శారదా సంతతి — 5 : శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

శ్రీశారదా దయా చన్ద్రికా :—
06–08–2017, ఆదివారము.

శారదా సంతతి—5.

శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.

ఈ వారం సంగీతసాహిత్యాలు రెండింటిలోను పరిణతప్రావీణ్యత కలిగిన పూర్ణప్రజ్ఞావంతులు ఐన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిని పరిచయం చేసుకుందాం!

శర్మగారిపూర్వుల ఇంటిపేరు “మంత్రమూర్తి”వారు. వారి వంశస్థులు అనంతపురంజిల్లా, కల్యాణదుర్గం తాలూకా, రాళ్ళపల్లిగ్రామంలో స్థిరపడినతరువాతనుంచి, వారి ఇంటిపేరు రాళ్ళపల్లిగా మారిపోయింది.

23—01—1893 వ తేదీన రాళ్ళపల్లి లోనే శర్మగారు జన్మించేరు. బాల్యంనుంచే వారి తెలివితేటలు సాత్త్వికంగాను, తేజోవంతంగాను వుండేవి. శర్మగారి తండ్రిగారు సంస్కృతంలోను, తెలుగులోను అపార పాండితీ ప్రకర్ష కలిగిన మహానుభావులు. అందువల్ల ప్రారంభవిద్యని శర్మగారు తండ్రివద్ద కూలంకషంగా నేర్చుకున్నారు. ఉన్నతవిద్యకోసం వారు మైసూరు వెళ్ళేరు. అక్కడ శ్రీ బ్రహ్మతంత్ర పరకాల
మఠం ఆస్థానం వుంది. శ్రీ కృష్ణబ్రహ్మతంత్ర పరకాలయతీంద్రులు ఆ మఠానికి అధిపతి. ఆ యతీంద్రుల సన్నిధిలోను, శ్రీ చామరాజేంద్ర సంస్కృతపాఠశాలలోను పరిపూర్ణ విద్యని అభ్యసించేరు.
సంస్కృత నాటక, అలంకార, వ్యాకరణ శాస్త్రాలలో పరిణత వైదుష్యం సాధించేరు. అదేసమయంలో తెలుగు, కన్నడ భాషలలోకూడా ౘక్కని పాండిత్యం సంపాదించేరు. ఆ రోజులలో కర్ణాటకసీమలో, దక్షిణ
భారతసంగీతసామ్రాజ్యంలో బిడారం కృష్ణప్ప, బిడారం రాౘప్ప అనే గొప్ప గాత్రసంగీతవిద్వాంసులుండేవారు. వారిలో కృష్ణప్పగారు వారి విద్యలో మకుటంలేని మహారాజు. అటువంటి బిడారం కృష్ణప్పగారివద్ద శర్మగారు గాత్రసంగీతాన్ని, వాయులీనవాద్య సంగీతాన్ని అమేయప్రతిభతో అభ్యసించి సంగీతవిద్యలో అనితర సాధ్యకళాకోవిదులయ్యేరు. మైసూరులోవున్న సమయంలోనే సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లాలలో నిపుణులైన పండితవరిష్ఠులు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారితో స్నేహం అయ్యింది. ఆయన ప్రోత్సాహం తోనే శర్మగారు తెలుగుసాహిత్యంలో ఫలవంతమైన ప్రత్యేకకృషి చేసేరు.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తువారి ఆహ్వానం ప్రేరణగా వేమనపై 7 ఉపన్యాసాలని వారు యిచ్చేరు. తెలుగు సాహిత్యం విమర్శ రంగంలో ఆ ఉపన్యాసగ్రంథం మార్గదర్శకమై శాశ్వతస్థానాన్ని అలంకరించింది.

ప్రాకృతగాథాసప్తశతికి వారు చేసిన కమనీయ అనువాదం, అనువాద సాహిత్యరంగానికి కరదీపంవంటిది.

మహీశూర రాజ్యాభ్యుదయాదర్శమ్ ” అనే సంస్కృతకావ్యం ప్రథమ పారితోషికం పొందింది. “గానకలె“, “సాహిత్యమత్తు జీవనకలె” అనే రెండు కన్నడభాషాసంపుటాలు వారి కన్నడరచనలకి ౘక్కనిసాక్ష్యాలు.

1974 వ సంవత్సరంలో మదరాసు (చెన్నై) మ్యూజిక్ అకాడమీవారు శర్మగారికి  “సంగీతకళానిధి” బిరుదునిచ్చి వారి సంగీతకళావైదుష్యాన్ని లోకానికి ఘనంగా వెల్లడిచేసేరు. శ్రీవేంకటేశ్వరప్రాచ్యపరిశోధనాలయంలో ప్రాధ్యాపకులుగావున్న సమయంలో అన్నమాచార్యులవారి కొన్ని సంకీర్తనలని సరసజనసంతోష దాయకంగా స్వరపరిచేరు. శ్రీ మైసూరు మహారాజ కళాశాలలో 37 సంవత్సరాలు ఉపాధ్యాయాగ్రేసరులుగా పనిచేసేరు.

శ్రీ రవీంద్రనాథ ఠాకూరు ఒకసారి బెంగుళూరు సందర్శించినపుడు, తన రవీంద్రసంగీతాన్ని సభాముఖంగా పాడివినిపించేరుట. అప్పుడు ఆ సభలో వున్న శర్మగారు యువకులు. రవీంద్రులగానాన్ని, శర్మగారు తన పుస్తకంలో “స్వరలిపి” లో వ్రాసుకున్నారుట. సభ ముగిసేక శర్మగారు, రవీంద్రుల పాటలకి తాను వ్రాసుకున్న స్వరలిపి/నొటేషన్ తీసుకువెళ్ళి సవరణకోసం రవీంద్రులకి చూపించేరుట. అది చూడగానే రవీంద్రులు ఆశ్చర్యంతోనిండిన ఆనందంతో యిలా అన్నారట: “ఈ యువకుడు నన్ను(నా పాటలని) స్వరలిపిద్వారా ఎలాగ అనుసరించేడో నాకు తెలియడంలేదు!” “I do not know how this young man followed me in notation!

ఇటువంటి ప్రతిభామూర్తికి నమస్కరిద్దాం!

స్వస్తి||

You may also like...

1 Response

  1. Chaganty RamaRao says:

    Manchi information about a great man. Elaa peddala gurinchi oka samkalanam vuntee chaalaa useful gaa vuntundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *