కదంబకం — 8 : శబ్దం

శ్రీశారదా దయా చంద్రికా :—
20—08—2017; ఆదివారము.

కదంబకం—8.

ఈ వారం “మాట” లేక “శబ్దం” గురించి డా.బి.శ్రీనివాస్ గతంలోచేసిన సూచన మేరకి ఈ క్రింది విషయాలు సంక్షిప్తంగా చర్చించుకుందాం.

1. “స్ఫోట(ము)”/ శబ్దబ్రహ్మవాదం.
2. “నాదబ్రహ్మ”వాదం.
3. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ తత్త్వవివేచన.

1. స్ఫోట(ము)/శబ్దబ్రహ్మవాదం:— స్ఫోటవాదాన్ని భర్తృహరి తన “వాక్యపదీయం”లో శాస్త్రప్రమాణాలతో నిరూపించి, లోకంలో సుప్రతిష్ఠితం చేసేడు. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత మతాలకి వరుసగా ఆదిశఙ్కర, రామానుజ, మధ్వ ఆచార్యులవారెలాగో ఈ స్ఫోటమతానికి భర్తృహరి అలాగన్నమాట. ఇంక అసలువిషయంలోకి వద్దాం!
ఈ పంచభూతాలతోనిండిన సర్వసృష్టి పరబ్రహ్మతత్త్వంనుంచి ఎలాపుట్టిందో అలాగే సర్వసృష్టిని నిర్దేశించి, వర్ణన శక్తితో వివరించగలిగిన మన మాటల ప్రపంచానికంతటికీ శాశ్వతమైన మూల ఆశ్రయతత్త్వమే “స్ఫోట(ము)”. అంటే నిరంతర పరిణామ శీలి ఐన ఈ ద్రవ్యమయవిశ్వాన్ని వివరించగలిగిన మాటల/వాక్యాల సముదాయంకూడా మారిపోతూనే వుంటుంది. మారిపోయే లక్షణమున్న
ప్రతిదానికి ఎప్పుడూ మారకుండా స్థిరంగావుండే ఆశ్రయం ఒకటివుండాలి కదా! మారే ఈ విశ్వానికి మార్పులేని బ్రహ్మ ఎలాగో మారిపోయేమాటలకి స్ఫోట/శబ్దబ్రహ్మ అలాగ! అంటే విశ్వ
తత్త్వమూలమైనబ్రహ్మ=విశ్వనామ రూపమైనశబ్దప్రపంచతత్త్వమూలము స్ఫోట. అంటే పరబ్రహ్మ=శబ్దబ్రహ్మ ఐన స్ఫోట. పరబ్రహ్మానుభవానికి ప్రస్థానత్రయ శ్రవణ, మనన, నిదిధ్యాసలు ఎలాగో స్ఫోట/శబ్దబ్రహ్మానుభవానికి పాణినీయం/ పతంజలిమహాభాష్యం/కాత్యాయనాది కారికలు, కౌముది మొదలైనవాటి శ్రవణ-మనన-ధ్యానాదులవలన ముక్తి కలుగుతుంది. మానవుడికి సంబంధించిన సర్వకళలు, విద్యలు, శాస్త్రాలు వ్యాకరణసంశోధితమైన సాధుశబ్దస్వరూపబద్ధమై సువ్యవస్థితమై వున్నాయి. ఆ మాటకి వస్తే మన ఈ ప్రేషణాలన్నీ మాటల ద్వారానేతప్ప వేరేదారిలో వివరించలేము. దీనినే శబ్దబ్రహ్మోపాసన అంటారు.

2. నాదబ్రహ్మ:—స్ఫోట, నాదము పరస్పరసంబంధంకలిగినవి. ఆ మాటకివస్తే మనకితెలిసినా, తెలియకపోయినా, మనం ఔనన్నా,కాదన్నా ఇటువంటితో ఏనిమిత్తమూ లేకుండా మనందరికీ స్ఫోటతో సంబంధమూ-అనుబంధమూ వుంది. ఐతే స్ఫోటకి-నాదానికిసంబంధం ఇలాగ వుంటుంది.
స్ఫోట స్ఫోరకం- నాదం స్ఫురణ
స్ఫోట మూస – నాదం ముద్ర
స్ఫోట వ్యంజకం – నాదం వ్యంజనం
ఈ నాదం సూక్షరూపంలో ఒకవైపు మంత్రంగాను, మరొకవైపు సంగీతంగాను మన అనుభవంలోవుంది. మంత్రోపాసనద్వారాగాని, సంగీతోపాసనద్వారాగాని సగుణ లేక నిర్గుణ బ్రహ్మోపాసనచేసి మన
పూర్వులెందరోతరించారు. మంత్రోపాసనలో సాధకుడు సంప్రదాయబద్ధంగా దీక్షతీసుకుని సంపూర్ణ అంకిత భావంతో సాధనచెయ్యాలి. సంగీతోపాసనలో సాధకుడు చక్కని గురుశుష్రూసద్వారా అపారసాధనచేసి సంగీతశారదని శ్రద్ధాసక్తులతో సేవించి తరించవచ్చు.అలాగచెయ్యలేనివారు గాఢభక్తిభావంతో కేవలం సంగీతం వినడంద్వారానే తరించవచ్చు. సంగీతగాన,వాదన,శ్రవణ తత్పరులు
అందరూ సంగీతోపాసనాసాధకులే.

3. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ: శ్రీలలితాసహస్రనామస్తోత్రంలో ఈ నాలుగూ శ్రీలలితాపరాంబిక రూపాలుగానే వర్ణించబడ్డాయి. మనందరికీ వశంలోవున్నది వైఖరీవాక్కు ఒక్కటే. ఆ వైఖరీవాగ్రూపంలోనే మానవప్రపంచ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. మిగిలినమూడింటిని వివరించుకోవడానికి మనం నిర్వచనాలు, వాటి వ్యాఖ్యానాల జోలికి పోకుండా ఒకటి/రెండు ఉదాహరణ/ల ద్వారా తెలుసుకునే ప్రయత్నంచేద్దాం! భూమిలో బంగారం ఖనిజరూపంలో ఉంది. అది పరావాక్కు వంటిది. ఆ ఖనిజాన్ని బయటకితీసి శుద్ధిచేసి బంగారపుముద్దగాచేస్తే దాన్ని పశ్యంతీవాక్కు అనవచ్చు. ఆ బంగారాన్ని అనేక ఆభరణాల రూపాలని తనలో ఇముడ్చుకున్న మూలద్రవ్యంగా భావిండం మధ్యమావాగ్రూపం. అలాగకాక దానినుంచి మనకికావలసిన ఆభరణాన్ని రూపొందించుకోవడం వైఖరీవాక్కు. అలాగే సౌరవిద్యుత్తుగల సౌరశక్తి, జలవిద్యుత్తుగల జలశక్తి, ఉష్ణవిద్యుత్తుగల అగ్నిశక్తి మొదలైనవన్నీ సామాన్యశక్తినిధులుగా పరావాక్కు వంటివి. బయటకితీయబడి విద్యుత్కేంద్రాలలో నిక్షిప్తంచేయబడిన విద్యుచ్ఛక్తి పశ్యంతీరూపం వంటిది. ఇళ్ళల్లో తీగలద్వారా ప్రవహించే విద్యుత్తు మధ్యమ వంటిది. ఇంక గృహోపకరణాలలో కాంతిగా, శబ్దంగా,ఉష్ణంగా, శీతలంగా ఇలాగ అనేక విధాలుగా వ్యక్తమయ్యేదంతా వైఖరీ రూపమే.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. Chaganty RamaRao says:

    Chaalaa lootugaaa anvvayaatmakamgaa chhuda valasina vishayam idi.

  2. CS says:

    గణితశాస్త్ర సమీకరణం (mathematical equation) వివరించినట్టు , సర్వసృష్టి మూలమైన బ్రహ్మలా శబ్దసమస్తానికి మూలమైనది స్ఫోట అని స్ఫుటంగా అర్థమయ్యే ట్టు చెప్పేవు.
    అసలు ‘శబ్దబ్రహ్మ’ అనీ ‘నాదబ్రహ్మ’ అనీ ఎందుకంటారో తెలియవచ్చింది.
    లలితాసహస్రం చదివినప్పుడల్లా ‘పరా, పశ్యంతీ,మధ్యమా, వైఖరీ’ గురించిన సందేహం కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సోదాహరణల వివరణతో సమాధానం దొరికినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *