీర్షికలో ఇక్కడ విరామం ఇద్దాము!
స్వస్తి||
క్రూరుడైన యజమాని…
“రబియా” జీవితచరిత్రలో పొరబాటున “కౄరమైన” అని పడింది. దానిని “క్రూరమైన” అని సవరించబడింది. “క్రూ” సంయుక్తాక్షరమేకాని, ఏకాక్షరం
కాదు. ఈ విషయాన్ని గమనించి, సూచించిన శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ (చెన్నై) గారికి ధన్యవాదాలు.
రబియా జీవితచిత్రం కళ్ళకు కట్టినట్టు, మనసుకు హత్తుకునేలా తీర్చి దిద్దేవు. అంతటి అనన్యమైన భక్తి భావం రబియా వంటి యోగినులకే సాధ్యపడింది. ఆ ముగ్గురి సంభాషణలో ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే , ఆమె ఆత్మసాక్షాత్కారం జరిగిన సిద్థపురుషుల కోవలోకి చెందిన మహా యోగిని అనేది సుస్పష్టం.
“రబియా” జీవితచరిత్రలో పొరబాటున “కౄరమైన” అని పడింది. దానిని “క్రూరమైన” అని సవరించబడింది. “క్రూ” సంయుక్తాక్షరమేకాని, ఏకాక్షరం
కాదు. ఈ విషయాన్ని గమనించి, సూచించిన శ్రీ బాలాంత్రపు కిరణ్ సుందర్ (చెన్నై) గారికి ధన్యవాదాలు.