కదంబకం – 5 : Sweet are the uses of adversity

శ్రీశారదా దయా దీప్తిః :—
30—07—2017;  ఆదివారం.కదంబకం—5

ఇక్కడినుంచి “సుమసుందర కదంబకం” శీర్షికని కేవలం “కదంబకం” అనే పేరుతోనే వ్యవహరింౘడం జరుగుతుంది.  అలాగే “శారదా ప్రతిభాన కోవిదులు” అనేశీర్షికని “శారదా సంతతి” గా మార్చడం జరిగింది.ఈ వారంకూడా మరొక భిన్నమైన విషయాన్ని ఈ శీర్షికలో  పరిచయం చేసుకుందాం.విలియం షేక్స్పియర్ ఆంగ్లవాఙ్మయంలో మన సంస్కృతసారస్వతంలోని కాళిదాసువంటి మహాకవి, నాటకకర్త, దార్శనికుడు అని లోకవిదితమైన విషయం. షేక్స్పియరు సుఖాంత, విషాదాంత, చారిత్రక నాటకాలు అన్నీ కలిపి 37 నాటకాలు రచించినట్లు మనకి లభ్యం ఐన గ్రంథాలనిబట్టి తెలుస్తోంది. వీటిలో “As You Like It” గొప్ప సుఖాంతనాటకాలలో ఒకటి. దీనిలో ఫెర్డినాండు అనేపేరుగల ఒక డ్యూక్ తనరాజ్యంనుంచి వెళ్ళగొట్టబడి ఒక అడవిలో తనపరివారంతో (మన భారతంలో ధర్మరాజులాగ) అజ్ఞాతవాసం చేస్తూంటాడు. ధర్మరాజులాగే నీతినియమాలని తప్పక ఆచరించే వ్యక్తి. మృదుస్వభావి. అన్నింటిలోను మంచినిచూసే మానవతామూర్తి. “Sweet are the uses of adversity” అనే జగత్ప్రశస్తిపొందిన గొప్ప ఉపదేశవాక్యం ఈ నాటకంలో ఈయన పలికినదే! “కష్టకాలంవల్ల కలిగే ప్రయోజనాలు మథురమైనవి” అని తాను నిజంగా కష్టంలోవున్న సందర్భంలోనే అనగలిగిన పరిణతమనస్కుడు, ఉదాత్తచరితుడు, ప్రజ్ఞామూర్తి ఐన ఆ ఫెర్డినాండురాజు అదే సమయంలో తాను నివసిస్తూన్న అడవిలోని అందౘందాలని తాత్త్వికకవితా పారవశ్యభావం(philosophically poetic ecstasy)తో యిలా దర్శిస్తాడు.

…tongues in trees, books in the running brooks, Sermons in stones and good in every thing“.

ఈ ఆంగ్లనాటకాన్ని శ్రీ రాజామంత్రిప్రెగడ భుజంగరాయకవిగారు యథాతథంగా చారుమతీపరిణయం అనే పేరుతో ఆంధ్రీకరించి 1917 వ సంవత్సరంలో ‘చెన్నపురం'(చెన్నై)లో ప్రచురించేరు. వారినాటకంలో ఈ సంభాషణభాగాన్ని వారు మత్తేభం అనే ఛందస్సులో ఇలా తెలిగించేరు.

వనభాగంబుల ఎట్టిచోద్యములు
లభ్యంబయ్యె తత్త్వప్రబో 
ధనమున్ చేయగ చెట్లు నాల్కలు 
సముద్యద్వాహినీపూరముల్ 
ఘనశాస్త్రంబులు ప్రస్తరంబులు 
వినంగానౌ ఉపన్యాసముల్ 
మనరమ్యస్థితితో సమానములె
దుర్మార్గంపు రాజ్యస్థితుల్ ” ||

ఈ రాజుగారిమాటలని సుమారు 45 సంవత్సరాలక్రితం నేను ఒక సంస్కృతశ్లోకంలో శారదామాత అనుగ్రహంతో యిలా అనువదించేను.

“పాదపేషు చ సూక్తాని
స్రోతస్సు పుస్తకాని చ |
పాషాణేషు మహాబోధాః
సర్వేషు సాధుదర్శనమ్ ” ||

అంటే రాజుగారి సాత్త్వికానుభవం ప్రకారం అడవిలోని చెట్లు గొప్ప, గొప్ప ఉపదేశవాక్యాలు చెపుతున్నాయట. అక్కడి సెలయేరుల గలగలలు మహాగ్రంథాలై మహోన్నతబోధలు చేస్తున్నాయట. అక్కడి (పర్వత) శిలలు ధర్మకర్తవ్య ఉపన్యాసాలు ప్రసాదిస్తున్నాయట. అంటే రాజుగారికి తనరాజ్యంలోని దర్బారులో తరచు అనుభవానికి వచ్చే మానవసంబంధాలలోని రజోగుణ, తమోగుణమయమైన రాగ-ద్వేషాలు,ఈర్ష్యాసూయలు మొదలైనవి ఇక్కడ అడవిలో మచ్చుకికూడా కనిపింౘలేదు. ఆ పైన దైవనిర్మితమైన సహజ అరణ్య స్వాభావికతలో కేవలమూ సత్వగుణం మాత్రమే ఆయనఅనుభవంలోకివచ్చి సర్వత్ర దివ్యవైభవమే గోచరించింది.
స్వస్తి|| (సశేషం).

You may also like...

1 Response

  1. Dr. P. Nisaant says:

    Three take homes for me..sweet are the uses of adversity, sarveshu sadhu darshana, sattva in its pristine beauty can be enjoyed only in nature apart from in great bhagavathas, pranams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *