సాహిత్యము సౌహిత్యము – 13 : స్మితకున్ వందనమాచరింపుము కవీ!

శ్రీశారదా వాత్సల్య స్ఫూర్తిః :—
05—08—2017;  శనివారము.

సాహిత్యము—సౌహిత్యము–13

ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు సువిఖ్యాత విద్వత్కవులు, విమర్శకులు, సంభాషణాచతురులు, సభానిర్వహణకుశలులు, సృజనాత్మక అవధానవిద్యాకోవిదులు.ఒకసారి సభలో చలనచిత్రనటి “స్మిత” పేరుతోకూడిన సమస్యనిచ్చి వారిని పూరింౘవలసినదిగా కోరేరుట! ఆ సమస్య యిది:—”స్మితకున్ వందనమాచరింపుము కవీ!
సిద్ధించు నీ కోరికల్ “|

ఈ సమస్యలో ఎవరికీ తెలియని మాటలూలేవు, అన్వయకాఠిన్యం అసలేలేదు, భావమూ తేటతెల్లంగానే వుంది. వచ్చిన చిక్కల్లా భావంయొక్క ఔచిత్యంలోనేవుంది. స్మిత యెంత గొప్పనటైనా ఆమెకి నమస్కరించడం వల్ల “కవికోరికలు” ఎలాసిద్ధిస్తాయి? కవికివుండే కోరికలు అసలు ఏమిటి?  కవి అనేవాడి అసలుకోరికలు ఉత్తమ కావ్యాలు రచించాలనేవుంటాయి. ఇక్కడ కవిశబ్దప్రయోగధ్యేయం అదే!

దానిని బేతవోలువారు అంత వెను వెంటనే పసిగట్టగలగడంలోనే వారి వ్యక్తిగతప్రతిభ దాగివుంది. కావ్యనిర్మాణానికి కవికి శారదామాత అనుగ్రహం అడుగడుగునా లభిస్తే అటువంటి అపూర్వకావ్యం అజరామరమౌతుంది. ఈ భావాన్నే ఆచార్యవరిష్ఠులు ఈ మత్తేభవృత్తంలో ఎంత అందంగా పొందుపరిచేరో రసహృదయులు గ్రహించి ఆనందించండి.

అతులంబైన యశంబునందుకొను 
ఊహల్ పూని కావ్యాళి ని
ర్మితిచేయన్ దొరకొందువేని, రసముల్ ,
రీతుల్ , ధ్వనుల్ , కూర్ప నెం
చితివేనిన్ , వినుమోయి నా పలుకు, 
వాక్ శ్రీమాతకున్ చంద్రికా 
స్మితకున్ వందనమాచరింపుము కవీ! 
సిద్ధించు నీ కోరికల్ “||

ఎంత మనోజ్ఞమైన పూరణ!

ఓ కవీ! అబ్బురమైన గొప్ప కావ్యాలు రచించడానికి పూనుకోవాలనుకుంటే నా యీ సలహాని పాటించు. ఆ నీ కావ్యాలలో మనోరంజకమైన రసాలు, కావ్యరీతులు, ధ్వనులు ౘక్కగా, సహజంగా అమరిపోవాలంటే  నీకు శ్రీశారదామాత(వాక్ శ్రీమాత)యొక్క వాత్సల్యం అనే వెన్నెల(చంద్రిక)ని నీవు పొందాలి. అలా పొందాలంటే ఆ తల్లికి నమస్కరించి(వందనమాచరింపుము)ప్రార్థిస్తే ఆ నీ కావ్యరచనాభిలాషని నీవు సిద్ధింప చేసుకోవచ్చు“.

ఇంతటి అన్వయసౌలభ్యంతో కావ్య భాష సర్వేసర్వత్ర వుండివుంటే పద్యం ఇప్పటికంటె మరింత ఎక్కువ ప్రాచుర్యంతో జనబాహుళ్యంలో ఠీవిగాను, మన్ననతోను సంచరిస్తూ వుండివుండేది.

స్వస్తి||

You may also like...

2 Responses

  1. cs says:

    బేతవోలు వారితో నాకు మంచి పరిచయముంది.మంచి సరసుడు.మాటకారి, చమత్కారి.గొప్పసభాసంచాలకులువారు.వారి అవథానాలు నేను చూసాను, పాల్గొన్నాను కూడ. వారు పూరించిన పద్యం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  2. Nishanth says:

    Wonderful,his transliteration and commentary on Uttara Rama charitam of bhavabhuthi,is absolutely true to the original without any interposition.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *