సాహిత్యము-సౌహిత్యము – 14 : దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః
12—08—2017; శనివారము.
సాహిత్యము—సౌహిత్యము——14.
ఇంతవరకు తెలుగుసమస్యాపూరణాలు బాగానే చర్చించుకుంటూవస్తున్నాం! ఈసారి ఒక సంస్కృతసమస్యా పూరణం చూద్దాం!
“దోషాణ్వేషణతత్పరో విజయతే
చోరోపమః సత్కవిః” ||
శార్దూలవృత్తంలో ఈ సమస్య యివ్వబడింది.
” లోటుపాట్లు గమనించే దొంగలాగ
కవి భాసిస్తున్నాడు ”
అని కవిని దొంగతో పోల్చడం ఈ సమస్యలోని అసమంజసమైన విషయం. ఈ అసమంజసతని తొలగింౘలేము. మరి సమస్యని పూరించిన కవిగారు ఏ విధంగా పూరణచేసారో చూద్దాం!
“మందం నిక్షిపతే పదాని పరితః
శబ్దం సముద్వీక్షతే
నానార్థాహరణం చ కాంక్షతి
ముదాలంకారమాకర్షతి |
ఆదత్తే సకలం సువర్ణ నిచయం
ధత్తే రసాంతర్గతం
దోషాణ్వేషణతత్పరో విజయతే
చోరోపమః సత్కవిః” ||
ఈ ౘక్కని శ్లోకంలో కవిగారు దొంగకి-కవికిగల సమానధర్మాలని, నానార్థ ప్రదాయకమైన శబ్దాలని ప్రయోగించడం ద్వారా వారిద్దరు చేసే సహజక్రియలని వర్ణించి మనకి సమస్యలో కనిపించిన
“పదమ్ ” అనేమాటకి సంస్కృతంలో ‘మాట’ అన్న అర్థమూవుంది, అలాగే ‘పాదము లేక అడుగు’ అన్న అర్థం కూడావుంది.
“మందం నిక్షిపతే పదాని” =
1. దొంగ మెల్లిగా అడుగులు వేస్తాడు.
2. కవి జాగ్రత్తగా ఆలోచించి మాటలని తన రచనలో పొందుపరుస్తాడు.
“పరితః శబ్దం సముద్వీక్షతే” =
1. దొంగ తన పరిసరాలలో అంతట అలికిడిని గమనిస్తూంటాడు.
2. కవి తనరచనలో తాను ప్రయోగించిన మాటని ముందువెనుకలకి అనుగుణంగావుండేవిధంగా కూర్చుతాడు.
“నానార్థాహరణం చ కాంక్షతి” =
1. దొంగ రకరకాల ధనాన్ని దొంగిలించాలని అనుకుంటాడు.
2. కవి తనరచనలో వేరు-వేరు స్థాయిలలో వివిధమైన అర్థాలు పాఠకులకి స్ఫురించేవిధంగా తన రచనవుడాలని కోరుకుంటాడు.
“ముదాలంకారమాకర్షతి” =
1. దొంగ దృష్టి ఆభరణాలని ఆకర్షించడంలో నిమగ్నమైవుంటుంది.
2. కవి కావ్యరచనానందంతో అంటే ‘పొయెటిక్ ఇన్స్పిరేషన్ ‘తో తన రచనని సహజ శబ్దార్థాలంకారాలతో శోభింపచేసే ప్రయత్నంలోవుంటాడు.
“ఆదత్తే సకలం సువర్ణనిచయం” =
1. దొంగ బంగారంవస్తువులన్నీ కాజేస్తాడు.
2. కవి ౘక్కని అక్షరాల అందమైన కూర్పు కలిగిన మంచిమాటలతో తన రచనని పొందికగా నిర్మిస్తాడు.
“ ధత్తే రసాంతర్గతం” =
1. దొంగ (రసాంతర్గతం) నేలమాళిగలో భద్రపరౘబడిన సొమ్మునికూడా స్వంతంచేసుకుంటాడు.
2. కవి తన రచనని నవరసభరితంగా తీర్చి దిద్దుతాడు.
“దోషాణ్వేషణతత్పరో విజయతే చోరోపమః సత్కవిః” =
1. దొంగ లోటుపాటులన్నీ గ్రహింౘడంలో నిమగ్నమైవుంటాడు.
2. కవి తన రచనలో యేవిధమైన లోటుపాటులు లేకుండావుండాలని పూర్తిగా జాగరూకుడైవుంటాడు.
ఈ విధంగా దొంగ లోకహానిని కలిగించే నీచదృష్టితోను, సత్కవి లోకహితాన్నిచేసే ఉత్తమదృష్టితోను, 180 డిగ్రీల విభిన్న దృక్కోణాలతో పైన వివరింౘబడిన సమానధర్మాలు కలిగివుండడం ఆశ్చర్యకరంకదా!
ఈ సమస్యా పూరణంలో కవి గొప్ప ప్రతిభ కనపరచాడు. సమస్యలోని ఒక పదాన్ని విరిచో లేదా ఒక పదాన్ని / అక్షరాన్ని అదనంగా కూర్చడం ద్వారానో సాధారణంగా సమస్యని పూరిస్తారు. కానీ ఇక్కడ మొత్తం శ్లోకంలో ద్వ్యర్థిని సాధించి శబ్దార్థాలమీద తనకున్న అధికారాన్ని రసవంతంగా ప్రదర్శించేడు.కవి ఎవరో తెలియకపోయినా ఈ శ్లోకాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు.
Baagundi.