శారదా సంతతి — 6 : శ్రీ యామునాచార్యవర్యులు : రెండవభాగం

శ్రీశారదా వాత్సల్య దీప్తిః :—
20—08—2017; ఆదివారము.

శారదా సంతతి—6—రెండవభాగం. శ్రీ యామునాచార్యవర్యులు—2.

రాజలాంఛనాలతో, పండితమర్యాదలతో యామునాచార్యుడిని ఆహ్వానించి రాజసభలో విద్వజ్జనకోలాహలుడికి ఎదురుగా తగిన సువర్ణమయ ఆసనంలో కూర్చుండబెట్టేరు. యామునాచార్యుడు 12 ఏళ్ళ
వయస్సువాడైనా శారదానుగ్రహ ముఖతేజస్సుతో మణిదీపంలాగ వెలిగిపోతున్నాడు. రాజుగారికి విద్వజ్జనకోలాహలుడి పాండిత్యంమీద నమ్మకంఎక్కువ. అతడు పోటీలో తప్పకగెలుస్తాడని సభలో తనప్రక్క సింహాసనాసీనురాలై వున్న రాణికి తన అభిప్రాయం చెప్పేడు. రాణిగారు రాజుగారిమాటలు అంగీకరించక బాలశారదకి ప్రతిరూపంలావున్న యామునాచార్య పోటీలో గెలిచితీరతాడని చెప్పింది.
భార్యాభర్తలకి మాటా-మాటా పెరిగి విషయం పందెంవరకుదారితీసింది. రాణిగారు బాలుడు ఓడిపోతే రాజుగారిదాసీలకి ఊడిగంచేస్తానంది. రాజుగారు బాలుడు నెగ్గితే అర్థరాజ్యం యిచ్చి అతడికి రాజ్యాభిషేకం చేస్తానన్నాడు.

విద్వజ్జనకోలాహలుడు యామునాచార్యుడికి ఒక అవకాశం యిచ్చి వెనక్కితగ్గిపొమ్మని హెచ్చరించేడు. తగ్గకపోతే అతడికి, భాష్యాచార్యులకి తీవ్రరాజదండన తప్పదని భయపెట్టేడు. యామునాచార్యుడు చిరునవ్వుతో ఆ ప్రతిపాదనని తిరస్కరించేడు. ఇద్దరికి హోరాహోరీగా వివిధ శాస్త్రాలలో వాదోపవాదాలుజరిగేయి. పండితపరిషత్తు ఇద్దరిలో ఏఒక్కరినీ విజేతగా నిర్ణయించలేకపోయింది.

ఇద్దరికి వారి ఇష్టానుసారం ప్రత్యర్థిని చెరొక మూడుప్రశ్నలువెయ్యడానికి అవకాశం యివ్వబడింది. ఆస్థాన పండితుడి భయంవల్ల పండితపరిషత్తు మొదటి అవకాశం కోలాహలుడికి కట్టబెట్టింది. అతడిప్రశ్నలన్నింటికి యామున అలవోకగా సమాధానం చెప్పేడు. రాజుగారికి, పండితపరిషత్తుకి, సభాసదులకి, ఆఖరికి కోలాహలుడికికూడా యామునయొక్క పరిణతప్రజ్ఞకి అంతులేని ఆశ్చర్యం
కలిగింది. ఆ బాలుడి అనాయాసప్రతిభకి అక్కడివారందరికి ఆనందం, ఆశ్చర్యం, ఆదరం, గౌరవం ఏకకాలంలో కలిగేయి. యామునాచార్యుడికి, విద్వజ్జన కోలాహలుడిని మూడుప్రశ్నలు అడిగే
అవకాశంవచ్చింది. అప్పుడు వారిద్దరికి జరిగిన సంభాషణ యిది.:

యా:— నేను ఇప్పుడు ఒకవ్యతిరేకార్థ వాక్యాన్ని, తరవాత రెండు అనుకూలార్థ వాక్యాలని చెపుతాను. మీరు మూడింటినీ కాదని తిరస్కరించి నన్ను ఓడించాలి. అలాగ మీరు చెయ్యలేకపోతే మన ఈ పోటీలో
మీరు ఓడిపోయినట్లే! ఏమంటారయ్యా?
వి:— (భయం,భయంగానే-లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ) ఓ! అలాగే! అది వేరే చెప్పాలా? నీ మొదటి వాక్యం చెప్పు, మరి.
యా:— మీ తల్లిగారు గొడ్రాలు(వంధ్య) కాదు. (ఈ వాక్యాన్ని తిరస్కరిస్తే తనతల్లి వంధ్య అని అంగీకరించడమే! అలాగైతే  తాను ఆమెకి ఎలాపుట్టినట్టు?–అని తర్జనభర్జనపడి ఏమీచెప్పలేక ఇలా అన్నాడాయన)
వి:— ఈలోగా నేను ఆలోచిస్తూంటాను. నీ రెండవ వాక్యంచెప్పు.
యా:— ఈ రాజుగారు పుణ్యాత్ములు.
వి:— – – – – – – – -మరి – – – మూడో- – -వా- – – క్యం?
యా:— ఈ రాణిగారు పతివ్రత.

విద్వజ్జనకోలాహలుడు నిర్వణ్ణుడై (తన్ను తాను నిందించుకుంటూ) నిశ్చేష్టుడై(కదిలికలేమీలేకుండా) ఉండిపోయేడు. రాజుగారు యామునతో యిలా అన్నారు.

రాజు:— మీరు వయస్సులో బాలరైనా, బహుళశాస్త్రవైదుష్యంలో వృద్ధులు; బుద్ధిలో బృహస్పతివంటివారు. మిముకన్నతలితండ్రులు ధన్యులు. మీ గురూత్తములు ధన్యాత్ములు. ఆద్యంతమూ మీ పాండిత్యవైభవం నిరుపమానం. నాకొకసందేహం. మీ మూడు వాక్యాలలో ఒక్కదానినైనా మీరు కాదని శాస్త్రప్రమాణంతో సమర్థించి నా ముచ్చట తీర్చగలరా?

యా:— మహాప్రసాదం, ప్రభూ! తమ అనుజ్ఞ అయ్యిందికనుక మూడు వాక్యాలని శాస్త్రమర్యాదమీరకుండా తిరస్కరించి మీ ఆశీస్సులు పొందుతాను.
మొదటిది:— విద్వజ్జనకోలాహల పండితవర్యుల తల్లిగారు వంధ్యకాదు అనేవాక్యం నేను కాదంటున్నాను. కారణం వారు వారి తల్లిగారికి ఏకైకసంతానం. శాస్త్రం “ఏకపుత్రవతీ వంధ్యా” అంది. అంటే ఒకే కోడుకువుంటే అలాంటి తల్లిని శాస్త్రం వంధ్యగా పరిగణిస్తోంది. అంతేకాదు. మహాభారతం- ఉద్యోగపర్వం-147 వ అధ్యాయంలోని 18 వ శ్లోకం ఇలాచెప్తోంది:— ” ఏకపుత్రం అపుత్రం వై ప్రవదంతి మనీషిణః
“ఒకే కొడుకు ఉన్నవాడు కొడుకులేని వాడే అని పండితులు చెపుతున్నారు” అని దానికి అర్థం.

ఇంక రెండవవాక్యం: మహారాజుగారు పుణ్యాత్ములు— దీనిని కూడా నేను కాదంటున్నాను మహారాజా! ఎందుకంటే వ్యక్తిగతంగా మీరెం పుణ్యాత్ములైనా, శాస్త్రం “రాజా రాష్ట్రకృతం పాపం” అని చెప్పింది.
మీ రాజ్యంలో మీప్రజలలో ఏ ఒక్కరు పాపంచేసినా దానిలో మీకూ భాగం వుంటుందని శాస్త్రనిర్ణయం. అందువల్ల ఏదోమూల మీ రాజ్యంలో ఎవరోఒకరు ఏదోఒకపాపం అనుక్షణమూ చేస్తూనే వుంటారు. దాంట్లో మీవంతు మీకు చేరుతూనేవుంటుంది.

మూడవ వాక్యం:— మహారాణిగారు పతివ్రత. ఈ వాక్యంకూడా శాస్త్రసమ్మతంకాదు, మహారాజా! వివాహమంత్రాలలో ఒకటి ఇలాగ అంటోంది:—”సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తరతః తృతీయో అగ్నిష్టే పతిః తురీయః తే మనుష్యజాః
దీని భావం యిది:—
చంద్రుడు నీ మొదటి భర్త. (విశ్వావసువు అను) గంధర్వుడు నీ రెండవ భర్త. అగ్నిదేవుడు నీ మూడవభర్త. మనుష్యజన్ముడనైన నేను నీ నాలుగవ భర్తని“. అందు వలన శాస్త్రప్రకారం ఈ మూడు చెల్లవు.

రాజుగారు పరమానందభరితులై, శుభముహూర్తమున్నరోజున యామునాచార్యులకి అర్ధరాజ్యమిచ్చి దానికి రాజుగా అభిషేకించేరు. విద్వజ్జనకోలాహలుడిని యామునాచార్యులకి అప్పగించి తగిన దండన విధించమన్నారు, రాజుగారు. ఆ పండితుడిని ఏమీచెయ్యకుండా తగిన బహుమతులిచ్చి స్వేచ్ఛగా విడిచిపెట్టేడు, యామునాచార్యులు.ఆ తరువాత సర్వరాజభోగాలు అనుభవిస్తూండగానే, మధ్యవయస్సు
లోపుగా గురువుగారి ఆజ్ఞని అనుసరించి యామునాచార్యులు శ్రీరంగంవెళ్ళి అక్కడ శ్రీరంగనాథుని అర్చిస్తూ భగవదైక్యం పొందేడు.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. సి.యస్ says:

    తర్కశాస్త్ర ప్రావీణ్యంతో పాటు బహుల పురాణ పారంగతుడు కాకపోతే వాదనలో నిలవలేరు.ఈ రెంటితో పాటు దైవకృప, గుర్వాశీస్సులు మెండుగా ఉన్న యామునాచార్యులవారు అద్భుతమైన వాదన చేసారు. ఎంతో రక్తి కట్టేలా ఆసక్తిదాయకంగా ఉంది రచన.

  2. Chaganty RamaRao says:

    Saastram tagina samayam loo sphuranaku raavadam, daanni priyamgaa cheppadam , dhaarana annititiki minchi daivaanugraham vundadam mukhyam ani bodhinchee samghatana. Chaalaa baagundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *